ముంబై నగర మురికివాడల్లో నివసించే పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో 32 ఏళ్లుగా నిమగ్నమైన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంది సింగ్ రావత్. సుదీర్ఘ బోధనా అనుభవంలో పిల్లల మనస్తత్వాన్ని దగ్గరుండి అర్ధం చేసుకున్న మానసిక నిపుణురాలు. పిల్లలు రోల్ మోడల్‌గా భావించే ఈ టీచర్ ఇన్నేళ్లుగా చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది.
‘‘మూడు దశాబ్దాలకు పైగా పిల్లలతో కలిసి ఉండటం వల్ల వారి మనస్తత్వాన్ని సులువుగా అర్థం చేసుకునే స్థితి నాకు అలవడింది. ఆ ఆలోచనతో ‘మేము, పిల్లలు, వారి మనస్తత్వశాస్త్రం’ పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. టీచర్‌గా పిల్లల మనస్తత్వంపై, వారి వికాసంపై అనేక రకాల పరిశోధనల కథనాలు నేను రాసిన పుస్తంలో ఉన్నాయి. ఇవన్నీ టీచర్లకు, తల్లిదండ్రులకు మార్గదర్శకం అవుతాయి. ఇది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
పిల్లల మనసులను చదవాలి
హైపర్ యాక్టివ్, కోపం, పిరికితనం... ఇలా పిల్లలు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లల వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని వారితో మాట్లాడాలి. పిల్లల ప్రవర్తన వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేరు.
బాల్యంలో పిల్లల మనసులో నిలిచిపోయే విషయాలు లేదా సంఘటనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రోజూ తల్లిదండ్రుల పోట్లాడుకుంటుంటే పిల్లవాడికి భవిష్యత్తులో పెళ్లి పట్ల విముఖత ఏర్పడుతుంది. లేదా తన జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలో అర్థం కాకపోవచ్చు. చదువుకోవడానికి వచ్చే మురికివాడల పిల్లల జీవితం సంపన్నుల పిల్లల కంటే భిన్నంగా ఉంటుంది. వారి సమస్య లు, అవసరాలు లెక్కలేనన్ని ఉంటాయి.
ప్రేమ, ఆప్యాయత వారికి లభించడం లేదు. ఈ పిల్లలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఇంట్లో వాతావరణం బాగుండదు. దీని ప్రభావం కొన్నిసార్లు వారి హృదయాన్ని, మనస్సును గాయపరుస్తుంది. అప్పుడు వారు క్లాసులో మౌనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అలాంటి పిల్లలను పక్కకు తీసుకెళ్లి వారితో మాట్లాడతాను. వారి మనస్సులను చదువుతాను. వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. క్లాసులో పిల్లలెవరూ విచారంగా, మౌనంగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను.
తల్లిదండ్రులూ అర్థం చేసుకోలేరు
పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతాను. వారి ఇంటి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాను. వారి పొర పాట్లను ప్రేమగా వారికి తెలియజెబుతాను. పిల్లల ముందు ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలో వివరిస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పోట్లాడుకోవడం చూసిన పిల్లలు స్కూల్లో ఇతర పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ పిల్లల ఇంటి వాతావరణం వారి బాల్యాన్ని నాశనం చేసే సామాజిక సమస్య. వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. చిన్న పిల్లల మనసు అర్థం చేసుకోవాలంటే వాళ్ల మనసు లోతుల్లోకి వెళ్లాలి. వాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే వాళ్ల కష్టాలు అర్థం చేసుకోవడం తేలికైంది. అప్పుడు పిల్లలు కూడా నేను చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
హృదయ విదారక కథలు
కుటుంబంలో తగాదాలు, ఇల్లు కూలిపోవడం, అమ్మ లేదా నాన్న కొట్టడం, కొన్నిసార్లు సవతి తండ్రి, కొన్నిసార్లు సవతి తల్లితో బాధలు... దీంతో ఈ పిల్లల బాల్యాన్ని తుంగ లో తొక్కేసినట్టవుతుంది. ఈ పిల్లలను తిరిగి స్కూల్‌కు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి.
భయపెట్టే సంఘటనలు
రోహన్ (పేరుమార్చాం) తన మనసులో ఏదో దాచుకుంటున్నట్టు, భయం భయంగా ఉండేవాడు. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు. వారి ఇల్లు చాలా చిన్నది కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఒకే గదిలో పడుకునేవారు. తన తల్లిదండ్రులు రాత్రిపూట వ్యక్తిగతంగా గడపడం చూశాడు రోహన్. తన తండ్రి అమ్మను హింసిస్తున్నాడని మనసులో భయం పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మదనపడుతుండేవాడు. తల్లిదండ్రులకు, ఆ పిల్లవాడికి కౌన్సెలింగ్ ఇచ్చాక సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు.
ఆరవ తరగతి చదువుతున్న సోఫియా (పేరు మార్చాం) తన డైరీలో ఏదో రాసుకోవడం గమనించాను. అడిగితే, ఎవరూ చూడకుండా చూపిస్తానంది. క్లాస్ రూమ్ నుంచి మరో గదికి తీసుకెళ్లి అడిగితే, డైరీ చూపించింది. ఆ డైరీ చదివినప్పుడు నా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సోఫియా తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంది. తన తల్లితో కలిసి కొత్త తండ్రి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొత్త తండ్రి, అతని తమ్ముడు సోఫియాను బాధపెడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరికీ ఏమీ చెప్పలేక తన తండ్రికి డైరీలో ఉత్తరాలు రాసుకుంది. ఆ తర్వాత వాళ్ల అమ్మను కలిసి మాట్లాడాను. ఆమె సోఫియా పట్ల జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, మరెన్నో గాథలు పిల్లల నుంచి తెలుసుకున్నవి, పరిష్కరించినవి ఉన్నాయి.
టీచర్‌ని కావాలనుకున్నాను..
ముంబైలోని సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగాను. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఫీజు కట్టడానికి డబ్బుల్లేక ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాంటిస్సోరి కోర్సు చేశాను. ఇదే పిల్లలకు నన్ను దగ్గర చేసింది.
ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో
నేను పనిచేసే చోట ప్రిన్సిపల్ బీఎడ్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత రెండేళ్లకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి అయింది. అత్తింటి ప్రోత్సాహంతో ఎం.ఏ. డిగ్రీ పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచడంతో పాటు ఇంటి పనులు, స్కూల్ పనుల వల్ల సమయం అస్సలు ఉండేది కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక పీహెచ్‌డీ పూర్తిచేశాను. నాకూతురు మెడిసిన్ చదువుతుండగా నేను పీహెచ్‌డీ చేస్తున్నాను. అలాగని నా జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, కష్టాలు ఎదురైనా పూర్తి నిజాయితీతో నా పని చేస్తూ వచ్చాను. నేను చదువు చెప్పే పిల్లలు బాగా రాణిస్తున్నారని అర్థమయ్యాక నాకు చాలా ఆనందం కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment