అల్లుడి కిరాతకం
అల్లుడి కిరాతకం
Published Sat, Oct 22 2016 10:32 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
- భార్యను కాపురానికి పంపలేదని అత్తారింటికి నిప్పుపెట్టిన అల్లుడు
- తృటిలో ప్రాణాలతో బయటపడిన పది మంది
- మూడు గుడిసెలు దగ్ధం
- రూ.2 లక్షల ఆస్తినష్టం
- ఆలస్యంగా వెలుగులోకి
కుటుంబ కలహాలతో ఓ అల్లుడి కిరాతకంగా మారాడు. భార్య తరపు కుటుంబీకులందరినీ అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి గ్రామానికి చేరుకుని గుడిసెలకు నిప్పుపెట్టాడు. అయితే అంతకు ముందు జరిగినఽ ఓ ఘటనతో పది మంది తృటిలో ప్రాణాలను దక్కించుకున్నారు. వరుసగా ఉన్న మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.
- కొత్తసిద్దేశ్వరం (జూపాడుబంగ్లా)
కొత్త సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన చెంచురామయ్యకు కుమారుడు శీనుతోపాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె నాగమణికి 15 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా జిల్లా చీమకుర్తి సమీపంలోని భ్రైసీకి చెందిన బ్రహ్మయ్యతో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలతో ఏడాది క్రితం నాగమణి పుట్టింటికి చేరుకుంది. ఇటీవల భార్యను కాపురానికి పంపాలని బ్రహ్మయ్య అత్తామామలను కోరగా పెద్దమనుషులను తీసుకొస్తే పంపుతామని వెనక్కు పంపారు. దీంతో అతను వారిపై కక్ష పెంచుకుని భార్య తరపు వారందరిని తుదిముట్టించాలని కుట్ర పన్నాడు. మేకల పెంపకం, నాటువైద్యం చేస్తూ చెంచురాయమ్య, అతని కుమారుడు శీను, పెద్ద అల్లుడు పోలయ్య ఊరికి శివారులో ఒకరి తర్వాత ఒకరు గుడిసెలు వేసుకొని అందులో జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చెంచురామయ్యకు పక్షవాతం రావటంతో అతనికి దొర్నిపాడు మండలం గుండుపాపలలో పసరు తాపించేందుకు అందరూ వెళ్లారు. ఈ విషయం తెలియని బ్రహ్మయ్య అర్ధరాత్రి కొత్తసిద్దేశ్వరం చేరుకుని భార్య తరుపు కుటుంబీకులను అంతమొందించాలని మూడు గుడిసెలకు నిప్పుపెట్టాడు. ఊరికి శివారులో ఉండటంతో మొదట మంటలను ఎవరూ గుర్తించలేదు. ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈలోగా గుడిసెలు పూర్తిగా దగ్ధమై అందులోని సామగ్రి కాలి బూడిదైంది. అక్కడికి సమీపంలో పొదల్లో ఉన్న బ్రహ్మయ్యను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు పట్టించే లోపే తప్పించుకొని పారిపోయాడు. ప్రమాదంలో నాలుగు టీవీలు, రూ.30వేల నగదు, బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, సైకిల్ తదితర సామగ్రి అంతా కాలిపోయాయి. దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పొరపాటున బాధితులు ఇంట్లో నిద్రించి ఉంటే పది మంది సజీవ దహనమయ్యేవారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన చెంచురామయ్య కుటుంబసభ్యులు జరిగిన సంఘటనను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం గ్రామ పాఠశాలలో తలదాచుకున్నారు. శనివారం ఉదయం వారు జరిగిన విషయమై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement