టైటిల్ : జాంబీ రెడ్డి
జానర్ : జాంబీ
నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు
దర్శకుడు : ప్రశాంత్ వర్మ
నిర్మాత : రాజశేఖర్ వర్మ
సంగీతం : మార్క్ కె. రాబిన్
సినిమాటోగ్రఫి: అనిత్
విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021
మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్‌లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
కథ:
ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం.
ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్‌లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ)
ఎలా ఉందంటే..
మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్‌లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి.
సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్‌లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్)
నటన:
ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!)
Comments
Please login to add a commentAdd a comment