Childrens future
-
Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం
ముంబై నగర మురికివాడల్లో నివసించే పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో 32 ఏళ్లుగా నిమగ్నమైన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంది సింగ్ రావత్. సుదీర్ఘ బోధనా అనుభవంలో పిల్లల మనస్తత్వాన్ని దగ్గరుండి అర్ధం చేసుకున్న మానసిక నిపుణురాలు. పిల్లలు రోల్ మోడల్‌గా భావించే ఈ టీచర్ ఇన్నేళ్లుగా చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతుంది. ‘‘మూడు దశాబ్దాలకు పైగా పిల్లలతో కలిసి ఉండటం వల్ల వారి మనస్తత్వాన్ని సులువుగా అర్థం చేసుకునే స్థితి నాకు అలవడింది. ఆ ఆలోచనతో ‘మేము, పిల్లలు, వారి మనస్తత్వశాస్త్రం’ పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. టీచర్‌గా పిల్లల మనస్తత్వంపై, వారి వికాసంపై అనేక రకాల పరిశోధనల కథనాలు నేను రాసిన పుస్తంలో ఉన్నాయి. ఇవన్నీ టీచర్లకు, తల్లిదండ్రులకు మార్గదర్శకం అవుతాయి. ఇది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల మనసులను చదవాలి హైపర్ యాక్టివ్, కోపం, పిరికితనం... ఇలా పిల్లలు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లల వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని వారితో మాట్లాడాలి. పిల్లల ప్రవర్తన వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేరు. బాల్యంలో పిల్లల మనసులో నిలిచిపోయే విషయాలు లేదా సంఘటనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రోజూ తల్లిదండ్రుల పోట్లాడుకుంటుంటే పిల్లవాడికి భవిష్యత్తులో పెళ్లి పట్ల విముఖత ఏర్పడుతుంది. లేదా తన జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలో అర్థం కాకపోవచ్చు. చదువుకోవడానికి వచ్చే మురికివాడల పిల్లల జీవితం సంపన్నుల పిల్లల కంటే భిన్నంగా ఉంటుంది. వారి సమస్య లు, అవసరాలు లెక్కలేనన్ని ఉంటాయి. ప్రేమ, ఆప్యాయత వారికి లభించడం లేదు. ఈ పిల్లలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఇంట్లో వాతావరణం బాగుండదు. దీని ప్రభావం కొన్నిసార్లు వారి హృదయాన్ని, మనస్సును గాయపరుస్తుంది. అప్పుడు వారు క్లాసులో మౌనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు. అలాంటి పిల్లలను పక్కకు తీసుకెళ్లి వారితో మాట్లాడతాను. వారి మనస్సులను చదువుతాను. వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. క్లాసులో పిల్లలెవరూ విచారంగా, మౌనంగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను. తల్లిదండ్రులూ అర్థం చేసుకోలేరు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతాను. వారి ఇంటి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాను. వారి పొర పాట్లను ప్రేమగా వారికి తెలియజెబుతాను. పిల్లల ముందు ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలో వివరిస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పోట్లాడుకోవడం చూసిన పిల్లలు స్కూల్లో ఇతర పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ పిల్లల ఇంటి వాతావరణం వారి బాల్యాన్ని నాశనం చేసే సామాజిక సమస్య. వారి జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. చిన్న పిల్లల మనసు అర్థం చేసుకోవాలంటే వాళ్ల మనసు లోతుల్లోకి వెళ్లాలి. వాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే వాళ్ల కష్టాలు అర్థం చేసుకోవడం తేలికైంది. అప్పుడు పిల్లలు కూడా నేను చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ప్రారంభించారు. హృదయ విదారక కథలు కుటుంబంలో తగాదాలు, ఇల్లు కూలిపోవడం, అమ్మ లేదా నాన్న కొట్టడం, కొన్నిసార్లు సవతి తండ్రి, కొన్నిసార్లు సవతి తల్లితో బాధలు... దీంతో ఈ పిల్లల బాల్యాన్ని తుంగ లో తొక్కేసినట్టవుతుంది. ఈ పిల్లలను తిరిగి స్కూల్‌కు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. భయపెట్టే సంఘటనలు రోహన్ (పేరుమార్చాం) తన మనసులో ఏదో దాచుకుంటున్నట్టు, భయం భయంగా ఉండేవాడు. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను విపరీతంగా ఏడవడం ప్రారంభించాడు. వారి ఇల్లు చాలా చిన్నది కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఒకే గదిలో పడుకునేవారు. తన తల్లిదండ్రులు రాత్రిపూట వ్యక్తిగతంగా గడపడం చూశాడు రోహన్. తన తండ్రి అమ్మను హింసిస్తున్నాడని మనసులో భయం పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మదనపడుతుండేవాడు. తల్లిదండ్రులకు, ఆ పిల్లవాడికి కౌన్సెలింగ్ ఇచ్చాక సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న సోఫియా (పేరు మార్చాం) తన డైరీలో ఏదో రాసుకోవడం గమనించాను. అడిగితే, ఎవరూ చూడకుండా చూపిస్తానంది. క్లాస్ రూమ్ నుంచి మరో గదికి తీసుకెళ్లి అడిగితే, డైరీ చూపించింది. ఆ డైరీ చదివినప్పుడు నా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సోఫియా తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంది. తన తల్లితో కలిసి కొత్త తండ్రి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొత్త తండ్రి, అతని తమ్ముడు సోఫియాను బాధపెడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరికీ ఏమీ చెప్పలేక తన తండ్రికి డైరీలో ఉత్తరాలు రాసుకుంది. ఆ తర్వాత వాళ్ల అమ్మను కలిసి మాట్లాడాను. ఆమె సోఫియా పట్ల జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, మరెన్నో గాథలు పిల్లల నుంచి తెలుసుకున్నవి, పరిష్కరించినవి ఉన్నాయి. టీచర్ని కావాలనుకున్నాను.. ముంబైలోని సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగాను. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఫీజు కట్టడానికి డబ్బుల్లేక ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాంటిస్సోరి కోర్సు చేశాను. ఇదే పిల్లలకు నన్ను దగ్గర చేసింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో నేను పనిచేసే చోట ప్రిన్సిపల్ బీఎడ్ కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత రెండేళ్లకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి అయింది. అత్తింటి ప్రోత్సాహంతో ఎం.ఏ. డిగ్రీ పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచడంతో పాటు ఇంటి పనులు, స్కూల్ పనుల వల్ల సమయం అస్సలు ఉండేది కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక పీహెచ్డీ పూర్తిచేశాను. నాకూతురు మెడిసిన్ చదువుతుండగా నేను పీహెచ్డీ చేస్తున్నాను. అలాగని నా జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, కష్టాలు ఎదురైనా పూర్తి నిజాయితీతో నా పని చేస్తూ వచ్చాను. నేను చదువు చెప్పే పిల్లలు బాగా రాణిస్తున్నారని అర్థమయ్యాక నాకు చాలా ఆనందం కలుగుతుంది. -
