Anandi
-
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా 'శంబాల'
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ఛాలెంజింగ్ రోల్లో నటించేందుకు రెడీ అయ్యాడు. తన నటిస్తున్న కొత్త సినిమా 'శంబాల' విభిన్నమైన కాన్సెప్ట్‌తో రానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామనే హింట్‌ను మేకర్స్ ఇచ్చారు.టైటిల్ పోస్టర్లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే 'శంబాల' కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్‌గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమాలో ఆదీకి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.'ఏ' యాడ్ ఇన్ఫినిటిమ్ అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తన తొలి సినిమా తరహాలోనే 'శంబాల'ను కూడా ఓ డిఫరెంట్ వరల్డ్‌లో రూపొందిస్తున్నారు.సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారు.అమెరికాలోని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ ట్రైనింగ్ తీసుకున్న యుగంధర్, 'శంబాల' సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్ పరంగా, టెక్నికల్‌గా సినిమాను "టాప్ క్లాస్"అనే రేంజ్లో తెరకెక్కించేందుకు అన్ని రకాలుగా సహకరింస్తున్నారు నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి.టెక్నికల్ సపోర్ట్ విషయంలోనూ హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్‌నే తీసుకున్నారు యుగంధర్. డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్ జిమ్మర్ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఇండియన్ మ్యూజీషియన్ శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో వినిపించబోతున్నారు. -
ఓ కల ఆధారంగా..
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం దర్శకత్వం వహించిన చిత్రం ‘విధి’. ఎస్. రంజిత్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రోహిత్ నందా మాట్లాడుతూ ‘‘న్యూజిల్యాండ్‌లో చదువుకున్నాను. నటనపై ఆసక్తితో స్టేజ్ డ్రామాల్లో చేశాను. చిరంజీవిగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఇక ‘విధి’ సినిమా రా అండ్ రస్టిక్ ఫిల్మ్. రియల్ లైఫ్‌లోని నా క్యారెక్టర్‌కు విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేశాను. అలాగే మా ‘విధి’ సినిమాను చూపులేనివారు కూడా ఓ యాప్ సాయంతో ఆస్వాదించవచ్చు. ఈ ఆలోచన నాదే. కొన్ని కొత్త కథలు వింటున్నాను’’ అన్నారు. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చిన ఓ కల ఆధారంగా ‘విధి’ సినిమా స్టోరీ లైన్‌ను డెవలప్ చేసి, కథ రెడీ చేసుకున్నాం. రోహిత్ బాగా చేశారు’’ అన్నారు శ్రీనాథ్, శ్రీకాంత్. -
నాకూ అలా అనిపిస్తోంది – విశ్వక్ సేన్
‘‘విధి’ నిర్మాత రంజిత్ నాకు మంచి స్నేహితుడు.ప్రోడక్షన్ లో సాయం చేసేందుకు, సపోర్ట్‌గా నిలిచేందుకు నాకూ ఓ బ్రదర్ ఉంటే బాగుండని ఈ దర్శకుల్ని(శ్రీకాంత్, శ్రీనాథ్) చూస్తుంటే అనిపిస్తోంది. ‘విధి’ టీజర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ కావాలి.. నిర్మాతకు మంచి లాభాలు రావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకద్వయం తెరకెక్కించిన చిత్రం ‘విధి’. రంజిత్ ఎస్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రంజిత్ ఎస్ మాట్లాడుతూ–‘‘మా సినిమా కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కథ, కథనాలను ప్రేక్షకులు ముందుగా ఊహించలేరు’’ అన్నారు. ‘‘మనం మాట్లాడటం కంటే.. మనం తీసే సినిమానే మాట్లాడాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్. ‘‘మా సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి’’ అన్నారు రోహిత్ నందా, ఆనంది. -
థ్రిల్ చేసే విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఎస్. రంజిత్ నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో హీరో రోహిత్ నందా మాట్లాడుతూ– ‘‘విధి’ మాకెంతో స్పెషల్ మూవీ. ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను చేశాం. దీంతో కంటి చూపు లేనివాళ్లు కూడా మా సినిమాను అనుభూతి చెందగలరు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాలగారు అద్భుతమైన ఆర్ఆర్, సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ‘విధి’’ అన్నారు నిర్మాత రంజిత్. ‘‘మాకు ఇది తొలి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీకాంత్, శ్రీనాథ్. ‘‘వినోదం మాత్రమే కాదు.. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు హీరోయిన్ ఆనంది. ‘‘ఈ సినిమాలో ట్విస్ట్‌లు బాగుంటాయి’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. నటుడు ‘రంగస్థలం’ మహేశ్ మాట్లాడారు. -
Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ
టైటిల్: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నటీనటులు: ‘అల్లరి’ నరేశ్, ఆనంది, వెన్నెల కిశోర్, రఘు బాబు, శ్రీతేజ్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండు సమర్పణ: జీ స్టూడియోస్ దర్శకుడు: ఏఆర్ మోహన్ సంగీతం: సాయి చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చోటా కె. ప్రసాద్ ఎడిటర్: రామ్ రెడ్డి విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేంటంటే.. శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా అభివృద్దికి నోచుకొని తండా అది. అక్కడ చదువుకోవడానికి బడి లేదు. అనారోగ్యం పాలైతే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. పట్టణం వెళ్లడానికి సరైన దారి లేదు. పాఠశాల, ఆస్పత్రితో పాటు నదిపై వంతెన కట్టించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అందుకే వాళ్లు ఓటేయడానికి నిరాకరిస్తారు. కానీ శ్రీనివాస్ చేసిన ఓ పనికి మెచ్చి అతని కోసం ఓట్లు వేస్తారు. వందశాతం పోలింగ్ జరుగుతుంది. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పట్టణాలకు దూరంగా నివసించే తండా వాసుల కష్టాల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. వాళ్లకు సరైన సదుపాయాలు ఉండవు. కనీస అవసరాలైన విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కూడా ఉండవు. తమ సమస్యలను తీరుస్తేనే ఓటు వేస్తామంటూ ధర్నాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటలనే కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఏఆర్ మోహన్. తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా. విద్య, వైద్యం, రవాణా సదుపాలను కల్పించాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అధికారులను నిర్భంధిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీనే అయినా.. అందరికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాలో కొత్తగా చెప్పిన విషయమేమి ఉండదు కానీ.. అందరిని ఆలోచింపజేస్తుంది. కంప్యూటర్ యుగంలోనూ.. కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేవారున్నారని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగడం కాస్త మైనస్. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎన్నికల చుట్టే కథ సాగుతుంది. తండావాసులు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయానికి శ్రినివాస్ చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకొని చలించిపోవడం.. ఇలా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్‌ల కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ మొత్తం తండావాసుల దగ్గర బంధీలుగా ఉన్న అధికారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కథనం రోటీన్‌గా సాగినా.. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు... సాయం చేసి బాధ పడకూడదు', మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం... కానీ ఎవరూ మనిషి కావడం లేదు' లాంటి అద్భుతమైన సంభాషణలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. నరేశ్ చేసిన మరో మంచి అటెంప్ట్‌గా మాత్రం నిలుస్తుంది. ఎవరెలా చేశారంటే.. కామెడీనే కాదు సీరియస్ పాత్రల్లో కూడా అద్భుతంగా నటించే నటుల్లో నరేశ్ ఒకరు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. సీరియస్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో నరేశ్ది పూర్తి సిరియస్ రోల్. తెలుగు భాషా ఉపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే ఇలాంటి పాత్ర కొత్తేమి కాదు. ప్రవీణ్, వెన్నెల కిషోర్, రఘుబాబుల కామెడీ బాగా పండింది. తండా వాసి కండాగా శ్రీతేజ్, ఊరి పెద్దమనిషి ‘పెద్ద’ కుమనన్ సేతురామన్‌లతో పాటు మిగిలిన నటీనటుల తమ పాత్రల పరిధిమేర నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. చోటా కె. ప్రసాద్ కెమెరా పనితీరు బాగుంది. అడవి అందాలను అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ నమ్మకం ఉంది
‘‘మన చుట్టుపక్కల జరిగే కథే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఓ నిజాయితీ సినిమా. కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు కొత్త ప్రయత్నంగా మేం చేసిన ‘మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘నాంది’ సినిమాతో నిర్మాత సతీష్‌గారికి ఎంత మంచి పేరు వచ్చిందో ‘ఇట్లు మారేడు...’తో రాజేష్‌గారికి అంత మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన తర్వాత మాటల రచయిత అబ్బూరి రవి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. చివరి 20 నిమిషాలు సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘వినోదం, హాస్యం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ఏఆర్ మోహన్. ‘‘స్వామి రారా’తో డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 75 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం అయినప్పటికీ ఒత్తిడి అనిపించలేదు’’ అన్నారు రాజేష్. ‘‘ఈ సినిమాలో నేను రాసినవి మాటలు కాదు.. ఆ పాత్రల తాలూకు భావాలు. అలాగే ఈ సినిమాకు ఓ లిరిసిస్ట్‌లా ఓ పాట రాసి, సింగర్‌గా పాడటం సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. ఓ బాధ్యతగల పౌరుడిగా ఎన్నికలప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. సకాలంలో పన్నులు చెల్లిస్తున్నాను. ఇక రాజకీయలపై నాకు అంతగా ఆసక్తిలేదు. నాది చాలా సున్నితమైన మనసు. నాలాంటి వారు రాజకీయాలకు పనికి రారు. భవిష్యత్‌లో దర్శకుడిని అవుతాను కానీ పొలిటీషియన్ని కాను. – ‘అల్లరి’ నరేశ్ -
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈనెల 11న ఈ సినిమా రిలీజ్ చేయాల్సి ఉండగా ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను అల్లరి నరేష్ షేర్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి' నరేష్ నటించారు. వెన్నల కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. A New GO has been passed! 📜 The Elections will be held at your Nearest Theatres on NOV 25th! 💥 - #ItluMaredumilliPrajaneekam#IMP #IMPonNov25th ✅@allarinaresh @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore pic.twitter.com/5KvEOknyTW — Allari Naresh (@allarinaresh) November 5, 2022 -
' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన నితిన్
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి " అనే సాంగ్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. -
అల్లరి నరేశ్ మూవీ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఆరోజే..!
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని 'లచ్చిమి' అనే సాంగ్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. -
ఇట్లు... ప్రజానీకం
అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం వెండితెరపై పోరాడుతున్నారు ‘అల్లరి’ నరేశ్. అది ఏ సమస్య? ఆ సమస్యకు ఎలా పరిష్కారం లభించింది? అనే విషయాలను సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ‘నాంది’ తర్వాత ‘అల్లరి’ నరేశ్ హీరోగా చేస్తోన్న మరో చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. రాజేష్ దండు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకుడు. మంగళవారం (మే 10) ‘అల్లరి’ నరేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
అల్లరి 59 షురూ
ఓ వైపు వినోదం.. మరోవైపు వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షురూ అయింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నరేశ్ నటిస్తున్న 59వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ గుత్త. -
దీపావళికి ఓటీటీలో సందడి చేయబోతోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’
ఇటీవల సుధీర్ బాబు, తెలుగమ్మాయి ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలైంది. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగులో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. చదవండి: విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి ఎన్నో అంచనాల మధ్య విడుదలై కొన్ని వర్గాల ప్రేక్ష్కుల బాగా ఆకట్టుకోగా.. మిరికొందరి నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైనమెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు. From bigg screens to ur home screens, coming to make ur diwali more special.. I am sure love for #SrideviSodaCenter will just grow bigger & bigger 🤟🤗 Premiers on 4th November exclusively on @ZEE5Telugu #sridevisodacenterOnZee5 @70mmEntertains @Karunafilmmaker @anandhiactress pic.twitter.com/CxtHg8Put0 — Sudheer Babu (@isudheerbabu) October 21, 2021 చదవండి: పెళ్లిలో కలిసిన మెగా బ్రదర్స్.. నవ్వుతున్న ఫోటోలు వైరల్ -
'జాంబీ రెడ్డి'కి బెదిరింపులు: దర్శకుడు
‘‘లాక్ డౌన్ తర్వాత ఆరంభించిన ఫస్ట్ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్ చేశాం.. ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్ జానర్ ఎలానో జాంబీ కూడా ఒక జానర్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్‌గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్‌కి ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి. ‘ఇలాంటి జానర్ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యాక హిందీ రీమేక్‌కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్‌ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్ ఇండియా కథలు కూడా ఉన్నాయ్. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్‌ని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు. -
తేజ మా మెగాఫ్యామిలీ మెంబర్
‘‘తేజ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్. చిరంజీవిగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తనని చూసి సర్ప్రై జ్ అయ్యాను. ప్రశాంత్ వర్మ గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబీ జానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాంబిరెడ్డి’ ప్రీ–రిలీజ్ వేడుకలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘ ‘శివ’ సినిమా టైమ్‌లో ఆర్జీవీని చూసి గొప్ప డైరెక్టర్ అవుతాడనుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయాలనే నా కల. ‘జాంబిరెడ్డి’తో నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నిర్మాత రాజశేఖర్ వర్మగారు కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. తేజ నాకు మంచి ఫ్రెండ్. ‘అ!’ సినిమా కన్నా ముందే తనతో ఓ చిత్రం చేయాలి... కుదరలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలంలో పెళ్లి బాట పడుతున్న నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్ రానా దగ్గుబాటి, నితిన్‌లు, నిహారి కొణిదెల వంటి కొంతమంది స్టార్లు ఇటీవల ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. తాజాగా ‘బస్‌స్టాప్’ ఫేం కయల్ ఆనంది కూడా పెళ్లి పీటలు ఎక్కారు. తమిళ పరిశ్రమకు చెందిన సోక్రటీస్‌ను ఆమె గుట్టుగా పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆనంది తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ అసిస్టెంట్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సోక్రటీస్‌తో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో గురువారం ఆమె సోంతూరైన వరంగల్‌లోని ఓ స్టార్ హోటల్లో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆమె వివాహ వేడుక జరిగింది. చేతి నిండా సినిమాలతో సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తున్న సమయంలో ఆమె సడెన్‌గా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంపై టాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్ర్తసుతం ఆనంది నటించిన ‘జాంబి రెడ్డి’ విడుదలకు సిద్దంగా ఉంది. అంతకుముందు తెలుగులో ‘ఈరోజుల్లో’, ‘బస్ట్ స్టాప్’, ‘నాయక్’, ‘ప్రియతమా నీవచటకుశలమా’, ‘గ్రీన్ సిగ్నల్’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోయారు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: సమంత
‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌తో ప్రశాంత్ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్డౌన్ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్టైన్ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్ 2 స్క్రిప్ట్ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైంది. తేజ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్డౌన్ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి. -
ప్రియుడే కడతేర్చాడు
అన్నానగర్: వివాహేతర సంబంధం ఓ మహిళను బలి తీసుకుంది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహించి ప్రియుడే ఆమెను కడతేర్చాడు. నెల్లై జిల్లా ముక్కుడలైకి చెందిన చంద్రశేఖర్ భార్య ఆనంది (38). వీరికి సుజీధరన్, అస్సుదన్ ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్ పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆనంది ఇద్దరు కుమారులతో ఉంటోంది. ఆనంది పెద్ద కుమారుడు సుజీధరన్ డిగ్రీ, రెండవ కుమారుడు అస్సుధన్ ప్లస్‌ఒన్ చదువుతున్నాడు. పేటైలో ఉన్న పిల్లల వసతిగృహంలో ఆనంది వంటమనిషిగా చేరింది. దీంతో ఆనంది కుటుంబం సహా పేటైలో నివాసం ఉంటోంది. వసతి గృహంలోనే ఉన్న ఓ గదిలో తన కుమారులతో ఉంటూ వంటపని చేసేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వసతిగృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఆనంది హాస్టల్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి, ఆనందికి ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆనందిని కత్తితో నరికి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లై టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆనంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసుల విచారణలో ఆనందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముక్కుడల్ సమీపంలో ఉన్న సింగమ్‌పాలైకి చెందిన చెల్లప్ప (50) ఈ హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేశారు. విచారణలో ఆనంది భర్త చంద్రశేఖర్, చెల్లప్ప స్నేహితులని, తరచూ వారి ఇంటికి వెళ్లే వాడని చంద్రశేఖర్ మృతిచెందడడంతో ఆనందితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ఆనంది వసతిగృహంలో వంటమనిషిగా చేరిన తరువాత చెల్లప్పతో మాట్లాడేది తగ్గించింది. దీంతో మంగళవారం ఉదయం హాస్టల్లోని పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత చెల్లప్ప హాస్టల్‌కి వెళ్లాడు. ఆనందితో తన కోరిక తీర్చమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన చెల్లప్ప ఆనందిని కత్తితో నరికి హత్య చేసినట్టు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. -
త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్ రిపీట్
తమిళసినిమా: త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఆ మధ్య విడుదలై కమర్శియల్‌గా సక్సెస్ అనిపించుకుని వసూళ్లను రాబట్టుకున్నా చిత్రం అంతా అశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలు అంటూ విమర్శకులు చేతిలో నలిగిపోయింది.అంతే కాదు అందులో నటించిన నటి ఆనంది కూడా తనను అశ్లీలంగా చూపించారని దర్శకుడిపై మండిపడింది. ఇంతకీ ఆ చిత్ర హీరో ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరేదనుకుంటా ‘ ఎస్. యువ సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్కుమారే ఆ చిత్ర కథానాయకుడు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు.ఈయన ఇటీవల సంచలన నటుడు శింబు త్రిపాత్రాభినయం చేసిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఆ చిత్రాన్ని శింబు అభిమానులు సైతం దుమ్మెత్మి పోశారు. ఇక విమర్శకలైతే సరేసరి. కాగా దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తాజాగా తదుపరి చిత్రానికి రెడీ అయ్యారని సమాచారం. తన తొలి చిత్ర హీరోనే తాజా చిత్రానికి ఎంచుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కాకున్నా మొత్తం మీద త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం సెట్ పైకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. జీవీ.ప్రకాశ్‌కుమార్ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతోయమ బిజీగా ఉన్నారు. -
నటనకు అనుమతించారు కానీ..!
తమిళసినిమా: తాను హీరోయిన్ అవుతానని అన్నప్పుడు కుటుంబసభ్యులు సమ్మతించడంతో పాటు, మద్దతుగా నిలిచారని, అయితే చిత్రాన్ని నిర్మిస్తానన్నప్పుడు మాత్రం తన కుటుంబసభ్యులతో పాటు చాలా మంది వద్దని నిరుత్సాహపరిచారని నటి విజయలక్ష్మీ పేర్కొన్నారు. చెన్నై–28 చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె తాజాగా నిర్మాత అవతారమెత్తి తన భర్త ఫెరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పండగై అనే చిత్రం నిర్మిస్తున్నారు. కృష్ణ, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సరవణన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయిన క్రమంలో పండిగై చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత నటి విజయలక్ష్మీ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు కృష్ణ తనకు మంచి మిత్రుడని తెలిపారు. చిత్రం కోసం ఎంతగానో శ్రమించారని, కేరవన్కు కూడా వెళ్లకుండా చాలా కష్టపడి నటించారని పేర్కొన్నారు. అదే విధంగా చిత్ర సాంకేతిక వర్గం పోటీ పడి మరీ చిత్రం బాగా రావాలని అహర్నిశలు పని చేశారని చెప్పారు. ఇప్పుడు ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసిన ఆరా సినిమా అధినేత మహేశ్ ఇప్పుడు తమకంటే ఎక్కువగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదల తరువాత మరో నాలుగు చిత్రాలను నిర్మించాలన్న కోరిక కలుగుతోందని విజయలక్ష్మీ తెలిపారు. ఎవరూ ముందుకు రాలేదు ఈ చిత్ర కథను చాలా మందికి చెప్పానని, అందరూ బాగుందని అన్నా నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో తామే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చిత్ర దర్శకుడు ఫెరోజ్ తెలిపారు. ఇందులో కృష్ణ, ఆనంది, సవరణన్లను నటింపజేయాలనుకున్నామని, అది సాధ్యం అయ్యినందుకు సంతోషం కలిగిందన్నారు. ఇది వీధి పోరాట ఇతివృత్తంతో కూడిన చిత్రం కావడంతో ఫైట్స్‌కు ప్రాముఖ్యత ఉంటుందని, స్టంట్‌మాస్టర్ అన్భరివు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారని తెలిపారు. చిత్రం చూడకుండానే నమ్మకంతో చాలా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన ఆరా సినిమాస్ అధినేత మహేశ్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. -
నీటి కోసం పోరాటం!
వైవిధ్యమైన కథా చిత్రాల దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘చండివీరన్’. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్యపాత్రల్లో సర్కుణమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కాళి’ పేరుతో నిర్మాత ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నీటి కోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరా టమే ఈ చిత్రకథ. పల్లెల్లో ఉండే సంక్రాంతి సంబరాలు, సరదాలు, సరసాలు ఉంటాయి. తొలి భాగం నవ్వులు పంచితే, రెండో భాగం ఉత్కంఠగా ఉంటుంది. అరుణగిరి పాటలు, సబేష్ మురళి నేపథ్య సంగీతం, పి.జి. ముత్తయ్య ఛాయాగ్రహణం హైలైట్. అధర్వ, ఆనందిల మధ్య కెమిస్ట్రీ బాగుం టుంది. కథ నచ్చి, తమిళంలో నిర్మించిన బాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పాటలు, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
పవన్ చెల్లి పాత్రలో ఆనంది
ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న సినిమాతో పాటు రాధకృష్ణ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు సినిమాలకు సంబందించిన నటీనటలు ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా నేసన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వేదలం కు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎంతో కీలకమైన చెల్లెలి పాత్రకు ఓ తెలుగమ్మాయినే ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమాతో పరిచయం అయిన ఆనంది, తరువాత తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ అమ్మాయినే పవన్‌కు చెల్లిగా ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఇతర నటీనటుల వివరాలతో పాటు సినిమా ఎప్పుడు మొదలుకానుందో తెలిసే అవకాశం ఉంది. -
ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ
కడువుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే తెరపైకి రానుంది. నిజానికి ఈ చిత్రం అనుకున్న సమయంలో విడుదలవుతుందా?అన్న సందేహం నెలకొంది.అందుకు కారణం చిత్రం కోర్టులో పిటిషన్ దాఖలు కావడమే. వివరాల్లోకెళ్లితే జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఆనంది, నిక్కీగల్రాణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స టి.శివ నిర్మించారు. చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా చిత్రాలను శుక్రవారం రోజు విడుదల చేస్తుండడం ఆనవాయితీ. అయితే కొన్ని చిత్రాలను అదనంగా కలెక్షన్లను వసూలు చేసుకోవడానికి ఒక రోజు ముందే విడుదల చేస్తుంటారు.అలా కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాన్ని ఒక రోజు ముందే అంటే 10వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఈ నెల10 తేదీన విచారించనున్నట్లు నాయస్థానం వెల్లడించింది.దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కేసును ఈ రోజే అంటే సోమవారం విచారించాలని పిటిషన్‌దారుడు మరో పిటిషన్ దాఖలు చేశారు.అయితే పిటిషన్‌దారుడి కోరికను తిరస్కరించిన కోర్టు 10వ తేదీనే విచారించనున్నట్లు ప్రకటించారు.దీంతో కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం ఆ నెల 10వ తేదీనే తెరపైకి రానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
ఇకపై చిత్ర నిర్మాణం చేపట్టను
ఇకపై సొంతంగా చిత్రాలు తీయనని ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్ పేర్కొన్నారు. మైనా, కుంకీ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడైన ఈయన తాజా చిత్రం తొడరి ఆశించిన విజయం సాధించలేదు. కాగా ప్రభుసాల్మన్ నిర్మాతగా తన గాడ్ ఫిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం రూపాయ్.ఆర్పీకే.ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత ఆర్.రవిచంద్రన్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కయల్ ఫేమ్ చంద్రన్, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించారు. కిషోర్వ్రిచంద్రన్, చిన్నిజయంత్, హరీష్‌ఉత్తమన్, ఆర్ఎన్ఆర్, మనోహర్, మారిముత్తు, వెట్రివేల్రాజా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అన్భళగన్ దర్శకత్వం వహించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తన తొలి చిత్రం సాటైట్ తరహాలోనూ ఇదీ వైవిధ్యంగా ఉంటుందన్నారు. అయితే కథ, కథనాలు మరో కోణంలో ఉంటాయని తెలిపారు. డబ్బు మోహం ఎలాంటి సమస్యలకు కారణం అవుతుందనే ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం రూపాయ్ అని వివరించారు. అనంతరం చిత్ర నిర్మాత దర్శకుడు ప్రభుసాల్మన్ మాట్లాడుతూ ఇంతకు ముందు తాను నిర్మించిన సాటైట్ చిత్ర సాటిలైట్ హక్కులే 1.25 కోట్లకు అమ్ముడు పోయాయన్నారు. అలాంటిది ఈ చిత్రం శాటిలైట్ విక్రయణే జరగలేదని చెప్పారు. ఇకపై తాను నిర్మాతగా చిత్రాలు చేయనని చెప్పారు. కారణం ప్రస్తుత పరిస్థితి అంత దయనీయంగా ఉందని వ్యా ఖ్యానించారు. ఈ చిత్రాన్ని ఈ 5 జేకే.గ్రూప్స్ అధినేత డా.జే.జయక్రిష్ణన్, కాస్మో విలేజ్ శివకుమార్ కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
ప్రేమ కథా చిత్రంగా కడవుల్ ఇరక్కాన్ కుమారు
టాస్మాక్ సన్నివేశాలు లేని చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు. టాస్మాక్‌ను ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు మద్యం సన్నివేశాలు లేకుండా ఉండడం లేదు. ఇక అసలు విషయం దర్శకుడు రాజేశ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు లేని చిత్రమే లేదు. అలాంటిది ఆయన తాజా చిత్రమే కడవుల్ ఇరుక్కాన్ కుమారు. అమ్మా క్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి, ఆనంది నటిస్తున్నారు. జీవీకి స్నేహితుడిగా ఆర్జే.బాలాజీ, ముఖ్యపాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్న ఈచిత్రం గురించి దర్శకుడు రాజేశ్ తెలుపుతూ సరోజ చిత్రం తరువాత రోడ్డు ప్రయాణంలో సాగే మించి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రం అని తెలిపారు. ఇందులో ప్రేమ, కామెడీ, సెంటి మెంట్ అంటూ ఆబాలగోపాలం చూసి ఆనందించే జనరంజక అంశాలు ఉంటాయన్నారు. ఇది రోడ్డు జర్నీ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను ప్రధాన రోడ్లపైనే నిర్వహించామని తెలిపారు.అందుకు చెన్నై, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో జనసంచారం లేని రోడ్లలో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. తన గత చిత్రాల్లో టాస్మాక్ సన్నివేశాలు అధికంగా ఉంటాయనే అపవాదు ఉందన్నారు. అయితే ఈ చిత్రంలో అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా ఉండదని ఇది క్లీన్ యూ సర్టిఫికెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ చెప్పారు. -
సునామీ నేపథ్యంలో...
‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం ‘కయల్’. చంద్రన్, ఆనంది, ప్రభు ముఖ్య పాత్రధారులు. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని గౌళీకార్ శ్రీనివాస్ సమర్పణలో తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ తెలుగులో ‘తొలిప్రేమలో’ పేరుతో విడుదల చేస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘సునామీ వచ్చినప్పుడు కన్యాకుమారిలోని ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి భావోధ్వేగాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సాగే చిత్రమిది. తమిళంలో మంచి వసూళ్లు సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ‘‘ఫీల్ గుడ్ టైటిల్ ఇది. పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. మా చిత్రం విడుదల విషయంలో శోభారాణిగారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈనెల 26న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతల్లో ఒక్కరైన శ్రీనివాస్ అన్నారు. -
అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు
ఒత్తిడి చేసిన మాట నిజమే అరకొర దుస్తులు ధరించాలంటూ తనపై ఒత్తిడి చేసిన మాట నిజమే నంటూ నటి ఆనంది స్పష్టం చేశారు.ఈ అమ్మడు త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర విడుదల సమయంలో ఆ చిత్ర దర్శకుడిపై విమర్శల వర్షం కురిపించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో రొమాన్స్ చేసిన నటి ఆనంది. ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆ బ్యూటీ ఏమన్నారో చూద్దాం. నేను అనుకోకుండానే నటినయ్యాను. చదువుకునే రోజుల్లో నటనపై ఎలాంటి ఆసక్తి లేదు. కయల్ చిత్రంలో కథానాయకిగా అవకాశం ఇచ్చి దర్శకుడు ప్రభుసాల్మన్ నాకు గుర్తింపు తెచ్చిపెట్టారు.ఆయనే నాకు నటనను నేర్పించారు. ఆ తరువాత త్రిష ఇల్లన్నా నయనతార, పొరియాళన్, చండీవీరన్ చిత్రాల్లో నటించాను. అదే విధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేశాను. అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు ఇంతకు ముందు చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు. చాలా అసౌకర్యానికి గురయ్యాను. అయితే అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాను. గ్లామరస్ దుస్తులు నా శరీరాకృతికి సరిపడవు. అందువల్ల అలాంటి దుస్తులు ధరించకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని చిత్రాన్ని అంగీకరించే ముందే దర్శక నిర్మాతలకు తెలియజేస్తాను. ఇప్పటీకీ కథ విన్నప్పుడే గ్లామరస్‌గా నటించను, టూపీస్ దుస్తులు ధరించను అని దర్శకుడితో చెప్పేస్తాను. అయితే ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో మంచి పాత్రలో నటించే అవకాశం లభించింది. ఇందులో దాదా కూతురిగా నటించాను. జీవీ.ప్రకాశ్‌కుమార్ నాకు సిఫార్సు చేశారనే ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. షూటింగ్లో యూనిట్ సభ్యులు నన్ను చక్కగా చూసుకున్నారు.చాలా సౌకర్యంగా అనిపించింది. -
ఆనంది... భర్తకు దూరం కానుందా?!
యేళ్ల తరబడి సా..గు..తూ.. ఉంటే ఏ సీరియల్ అయినా బోర్ కొట్టి తీరుతుంది. కానీ ‘చిన్నారి పెళ్లికూతురు’ మాత్రం అంతకంతకూ ఆకట్టుకుంటోంది. ఆనంది అనే చిన్న అమ్మాయి బాల్యవివాహంతో మొదలైన ఈ సీరియల్... ఉత్కంఠభరితమైన మలుపులతో నేటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అయితే ఇందులో అతి త్వరలో ఓ పెద్ద మలుపు రాబోతోంది. అది ఇప్పటివరకూ రానంత పెద్ద మలుపు. అందరి మనసులనూ కలచివేసే మలుపు. అదే... హీరో శివ్‌రాజ్ శేఖర్ మరణం! అప్పటికే మొదటి పెళ్లితో ఘోర పరాభవానికి గురై, అష్టకష్టాలు అనుభవించి, గుండెను రాయి చేసుకుని బతుకుతోన్న ఆనంది జీవితంలోకి వస్తాడు శివ్. ఎలాగో ఆమె మనసును కరిగించి, అందులో స్థానం సంపాదిస్తాడు. ఆమెకు అన్ని విషయాల్లో తోడు నీడగా ఉంటూ ఆదర్శ భర్తగా మెలుగుతున్నాడు. అలాంటివాడికి మరణమా? అతను పోతే ఆనంది పరిస్థితి ఏమిటి? అతడే లోకమనుకునే ఆమె ఎలా బతుకుతుంది? తలచుకుంటేనే ప్రేక్షకుడికి, ముఖ్యంగా ఆ సీరియల్ అభిమానికి గుండె చెరువైపోతుంది. కానీ ఏం చేస్తాం... ఈ ట్విస్టుకు సిద్ధపడాల్సిందే! -
కథ వినకుండానే ఓకే చెప్పాను
దర్శకుడు బాలా పిలిచి మంచి కథ ఉంది చేస్తావా అని అడగ్గానే ఏలాంటి ప్రశ్న వేయకుండా ఓకే అన్నానని యువ నటుడు అధర్వ అన్నారు. బాలా దర్శకత్వంలో పరదేశీ చిత్రంలో అద్భుతమైన అభినయంతో ప్రశంసలు అందుకున్న ఈ నటుడు తాజాగా ఆయన నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం చండీవీరన్. కలవాణి చిత్రం ఫేమ్ సర్గుణం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కయల్ ఫేమ్ ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అధర్వ మాట్లాడుతూ పరదేశీ చిత్రం తరువాత ఒక రోజు దర్శకుడు బాలా నుంచి పిలుపొచ్చిందన్నారు. అప్పుడాయన ఒక మంచి కథ ఉంది చేస్తావా? అని అడిగారన్నార న్నారు. తాను మరో మాట లేకండా ఓకే అన్నానని చెప్పారు. ఆ తరువాత దర్శకుడు బాలా కథ వివరించారని అన్నారు. కథ, కథనాలు కొత్తగానూ, కథానాయకుడి పాత్ర తనకు నప్పేదిగానూ ఉండడంతో మంచి అవకాశంగా భావించినట్లు తెలిపారు. సింగపూర్‌లో పనిచేసే తాను స్వంత గ్రామానికి తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక సమయంలో ఊరంతా తనకు వ్యతిరేకం అవుతుందన్నారు. అందుకు కారణం ఏమిటి? ఆ సమస్య నుంచి ఎలా భయటపడ్డానన్నది చిత్ర కథ అని అధర్వ పేర్కొన్నారు. -
సినిమా ఏంటనేది తెలుసుకున్నా
సినిమా ఏంటనేది తెలుసుకున్నానంటోంది కయల్ కథానాయకి ఆనంది. పదహారణాల ఈ తెలుగమ్మాయి కయల్ పాత్రలో లీనమై నటించడం అంత సులభం కాదు. కయల్ చిత్రం ప్రశంసలందిస్తే తమిళ సినిమా మరో మూడు అవకాశాలను ఇచ్చేసింది. దీంతో కోలీవుడ్ పైనే దృష్టి సారిస్తున్న ఆనందితో మినీ ఇంటర్వ్యూ. ప్రశ్న: సినీ రంగ ప్రవేశం గురించి? జవాబు: చిన్నతనంలోనే నాట్యంలో నైపుణ్యం పొందాను. చదువుకునే రోజుల్లోనే స్టేజ్ డాన్స్ చేశాను. పదవ తరగతి చదువుతున్నప్పుడే తెలుగులో బస్టాప్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. మొదట ఆ అవకాశాన్ని అందుకోవాలా? వద్ద అన్న సందిగ్ధంలో పడ్డాను. ఇంటిలోనూ సమ్మతించలేదు. ఆ చిత్ర దర్శకుడు నన్ను, కుటుంబ సభ్యులను కన్విన్స్ చేసి ఒప్పించడంతో నేను నాయకినయ్యాను. ఇదే చిత్రం ద్వారా నటి శ్రీదివ్య పరిచయమయ్యారు. ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాం. ప్రశ్న: శ్రీదివ్య మీకిప్పటికీ టచ్‌లో ఉన్నారా? జవాబు: లేదు. ఆ చిత్రంలో నటించడంతో సరి. ఆ తరువాత మా మధ్య ఫ్రెండ్షిప్ లేదు. ఎప్పుడైనా ఎదురుపడినా హాయ్ అంటూ చిన్న నవ్వు అంతే. తాను బిజీగా ఉంది. నేను నా చిత్రాల్లో బిజీగా ఉన్నాను. ప్రశ్న: కయల్ చిత్ర అవకాశం ఎలా లభించింది? జవాబు: తమిళంలో నేను పరిచయమైన చిత్రం పొదియళన్ ఆ చిత్ర షూటింగ్ మొదలైన పది రోజులకు అనూహ్యంగా ఒక స్నేహితుడు దర్శకుడు ప్రభు సాల్మన్ చిత్రానికి నాయకి కావాలట. వెళ్లి కలుస్తారా? అని అన్నారు. వెంటనే వెళ్లి దర్శకుడిని కలిశాను. టెస్ట్ షూట్ చేసి చూశారు. అప్పుడు నాకు తమిళం భాష రాదు. అయినా ఆయన చెప్పిన డైలాగ్స్ రెండు, మూడు సార్లు ఆ తరువాత కరెక్ట్‌గా చెప్పాను. ఐదు మాడ్యువేషన్స్లో డైలాగ్ చెప్పించారు. అది వారికి సంతృప్తి కలిగించింది. దీంతో నువ్వే కయల్వి అన్నారు. ప్రశ్న: ఇప్పుడు తమిళం బాగానే మాట్లాడుతున్నట్లున్నారు? జవాబు: షూటింగ్లో యూనిట్ సభ్యులందరితో తమిళంలోనే మాట్లాడాలంటూ దర్శకుడు ప్రభు సాల్మన్ ఆంక్షలు విధించారు. దాంతో అందరూ తమిళంలోనే మాట్లాడేవారు. తమిళంకు తెలుగుకు భాషా బేధం వున్నా ప్రయత్నిస్తే త్వరలోనే అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది. అలా కిందా మీద పడి ఇప్పుడు తమిళం బాగానే మాట్లాడుతున్నారనే స్థాయికి చేరుకున్నాను. ప్రశ్న: ప్రభుసాల్మన్ చిత్రాల్లో నటించిన నాయకిలందరూ మంచి స్థాయికి చేరుకుంటారనే పేరుంది? జవాబు: నిజమే. అమలాపాల్, లక్ష్మీమీనన్ లాంటి హీరోయిన్లు మంచి స్థాయికి చేరుకున్నారు. అలాగే మంచి స్థాయికి చేరుకుంటాననే నమ్మకం నాకు ఉంది. కయల్ చిత్ర షూటింగ్ చేస్తున్నప్పుడే సినిమా అంటే ఆ టీమ్‌కు ఉండే ఫ్యాషన్ తెలిసింది. సాధారణంగా ఆఫీసు ఉద్యోగానికి వెళ్లొచ్చినట్లు కాదు సినిమా అంటే అని అర్థం చేసుకున్నా. ఆ తరువాతే నన్ను నేను కొత్తగా చూసుకోవడం ప్రారంభించాను. పూర్తి డెడికేషన్‌తో పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఫలితంగా కయల్ పాత్రకు ప్రశంసలు జల్లులు కురిశాయి. ప్రశ్న: ఏ నటిని స్పూర్తిగా భావిస్తారు? జవాబు: సిమ్రాన్. ఆమె నటన, డాన్స్ అంటే చాలా ఇష్టం. సిమ్రాన్లా నటించాలని ప్రతిసారి నాలో నేను చెప్పుకుంటుంటాను. ప్రశ్న: తదుపరి చిత్రాలు? జవాబు: ప్రస్తుతం జి.వి.ప్రకాష్‌కుమార్‌తో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలోను, వెట్రిమారన్ దర్శకత్వంలో దినేష్ సరసన విచారణై చిత్రంతో పాటు సర్గుణం దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మంచి కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నాను. -
పోయిన పేరు మళ్లీ వస్తుందా?!
