ఆనంది చెప్పులు కనిపించలేదట!
నటి ఆనంది చెప్పులు కనిపించలేదట. ఏమిటీ ఇదో వార్త, దీనికింత బిల్డప్పా అని అనుకుంటున్నారా? అలాంటి టైటిల్‌తో ఒక సినిమానే వస్తుంటే అది వార్తే అవుతుందిగా. ‘ఎన్ ఆళోడ చెరుప్పు కానోం’ (నా లవర్ చెప్పులు కనిపించడం లేదు) అనే చిత్రాన్ని డ్రమస్టిక్ ప్రొడక్షన్ పతాకంపై వెడిక్కరన్‌పట్టి ఎస్. శక్తివేల్, విజయ్ సోదర ద్వయం నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు కోడంబాక్కమ్, రామన్ తేడియ సీతై చిత్రాలను తెరకెక్కించిన జగన్నాథన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది.
పసంగ చిత్రం ఫేమ్ పాండి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతని లవర్‌గా కయల్ చిత్రం ఫేమ్ ఆనంది కథానాయకిగా నటిస్తున్నారు. కాగా ఇందులో హీరోకు జంటగా నటించడానికి ఆనంది సంకోచించారట. పాండి నటించిన ఒక వీడియోను చూసిన తరువాత అతనితో నటించడానికి ఓకే అన్నదట. ఈ విషయాన్ని దర్శకుడు తెలుపుతూ నిజానికి తన ఫ్రెండ్ సిఫారసు చేసిన పాండిని ఈ చిత్ర కథానాయకుడిగా ఎంపిక చేయడానికి తానే ఆలోచించానన్నారు.
అయితే తాను చెప్పిన సన్నివేశానికి అతని నటన చూసి తరువాత పాండిపై నమ్మకం కుదిరిందన్నారు. ఇక చిత్రం గురించి చెప్పాలంటే మనం పాదరక్షలను చాలా సాధారణ వస్తువులుగా చూస్తామన్నారు. అయితే అవి చాలా సంఘటనలకు కారణంగా నిలుస్తాయని, అవేమిటో చెప్పే కథా చిత్రంగా ఎన్ ఆళోడ చెరుప్పు కానోం ఉంటుందని తెలిపారు. చిత్రంలో చెప్పులు, వర్షం కీలకం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను కడలూర్ çపరిసర ప్రాంతాల్లో సహజంగా కురిసిన వానలో చిత్రీకరించినట్లు తెలిపారు.