Kayal
-
హీరోయిన్ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్: ఆనంది
తమిళసినిమా: తనకు నటనపై ఆసక్తే లేదని నటి కయల్ ఆనంది పేర్కొన్నారు. ఈమె అసలు పేరు ఆనంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో కయల్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి ఆదరణ పొందడంతో కయల్ ఆనందిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత పరియేరుమ్ పెరుమాళ్, చండీవీరన్, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్ వగైయార్, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. గ్లామర్‌కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటారు. కాగా ఆమె ఇటీవల తన సినీ అనుభాలను ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు మొదట్లో నటనపై ఆసక్తే లేదని చెప్పారు. అసలు నటినవుతానని కూడా ఊహించలేదన్నారు. అయితే కయల్ చిత్రం తరువాత నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఇప్పుడు మంచి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. అదే విధంగా మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పారు. తనకు నప్పే పాత్రలకు దర్శక నిర్మాతలు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని తెలిపారు. కయల్ చిత్రంలో నటించడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఆ చిత్రం తన కేరీర్‌కు బాగా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు. -
సినిమా ఏంటనేది తెలుసుకున్నా
సినిమా ఏంటనేది తెలుసుకున్నానంటోంది కయల్ కథానాయకి ఆనంది. పదహారణాల ఈ తెలుగమ్మాయి కయల్ పాత్రలో లీనమై నటించడం అంత సులభం కాదు. కయల్ చిత్రం ప్రశంసలందిస్తే తమిళ సినిమా మరో మూడు అవకాశాలను ఇచ్చేసింది. దీంతో కోలీవుడ్ పైనే దృష్టి సారిస్తున్న ఆనందితో మినీ ఇంటర్వ్యూ. ప్రశ్న: సినీ రంగ ప్రవేశం గురించి? జవాబు: చిన్నతనంలోనే నాట్యంలో నైపుణ్యం పొందాను. చదువుకునే రోజుల్లోనే స్టేజ్ డాన్స్ చేశాను. పదవ తరగతి చదువుతున్నప్పుడే తెలుగులో బస్టాప్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. మొదట ఆ అవకాశాన్ని అందుకోవాలా? వద్ద అన్న సందిగ్ధంలో పడ్డాను. ఇంటిలోనూ సమ్మతించలేదు. ఆ చిత్ర దర్శకుడు నన్ను, కుటుంబ సభ్యులను కన్విన్స్ చేసి ఒప్పించడంతో నేను నాయకినయ్యాను. ఇదే చిత్రం ద్వారా నటి శ్రీదివ్య పరిచయమయ్యారు. ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాం. ప్రశ్న: శ్రీదివ్య మీకిప్పటికీ టచ్‌లో ఉన్నారా? జవాబు: లేదు. ఆ చిత్రంలో నటించడంతో సరి. ఆ తరువాత మా మధ్య ఫ్రెండ్షిప్ లేదు. ఎప్పుడైనా ఎదురుపడినా హాయ్ అంటూ చిన్న నవ్వు అంతే. తాను బిజీగా ఉంది. నేను నా చిత్రాల్లో బిజీగా ఉన్నాను. ప్రశ్న: కయల్ చిత్ర అవకాశం ఎలా లభించింది? జవాబు: తమిళంలో నేను పరిచయమైన చిత్రం పొదియళన్ ఆ చిత్ర షూటింగ్ మొదలైన పది రోజులకు అనూహ్యంగా ఒక స్నేహితుడు దర్శకుడు ప్రభు సాల్మన్ చిత్రానికి నాయకి కావాలట. వెళ్లి కలుస్తారా? అని అన్నారు. వెంటనే వెళ్లి దర్శకుడిని కలిశాను. టెస్ట్ షూట్ చేసి చూశారు. అప్పుడు నాకు తమిళం భాష రాదు. అయినా ఆయన చెప్పిన డైలాగ్స్ రెండు, మూడు సార్లు ఆ తరువాత కరెక్ట్‌గా చెప్పాను. ఐదు మాడ్యువేషన్స్లో డైలాగ్ చెప్పించారు. అది వారికి సంతృప్తి కలిగించింది. దీంతో నువ్వే కయల్వి అన్నారు. ప్రశ్న: ఇప్పుడు తమిళం బాగానే మాట్లాడుతున్నట్లున్నారు? జవాబు: షూటింగ్లో యూనిట్ సభ్యులందరితో తమిళంలోనే మాట్లాడాలంటూ దర్శకుడు ప్రభు సాల్మన్ ఆంక్షలు విధించారు. దాంతో అందరూ తమిళంలోనే మాట్లాడేవారు. తమిళంకు తెలుగుకు భాషా బేధం వున్నా ప్రయత్నిస్తే త్వరలోనే అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది. అలా కిందా మీద పడి ఇప్పుడు తమిళం బాగానే మాట్లాడుతున్నారనే స్థాయికి చేరుకున్నాను. ప్రశ్న: ప్రభుసాల్మన్ చిత్రాల్లో నటించిన నాయకిలందరూ మంచి స్థాయికి చేరుకుంటారనే పేరుంది? జవాబు: నిజమే. అమలాపాల్, లక్ష్మీమీనన్ లాంటి హీరోయిన్లు మంచి స్థాయికి చేరుకున్నారు. అలాగే మంచి స్థాయికి చేరుకుంటాననే నమ్మకం నాకు ఉంది. కయల్ చిత్ర షూటింగ్ చేస్తున్నప్పుడే సినిమా అంటే ఆ టీమ్‌కు ఉండే ఫ్యాషన్ తెలిసింది. సాధారణంగా ఆఫీసు ఉద్యోగానికి వెళ్లొచ్చినట్లు కాదు సినిమా అంటే అని అర్థం చేసుకున్నా. ఆ తరువాతే నన్ను నేను కొత్తగా చూసుకోవడం ప్రారంభించాను. పూర్తి డెడికేషన్‌తో పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఫలితంగా కయల్ పాత్రకు ప్రశంసలు జల్లులు కురిశాయి. ప్రశ్న: ఏ నటిని స్పూర్తిగా భావిస్తారు? జవాబు: సిమ్రాన్. ఆమె నటన, డాన్స్ అంటే చాలా ఇష్టం. సిమ్రాన్లా నటించాలని ప్రతిసారి నాలో నేను చెప్పుకుంటుంటాను. ప్రశ్న: తదుపరి చిత్రాలు? జవాబు: ప్రస్తుతం జి.వి.ప్రకాష్‌కుమార్‌తో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలోను, వెట్రిమారన్ దర్శకత్వంలో దినేష్ సరసన విచారణై చిత్రంతో పాటు సర్గుణం దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మంచి కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నాను. -
ప్రేమికులను కలిపిన సునామీ
వేలాదిమంది పొట్టన పెట్టుకుని, లక్షలాదిమందిని భయభ్రాంతులకు గురి చేసిన సునామీ ఒక ప్రేమ జంటను మాత్రం కలిపింది. ఈ అంశంతో తెరకెక్కిన చిత్రం కయల్. మైనా, కుంకి చిత్రాల తరహాలో మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం ఇది. కొన్ని రోజులు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న డబ్బుతో ఆనందంగా దేశ సంచారం చేసే ఒక యువకుడు అచ్చంగా తన లానే ఆలోచించే స్నేహితుడితో కలసి సంతోషంగా కాలాన్ని గడిపేస్తుంటాడు. అలా దేశాటనలో కన్యాకుమారి చేరుకున్న అతనికి అనూహ్య సంఘటనల మధ్య ఒక యువతి తారసపడుతుంది. ఇంతకుముందు ప్రేమించడానికి నచ్చిన అమ్మాయి కంటపడలేదన్న ఆ యువకుడు ఆ యువతిని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆ విషయాన్ని ధైర్యంగా ఆమెతో చెప్పేసి వెళ్లిపోతాడు. ఒక జమీందారు ఇంటిలో పని చేసే ఆ యువతి అతనిపై మనసు పడుతుంది. అయితే అతనెవరో, ఎక్కడ ఉంటాడో తెలియదు. అయినా అతనే తన జీవితం అంటూ ఇల్లు వదలి వచ్చేస్తుంది. ఆ తరువాత ఏమైంది? చివరికి ఎలా భగ్న ప్రేమికులు ఒకటయ్యారా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన కయల్ చిత్ర కథకు దర్శకుడు ప్రభుసాల్మన్ సునామీ నేపథ్యాన్ని అద్భుతంగా వాడుకున్నారు. కొత్త వాళ్లతో పాత్రలకు జీవం పోయించడంలో అందెవేసిన ప్రభుసాల్మన్ ఈ చిత్రంలోనూ ఒక హీరోయిన్ ఆనంది మినహా అందరినీ కొత్తవారినే ఎంచుకున్నారు. చిత్రం చివరి ఘట్టంలో సునామీ సన్నివేశాలు గ్రాఫిక్స్ అయినా అబ్బురపరిచేలా రూపొందించారు. ఆరణాల అచ్చ తెలుగమ్మాయి ఆనంది కథానాయికగా చాలా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. నవ నటుడు చంద్రన్ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. గాడ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ ఎస్.మదన్ విడుదల చేశారు. చిత్రం మంచి ప్రజాదరణతో ప్రదర్శితమవుతోంది. -
క్రిస్మస్కి కయల్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కయల్ చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మైనా, కుంకీ చిత్రాల సృష్టికర్త ప్రభుసాల్మన్ ప్రయోగం కయల్. మైనాతో అమలాపాల్‌ను, కుంకితో లక్ష్మీమీనన్‌ను హీరోయిన్లు గా అందలం ఎక్కించిన ఈ దర్శకుడు తాజాగా కయల్ చిత్రం ద్వారా ఆనందికి నటిగా సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్, గాడ్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నవ నటుడు చంద్రన్ కథానాయకుడిగా పరిచ యం అవుతున్నారు. ఆనంది నాయకిగా నటిస్తుండగా విన్సెంట్, ఆర్తి, జెమినీ రాజేశ్వరి, యార్కన్నన్, భారతీకన్నన్, జేకాప్, యోగి దేవరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిం చారు. డి.ఇమాన్ సంగీతాన్ని, వి.మహేంద్రన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం చిత్రంలోని ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయకుండా మంచి వైవిధ్యభరిత చిత్రం అంటూ అభినందించి యు సర్టిఫికెట్ ఇచ్చిందని యూనిట్ వర్గాలు తెలిపారుు. సాధారణంగా ప్రభుసాల్మన్ చిత్రాల్లో పాటల కు మంచి ఆదరణ ఉంటుందని ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్నాయని కయల్ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.