మురికివాడల్లో మనమే ఫస్ట్
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక మురికివాడలు, గుడిసెలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విషయం నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్‌ఎస్‌ఎస్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యధిక గుడిసెలు వెలసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఎస్ సర్వే గణాంకాల ప్రకారం...2012 డిసెంబర్‌నాటికి దేశంలో ఉన్న గుడిసెల్లో 23 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13.5 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 12 శాతం గుడిసెలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.దేశంలో సుమారు 33,510 గుడిసెలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో 41 శాతం గుడిసెలు నోటిఫై అయినవి కాగా, 59 శాతం నోటిఫైడ్ లేనివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 23 శాతం నోటిఫైడ్ గుడిసెలు ఉండగా, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తొమ్మిది శాతం ఉన్నాయి. ఇక నాన్ నోటిఫైడ్ గుడిసెల సంఖ్య దేశవ్యాప్తంగా 19,749 ఉండగా, అందులో మహారాష్ట్రలో 29 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 14 శాతం, గుజరాత్‌లో 10 శాతం ఉన్నాయి.
రాష్ట్రంలో 7,723 గుడిసెలు...
రాష్ట్రంలో మొత్తం 7,723 గుడిసెలు వెలిశాయి. దేశవ్యాప్తంగా 38 శాతం గుడిసెల్లో నివసించే కుటుంబాలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. 18 శాతం ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నాయి. దేశంలో సుమారు 88 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. వారిలో 56 లక్షల మంది నోటిఫైడ్, 32 లక్షల మంది నాన్ నోటిఫైడ్ గుడిసెలకు చెందిన వారున్నారు. దేశంలో నోటిఫైడ్ గుడిసెల్లో 63 శాతం కుటుంబాలు నివసిస్తున్నాయి. నాన్ నోటిఫైడ్ విషయానికొస్తే ఈ గుడిసెల్లో 40 శాతం కుటుంబాలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. రాష్ట్రం తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గుడిసెల సమస్య కొత్తదేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాల కన్నా అత్యధిక మురికివాడలు, గుడిసెలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం.