slum areas
-
Jones Manikonda: ట్యూషనమ్మ
విజయవాడకు చెందిన 50 ఏళ్ల జోన్స్ మానికొండ వెనుక ఏ ఆర్థిక అండాదండా లేదు. కాని ఆమె విజయవాడలో, కృష్ణాజిల్లాలో ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పిల్లల కోసం 60 ట్యూషన్ కేంద్రాలను వాలంటీర్లతో నడుపుతోంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వల్ల స్కూల్ ΄ాఠాల పట్ల భయం ఏర్పడకుండా, స్కూల్ మానేయకుండ ఈ ఈవెనింగ్ ట్యూషన్స్ సాయపడుతున్నాయి. మొత్తం 6 వేల మంది పిల్లలు ఇప్పటికి జోన్స్ వల్ల మేలు ΄÷ందారు. మామూలు పిల్లల సాయంత్రాలు వేరు. తల్లి వారికి స్నానం చేయించి, తినడానికి ఏదైనా ఇచ్చి, కాసేపు ఆడుకోనిచ్చి, ఆ తర్వాత చదువుకు కూచోబెడుతుంది. చదివిస్తుంది. లేదంటే ట్యూషన్‌కు పంపుతుంది. మరి మురికివాడల్లోనో? ఆ పిల్లలు స్కూల్‌కు వెళ్లడమే కష్టం. ఇంటికొచ్చాక ΄ాఠాలు చదివించాలంటే తల్లికి తీరిక ఉండదు. లేదా ఆమెకు చదువు రాదు. తండ్రికి అసలే పట్టదు. మరుసటి రోజు స్కూల్‌కు వెళితే హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ తిడుతుందని భయం. దాని బదులు స్కూల్ ఎగ్గొట్టడమే నయం. ఇలా ఆ పిల్లలు డ్రాపవుట్స్‌గా మారితే? అందుకే జోన్స్ మానికొండ మురికివాడల్లో ట్యూషన్లు నడుపుతుంది. ఆదర్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ పేరుతో ఆమె నడుపుతున్న ట్యూషన్లు ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల చదువుకు మేలు చేస్తున్నాయి. చదువే గౌరవం విజయవాడలోనే పుట్టి పెరిగిన జోన్స్ మానికొండ ఏడుగురు సంతానంలో రెండవది. సోషియాలజీలో ΄ోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాక ఎం.ఈడీ. చేసి, సైకాలజీలో మరో పీజీ చేసింది. ‘మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరం బాగా చదువుకున్నాం. చదువు మాత్రమే మనిషికి గౌరవం, ఉ΄ాధి ఇవ్వగలదు. కాని నేటికీ చాలా పేదవాడల్లో పిల్లలకు చదువు అందడం లేదు. మురికివాడల్లోని పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు సమాజం మీద కూడా ఉంది’ అంటుందామె. సమాజసేవ కోసం అవివాహితగా ఉండాలని నిర్ణయించుకుంది జోన్స్. వెనుకబడ్డ సమూహాలు మురికివాడల్లో ఎక్కువగా ఉంటున్నది వెనుకబడ్డ సమూహాలు అని గమనించి ఆ సమూహాల మీద దృష్టి పెట్టింది జోన్స్. యానాది, ఎరుకల, వడ్డెర, జంగం, సుగాలి, కోయ... ఇలా 19 సమూహాలను గుర్తించి వారి నివాస ్ర΄ాంతాల్లో ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తోంది. మొత్తం కృష్ణాజిల్లాలో 22, విజయవాడలో 13, వైజాగ్‌లో 4, హైదరాబాద్‌లో 3 సెంటర్లు ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 48 టీచర్లు, 13 మంది వాలంటీర్లు మురికివాడల్లో ట్యూషన్లు చెబుతూ పిల్లలు స్కూళ్లకెళ్లి బాగా చదువుకునేలా సహాయం చేస్తున్నారు. బంధుమిత్రుల సాయంతో జోన్స్ నిర్వహిస్తున్న ఈవెనింగ్ ట్యూషన్లకు నెలకు దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో దాదాపు ఎక్కువ భాగం సౌత్ ఆఫ్రికాలోని ఒక సోదరుడు, సింగపూర్‌లో ఉన్న ఒక సోదరి ఇస్తారు. మరికొంత సాయం స్నేహితుల వల్ల... దాతల వల్ల అందుతుంది. ‘కేవలం చదువు మాత్రమే కాదు... ఈ పిల్లలకు ΄ûష్టికాహారం, పరిశుభ్రమైన బట్టలు కూడా కావాలి. ఆ దిశగా కూడా నా సేవ కొనసాగాలని కోరుకుంటున్నాను. పేదరికం వల్ల పిల్లల్ని పనుల్లో పెట్టే తల్లిదండ్రులను ఒప్పించి ఆ పిల్లలను బడికి పంపేలా చూడటం మాకున్న అతిపెద్ద సవాలు’ అంటుంది జోన్స్. లెక్చరర్‌గా ఉద్యోగం మానేసి మరీ ఆమె చేస్తున్న ఈ సేవకు సమాజం నుంచి మరింత మద్దతు దొరుకుతుందని ఆశిద్దాం. -
Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం
ముంబై నగర మురికివాడల్లో నివసించే పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో 32 ఏళ్లుగా నిమగ్నమైన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంది సింగ్ రావత్. సుదీర్ఘ బోధనా అనుభవంలో పిల్లల మనస్తత్వాన్ని దగ్గరుండి అర్ధం చేసుకున్న మానసిక నిపుణురాలు. పిల్లలు రోల్ మోడల్‌గా భావించే ఈ టీచర్ ఇన్నేళ్లుగా చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది. ‘‘మూడు దశాబ్దాలకు పైగా పిల్లలతో కలిసి ఉండటం వల్ల వారి మనస్తత్వాన్ని సులువుగా అర్థం చేసుకునే స్థితి నాకు అలవడింది. ఆ ఆలోచనతో ‘మేము, పిల్లలు, వారి మనస్తత్వశాస్త్రం’ పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. టీచర్‌గా పిల్లల మనస్తత్వంపై, వారి వికాసంపై అనేక రకాల పరిశోధనల కథనాలు నేను రాసిన పుస్తంలో ఉన్నాయి. ఇవన్నీ టీచర్లకు, తల్లిదండ్రులకు మార్గదర్శకం అవుతాయి. ఇది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల మనసులను చదవాలి హైపర్ యాక్టివ్, కోపం, పిరికితనం... ఇలా పిల్లలు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లల వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని వారితో మాట్లాడాలి. పిల్లల ప్రవర్తన వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేరు. బాల్యంలో పిల్లల మనసులో నిలిచిపోయే విషయాలు లేదా సంఘటనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రోజూ తల్లిదండ్రుల పోట్లాడుకుంటుంటే పిల్లవాడికి భవిష్యత్తులో పెళ్లి పట్ల విముఖత ఏర్పడుతుంది. లేదా తన జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలో అర్థం కాకపోవచ్చు. చదువుకోవడానికి వచ్చే మురికివాడల పిల్లల జీవితం సంపన్నుల పిల్లల కంటే భిన్నంగా ఉంటుంది. వారి సమస్య లు, అవసరాలు లెక్కలేనన్ని ఉంటాయి. ప్రేమ, ఆప్యాయత వారికి లభించడం లేదు. ఈ పిల్లలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఇంట్లో వాతావరణం బాగుండదు. దీని ప్రభావం కొన్నిసార్లు వారి హృదయాన్ని, మనస్సును గాయపరుస్తుంది. అప్పుడు వారు క్లాసులో మౌనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అలాంటి పిల్లలను పక్కకు తీసుకెళ్లి వారితో మాట్లాడతాను. వారి మనస్సులను చదువుతాను. వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. క్లాసులో పిల్లలెవరూ విచారంగా, మౌనంగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను. తల్లిదండ్రులూ అర్థం చేసుకోలేరు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతాను. వారి ఇంటి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాను. వారి పొర పాట్లను ప్రేమగా వారికి తెలియజెబుతాను. పిల్లల ముందు ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలో వివరిస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పోట్లాడుకోవడం చూసిన పిల్లలు స్కూల్లో ఇతర పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ పిల్లల ఇంటి వాతావరణం వారి బాల్యాన్ని నాశనం చేసే సామాజిక సమస్య. వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. చిన్న పిల్లల మనసు అర్థం చేసుకోవాలంటే వాళ్ల మనసు లోతుల్లోకి వెళ్లాలి. వాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే వాళ్ల కష్టాలు అర్థం చేసుకోవడం తేలికైంది. అప్పుడు పిల్లలు కూడా నేను చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ప్రారంభించారు. హృదయ విదారక కథలు కుటుంబంలో తగాదాలు, ఇల్లు కూలిపోవడం, అమ్మ లేదా నాన్న కొట్టడం, కొన్నిసార్లు సవతి తండ్రి, కొన్నిసార్లు సవతి తల్లితో బాధలు... దీంతో ఈ పిల్లల బాల్యాన్ని తుంగ లో తొక్కేసినట్టవుతుంది. ఈ పిల్లలను తిరిగి స్కూల్‌కు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. భయపెట్టే సంఘటనలు రోహన్ (పేరుమార్చాం) తన మనసులో ఏదో దాచుకుంటున్నట్టు, భయం భయంగా ఉండేవాడు. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు. వారి ఇల్లు చాలా చిన్నది కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఒకే గదిలో పడుకునేవారు. తన తల్లిదండ్రులు రాత్రిపూట వ్యక్తిగతంగా గడపడం చూశాడు రోహన్. తన తండ్రి అమ్మను హింసిస్తున్నాడని మనసులో భయం పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మదనపడుతుండేవాడు. తల్లిదండ్రులకు, ఆ పిల్లవాడికి కౌన్సెలింగ్ ఇచ్చాక సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న సోఫియా (పేరు మార్చాం) తన డైరీలో ఏదో రాసుకోవడం గమనించాను. అడిగితే, ఎవరూ చూడకుండా చూపిస్తానంది. క్లాస్ రూమ్ నుంచి మరో గదికి తీసుకెళ్లి అడిగితే, డైరీ చూపించింది. ఆ డైరీ చదివినప్పుడు నా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సోఫియా తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంది. తన తల్లితో కలిసి కొత్త తండ్రి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొత్త తండ్రి, అతని తమ్ముడు సోఫియాను బాధపెడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరికీ ఏమీ చెప్పలేక తన తండ్రికి డైరీలో ఉత్తరాలు రాసుకుంది. ఆ తర్వాత వాళ్ల అమ్మను కలిసి మాట్లాడాను. ఆమె సోఫియా పట్ల జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, మరెన్నో గాథలు పిల్లల నుంచి తెలుసుకున్నవి, పరిష్కరించినవి ఉన్నాయి. టీచర్ని కావాలనుకున్నాను.. ముంబైలోని సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగాను. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఫీజు కట్టడానికి డబ్బుల్లేక ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాంటిస్సోరి కోర్సు చేశాను. ఇదే పిల్లలకు నన్ను దగ్గర చేసింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో నేను పనిచేసే చోట ప్రిన్సిపల్ బీఎడ్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత రెండేళ్లకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి అయింది. అత్తింటి ప్రోత్సాహంతో ఎం.ఏ. డిగ్రీ పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచడంతో పాటు ఇంటి పనులు, స్కూల్ పనుల వల్ల సమయం అస్సలు ఉండేది కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక పీహెచ్డీ పూర్తిచేశాను. నాకూతురు మెడిసిన్ చదువుతుండగా నేను పీహెచ్డీ చేస్తున్నాను. అలాగని నా జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, కష్టాలు ఎదురైనా పూర్తి నిజాయితీతో నా పని చేస్తూ వచ్చాను. నేను చదువు చెప్పే పిల్లలు బాగా రాణిస్తున్నారని అర్థమయ్యాక నాకు చాలా ఆనందం కలుగుతుంది. -
అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్
ముంబైలోని మురికివాడల్లో ఉదయం పూట మహిళాపోలీసులు ‘కార్నర్ మీటింగ్స్’ నిర్వహిస్తున్నారు. ప్రతి వీధిలోని ఒక మూల మీద అక్కడ పోగైన స్త్రీలకు, పిల్లలకు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’తో మొదలు డ్రగ్స్, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్‌ల గురించి వివరిస్తున్నారు. పెద్దగా చదువులేని మహిళలకు ఈ వీధిమలుపు మీటింగ్‌లు మేలుచేస్తున్నాయి. నిజానికి ప్రతి రాష్ట్రంలో, ప్రతి బస్తీల్లో ఇలాంటి కార్నర్ మీటింగ్‌ల అవసరం ఉంది. నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న స్త్రీల భద్రత గురించి కొంతైనా నిశ్చింత ఉంది. కాని ఇవే నగరాల్లో, పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లోని, బస్తీల్లోని స్త్రీల, పసిపిల్లల భద్రత చాలా కష్టతరమైనది. చట్టపరంగా ఎంత కట్టుదిట్టాలు ఉన్నా స్వీయ అవగాహన లేకపోతే ప్రమాదం తప్పదు. మన దేశంలో నిత్యం పసి పిల్లల మీద అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పిపోతున్న పిల్లల సంఖ్య తీవ్రంగా ఉంది. మరోవైపు అసంఘటిత రంగాల్లో స్త్రీలపై లైంగిక దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు లేని స్త్రీలు ఈ విషయమై ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధ పడతారు, ఆందోళన చెందుతారు. అందుకే ముంబైలో మహిళా పోలీసులు ‘కార్నర్ మీటింగ్’ లు నిర్వహిస్తున్నారు. సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం పోలీసు అధికారుల సూచన మేరకు మహిళా పోలీసులతో మొదలైన ఈ పని సత్ఫలితాలను ఇస్తోంది. ముంబైలోని అతి పెద్ద మురికివాడలకు రోజూ ఉదయం పూట మహిళా పోలీసు బృందాలు చేరుకుని వీధి మూలల్లో ఆడవాళ్లను కూడేసి జాగ్రత్తలు చెప్పడమే ఈ కార్నర్ మీటింగ్‌ల ఉద్దేశం. ఆడపిల్లలకు అర్థమయ్యేలా ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ల గురించి చెప్పడం మరో ముఖ్య ఉద్దేశం. అపరిచితులకు పిల్లల్ని అప్పగించి పనుల్లోకి వెళ్లకుండా చూడటం, మొబైల్ ఫోన్లలో వచ్చే కేటుగాళ్ల కాల్స్ వల్ల ఆర్థికంగా నష్టపోకుండా చూడటం కూడా కార్నర్ మీటింగ్‌ల ముఖ్యవిధిగా ఉంది. ‘రోజూ పది నుంచి పదకొండు గంటల మధ్య బస్తీ స్త్రీలు ఖాళీగా దొరుకుతారు. వారికి అన్ని విధాలా కౌన్సెలింగ్ ఇచ్చి అలెర్ట్ చేస్తాం. చిన్నచిన్న ఫ్యాక్టరీల్లో పని చేసే స్త్రీలు లైంగికపరంగా వేధింపులను ఎదుర్కొంటే ఫిర్యాదు చేయమని చెబుతాం. దీని వల్ల దౌర్జన్యకారుల్లో భయం ఏర్పడుతోంది’ అంటున్నారు మహిళా పోలీసులు. అలాగే వ్యభిచార వృత్తిలోకి ఈడ్చబడే స్త్రీల, బాలికలను కాపాడే బాధ్యత వారి గురించి సమాచారం ఇచ్చే చైతన్యం కూడా బస్తీ మహిళలకు కలిగిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల జరిగే హాని చెబుతున్నారు. నిజానికి ఈ పని ముంబైలోనే కాదు దేశంలోని ప్రతి నగరంలో చదువులేని బీదసాదలు ఉండే అన్నీ ఊళ్ల వాడల్లో జరగాలి. సత్ఫలితాలు ఇస్తున్న ఈ పనిని మిగిలిన రాష్ట్రాల్లోని పోలీసులు కూడా అనుసరిస్తే బాగుంటుంది. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
ముంబైను వణికిస్తున్న ‘మీజిల్స్’ వ్యాధి.. ఆస్పత్రుల్లో 1,071 మంది రోగులు
సాక్షి, ముంబై: ముంబైలో ఇన్ఫెక్షన్ డిసీస్ మీజిల్స్ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ముంబైలో సోమవారం ఒక్క రోజే 142 రోగులను గుర్తించారు. అదే విధంగా మంగళవారం రాత్రి వరకు ఆ వ్యాధి లక్షణాలున్న 171 మంది కొత్త రోగులు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దీంతో మొత్తం రోగుల సంఖ్య 1,071కి చేరింది. అందులో ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో 68 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మొత్తం ఏడుగురు పిల్లలుండగా, అందులో ఐదుగురు మీజిల్స్ అనుమానిత మృతులున్నారు. ఇద్దరు ఇన్ఫెక్షన్ డిసీస్‌తో మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురు పిల్లలు ఎలా చనిపోయారనేది మూడు రోజుల్లో నివేదిక కానుంది. మొత్తం ఏడుగురు మృతుల్లో కస్తూర్బా ఆస్పత్రిలో నల్గురు, ఇద్దరు రాజావాడి ఆస్పత్రిలో, మరొకరు ఇంటి వద్ద మృతి చెందారు. వీరంతా అక్టోబరు 26వ తేదీ నుంచి నవంబర్ 16 మధ్యలో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖలో నమోదైంది. ముంబైలోని ఎనిమిది బీఎంసీ వార్డుల్లో ఉన్న మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న పిల్లలను అత్యధికంగా గుర్తించారు. ఈ వార్డుల్లో 142 మంది రోగులుండగా అందులో ఒక్క మాన్‌ఖుర్ద్ రీజియన్‌లో 44 మంది పిల్లలున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభు త్వం నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం పర్యటిస్తోంది. తూర్పు, పశ్చిమ గోవండీ, బైకళ, కుర్లా, వడాల, ధారావి తదితర ఎనిమిది వార్డుల్లో ఇన్ఫెక్షన్ డిసీస్ తొందరగా వ్యాప్తి చెందుతోంది. ఈ రీజియన్లను హై రిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు. మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న మరికొంత మంది పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానంతో ప్రతీ గుడిసెలో సోదా చేయడం ప్రారంభించినట్లు బీఎంసీ ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక అధికారి డా.మంగల గోమారే తెలిపారు. ముంబైలో అనేక మంది పిల్లలకు ఎం.ఆర్.–1, ఎం.ఎం.ఆర్–2 వ్యాక్సినేషన్ లభించలేదని అధ్యయనంలో బయటపడింది. దీంతో అదనంగా వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు గోమారే తెలిపారు. చదవండి: గోఖలే వంతెన త్వరలో కూల్చివేత ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఇదిలాఉండగా రోజురోజుకూ పిల్లల్లో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కస్తూర్బా ఆస్పత్రిలో మూడు వార్డులు ప్రత్యేకంగా రిజర్వు చేసి ఉంచారు. అందులో 83 సాధారణ బెడ్లు, 10 ఐసీయూ బెడ్లు, ఐదు వెంటిలేటర్ బెడ్లు సమకూర్చి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా ఉప నగరాల్లోని గోవండీ, మాన్ఖుర్్ధ, కుర్లా తదితరా ప్రాంతాల్లో పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శతాబ్ధి ఆస్పత్రిలో 10 బెడ్లు ప్రత్యేకంగా సమకూర్చి ఉంచారు. అంతేగాకుండా గోవండీలోని మెటరి్నటి హోంలో ఇన్ఫెక్షన్ డిసీస్ రోగులను చేర్చుకునే వ్యవస్ధ చేయడంతో పాటు ఐసొలేషన్ సెంటర్ నెలకొల్పాలని భావిస్తున్నట్లు బీఎంసీ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. మరోపక్క ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే మంగళవారం బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్‌తో ఫోన్లో చర్చించారు. ఆరోగ్య శాఖ తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో ఆ వ్యాధి నివారణకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యాధి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శిందే పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంతోపాటు అధ్యయనం పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు. సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో కూడా శిందే చర్చించారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు, ఇతర సిబ్బందికి సూచించారు. లక్షణాలు, వ్యాప్తి.. మీజిల్స్ అనేది వైరస్ వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి. ఇది సోకిన వ్యక్తి యొక్క ముక్కు, నోరు లేదా గొంతులో కనిపిస్తుంది. ఇది మోరిబిలివైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మానవులకు మాత్రమే సోకుతుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. దగ్గు మరియు తుమ్ము సమయంలో వ్యాధి సోకిన వ్యక్తులు వదిలే శ్వాసకోశ బిందువుల ద్వారా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. డాక్టర్లు ఈ వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్ తీవ్రమైన రినైటిస్ మరియు కండ్లకలక (ఎర్రటి కళ్ళు) మరియు కంటి ఉత్సర్గతో పాటు అధిక–స్థాయి జ్వరంతో లక్షణాలు ప్రారంభమవుతాయి. జ్వరం నాల్గవ రోజుకి తగ్గుతుంది. చెవులు, ముఖం నుండి మొదలై పొత్తికడుపు వరకు దద్దుర్లు కనిపిస్తాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఐదు శాతం వరకు తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి, టీకాలు వేసుకోని పిల్లలలో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. చదవండి: భయంకర దృశ్యాలు.. డ్రైవర్ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో ఎవరికి ప్రమాదం? ‘‘తట్టు సాధారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను, గర్భిణీలను ప్రభావితం చేస్తుంది. వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే మరియు ఈ వ్యక్తులు తగిన సమయంలో టీకాలు వేయకపోతే, వారు ఈ వ్యాధిబారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారు కమ్యూనిటీలలోని బాధిత వ్యక్తులతో పరిచయంలోకి వస్తే, వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధి తీవ్రమైతే మధ్య చెవి ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, మెదడు ఇన్ఫెక్షన్/ఎన్సెఫాలిటిస్ శాశ్వత వినికిడి లోపం మరియు మూర్ఛ, అతిసారం, పోషకాహార లోపం, మరియు క్షయవ్యాధిని తిరిగి ప్రేరేపించడం వంటి వాటికి దారి తీయవచ్చు. కొన్నింటిని చెప్పాలంటే, ఈ సమస్యలలో కొన్ని ప్రాణాపాయకరమైనవి కూడా ఉన్నాయి. మీజిల్స్ వ్యాక్సిన్ మీజిల్స్‌ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. తట్టు నివారణకు వాక్సిన్ ఉత్తమ మార్గం. వ్యాధి స్వల్పంగా ఉంటుంది మరియు మీజిల్స్‌ను అభివృద్ధి చేసే టీకాలు వేసిన పిల్లలలో సంక్లిష్టత రేటు తక్కువగా ఉంటుంది. ఇది 15 నెలలు మరియు 4–5 సంవత్సరాలలో బూస్టర్‌తో తొమ్మిది నెలలకు ప్రారంభించబడుతుంది. ఇది గవదబిళ్లలు, రుబెల్లా, కొన్నిసార్లు చికెన్‌పాక్స్ వ్యాక్సిన్‌తో కలిపి ఉంటుంది’ అని డాక్టర్లు చెబుతున్నారు. నివారణ చికిత్స లేనప్పటికీ, ఇది ప్రాణాంతకమైన స్వీయ–పరిమితి సంక్రమణం. వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా అదుపుచేసే అవకాశం ఉంది. -
స్లమ్స్‌లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
వెల్కమ్ ట్రంప్..గోడచాటు పేదలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీగా ఏర్పాట్లు చేస్తుండగా గుజరాత్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 24వ తేదీన అహ్మదాబాద్‌లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడ నిర్మాణం చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడికి పేదరికం ఛాయలు కనిపించకుండా ఉండేందుకు గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న మార్గంలోని పేదల ఇండ్ల పొడవునా కిలోమీటర్ పొడవైన గోడను నిర్మిస్తోంది. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ఉన్న 500 పూరిగుడిసెలు కనిపించకుండా చేసేందుకు సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు దాదాపు 7 అడుగుల ఎత్తైన ఈ గోడను నిర్మించడంతోపాటు, దాని పొడవునా ఖర్జూర మొక్కలు నాటి ఆ మార్గాన్ని అందంగా తయారుచేయనున్నారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న 16 ప్రధాన మార్గాల్లో రోడ్లు వేస్తున్నారు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో యంత్రాంగం బిజీగా ఉంది. ఈ మొత్తం పనుల కోసం అహ్మదాబాద్ అధికారులు రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు మీడియా పేర్కొంది. జపాన్ ప్రధాని షింజో అబే(2017), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(2014) పర్యటనలప్పుడు గుజరాత్ ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపట్టింది. 2017లో ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన సమయంలో హైదరాబాద్‌లో ఆమె పర్యటించే ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లందరినీ తెలంగాణ యంత్రాంగం వేరే చోటికి తరలించిన విషయం తెలిసిందే. భారత పర్యటనపై మెలానియా ఉత్సాహం భారత్‌లో పర్యటనకోసం తానెంతో ఉత్సుకతతో ఉన్నానని అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా చెప్పారు. అహ్మదాబాద్, న్యూఢిల్లీలో పర్యటనకు తమను సాదరంగా ఆహ్వానిస్తోన్న భారత ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బలపడనున్న బంధాన్నీ సెలబ్రేట్ చేసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నామని మెలానియా ప్రకటించారు. తమ ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదనీ, ఇది భారత్–అమెరికాల మధ్య స్నేహ బంధాల్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ ఆమె ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
‘400 మందికి కేవలం 2 మరుగుదొడ్లేనా?’
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు చేరువయ్యేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ‘దీదీ కో బోలో’ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతేకాక మురికివాడల్లో ఆకస్మిక పర్యటనలు కూడా చేపడతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హౌరా ప్రాంతంలోని ఓ మురికి వాడలో పర్యటించారు దీదీ. ఆ సమయంలో ఆమెతో పాటు పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహరాల శాఖ మంత్రి ఫిర్హాధ్ హకీమ్ కూడా ఉన్నారు. పర్యటనలో భాగంగా దీదీ అక్కడి ప్రజల స్థితి గతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో 400మంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నట్లు దీదీ దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హకీమ్‌ను వివరణ అడిగారు దీదీ. ‘మురికి వాడల అభివృద్ధి కోరకు ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. కానీ ఇక్కడ 400 మందికి కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంత కౌన్సిలర్ ఏక్కడ.. ఏం చేస్తున్నాడు’ అంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హకీమ్ స్పందిస్తూ.. కౌన్సిలర్ ఓ హత్యా నేరం కింద ప్రస్తుతం జైలులో ఉన్నాడని.. అందుకే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని తెలిపాడు. అందుకు దీదీ.. ‘కౌన్సిలర్ జైలులో ఉన్నాడు సరే.. మున్సిపాలిటీ ఇక్కడే ఉంది కదా. మీరు పర్యవేక్షించడం లేదా. 400 మంది కోసం కేవలం రెండు మరుగుదొడ్లు ఎలా సరిపోతాయి. కనీసం 8,10 అయినా ఉండాలి కదా. మీకొక వారం రోజుల గడువు ఇస్తున్నాను. ఈ లోపు అన్ని మురికివాడల్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించండి’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. -
మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
– నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా భోధనను ప్రారంభిస్తోందని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు నగరంలోని స్లమ్ ఏరియాల్లో విస్త్రృతంగా పర్యటించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బుధవారం స్థానిక నగరపాలకలోని కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మున్సిపల్‌ల పాఠశాలలను కార్పోరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్నామన్నరు. మెప్మాలో పనిచేసే సీఆర్పీలు, పొదుపు సంఘాల నాయకురాళ్లు మురికి వాడలు, పేదలు నివసించే ప్రాంతాలలో ఇంగ్లిషు మీడియం విద్య అమలుపై తెలియజేయాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
'మురికివాడలంటే బాబుకు అలుసు'
హైదరాబాద్: మురికివాడలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చాలా అలుసుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మురికివాడలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మహానుభావులు మురికి వాడలనుంచే వచ్చారన్న విషయం ముఖ్యమంత్రి గమనించాలని హితవు పలికారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు ఆపేసి వెంటనే మురికివాడలు ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని గుర్తు చేశారు. -
'మురికివాడలంటే బాబుకు అలుసు'
-
ఎంత వాడినా మూడొందలే..!
నెలకు వచ్చే విద్యుత్, నల్లా బిల్లు మొత్తమిది మురికివాడల పేదలకు ‘గ్రేటర్’ ఎన్నికల కానుక? అదే జరిగితే 1.25 లక్షల కుటుంబాలకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: రాబోయే బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని మురికివాడల ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి నగరంలో గుర్తించిన (నోటిఫైడ్) 1475 మురికివాడల్లో వినియోగంతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.150 నల్లా బిల్లు, రూ.150 విద్యుత్ బిల్లు జారీచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమీక్షలో కేసీఆర్ ఈ అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. సర్కారు తాజా నిర్ణయంతో ఆయా బస్తీల్లో నివాసం ఉంటున్న సుమారు 1.25 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. గ్రేటర్లో పాగా వేయాలని యోచిస్తున్న సర్కారు పెద్దలు ఈ దిశగా పేదల మనసు దోచుకునేందుకు నయా ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మహానగర పరిధిలో నెలకు ప్రతి 15 వేల లీటర్ల నీటి వినియోగం ఉండే ఇంటికి రూ.212 సాధారణ బిల్లు వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై గరిష్టంగా రూ.150 మాత్రమే బిల్లు వస్తుంది. ఇక వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారికి నెలకు రూ.300 సాధారణ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇకపై వీరికి నెలకు రూ.150 మాత్రమే బిల్లు వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు బిల్లులూ కలిపి రూ.300కు మించదన్నమాట. అయితే ప్రభుత్వం త్వరలో జారీ చేసే ఉత్తర్వులతో వీటిపై స్పష్టత వస్తుందని ఆయా విభాగాల అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా విద్యుత్, నీటి బిల్లుల బకాయిల మాఫీపైనా నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. ఇదే జరిగితే ఖజానాపై రూ.కోట్లు అదనపు భారం పడుతుందంటున్నారు. నోటిఫైడ్ కానివారికి నిరాశే... గ్రేటర్ పరిధి శరవేగంగా విస్తరిస్తుండటంతో పాటు పలు శివారు ప్రాంతాలు మౌలిక వసతులకు నోచుకోక మురికివాడలుగానే మిగిలాయి. వీటిని నోటిఫైడ్ మురికివాడలుగా గుర్తించకపోవడంతో ఆయా బస్తీలల్లో నివసిస్తున్న వారికి ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. నోటిఫైడ్మురికివాడలుగా గుర్తింపు పొందిన బస్తీలకు సబ్సిడీలు, సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రెండు దశాబ్దాల కిందటే పూర్తయ్యింది. నాటి జాబితాలో ఉన్న బస్తీలకే నేటికీ ఈ పథకాలు వర్తిస్తున్నాయి. -
అర్బన్ హెల్త్ సెంటర్ల బలోపేతానికి చర్యలు
మురికివాడల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అనధికారిక లేఅవుట్లపై చర్యలకు 9 మందితో కమిటీ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ వెల్లడి అరండల్‌పేట (గుంటూరు) : పట్టణాలు, నగరాల్లోని అర్బన్‌హెల్త్ సెంటర్లను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపురపాలకశాఖామంత్రి పి. నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పురపాలకసంస్థలు, నగరపాలకసంస్థల ప్రజారోగ్యవిభాగం అధికారులు, పట్టణ ప్రణాళికాధికారులతో గురువారం ఆయన విడివిడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత ప్రజారోగ్య విభాగం సమావేశంలో మాట్లాడారు. పురపాలక శాఖలు, కార్పొరేషన్ల వారీగా ఆయా ప్రాంతాల్లో అర్బన్ హెల్త్‌సెంటర్ల వివరాలు, అవి ఎవరి అధీనంలో ఉన్నాయి, ప్రతిరోజూ ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అర్బన్ హెల్త్సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు మోడల్ అర్బన్ హెల్త్ సెంటర్లుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అర్బన్ హెల్త్ సెంటర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో అర్బన్ హెల్త్‌సెంటర్ల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియమించడంతో పాటు అన్ని అర్బన్‌హెల్త్ సెంటర్లలో ల్యాబ్‌లు, మందులు ఉండేలా చూస్తామన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలు కమిషనర్ తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణ ప్రణాళికాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్లు, పురపాలకసంఘాల పరిధిలో నిర్మించే భవనాలకు అనుమతులను ఆన్లైన్లో అందించాలన్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. వేగవంతంగా, కచ్చితంగా ప్రజలకు సేవలందించేందుకు ఈ పద్ధతి ఎంతో దోహదపడుతుందన్నారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న అక్రమ కట్టడాలు అవి ఎవరివైనా ఉపేక్షించవద్దని తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. అనధికారిక లే అవుట్లు, నిర్మాణాలను గుర్తించేందుకు ఐదుగురు లేదా తొమ్మిది మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఒకటి ఏర్పాటు చే స్తామని, వారు రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తనిఖీ చేస్తారని చెప్పారు. 15 రోజుల్లో అనధికార నిర్మాణాలు, అన్‌అప్రూవుడ్ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ పాండురంగారావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
వరాల జల్లు
మురికివాడల్లో సమస్యలపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరాతీశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి మౌలిక వసతులు మెరుగు పరుస్తానని హామీఇచ్చారు. దశలవారీగా స్లమ్ఏరియాలను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. బస్తీల్లో సమస్యలను తాను స్వయంగా చూశానని, ఇబ్బందులు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత పాలమూరు హరిజనవాడ, పెద్దచెరువు, పాతతోట, వీరన్నపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణవాసులకు వరాలజల్లు కురిిపిస్తూ.. ముందుకు సాగారు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ పాలమూర్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పట్టణ ప్రజలకు హామీఇచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో పట్టణ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. పాలమూర్ ఎంపీగా ఉన్నప్పు డే తెలంగాణ రాష్ట్రం సాధించానని, కీర్తి ప్రతిష్టలు చరిత్రలో నిలబడతాయన్నారు. మరో రెండుమూడు వారాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. అందుకోసం తాను స్వయంగా వస్తానన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు ఒక్కదగ్గరకు వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు స్థలపరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ జనాభాకు తగిన విధంగా పట్టణరోడ్లు సరిపోవడం లేదని, పట్టణరోడ్డుకు అనుసంధానంగా మరో బైపాస్‌రోడ్డు నిర్మాణం జరగాలన్నారు. షాషాబ్‌గుట్ట, పెద్ద చెరువు, భూత్పూర్ రోడ్డు, రాయిచూర్ రోడ్డును కలుపుతూ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. అందుకోసం రూ.7కోట్లు మంజూరుచేస్తున్నట్లు వెల్లడించారు. హైజెనిక్ పద్ధతిలో మార్కెట్ జిల్లా కేంద్రంలో మార్కెట్లు దుర్భరంగా ఉన్నాయని, అత్యాధునిక పద్ధతిలో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్ల నిర్మిస్తామని సీఎం అన్నారు. రూ.5 కోట్లతో ఐదుమార్కెట్లు నిర్మించేందుకు నిధులు మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. ఆర్అండ్బీ ఈఈ కార్యాలయం ఆవరణలో, బాలుర జూనియర్ కళాశాల వద్ద, భగీరథ కాలనీలో, తూర్పుకమాన్, కమలానెహ్రుకాలనీ మార్కెట్లను నిర్మిస్తామన్నారు. ఇందులో కింద కూరగాయల మార్కెట్, పైభాగంలో మాంసం మార్కెట్, చేపల మార్కెట్ ఉండే విధంగా వీటిని నిరిస్తామని చెప్పారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం మరోరైతు బజార్‌ను నిర్మిస్తామని సీఎం చెప్పారు. ఆర్అండ్బీ కార్యాలయంలోని రెండెకరాల స్థలాన్ని ఇందుకోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. స్లాటర్‌హౌస్ మంజూరు జిల్లా కేంద్రంలో ఓ స్లాటర్‌హౌస్ లేదని, కోయిలకొండ చౌరస్తాలో ఓ స్లాటర్‌హౌస్‌ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టణంలో ఉన్న పెద్ద చెరువును మరో ట్యాంక్‌బండ్‌గా నిర్మిస్తామన్నారు. కట్టను వెడల్పుగా చేసి అవసరమైతే భూమిని సేకరిస్తామని సీఎం చెప్పారు. ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్కును నిర్మిస్తామని, చెరువులో ఉన్న గుర్రపుడెక్కల ఆకులను పదిరోజుల్లో తొలగించాలని అధికారులను ఆదేశించారు. కట్టకింద 35 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని, అవసరమైతే మరో మరికొంత భూమిని సేకరించి పార్కును నిర్మిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తామని సీఎం చెప్పారు. అంతవరకు ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్ధేశంతో ప్రతి 2, 3 వేల జనాభాకు ఓ మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.1.50కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న టౌన్‌హాల్ బాగా లేదని.. ఎప్పుడో కట్టిన హాల్ ప్రస్తుత ప్రజలకు సరిపోవడం లేదన్నారు. జిల్లా కేంద్రానికే తలమానికంగా ఉండే విధంగా మహబూబ్‌నగర్ కళాభారతి పేర ఆడిటోరియం నిర్మిస్తామని సీఎం హామీఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ కాలేజీ అవసరం ఉందని, కలిసికట్టుగా ఉండి సాధించుకుందామన్నారు. విద్యాభివృద్ధి కోసం పీయూను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. 3 కామన్డంపు యార్డ్ జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేస్తున్నారని.. పట్టణ జనాభాకు తగిన విధంగా మూడు కామన్డంప్ యార్డులను మంజూరుచేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పట్టణాన్ని సందరంగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది. జిల్లాకేంద్రంలో శ్మశానవాటికల కోసం స్థలాలు చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలమూరు జిల్లా వలసల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లికృష్ణారావు, విద్యుత్‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజు, అంజయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ టీకే.శ్రీదేవి, మునిసిపల్ చైర్‌ర్సన్ రాధాఅమర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మురికివాడల్లో మనమే ఫస్ట్
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక మురికివాడలు, గుడిసెలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విషయం నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యధిక గుడిసెలు వెలసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఎన్ఎస్ఎస్ సర్వే గణాంకాల ప్రకారం...2012 డిసెంబర్‌నాటికి దేశంలో ఉన్న గుడిసెల్లో 23 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13.5 శాతం, పశ్చిమ బెంగాల్లో 12 శాతం గుడిసెలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.దేశంలో సుమారు 33,510 గుడిసెలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో 41 శాతం గుడిసెలు నోటిఫై అయినవి కాగా, 59 శాతం నోటిఫైడ్ లేనివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 23 శాతం నోటిఫైడ్ గుడిసెలు ఉండగా, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తొమ్మిది శాతం ఉన్నాయి. ఇక నాన్ నోటిఫైడ్ గుడిసెల సంఖ్య దేశవ్యాప్తంగా 19,749 ఉండగా, అందులో మహారాష్ట్రలో 29 శాతం, పశ్చిమ బెంగాల్లో 14 శాతం, గుజరాత్లో 10 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో 7,723 గుడిసెలు... రాష్ట్రంలో మొత్తం 7,723 గుడిసెలు వెలిశాయి. దేశవ్యాప్తంగా 38 శాతం గుడిసెల్లో నివసించే కుటుంబాలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. 18 శాతం ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నాయి. దేశంలో సుమారు 88 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. వారిలో 56 లక్షల మంది నోటిఫైడ్, 32 లక్షల మంది నాన్ నోటిఫైడ్ గుడిసెలకు చెందిన వారున్నారు. దేశంలో నోటిఫైడ్ గుడిసెల్లో 63 శాతం కుటుంబాలు నివసిస్తున్నాయి. నాన్ నోటిఫైడ్ విషయానికొస్తే ఈ గుడిసెల్లో 40 శాతం కుటుంబాలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. రాష్ట్రం తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గుడిసెల సమస్య కొత్తదేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాల కన్నా అత్యధిక మురికివాడలు, గుడిసెలు రాష్ట్రంలో ఉండడం గమనార్హం. -
మురికిపాల్టీలు..!
విజయనగరం మున్సిపాల్టీ/ బొబ్బిలి, న్యూస్‌లైన్ : మున్సిపాల్టీలు.. మురికిపాల్టీలుగా మారుతున్నాయి. సిబ్బంది కొరత, కొరవడిన చిత్తశుద్ధి, ప్రత్యేక అధికారుల పాలన.. జవాబుదారీతనం లోపించడం వెరసి పట్టణ ప్రజలను పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నా యి. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బి లి మున్సిపాల్టీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. ప్రతి మున్సిపాల్టీలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మున్సిపాల్టీల్లో మురికివాడల సర్వేలతో కాలం గడుపుతున్నా రు కాని సమస్యలు పరిష్కరించడం లేదు. మూడేళ్లుగా పాలనా వ్యవహారాలు చూసే పాలక వర్గం లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవ డం వల్ల సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. పదేళ్లక్రితం నాటి ఉన్న సిబ్బంది, వాహనాలు ఉండడం వల్ల.. మంచినీటి ట్యాంకులు లేకపోవడం వెరసి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉన్న సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో పట్టణాల్లో ప్రజారోగ్యం కుంటుపడుతోంది. పట్టణాల్లో ఏ వార్డు చూసినా చెత్తచెదారాలతోనే దర్శనమిస్తున్నాయి. నెల్లిమర్లలో రోజూ 5 టన్నుల చెత్తను సేకరిస్తారు. చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు లేదు. దీని కోసం ప్రతిపాదనలు పంపించారు. విజయనగరం మున్సిపాల్టీ.. విజయనగరం పట్టణంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 1,74,651 మంది జనాభా ఉండగా, 2011 లెక్కల ప్రకారం 2,27,533 మంది జనాభా ఉన్నారు. వీరే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాల నిమిత్తం వచ్చి అద్దె ఇళ్లలో చాలా మంది నివాసం ఉంటున్నారు. పట్టణంలో 58,107 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 38 వార్డులు ఉండగా వీటితోపాటు నాలుగు విలీన పంచాయతీలు ఉన్నాయి. మున్సిపాల్టీలో ప్రజారోగ్యాన్ని కాపాడే ఎంహెచ్ఓ పోస్టు ఖాళీగా ఉంది. పట్టణమంతా పర్యవేక్షణ చేయవలసిన అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. నలుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లకు గాను రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్లు ఐదు పోస్టులకు నాలుగు, పీహెచ్ఎంలు ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు రెగ్యులర్ 261 మంది ఉండగా 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలో రోజూ సేకరించే 117 టన్నుల చెత్తను తరలించడానికి టిప్పర్లు 6, ఆటోలు 10, ట్రాక్టర్స్ 17, డుంపెర్ ప్లాసర్ 1, జేసీబీ 1, టారస్ 1, ఆటో మౌంటెడ్ పాగింగ్ మిషన్ 1, సెప్టిక్ క్లినర్ 1 ఉన్నాయి. బొబ్బిలి... బొబ్బిలిలో 57 వేల మంది జనాభా ఉన్నారు. 14,437 ఇళ్లు, 1072 దుకాణాలున్నాయి. మున్సిపాలీటీలో రోజుకు 17.5 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీనిలో దాదాపు టన్ను పొడి చెత్త, దాదాపు రెండున్నర టన్నుల తడి చెత్తను చెత్తశుద్ధి పార్కుకు తరలిస్తున్నారు. పార్కు రాక ముందు మూడేళ్ల కిందట మార్కెట్ కమిటీ వెనుకను మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో చెత్తను పోసేవారు. పక్క నుంచి వెళ్లే కృష్ణాపురం గ్రామస్తులు, సమీపంలో ఉండే పాఠశాల విద్యార్థులు, అతి సమీపంలో ఉండే దేవాలయానికి వచ్చిన భక్తులు ముక్కులు దుర్గంధం భరించలేకపోతున్నారు. 2011 జూలైలో రామందోరవలస వద్ద చెత్తశుద్ధి పార్కును పెట్టినా ఈ చెత్త సమస్య మాత్రం తీరలేదు. ఆ పార్కుకు వినియోగానికి పనికి వచ్చిన చెత్తను మాత్రమే తరలిస్తుండడంతో మిగతా పనికి రానిదంతా ఇలా పాత డంపింగ్ యార్డులోనే ఉంచేస్తున్నారు. అది ఇప్పుడు ఎక్కువై పక్కనే ఉన్న బొబ్బిలి-బలిజిపేట రోడ్డు మీదకు వచ్చేయడంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో 54 మంది శాశ్వత కార్మికులు, 105 కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ఆటోలు, రెండు ట్రిప్పర్లను చెత్తను తరలించేందుకు వినియోగిస్తున్నారు. అయినా మున్సిపాలిటీ ఎప్పుడూ మురిపికూపంగానే దర్శమనిస్తోంది. పార్వతీపురం పార్వతీపురం పురపాలక సంఘంలో కూడా అదే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 54 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ రోజుకు 25 టన్నుల చెత్త సేకరణ జరగుతోంది. పది వాహనాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది మాత్రమే పనిచేస్తున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో 79 మంది, శాశ్వత సిబ్బంది 45 మంది, శానిటరీ సూపర్వైజర్ ఒకరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇద్దరు, ఏఎస్ఓ ఒకరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరిపి గ్రామం వద్ద చెత్త శుద్ధి పార్కుకు స్థలం కేటాయించినా ఆ గ్రామస్తులు అడ్డుకోవడం వల్ల జట్టు ఆశ్రమానికి దగ్గరలో రాయగడ రోడ్డులోపాత డంపింగ్ యార్డులోనే చెత్తను ఉంచుతున్నారు. దీనివల్ల కొమరాడ, పార్వతీపురం మండలంలో ఉండే వారంతా రాకపోకలు చేయడానికి ఇబ్బందికి గురవుతున్నారు. సాలూరు సాలూరు పురపాలక సంఘంలో 10 వాహనాల ద్వారా 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. మొన్నటి వరకూ వేగావతి నది ఒడ్డే డంపింగ్ యార్డుగా ఉండేది. దీనివల్లతాగునీరు కలుషితం అవ్వడంతో వేగావతిలో ఉన్న ఫిల్టర్ బావుల్లో నీటిని ఉపయోగించిన బొబ్బిలి మండలం, పట్టణ వాసులకు అనేక రోగాలు వచ్చేవి. అయితే అక్కడ చెత్తశుద్ధి పార్కు కట్టిన తరువాత కొంత ఇబ్బందులు తీరాయి. స్లమ్ ప్రాంతాల్లో సమస్యలు.. విజయనగరంలో 72 స్లమ్ ప్రాంతాలు ఉన్నాయి. సాలూరులో 30, పార్వతీపురంలో 30, నెల్లిమర్ల 15 స్లమ్ ప్రాంతాలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. స్లమ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మురికివాడల్లో మంచినీటి, ఇళ్లు, పారిశుధ్య సమస్యలు ఎలాగున్నాయనే విషయాలపై అధికారులు సర్వే చేస్తున్నారు. విజయనగరం సర్వే చివరి దశకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.