
తమిళసినిమా: తనకు నటనపై ఆసక్తే లేదని నటి కయల్ ఆనంది పేర్కొన్నారు. ఈమె అసలు పేరు ఆనంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో కయల్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి ఆదరణ పొందడంతో కయల్ ఆనందిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత పరియేరుమ్ పెరుమాళ్, చండీవీరన్, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్ వగైయార్, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. గ్లామర్‌కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటారు.
కాగా ఆమె ఇటీవల తన సినీ అనుభాలను ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు మొదట్లో నటనపై ఆసక్తే లేదని చెప్పారు. అసలు నటినవుతానని కూడా ఊహించలేదన్నారు. అయితే కయల్ చిత్రం తరువాత నటనపై ఆసక్తి కలిగిందన్నారు.
ఇప్పుడు మంచి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. అదే విధంగా మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పారు. తనకు నప్పే పాత్రలకు దర్శక నిర్మాతలు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని తెలిపారు. కయల్ చిత్రంలో నటించడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఆ చిత్రం తన కేరీర్‌కు బాగా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు.