సినిమా ఏంటనేది తెలుసుకున్నా
సినిమా ఏంటనేది తెలుసుకున్నానంటోంది కయల్ కథానాయకి ఆనంది. పదహారణాల ఈ తెలుగమ్మాయి కయల్ పాత్రలో లీనమై నటించడం అంత సులభం కాదు. కయల్ చిత్రం ప్రశంసలందిస్తే తమిళ సినిమా మరో మూడు అవకాశాలను ఇచ్చేసింది. దీంతో కోలీవుడ్ పైనే దృష్టి సారిస్తున్న ఆనందితో మినీ ఇంటర్వ్యూ.
ప్రశ్న: సినీ రంగ ప్రవేశం గురించి?
జవాబు: చిన్నతనంలోనే నాట్యంలో నైపుణ్యం పొందాను. చదువుకునే రోజుల్లోనే స్టేజ్ డాన్స్ చేశాను. పదవ తరగతి చదువుతున్నప్పుడే తెలుగులో బస్టాప్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. మొదట ఆ అవకాశాన్ని అందుకోవాలా? వద్ద అన్న సందిగ్ధంలో పడ్డాను. ఇంటిలోనూ సమ్మతించలేదు. ఆ చిత్ర దర్శకుడు నన్ను, కుటుంబ సభ్యులను కన్విన్స్ చేసి ఒప్పించడంతో నేను నాయకినయ్యాను. ఇదే చిత్రం ద్వారా నటి శ్రీదివ్య పరిచయమయ్యారు. ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాం.
ప్రశ్న: శ్రీదివ్య మీకిప్పటికీ టచ్‌లో ఉన్నారా?
జవాబు: లేదు. ఆ చిత్రంలో నటించడంతో సరి. ఆ తరువాత మా మధ్య ఫ్రెండ్‌షిప్ లేదు. ఎప్పుడైనా ఎదురుపడినా హాయ్ అంటూ చిన్న నవ్వు అంతే. తాను బిజీగా ఉంది. నేను నా చిత్రాల్లో బిజీగా ఉన్నాను.
ప్రశ్న: కయల్ చిత్ర అవకాశం ఎలా లభించింది?
జవాబు: తమిళంలో నేను పరిచయమైన చిత్రం పొదియళన్ ఆ చిత్ర షూటింగ్ మొదలైన పది రోజులకు అనూహ్యంగా ఒక స్నేహితుడు దర్శకుడు ప్రభు సాల్మన్ చిత్రానికి నాయకి కావాలట. వెళ్లి కలుస్తారా? అని అన్నారు. వెంటనే వెళ్లి దర్శకుడిని కలిశాను. టెస్ట్ షూట్ చేసి చూశారు. అప్పుడు నాకు తమిళం భాష రాదు. అయినా ఆయన చెప్పిన డైలాగ్స్ రెండు, మూడు సార్లు ఆ తరువాత కరెక్ట్‌గా చెప్పాను. ఐదు మాడ్యువేషన్స్‌లో డైలాగ్ చెప్పించారు. అది వారికి సంతృప్తి కలిగించింది. దీంతో నువ్వే కయల్‌వి అన్నారు.
ప్రశ్న: ఇప్పుడు తమిళం బాగానే మాట్లాడుతున్నట్లున్నారు?
జవాబు: షూటింగ్‌లో యూనిట్ సభ్యులందరితో తమిళంలోనే మాట్లాడాలంటూ దర్శకుడు ప్రభు సాల్మన్ ఆంక్షలు విధించారు. దాంతో అందరూ తమిళంలోనే మాట్లాడేవారు. తమిళంకు తెలుగుకు భాషా బేధం వున్నా ప్రయత్నిస్తే త్వరలోనే అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది. అలా కిందా మీద పడి ఇప్పుడు తమిళం బాగానే మాట్లాడుతున్నారనే స్థాయికి చేరుకున్నాను.
ప్రశ్న: ప్రభుసాల్మన్ చిత్రాల్లో నటించిన నాయకిలందరూ మంచి స్థాయికి చేరుకుంటారనే పేరుంది?
జవాబు: నిజమే. అమలాపాల్, లక్ష్మీమీనన్ లాంటి హీరోయిన్లు మంచి స్థాయికి చేరుకున్నారు. అలాగే మంచి స్థాయికి చేరుకుంటాననే నమ్మకం నాకు ఉంది. కయల్ చిత్ర షూటింగ్ చేస్తున్నప్పుడే సినిమా అంటే ఆ టీమ్‌కు ఉండే ఫ్యాషన్ తెలిసింది. సాధారణంగా ఆఫీసు ఉద్యోగానికి వెళ్లొచ్చినట్లు కాదు సినిమా అంటే అని అర్థం చేసుకున్నా. ఆ తరువాతే నన్ను నేను కొత్తగా చూసుకోవడం ప్రారంభించాను. పూర్తి డెడికేషన్‌తో పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఫలితంగా కయల్ పాత్రకు ప్రశంసలు జల్లులు కురిశాయి.
ప్రశ్న: ఏ నటిని స్పూర్తిగా భావిస్తారు?
జవాబు: సిమ్రాన్. ఆమె నటన, డాన్స్ అంటే చాలా ఇష్టం. సిమ్రాన్‌లా నటించాలని ప్రతిసారి నాలో నేను చెప్పుకుంటుంటాను.
ప్రశ్న: తదుపరి చిత్రాలు?
జవాబు: ప్రస్తుతం జి.వి.ప్రకాష్‌కుమార్‌తో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలోను, వెట్రిమారన్ దర్శకత్వంలో దినేష్ సరసన విచారణై చిత్రంతో పాటు సర్గుణం దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మంచి కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నాను.