టీవీక్షణం: మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క తప్పు చేస్తే చాలు. ఒక్కసారి అందరి నోళ్లలో పడితే చాలు. అంతవరకూ ఉన్న పేరు తుడిచి పెట్టుకు పోతుంది. ఈ విషయం ప్రత్యూష బెనర్జీకి అర్థం కాలేదు. అందుకే ‘ఆనంది’గా తెచ్చుకున్న ఖ్యాతిని ‘బిగ్‌బాస్’ షోలో తన ప్రవర్తనతో పాడు చేసుకుంది. అతి చిన్న వయసులోనే చాలా పెద్ద పేరు తెచ్చుకుంది ప్రత్యూష. ‘బాలికావధు’లో ఆమె చేసింది ఓ ఆదర్శనీయమైన పాత్ర కావడంతో అందరూ ఆమెను ఆకాశానికెత్తేశారు. కానీ ‘బిగ్‌బాస్’లో ఆమెను చూసిన తర్వాత ఆ అభిమానం మాయమైంది. గిల్లికజ్జాలాడుకోవడానికే పెట్టారా అన్నట్టుండే బిగ్‌బాస్ షోలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. రకరకాల మనస్తత్వాలు ఉన్నవారి మధ్య తమ ఎమోషన్స్‌ను నియంత్రించుకుంటూ నిలబడటం అంత తేలిక కాదు. అదే ప్రత్యూషను దెబ్బ తీసింది. ఒకరి విషయాలు మరొకరి దగ్గర చెప్పడం, వెనుక మాట్లాడటం వంటి లక్షణాలతో చెడ్డపేరు మూటగట్టుకుంది. అది ఆమె కెరీర్ మీద కూడా ప్రభావం చూపించిందని చాలామంది చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు, చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘హమ్ హై నా’తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే సోనీ చానెల్లో ప్రారంభమైన ఈ సీరియల్లో బెంగాలీ అమ్మాయిగా నటిస్తోంది ప్రత్యూష. అంతకుముందు పక్కా రాజస్థానీ అమ్మాయిగా సంప్రదాయబద్ధంగా చూసిన ఆమెని, ఇప్పుడీ సీరియల్లో ఆధునిక యువతిగా చూడటం కొత్త అనుభూతి. మరి ఈ పాత్ర ఆమెకు ఎంత పేరు తెస్తుందో చూడాలి. నటన పరంగా ఆమెకు వంక పెట్టనవసరం లేదు. మరి ఆ నటన ఆమెకున్న చెడ్డపేరును తుడిచేసి మళ్లీ ప్రేక్షకుల మనసుల్లో ఆమెను నిలబెడుతుందా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది! -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఆనందిని
-
చిన్న సినిమాను పెద్ద హిట్ చేశారు
ప్రేక్షకులు చాలా పెద్ద హిట్ చేశారని ‘ఉయ్యాల జంపాలా’ హీరో రాజ్‌తరుణ్ అన్నారు. ఈ సినిమా విజయయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక అంబికా థియేటర్‌కు వచ్చారు. రాజ్‌తరుణ్ విలేకర్లతో మాట్లాడుతూ చాలా చిన్న సినిమా అనుకున్నామని ప్రజలు ఈసినిమాను బాగా ఆదరిస్తున్నారని అన్నారు. ఇది తనకు మొదటి సినిమా అని విడుదల అనంతరం చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. హీరోయిన్ అవికగోర్ మాట్లాడుతూ సినిమా పెద్దహిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వి.వర్మ మాట్లాడుతూ తన మొదటి సినిమాకే ముగ్గురు పెద్ద నిర్మాతలు ముందుకు రావడం, చిత్రం హిట్కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు ఇచ్చిన ఈ బహుమతి మరిచిపోలేనిదన్నారు. అనంతరం చిత్ర హీరో, హీరోయిన్లు ప్రేక్షకులతో సందడి చేశారు. థియేటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.