గుడిసెలను కూల్చేసిన అధికారులు
మంగపేట: అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను అటవీ అధికారులు తొలగించారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు వాగు ప్రాజెక్టు సమీపంలో జాజిగిరిగుట్ట వద్ద సుమారు 10 గొత్తికోయ కుటుంబాలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వీరు గతంలో నర్సాయిగూడెం సమీపంలో ఉండేవారు.
అయితే, తమ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడి నుంచి ఖాళీ చేయాలని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో వారు గతిలేని పరిస్థితుల్లో జాజిగిరిగుట్ట వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చేస్తామని అటవీ అధికారులు ముందుగానే హెచ్చరించినా వినిపించుకోలేదు. అడవికి ముప్పుగా భావించిన అధికారులు బుధవారం సాయంత్రం వాటిని కూల్చివేసి కలపను వాహనాల్లో తరలించారు.