Anandhi
-
తెలుగమ్మాయే కానీ తమిళంలో సూపర్ ఫేమస్.. డైరెక్టర్ని పెళ్లి చేసుకుని (ఫొటోలు)
-
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భరణి కే ధరన్ దర్శకుడిగా మారాడు. 40పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన ఆయన ‘సివంగి’కోసం మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రంలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు. -
Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం
ముంబై నగర మురికివాడల్లో నివసించే పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో 32 ఏళ్లుగా నిమగ్నమైన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంది సింగ్ రావత్. సుదీర్ఘ బోధనా అనుభవంలో పిల్లల మనస్తత్వాన్ని దగ్గరుండి అర్ధం చేసుకున్న మానసిక నిపుణురాలు. పిల్లలు రోల్ మోడల్‌గా భావించే ఈ టీచర్ ఇన్నేళ్లుగా చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది. ‘‘మూడు దశాబ్దాలకు పైగా పిల్లలతో కలిసి ఉండటం వల్ల వారి మనస్తత్వాన్ని సులువుగా అర్థం చేసుకునే స్థితి నాకు అలవడింది. ఆ ఆలోచనతో ‘మేము, పిల్లలు, వారి మనస్తత్వశాస్త్రం’ పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. టీచర్‌గా పిల్లల మనస్తత్వంపై, వారి వికాసంపై అనేక రకాల పరిశోధనల కథనాలు నేను రాసిన పుస్తంలో ఉన్నాయి. ఇవన్నీ టీచర్లకు, తల్లిదండ్రులకు మార్గదర్శకం అవుతాయి. ఇది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల మనసులను చదవాలి హైపర్ యాక్టివ్, కోపం, పిరికితనం... ఇలా పిల్లలు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లల వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని వారితో మాట్లాడాలి. పిల్లల ప్రవర్తన వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేరు. బాల్యంలో పిల్లల మనసులో నిలిచిపోయే విషయాలు లేదా సంఘటనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రోజూ తల్లిదండ్రుల పోట్లాడుకుంటుంటే పిల్లవాడికి భవిష్యత్తులో పెళ్లి పట్ల విముఖత ఏర్పడుతుంది. లేదా తన జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలో అర్థం కాకపోవచ్చు. చదువుకోవడానికి వచ్చే మురికివాడల పిల్లల జీవితం సంపన్నుల పిల్లల కంటే భిన్నంగా ఉంటుంది. వారి సమస్య లు, అవసరాలు లెక్కలేనన్ని ఉంటాయి. ప్రేమ, ఆప్యాయత వారికి లభించడం లేదు. ఈ పిల్లలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఇంట్లో వాతావరణం బాగుండదు. దీని ప్రభావం కొన్నిసార్లు వారి హృదయాన్ని, మనస్సును గాయపరుస్తుంది. అప్పుడు వారు క్లాసులో మౌనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అలాంటి పిల్లలను పక్కకు తీసుకెళ్లి వారితో మాట్లాడతాను. వారి మనస్సులను చదువుతాను. వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. క్లాసులో పిల్లలెవరూ విచారంగా, మౌనంగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను. తల్లిదండ్రులూ అర్థం చేసుకోలేరు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతాను. వారి ఇంటి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాను. వారి పొర పాట్లను ప్రేమగా వారికి తెలియజెబుతాను. పిల్లల ముందు ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలో వివరిస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పోట్లాడుకోవడం చూసిన పిల్లలు స్కూల్లో ఇతర పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ పిల్లల ఇంటి వాతావరణం వారి బాల్యాన్ని నాశనం చేసే సామాజిక సమస్య. వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. చిన్న పిల్లల మనసు అర్థం చేసుకోవాలంటే వాళ్ల మనసు లోతుల్లోకి వెళ్లాలి. వాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే వాళ్ల కష్టాలు అర్థం చేసుకోవడం తేలికైంది. అప్పుడు పిల్లలు కూడా నేను చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ప్రారంభించారు. హృదయ విదారక కథలు కుటుంబంలో తగాదాలు, ఇల్లు కూలిపోవడం, అమ్మ లేదా నాన్న కొట్టడం, కొన్నిసార్లు సవతి తండ్రి, కొన్నిసార్లు సవతి తల్లితో బాధలు... దీంతో ఈ పిల్లల బాల్యాన్ని తుంగ లో తొక్కేసినట్టవుతుంది. ఈ పిల్లలను తిరిగి స్కూల్‌కు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. భయపెట్టే సంఘటనలు రోహన్ (పేరుమార్చాం) తన మనసులో ఏదో దాచుకుంటున్నట్టు, భయం భయంగా ఉండేవాడు. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు. వారి ఇల్లు చాలా చిన్నది కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఒకే గదిలో పడుకునేవారు. తన తల్లిదండ్రులు రాత్రిపూట వ్యక్తిగతంగా గడపడం చూశాడు రోహన్. తన తండ్రి అమ్మను హింసిస్తున్నాడని మనసులో భయం పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మదనపడుతుండేవాడు. తల్లిదండ్రులకు, ఆ పిల్లవాడికి కౌన్సెలింగ్ ఇచ్చాక సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న సోఫియా (పేరు మార్చాం) తన డైరీలో ఏదో రాసుకోవడం గమనించాను. అడిగితే, ఎవరూ చూడకుండా చూపిస్తానంది. క్లాస్ రూమ్ నుంచి మరో గదికి తీసుకెళ్లి అడిగితే, డైరీ చూపించింది. ఆ డైరీ చదివినప్పుడు నా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సోఫియా తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంది. తన తల్లితో కలిసి కొత్త తండ్రి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొత్త తండ్రి, అతని తమ్ముడు సోఫియాను బాధపెడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరికీ ఏమీ చెప్పలేక తన తండ్రికి డైరీలో ఉత్తరాలు రాసుకుంది. ఆ తర్వాత వాళ్ల అమ్మను కలిసి మాట్లాడాను. ఆమె సోఫియా పట్ల జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, మరెన్నో గాథలు పిల్లల నుంచి తెలుసుకున్నవి, పరిష్కరించినవి ఉన్నాయి. టీచర్ని కావాలనుకున్నాను.. ముంబైలోని సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగాను. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఫీజు కట్టడానికి డబ్బుల్లేక ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాంటిస్సోరి కోర్సు చేశాను. ఇదే పిల్లలకు నన్ను దగ్గర చేసింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో నేను పనిచేసే చోట ప్రిన్సిపల్ బీఎడ్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత రెండేళ్లకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి అయింది. అత్తింటి ప్రోత్సాహంతో ఎం.ఏ. డిగ్రీ పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచడంతో పాటు ఇంటి పనులు, స్కూల్ పనుల వల్ల సమయం అస్సలు ఉండేది కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక పీహెచ్డీ పూర్తిచేశాను. నాకూతురు మెడిసిన్ చదువుతుండగా నేను పీహెచ్డీ చేస్తున్నాను. అలాగని నా జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, కష్టాలు ఎదురైనా పూర్తి నిజాయితీతో నా పని చేస్తూ వచ్చాను. నేను చదువు చెప్పే పిల్లలు బాగా రాణిస్తున్నారని అర్థమయ్యాక నాకు చాలా ఆనందం కలుగుతుంది. -
గతేడాది రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి..
ఓటీటీలు వచ్చాక సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు థ్రిల్లర్ సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే థియేటర్లలో విడుదలైన చిత్రాలను సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే విధి. ఓటీటీలోకి వచ్చేసిన మూవీ రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన చిత్రం విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఎస్. రంజిత్ నిర్మించారు. ఈ మూవీని ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో తెరకెక్కించారు. దీనివల్ల కంటి చూపు లేనివాళ్లు కూడా ఈ సినిమాను అనుభూతి చెందగలడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సైలెంట్‌గా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కథేంటంటే.. సూర్య (రోహిత్ నందా) ఓ అమాయకపు కుర్రాడు. ఉద్యోగం కోసం ఊరి నుంచి పట్నం వస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే క్రమంలో ఓ రోజు ఓ వ్యక్తి దగ్గరున్న కలం చూసి ముచ్చటపడతాడు. కానీ దాని ధర రూ.40 వేలు అని చెప్పడంతో షాకవుతాడు. తర్వాత అలాంటి పెన్ ఒకటి హీరోకు దొరుకుంది. ఆ పెన్‌తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతుంటారు. మరి ఈ కలం వల్ల సూర్య జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆ పెన్ వెనక అసలు కథేంటి? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే! Wishing my brother #Rohit all the best for his 'VIDHI'! 🎬 Now streaming on Prime Video, this all-around entertainer is a must-see! 🍿 #VIDHI #PrimeVideo 👉https://t.co/Dwk2DzpEfB#RohitNanda @anandhiactress @srikanthcinema @NoIdeaEntmt — Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2024 చదవండి: చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్ బాబు ఏం అన్నారంటే వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్ -
నా భర్త చెబితేనే బోల్డ్ సినిమాలో నటించా: హీరోయిన్
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. ఒకవేళ సినిమాల్లో నటించినా.. అసభ్యకర సన్నివేశాలు..రొమాంటిక్ సీన్స్ లేకుండా జాగ్రత్త పడతారు. కానీ హీరోయిన్ ఆనంది మాత్రం ఇందుకు మినహాయింపు. పెళ్లి అయిన తర్వాత కూడా బోల్డ్ సినిమాలో నటించింది. అయితే అది మంచి సందేశాత్మక చిత్రం కావడం వల్లే తాను అలా నటించానని చెబుతోంది. అంతేకాదు ఆ సినిమాలో నటించాలని తన భర్త ప్రోత్సహించాడట. ఆ తమిళ సినిమా పేరు మంగై. మంగై అంటే తెలుగులో పడుచు పిల్ల అని అర్థం. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది. ఆమె అనుభవాలు ఏంటనేది ఈ సినిమా కథ. ఓ ఆడపిల్లను మగాడు చూసే కోణంలో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ తెలిపారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఈ సినిమా కథనం ఎలా సాగుతుందో తెలియజేస్తుంది. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు ఆనంది నటించలేనని చెప్పిందట. మంచి సందేశాత్మక చిత్రమే అయినప్పటికీ.. బోల్డ్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయట. దీంతో తొలుత ఆనంది ఈ కథను రిజెక్ట్ చేసిందట. కానీ ఆమె భర్త మాత్రం ఓ నటిలాగా ఆలోచించమని చెప్పారట. ఆయన ప్రోత్సాహం వల్లే చాలా కంపర్ట్‌గా ఈ సినిమాలో నటించానని ఓ ఇంటర్వ్యూలో ఆనంది చెప్పింది. ఇక ఆనంది విషయానికొస్తే.. తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయిన తెలుగమ్మాయి. ఈమె స్వస్థలం తెలంగాణాలోని వరంగల్ జిల్లా. తెలుగులో చాన్స్‌లు రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్లి అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అసలు పేరు రక్షిత. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును హాసికగా మార్చుకున్నారు. ఆ పేరు కలిసి రాక ఆనందిగా మార్చుకుంది. 2021లో తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది. తెలుగులో జాంబీరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాల్లో నటించింది. -
హీరోయిన్ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్: ఆనంది
తమిళసినిమా: తనకు నటనపై ఆసక్తే లేదని నటి కయల్ ఆనంది పేర్కొన్నారు. ఈమె అసలు పేరు ఆనంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో కయల్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి ఆదరణ పొందడంతో కయల్ ఆనందిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత పరియేరుమ్ పెరుమాళ్, చండీవీరన్, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్ వగైయార్, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. గ్లామర్‌కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటారు. కాగా ఆమె ఇటీవల తన సినీ అనుభాలను ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు మొదట్లో నటనపై ఆసక్తే లేదని చెప్పారు. అసలు నటినవుతానని కూడా ఊహించలేదన్నారు. అయితే కయల్ చిత్రం తరువాత నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఇప్పుడు మంచి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. అదే విధంగా మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పారు. తనకు నప్పే పాత్రలకు దర్శక నిర్మాతలు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని తెలిపారు. కయల్ చిత్రంలో నటించడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఆ చిత్రం తన కేరీర్‌కు బాగా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు. -
కోలీవుడ్‌లో జాంబిరెడ్డి హీరోయిన్ కొత్త సినిమా!
మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న నటి 'కయల్' ఆనంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వైట్‌రోస్. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటుడు ఆర్కే సురేష్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. రంజని నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుశిగణేశన్ శిష్యుడు అన్నది గమనార్హం. చిత్ర యూనిట్ వైట్‌రోస్ వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువతి ఎదుర్కొనే సమస్యలు ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అన్నారు. ఇది ఉత్కంఠ భరితంగా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆనంది పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆమె కెరీర్లోనే ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెప్పారు. ఆనంది అద్భుతంగా నటిస్తున్నారన్నారు. సురేష్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదేవిధంగా చిత్రంలో మరో ప్రముఖ నటి నటించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి జోహన్, శివనేశ్ సంగీతాన్ని ఇళయరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో ఆనంది తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఇటీవలే ఆమె తెలుగులో కస్టడీ సినిమాలో కనిపించింది. చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషిపై జాలి చూపించిన హీరోయిన్ వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల -
అలాంటి టైంలో కూడా ఆనంది షూటింగ్ చేసింది : అల్లరి నరేష్
అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు తనని బాగా నటించావ్ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అందంగా ఉన్నావ్ అని అంటుంటే సిగ్గేస్తుంది. నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి థాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. ఇక ఈ మూవీలో ఆనంది హీరోయిన్గా చేసింది. షూటింగ్ సమయానికి ఆమె బేబీకి బర్త్ ఇచ్చిన మూడో నెల. అయినా సరే కష్టపడి సినిమాను చేశారు.ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమాని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్.ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి' అని కోరారు. -
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. టీజర్ చూశారా?
నాంది సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్నాడు అల్లరి నరేశ్. ప్రస్తుతం అతడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్నాడు. నరేశ్‌కు ఇది 59వ చిత్రం. ఈ మూవీలో ఆనంది హీరోయిన్. గురువారం (జూన్ 30న) అల్లరి నరేశ్ బర్త్‌డేను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా నటించాడు హీరో. సాయం సేత్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు, మీరు మనుషులైతే సాయం సేయండి అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు వారికున్న సమస్య ఏంటి? ఏ సమస్య గురించి నరేశ్ పోరాడుతున్నాడు? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. On my special day,a special something for all of you 😊https://t.co/gbt9OqkSKd#ItluMaredumilliPrajaneekam #IMP @kayal_anandhi @zeestudiosofficial @hasyamovies @lemonsprasad @rajdanda @vennelakish @balajigutta @abburiravi @sricharanpakala @raam_dop @chotakprasad @brahmakadali — Allari Naresh (@allarinaresh) June 30, 2022 చదవండి: ప్రస్తుతం నేను ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా పృథ్వీరాజ్ సినిమాకు కోట్లల్లో ఓటీటీ డీల్.. -
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో అల్లరి నరేష్ కొత్త సినిమా..
'నాంది' సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న “సభకు నమస్కారం” చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక రీసెంట్గా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో నరేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం క్రేజీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమా ఇది. దీనికి “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో నరేష్‌కి జోడీగా శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది నటిస్తుంది. ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రలు పోషించనున్నారు. On this auspicious Sri Rama Navami, blessed to share with you the title of my next #ItluMaredumilliPrajaneekam #Naresh59 #IMP @raajmohan73 🎬@anandhiactress @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @vennelakishore @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala pic.twitter.com/Pu1uHvA2FL — Allari Naresh (@allarinaresh) April 10, 2022 -
తల్లి కాబోతున్న హీరోయిన్ ఆనంది!
‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ ఆనంది తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగమ్మాయిగా పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనంది ‘బస్ స్టాప్’, ‘ఈ రోజుల్లో’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ కాస్తా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగమ్మాయి అయినప్పటికి తమిళంలో తన సత్తా చాటి సక్సెస్ సాధించింది. చదవండి: పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్ ఈ క్రమంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌తో ప్రేమలో పడిన పడిన ఆమె ఈ జనవరి 7న పెద్దల అంగీకారంతో ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆనంది త్వరలోనే తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు ఆరు నెలల గర్భిణిగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆనంది పెళ్లికి ముందు నటించిన జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ మూవీలు పెళ్లి అనంతరం విడుదలయ్యాయి. The beginning of new chapter... pic.twitter.com/IwUcet0BsH — Anandhi (kayal) (@anandhiactress) January 9, 2021 -
‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రొటీన కథ అని కొందరంటే, సినిమా అదిరిపోయిందని మరికొంత మంది అంటున్నారు. ఇక ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. శుక్రవారం తన ఇంట్లోని మినీ థియేటర్లలో సినిమాను వీక్షించిన మహేశ్.. దర్శకుడు కరుణ కుమార్, హీరో సుధీర్ బాబుపై ప్రశంసల జల్లుకురిపించాడు. (చదవండి: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ) ‘శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ మూవీ.. అంతేకాకుండా అదిరిపోయే క్లైమాక్స్ కూడా ఉంది. ‘పలాస’ తరువాత దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే తన బెస్ట్ ఫెర్మార్మెన్స్. నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసి అలరించారు. హీరోయిన్ ఆనంది గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీమ్ అందరికి మరోసారి శుభాకాంక్షలు’అని మహేశ్ వరుస ట్వీట్లు చేశాడు. #SrideviSodaCenter... a raw and intense film with a hard-hitting climax. Director @Karunafilmmaker comes up with yet another bold film after Palasa 1978. @isudheerbabu, is absolutely brilliant!! His finest performance till date 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) August 27, 2021 -
సోడా సెంటర్లో ప్రభాస్
-
'శ్రీదేవి సోడా సెంటర్': మొత్తానికి హీరోయిన్ను రివీల్ చేశారు..
సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్ను రివీల్ చేయలేదు చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రంలో జాంబిరెడ్డి ఫేం ఆనంది కథానాయికగా నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె గోలి సోడా కొడుతూ గ్రామీణ యువతిగా కనిపిస్తుంది. 'ఈ రోజుల్లో'.. 'బస్టాప్' వంటి సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఆనంది..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బిజీ అయింది. తాజాగా జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చిన ఆనంది ఖాతాలో ఇప్పుడు ఈ చిత్రం కూడా చేరింది. కాగా 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
భర్త రాసిన ప్రిస్క్రిప్షన్
ఆనంది భారతదేశపు తొలి వైద్యురాలు.ఆవిడ తెలివైందని.. ఆలోచన గలదనీ..కష్టాన్ని జయించగలదనీ..పందొమ్మిదో శతాబ్దంలోనే అమెరికా వెళ్లిడాక్టర్ చదువు చదివేంత ధైర్యం గలదనీ..ఇన్ని.. ఉన్నా..ఆవిడ విజయం.. భర్త రాసిన ప్రిస్క్రిప్షన్‌గానేఉండిపోయింది!ఆ ప్రిస్క్రిప్షన్ని కొద్దిగా మారుస్తూ.. ఆనందీ గొప్పతనాన్ని, వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్నీచూపించబోతోంది..కొత్త మరాఠీ సినిమా.. ‘ఆనందీ గోపాల్’. భరించువాడు భర్త! మంచి మాటే. పెళ్లయితే భర్తయినట్లేనా?! కలిసుండాలి లైఫ్ లాంగ్. కనీసం కష్టంలో. ట్యాప్‌లో నీళ్లు రాకపోతే, ‘కాశీకి పోతాను రామా హరి..’అని రాగి చెంబు అందుకుని, వారణాసి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతానంటే కుదరదు. ఫోన్ చెయ్యాలి. వాటర్ ట్యాంక్ తెప్పించాలి. అంత లేకపోతే, బిందెల్ని సైకిల్‌కి కట్టుకుని, పోయిరావలె చెరువుకు. జ్వరం వచ్చిందా తనకి. ‘డోలో సిక్స్ఫిఫ్టీ వేసుకో’ అని చెప్పి ఆఫీస్‌కి వెళ్లిపోవడం కరెక్టే. ఒకరోజుకి కరెక్ట్, రెండు రోజులకు కరెక్ట్. మూడో రోజూకీ తగ్గకుంటే నీ మానాన నువ్వు ఆఫీస్‌కి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో. బండి మీద ఎక్కించుకో. అంతలేకపోతే భుజాన వేసుకుపో. భార్య ఆమె నీకు. నీళ్లు రాకపోవడం, జ్వరం తగ్గకపోవడం జీవితంలో పెద్ద కష్టాలు కాదు. ఇంకా పెద్దవి ఉంటాయి. ఏం ఉంటాయో చెప్పలేం. చెప్పకుండా వచ్చేస్తాయి. అకస్మాత్తు అవసరాలు, అకస్మాత్తు ట్రాన్స్ఫర్లు. అకస్మాత్తుగా.. ఇంకేమైనా. అప్పుడు గట్టిగా నిలబడాలి. గట్టిగా నిలబడలేకపోతే పిల్లాడికి అమ్మ కొంగు ఉంటుంది. కుర్రాడికి నాన్న చెయ్యి ఉంటుంది. డిగ్రీ అయి వీధిలోకి వచ్చినవాడికి ‘రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ’ అని గాత్ర సహకారం అందించే సాటి పట్టభద్రులు ఉంటారు. భర్తకు వీళ్లెవరూ ఉండరు. అతడే పడాలి. పడలేకపోతే, కనీసం బయటైనా పడకుండానైనా ఉండాలి. నువ్వు బయట పడితే.. ఆమె బయటపడి పోతుంది. పడకూడదు. భార్య ఆమె నీకు. భర్తకు అన్నిటికన్న పెద్ద కష్టం.. భార్య మనసులోని కష్టం తెలుసుకోవడం! ఆమె చెప్పదు. నువ్వు బిజీగా ఉంటావు. ప్రపంచంతో పోరాడి ఇంటికి వస్తావు. అప్పుడు చెప్పదు. ఉదయాన్నే మళ్లీ కత్తీ డాలు తీసుకుని, కవచం తొడుక్కుని, హెల్మెట్ పెట్టుకుని బయల్దేరతావు. అప్పుడూ చెప్పదు. ఇంకెప్పుడు చెప్పడం? ఎప్పుడూ చెప్పదు. నువ్వే తెలుసుకోవాలి. ఆమె చెప్పకుండా ఆమె చెప్పాలనుకుంటున్నదేమిటో తెలుసుకోవాలి. ఆమె నుదురు తాకకుండా నూటా మూడు డిగ్రీలలో సైతం ఆమె తన చిరునవ్వును చెరగనివ్వడం లేదని తెలుసుకోవాలి. భార్య ఆమె నీకు.చెప్పి నీ మనసు పాడు చేయకూడదని భార్యగా ఆమె అనుకుంటున్నప్పుడు, చెప్పకుండా తెలుసుకుని ఆమె మనసును భర్తగా నువ్వు అర్థం చేసుకోవాలి. భర్తంటే భరించేవాడేనా? ‘భరింపబడే’ అగత్యం లేకుండా లోకంతో తలపడడం ఎలాగో భార్యకు నేర్పించేవాడు కూడా. తల ఆన్చడానికి ఇవాళ నీ భుజం ఉంది. రేపు? నీకేదైనా అయితే? అప్పుడూ నువ్వే భరించాలి. అప్పుడూ భర్తవే కదా. ఇన్నాళ్లూ ఇద్దరూ కలిసి బతికిందంతా.. రేపు నువ్వు లేకున్నా కూడా ఆమె ఒకరే బతకడం ఎలాగో నేర్పించడానికే అవ్వాలి. భార్య తెలివిగలది కావచ్చు. మాటకారి కావచ్చు. ఏటీఎంకి వెళ్లి డబ్బులెలా తియ్యాలో ఆమెకు తెలిసుండొచ్చు. ఇంటిపనీ, ఆఫీస్ పని సింగిల్ హ్యాండెడ్‌గా చక్కబెడుతూ ఉండి ఉండొచ్చు. అయినా నేర్పించాలి. అయినవాళ్లలోనే ఎవరైనా చివుక్కుమనేలా ఒక మాట అంటే.. ‘నా భర్తే ఉండి ఉంటేనా’ అనే ఆలోచన రాకుండా, గట్టిగా నిలబడేలా భర్తే ఆమెకు మానసిక శక్తిని ఇచ్చిపోవాలి. అదే భర్త బాధ్యత. భర్త ధర్మం.∙∙ ‘‘పద’’ అన్నాడు గోపాల్రావ్ జోషి, ఇంట్లోకొచ్చి. అతడు భర్త. మౌనంగా వెనకే బయల్దేరింది యమున. ఆమె భార్య. తొమ్మిదేళ్ల వయసులో యమునకు ఇరవై తొమ్మిదేళ్ల గోపాల్రావ్తో పెళ్లయింది. పెళ్లవగానే యమున ‘ఆనంది’ అయింది. భార్యకు భర్త ఇష్టంగా పెట్టుకున్న పేరు ఆనంది. ఆమెకేం ఇష్టాల్లేవు. భర్తపై ఇష్టం, భర్తంటే అయిష్టం కలిగే వయసు కూడా కాదు. పెళ్లైతే అవడానికి అయింది కానీ, ఆమె ఇంకా భార్య కాలేదు. పదేళ్లొచ్చినా, పన్నెండేళ్లొచ్చినా, పదమూడేళ్లొచ్చినా కాలేదు. పద్నాలుగో యేట మాత్రం తల్లి అయింది. తల్లయినా, భార్య కాలేదు! గోపాల్రావ్ వచ్చి భార్యతో ‘పద’అన్నది.. ఆమెకు తొమ్మిదీ–పదమూడేళ్ల మధ్య వయసులో. కనీసం ఐదుసార్లు ‘పద’ అని ఉంటాడు. భర్త పద అనగానే ఇద్దరివీ బట్టలు సర్దేది. గోపాల్రావ్ పోస్టల్ క్లర్క్. పుణెకు కొద్ది దూరంలో కల్యాణ్‌లో హెడ్డాఫీస్. పుణె, కల్యాణ్, కొల్హాపూర్, అలీభాగ్, కచ్, సెరంపూర్.. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి భర్త ‘పద’ అనేవాడు. ఆనంది చెప్పులైనా చప్పుడు కాకుండా ఫాలో అయ్యేది.ఆనంది పుట్టింది పుణెలో. పెరిగింది, పెళ్లి జరిగిందీ కల్యాణ్‌లో. భూస్వామి కుటుంబం. కుటుంబంలోని పూర్వపు పెద్దల తెలివితక్కువతనంతో భూములు పోయి, ఫ్యామిలీ అప్పుల పాలైంది. ‘పిల్లకు పెళ్లి చేసేయండి’ అన్నారు బంధువులు. ‘ఇంకా తొమ్మిదేళ్లే కదా’అంటే, ‘మీకింకా తెలివి రాలేదా?’ అన్నారు. వాళ్లే గోపాల్రావ్ని వెదికి తెచ్చారు. గోపాల్రావ్ ప్రొగ్రెసివ్.‘‘బదిలీ అయిన ప్రతిచోటికీ పిల్లను తీసుకెళతావెందుకు?’’ అని ఆ ఇంట్లోవాళ్లు, ఈ ఇంట్లో వాళ్లు అన్నప్పుడు.. గోపాల్రావ్ అన్నమాట ఆనందికి బాగా గుర్తుండిపోయింది. ‘‘నా భార్య చదువుకుంది. చదువుకున్న పిల్లకు ఇల్లే ప్రపంచం కాకూడదు. ప్రపంచం నడవడానికి తనూ ఒక కారణం అవాలి. ఒకవేళ ఆనందికి చదువులేకపోయినా నేను ఇంట్లో ఉంచేవాడిని కాదు. చదివించుకునేవాడిని’’ అన్నాడు. అంతా బుగ్గలు నొక్కుకున్నారు.1880ల చివరి కాలమది. అప్పటికి ఆనందికి పద్దెనిమిదేళ్లు. ఈసారి బదిలీ అయింది పెద్ద ఊరికి. కలకత్తా. ‘‘కలకత్తాలో పిల్ల ఒక్కతే ఎలా ఉంటుంది!’’ అన్నారు. ‘‘కలకత్తాలోనూ మనుషులే ఉంటారు’’ అన్నాడు గోపాల్రావ్. గుడిపాటి వెంకటాచలం కన్నా యాభై ఏళ్ల ముందే.. ‘స్త్రీకి మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. స్త్రీకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి. స్త్రీకి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి’ అని వాదించిన మొండివాడు గోపాల్రావ్. పద్నాలుగో ఏట పుట్టిన బిడ్డ పదిరోజులకే చనిపోయి ఆనంది ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్నప్పుడూ అతడు ఓదార్చిన విధానం మొండిగానే ఉంది. ‘‘ఏడ్వకు. ఏడిస్తే పోయిన బిడ్డ వస్తాడా. నీ బిడ్డ ఒక్కడే కాదు. పుణె చుట్టుపక్కల చాలామంది బిడ్డలు చనిపోతున్నారు. బతికించే వైద్యం లేదు. ఉండి ఉంటే నీ బిడ్డ బతక్కపోయేవాడా’’ అన్నాడు. ‘నీ బిడ్డ’ అనడం ఆనందిని నొప్పించింది. బిడ్డ చనిపోతే తల్లికేనా బాధ! తండ్రికి ఏమీ ఉండదా? ‘నీ బిడ్డ’ అన్న మాటకు భార్య బాధపడిందని గోపాల్రావ్ గ్రహించాడు. తనూ కూర్చొని ఏడిస్తే ఏం భర్త?! ‘‘ఆనందీ.. నువ్వు మెడిసిన్ చదవాలి’’ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ‘‘అవును. మన బిడ్డలా సరైన వైద్యం లేక ఎవరూ చనిపోకూడదు. నువ్వు డాక్టర్వి కావాలి’’ అన్నాడు. ఆనంది ముఖం వెలిగిపోయింది. ‘నువ్వు డాక్టర్వి కావాలి’ అన్నందుకు కాదు. అతడు ‘మన బిడ్డ’ అన్నందుకు. ∙∙ ‘‘పద’’ అన్నాడు గోపాల్రావ్ వచ్చి. ఈసారి యు.ఎస్కి! పెన్సిల్వేనియాలోని ‘ఉమెన్స్ మెడికల్ కాలేజ్’లో భార్యకు సీటు సంపాదించుకొచ్చాడు అతడు! మళ్లీ అంతా ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కుకున్నారు. కిరస్తానీలుండే దేశానికి పెళ్లాన్ని తీసుకెళ్తున్నాడా?! తీసుకెళ్తున్నాడా ఏంటీ.. తీసుకెళ్లాడు గోపాల్రావ్. ఆనంది మెడిసిన్ పూర్తి చేసింది. అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్లు. యు.ఎస్.లో వాతావరణం పడక దగ్గుతూ ఉండేది. మెడిసిన్ అయ్యాక ఆ దగ్గుతోనే ఇండియా వచ్చింది. కొల్హాపూర్ ‘ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్’లో డాక్టర్‌గా ఉద్యోగం. దేశంలోనే మొదటి మహిళా డాక్టర్!! క్రమంగా దగ్గుకు ఆమె దగ్గరైంది. డాక్టర్ అయిన ఏడాదికే క్షయ వ్యాధితో 21 ఏళ్ల వయసులో చనిపోయింది. ∙∙ పెళ్లయినా భార్య కాలేకపోయింది ఆనంది. ఓ పిల్లను పెంచినట్లే మురిపెంగా ఆమెను పెంచుకున్నాడు గోపాల్రావ్. బిడ్డ పుట్టినా తల్లి కాలేకపోయింది ఆనంది. పదిరోజులు మురిపించి కన్నుమూశాడు ఆ బిడ్డ. డాక్టర్ చదివినా వైద్యం చేయలేకపోయింది ఆనంది. ‘డాక్టరమ్మ’ వచ్చిందనే మురిపెం కూడా దేశానికి తీరకముందే మృత్యువు ఆమెను తీసుకుపోయింది. ఆనంది చనిపోయిన ఫిబ్రవరి 26 కి పదిరోజుల ముందు 15 వ తేదీన.. వచ్చే శుక్రవారం. సినిమా విడుదల అవుతోంది. సమీర్ విద్వాంస్ దర్శకుడు. ఆనందికి భర్తలో ఒక తండ్రిని, ఒక ప్రేమికుడిని, ఒక స్నేహితుడినీ చూపించాడు విద్వాంస్. అన్నిటినీ మించి.. ఒక మంచి భర్తను! ‘వాటా వాటా వాటా గో’ అనే ఒక శ్రావ్యమైన పాటతో విడుదలైన తాజా వీడియోలో మీకు ఆ భర్త కనిపిస్తాడు. పల్లెకు పోదాం.. పారును చూదాం.. చలో చలో.. అని పాటలోని ప్లెజెంట్ నెస్ అందులో ఉంది. మాధవ్ శింగరాజు -
కొత్త ఏంజిల్
అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్లు ఈ పంజాబీ బ్యూటీ తలుపు తట్టాయి. కానీ మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారీ సొగసరి. అలా ఓ కథ నచ్చి కోలీవుడ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారామె. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కేఎస్ అదియమాన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ఒక హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ ఎంపికయ్యారు. ఈ సినిమాకు ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా ఆనంది నటిస్తారని టాక్. ఆల్రెడీ పాయల్ తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేశారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్నారు పాయల్ రాజ్‌పుత్. మరోవైపు తెలుగులో హిట్ సాధించిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తమిళంలో రీమేక్ కానుంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తారు. ఇందులో కథానాయికగా ఇంకా ఎంపిక కాలేదు. పాయల్‌నే తీసుకున్నా ఆశ్చర్యపోవడానికి లేదు. -
నా కేరీర్లో ముఖ్యమైన చిత్రం పండిగై
తమిళసినిమా: యువ నటుడు కృష్ణ విజయానందంలో తేలిపోతున్నారు. చిన్న గ్యాప్ తరువాత పండిగై చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. నటి విజయలక్ష్మి నిర్మాతగా మారి తన భర్త ఫిరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం పండిగై. కృష్ణకు జంటగా ఆనంది నటించిన ఈ చిత్రానికి ఆర్‌హెచ్.విక్రమ్ సంగీతాన్ని అందించారు. గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో ఆ సంతోషాన్ని చిత్ర కథానాయకుడు కృష్ణ సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చిత్ర దర్శకుడు ఫిరోజ్ తనకు చిరకాల మిత్రుడన్నారు. ఆయన కొన్ని యదార్థ సంఘటనలతో తయారు చేసిన కథతో తెరకెక్కించిన చిత్రం పండిగై అని తెలిపారు. ప్రేమ, సెంటిమెంట్‌తో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలతో తనకు యాక్షన్ హీరో అంతస్తును అందించిన చిత్రం పండిగై అని చెప్పారు. ఇది తన సినీ కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కళుగు, యామిరుక్క భయమేన్ చిత్రాలు చేసే సమయంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ పండిగై చిత్రం నటిస్తున్నప్పుడు అలాంటి భావనే కలిగిందన్నారు. ఈ చిత్రంలో తనతో నటించిన ఆనంది చాలా రాశి గల నటి అని, ఈ చిత్రంతో ఆమె ఖాతాలో మరో విజయం చేరిందని అన్నారు. అదే విధంగా నటుడు సవరణన్ పండిగై చిత్రం తరువాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలిగిపోతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే నటుడు నితిన్ సత్యకు మంచి పేరు వచ్చిందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన నటి విజయలక్ష్మి తనకు మంచి స్నేహితురాలని, ఆమె ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారని తెలిపారు. టోటల్ చిత్ర యూనిట్ శ్రమకు దక్కిన విజయం పండిగై అని కృష్ణ పేర్కొన్నారు. -
14న తెరపైకి రూపాయ్
తమిళసినిమా: రూపాయ్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. గాడ్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు ప్రభుసాలమన్ నిర్మిస్తున్న చిత్రం రూపాయ్. ఆర్పీకే.ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత ఆర్.రవిచందర్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చంద్రన్, ఆనంది జంటగా నటించారు. ఈ జంటను ప్రభుసాలమన్ తన కయల్ చిత్రం ద్వారా పరిచయం చేశారన్నది గమనార్హం. కాగా కిశోర్‌రవిచంద్రన్, చిన్నిజయంత్, మరీష్‌ఉత్తమన్, ఆర్ఎస్ఆర్.మనోహర్, మారిముత్తు, వెట్ట్రివేల్‌రాజా తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన రూపాయ్ చిత్రానికి వి.ఇళయరాజా చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతం అందించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎం.అన్బళగన్ నిర్వహించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ డబ్బు అందరికీ అవసరమేనన్నారు. అయితే దాన్ని న్యాయంగా సంసాదిస్తే జీవితం సంతోషంగా సాగుతుందన్నారు. అదే అక్రమంగా అర్జిస్తే ఆ డబ్బు సమస్యల పాలు చేస్తుందనే ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రూపాయ్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంతకు ముందే విడుదల చేయనున్నట్లు వెల్లడించామని అయితే ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దు సంఘటనతో చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా ఈ నెల 14న రూపాయ్ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు. -
ఆనంది చెప్పులు కనిపించలేదట!
నటి ఆనంది చెప్పులు కనిపించలేదట. ఏమిటీ ఇదో వార్త, దీనికింత బిల్డప్పా అని అనుకుంటున్నారా? అలాంటి టైటిల్‌తో ఒక సినిమానే వస్తుంటే అది వార్తే అవుతుందిగా. ‘ఎన్ ఆళోడ చెరుప్పు కానోం’ (నా లవర్ చెప్పులు కనిపించడం లేదు) అనే చిత్రాన్ని డ్రమస్టిక్ ప్రొడక్షన్ పతాకంపై వెడిక్కరన్పట్టి ఎస్. శక్తివేల్, విజయ్ సోదర ద్వయం నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు కోడంబాక్కమ్, రామన్ తేడియ సీతై చిత్రాలను తెరకెక్కించిన జగన్నాథన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. పసంగ చిత్రం ఫేమ్ పాండి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతని లవర్‌గా కయల్ చిత్రం ఫేమ్ ఆనంది కథానాయకిగా నటిస్తున్నారు. కాగా ఇందులో హీరోకు జంటగా నటించడానికి ఆనంది సంకోచించారట. పాండి నటించిన ఒక వీడియోను చూసిన తరువాత అతనితో నటించడానికి ఓకే అన్నదట. ఈ విషయాన్ని దర్శకుడు తెలుపుతూ నిజానికి తన ఫ్రెండ్ సిఫారసు చేసిన పాండిని ఈ చిత్ర కథానాయకుడిగా ఎంపిక చేయడానికి తానే ఆలోచించానన్నారు. అయితే తాను చెప్పిన సన్నివేశానికి అతని నటన చూసి తరువాత పాండిపై నమ్మకం కుదిరిందన్నారు. ఇక చిత్రం గురించి చెప్పాలంటే మనం పాదరక్షలను చాలా సాధారణ వస్తువులుగా చూస్తామన్నారు. అయితే అవి చాలా సంఘటనలకు కారణంగా నిలుస్తాయని, అవేమిటో చెప్పే కథా చిత్రంగా ఎన్ ఆళోడ చెరుప్పు కానోం ఉంటుందని తెలిపారు. చిత్రంలో చెప్పులు, వర్షం కీలకం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను కడలూర్ çపరిసర ప్రాంతాల్లో సహజంగా కురిసిన వానలో చిత్రీకరించినట్లు తెలిపారు. -
నలుగురు బ్యూటీస్‌తో అధర్వ
యువ నటుడు అధర్వ నలుగురు భామలతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కనిదన్ చిత్రం తరువాత నటుడు అధర్వ నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుమ్ సురుళిరాజనుమ్. ఇందులో ఆయన సరసన రెజీనా, ప్రణీత, ఐశ్వర్య రాజేశ్, ఆనంది నాయికలుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సూరి, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత టీ.శివ అమ్మా క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. కాగా ఓడమ్ ఇళవరసు కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది రొమాంటిక్ లవ్, కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అమ్మాయిల తొలి ప్రేమ వారి జీవితాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అన్నది చాలా అందంగా చెప్పనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను మధురైలో పూర్తి చేసినట్లు చెప్పారు. రెండో షెడ్యూల్‌ను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్రాన్ని డిసెంబర్లో తెరపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత టీ.శివ తెలిపారు. ఆయన ఈ చిత్రాన్ని 2ఎంబీ సంస్థ అధినేతలు రఘునందన్, పీఎస్ఆర్.చంద్రశేఖర్, ఆర్.శరవణన్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేతలు ఐబీ.కార్తీకేయదిలీపన్ సంగోటయ్య, డీ.పరంజ్యోతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
`తొలిప్రేమలో` మూవీ స్టిల్స్
-
జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్
యువ కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో నటి ఆనంది మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. వీరిద్దరూ ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో నటించారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాదు శ్రుతిమించిన గ్లామర్ సన్నివేశాలతో కూడుకున్న చిత్రంగా విమర్శలను బాగాను మూటగట్టుకుంది. మరో విషయం ఏమిటంటే అందులో నన్ను అశ్లీల సన్నివేశాల్లో నటింపజేశారంటూ నటి ఆనంది దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది. దీంతో ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమే అనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆనందికి మరోసారి జీవీతో రొమాన్స్ చేసే అవకాశం రావడం విశేషమే అవుతుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రానికి ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది బాషా చిత్రంలో రజినీకాంతో ఒక సన్నివేశంలో చెప్పే డైలాగ్ అన్నది గమనార్హం. ఇక పోతే ఇంతకు ముందు జీవీతో డార్లింగ్ వంటి హిట్ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్యామ్ ఆంటోన్ ఈ చిత్రానికి మోగాఫోన్ పట్టారు. రజినీకాంత్ హీరోగా ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం ఇటీవలే సెట్‌పైకి వెళ్లింది. ఇందులో నటి ఆనందికి అభినయానికి అవకాశం ఉన్న పాత్ర అట. చిత్రాన్ని అధిక భాగాన్ని పాండిచ్చేరి, చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. -
ఉయ్యాల...జంపాల
అక్కినేని నాగార్జున, డి.సురేశ్‌బాబు, ‘అష్టా చమ్మా’ ఫేమ్ పి.రామ్మోహన్... ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడమే ఒక ఆసక్తికర అంశమైతే, అంతా కొత్త టీమ్‌తో ఈ సినిమా నిర్మించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం! ఇన్ని ఆసక్తులకు నెలవుగా నిలిచిన సినిమా ‘ఉయ్యాల జంపాల’. విరించి వర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ప్రాచుర్యం పొందిన ఆనంది, రాజ్‌తరుణ్ ఇందులో నాయికా నాయకులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్.పి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ నెలలో పాటలను త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వ డి.బి., సంగీతం: సన్నీ ఎం.ఆర్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాతలు: నాగార్జున, రామ్మోహన్ పి.