ఏపీ బాలల బడ్జెట్ బహుబాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి ఆంగ్ల మాధ్యమంలో మంచి చదువులు అందిస్తూ వారి సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం అద్భుతమని మెచ్చుకుంటున్నాయి. జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ–నీపా)) బుధవారం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌లో రాష్ట్రం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘స్టూడెంట్ బేస్డ్ ఫైనాన్సియల్ సపోర్టు సిస్టమ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల గురించి విని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు సాహసోపేతమైన చర్యగా పలువురు అభినందించారు. నాడు–నేడు కింద రాష్ట్రంలోని ఫౌండేషన్ స్కూళ్లు మొదలు 60 వేల వరకు ఉన్న పలు విద్యాసంస్థలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్ల నీపా అధికారులు మెచ్చుకున్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ప్రశంసించారు. పైగా అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో వాటి భద్రత నిర్వహణ కోసం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిటెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులకోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దేలా కృషి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు విద్యారంగంలో ముఖ్యంగా పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా వారిని మార్చేలా జగనన్న విద్యాకానుక కింద ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చుచేస్తూ 43 లక్షల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో లెర్నింగ్ అవుట్‌కమ్స్ పెరుగుతున్నాయి. మనబడి నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింటింగ్‌లు, కాంపౌండ్ వాల్, కిచెన్‌షెడ్ల నిర్మాణం వంటి ఏర్పాటు ద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే వీలు ఏర్పడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేలా రోజుకో మెనూతో అందిస్తున్న భోజనం గురించి ప్రతినిధులు తెలుసుకున్నారు. ఇందుకు ఈ ఏడాది ప్రభుత్వం 1,595.55 కోట్లు ఖర్చుచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి తల్లి తన పిల్లలను ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరంగా ఉంచకుండా బడులకు పంపేలా ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తున్న సంగతి విని ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2022–23 విద్యాసంవత్సరంలోనే తల్లులకు రూ.6,500 కోట్లు అందించారు. చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ వినూత్న ఆలోచన ► చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై నీపా అధికారులు, ఇతర ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకున్నారు. ► కుల, లింగ, వైకల్యాలు, తరగతి, మత, సాంస్కృతిక ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలిగే వాతావరణా న్ని సృష్టించడమే ఈ చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ లక్ష్యం. ► 2021–22లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా ఈ బాలల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022–23లో రూ.16,903 కోట్లు కేటాయించారు. ► బాలల పథకాల కోసం వందశాతం నిధులు కేటాయించే కార్యక్రమాలు మొదటి విభాగం కాగా అవసరాల మేరకు నిధులు కేటాయించే సంక్షేమ పథకాలు రెండో విభాగంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ► వివిధ శాఖల ద్వారా పిల్లల కోసం పలు పథకాలను అమలు చేయిస్తున్నారు. మొదటి విభాగంలో 15 స్కీములు, రెండో విభాగంలో 18 స్కీములు అమలు చేస్తున్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా
రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. వారికి ఈ ఆగస్టు 15 చిరస్మరణీయం చేయండి. ప్రతి భారతీయ గుండె ఉప్పొంగే క్షణాలివి. ప్రతి కన్ను ఆనందంతో చమర్చే అనుభూతి ఇది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ మువ్వన్నెలు నిండిపోయే అపూర్వఘట్టం ఇది. మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం... అందరూ అనిర్వచనీయమైన ఉద్వేగంతో ఊగిపోయే సందర్భం ఇది. దేశమా... నీ సమున్నత కీర్తిని చూసి గర్విస్తున్నాం. దేశమా... నీ ఘన వారసత్వానికి పులకించిపోతున్నాం. దేశమా... నీ విలువల ఔన్నత్యానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. దేశమా... నీవు ఇచ్చిన ఈ పిడికెడు మట్టికి హృదయాల్ని అర్పణం చేస్తున్నాం. ‘సారే జహా సే అచ్ఛా హిందూస్తాన్ హమారా’... ప్రపంచ దేశాలలోనే అందమైన దేశం, సుందర దేశం, సమృద్ధి దేశం మన దేశం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ 75 ఏళ్ల అమృత మహోత్సవం సందర్భంగా వాగ్దానం చేయాలి. నేటి బాలల హృదిలో ఈ కొనసాగింపునకు పాదులు వేయాలి. ఎందుకంటే వారే కదా భావిపౌరులు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని నెహ్రూ అన్నది– బాలల్లో దేశభక్తిని పెంపొందించాలని సూచించినది. అందుకే ప్రతి ఇంట ఉన్న బాలబాలికలందరినీ తప్పనిసరిగా ఆగస్టు 15 ఉదయం నాటి పతాకావిష్కరణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడండి. వారి చేత వందేమాతరం, జనగణమన పాడించండి. మాట్లాడనివ్వండి రేపటి ఘట్టం మాట్లాడే ఘట్టం. పిల్లల్ని మాట్లాడించాల్సిన ఘట్టం. మీ ఇళ్లల్లో, వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో పిల్లలకు వక్తృత్వ పోటీలు పెట్టండి. ‘నేను నా దేశం’, ‘నాకు నచ్చిన మహనీయుడు’, ‘ఈ దేశానికి నేను ఏమి ఇస్తాను’, ‘దేశమంటే మట్టి కాదోయ్... మనుషులోయ్’... వంటి అంశాలు ఇచ్చి, ప్రిపేర్ అయ్యి, మాట్లాడమనండి. ఏం మాట్లాడాలో కొంత సహాయం చేయండి. ఎలా మాట్లాడాలో నేర్పించండి. గొప్ప వక్త గొప్ప నాయకుడు కాగలడు... మార్గనిర్దేశనం చేయగలడు... అని చెప్పి ప్రోత్సహించండి. బాగా మాట్లాడిన వారికి బహుమతులు ఇవ్వండి. ఆగస్టు 15న వారిలోని కొత్త ప్రతిభకు పాదు వేయండి. నేనే ఆ నాయకుణ్ణయితే పిల్లల్ని పరకాయప్రవేశం చేయించండి. మోనో యాక్షన్... ఏకపాత్రాభినయం పోటీలు పెట్టండి. దేశ నాయకులుగా వేషం కట్టి వారిలా మారి వారు ఎలా మాట్లాడతారో దేశం కోసం ఏం సందేశం ఇస్తారో ఇమ్మనమని చెప్పండి. గాంధీ, నెహ్రూ, అల్లూరి, భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్... ఒక్కొక్కరు ఒక్కో నేతలా మారనివ్వండి. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాదు సమాజం కోసం పాటుపడిన వారు కూడా దేశభక్తులే అని చెప్పి సుందరలాల్ బహుగుణ, మదర్ థెరిసా, సావిత్రిబాయ్ పూలే, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్ వంటి మహనీయుల వేషాలు వేయమనండి. దేశకీర్తిని ఇనుమడింప చేసిన చిత్రకారులు, గాయకులు, కవులు రవీంద్రనాథ్ టాగోర్, మంగళంపల్లి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్ వంటి వారి రూపంలో పిల్లల్ని వేదిక మీదకు రమ్మనండి. అద్భుతం ఆ దృశ్యం. మహనీయుల పసిరూపం. పర్వతాలు, నదులు... దేశమే చిత్రలేఖనం పోటీ పెట్టండి. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ బొమ్మలే కాదు హిమాలయాలు, గంగానది, వింధ్య పర్వతాలు, హిందూ మహాసముద్ర తీరాలు... వీటిని కూడా గీయమనండి. దేశంలోని ప్రకృతిని కాపాడటం దేశభక్తి అని చెప్పండి. రాజస్తాన్ ఎడారి, గుజరాత్ శ్వేత మైదానాలు, మధ్యప్రదేశ్ ఘోరారణ్యాలు, తెలంగాణ పీఠభూములు, ఆంధ్రప్రదేశ్ నదీ ప్రవాహాలు జాతి సంపదలేనని చాటుతూ గీయమనండి. ‘టీ షర్ట్ పెయింటింగ్’ కూడా మంచి ఆలోచన. తెల్లటి టీషర్ట్ మీద దేశభక్తిని తెలియచేసే బొమ్మ గీసి వేసుకోవడం, బహుమతిగా ఇవ్వడం చేయమనండి. జాతీయ జంతువు, పక్షి, చిహ్నం వీటిని గీయమని చెప్పండి. అంతే కాదు, వీటన్నింటికి అర్హుడయ్యేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటామని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించండి. క్విజ్లు, థీమ్ పార్టీలు స్వాతంత్య్ర పోరాటం ఒక సుదీర్ఘ ఘట్టం. దీని మీద ఎన్ని క్విజ్లైనా నిర్వహించవచ్చు. సరైన సమాధానాలు చెప్పిన పిల్లలకు మంచి బహుమతి ఇవ్వండి. అలాగే ఆ మధ్యాహ్నం లేదా సాయంత్రం థీమ్ పార్టీ చేసుకోవచ్చు. ఖాదీ బట్టలు, మూడు రంగుల బట్టలు లేదా గాంధీ టోపీ... ఇలాంటి థీమ్ పెట్టుకొని పిల్లలు స్నాక్స్ పార్టీ చేసుకోవచ్చు. ఆ సాయంత్రం ‘చరిత్ర నడక’– అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా చారిత్రక స్థలం అంటే కూడలి, దేశభక్తుని విగ్రహం, లేదా గతంలో మహనీయులు వచ్చి వెళ్లిన చోటు అక్కడి వరకు పిల్లలు పెద్దలు కలిసి వాక్ చేయవచ్చు. అలాగే ఆ సాయంత్రం అందరూ కలిసి మంచి దేశభక్తి సినిమా తిలకించవచ్చు. పాటల పోటీ, డాన్స్ పోటీలు ఎలాగూ ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలు వేసిన బొమ్మలతో సాయంత్రం ప్రదర్శన ఏర్పాటు చేయాలి. సంకల్పం దేశ స్వాతంత్య్రం ఒక్కరోజులో రాలేదని, ఎందరో త్యాగాలు చేస్తే... కష్టాలు ఎదుర్కొంటే వచ్చిందని పిల్లలకు చెప్పాలి. జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని దేశం గర్వించేలా ఎదగడమే దేశభక్తి అని కూడా వారికి చెప్పాలి. ‘నాకు జన్మనిచ్చిన దేశానికి నేను పెద్దయ్యి ఏం చేయాలి’ అనే భావన ఎప్పుడూ కలిగి ఉండాలని వారికి చెప్పాలి. భారత్ మాతా కీ జై అనే నినాదం వారి హృదయంలో సదా మార్మోగేలా పెద్దల సహకారంతో పిల్లలు ఈ అమృత మహోత్సవాన్ని జరుపుకునేలా నేడంతా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాం. సంస్కృతులకు స్వాగతం చెప్పండి సాటి సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని కూడా చెప్పండి. భిన్న సంస్కృతుల వేషధారణల పోటీ పెట్టండి. అస్సామీలు, మణిపురిలు, తమిళులు, మలయాళీలు, మహరాష్ట్రీయులు, కశ్మీరీలు... వీరంతా వేదిక మీదకు రావాలి. హిందూ ముస్లిం శిక్కు క్రైస్తవ ధర్మాలు మన దేశంలో ఉన్నాయని, అందరూ కలిసి మెలిసి జీవించాలని తెలియచేసే రూపకాలు, పాత్రలు వేయించండి. భిన్నత్వంలో ఏకత్వం... ఏకత్వంలో భిన్నత్వం బోధించండి. -
అవకాశాల అవసరశాల
లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన పిల్లలను బిజీగా ఉంచడానికి నానా తంటాలు పడ్డారు తల్లిదండ్రులు. అశ్వతీ వేణుగోపాల్ మాత్రం పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా, సమయాన్ని సద్వినియోగం చేసే ‘అవసర శాల’నే ప్రారంభించింది. ‘‘పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అంశాలు, వారిలో దాగున్న ప్రతిభను వెలికితీసే పోటీలు నిర్వహిస్తూ వారిని బిజీగా ఉంచడమేగాక, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. అవసర శాల ఏర్పాటుకు ప్రేరణ ఇచ్చిన కెటిల్ సంస్థకే ఇండియా తరపున సభ్యురాలిగా ఎంపికైంది. లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన చిన్న స్టార్టప్‌తో అతికొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అశ్వతి గురించి ఆమె మాటల్లోనే... ‘‘కేరళలోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. అందరిలాగే కష్టపడి ఇంజినీరింగ్ తరువాత ఎంబీఏ చేశాను. క్యాంపస్ సెలక్షన్స్ లో అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. ఏదైనా ఫెలోషిప్ చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఫెలోషిప్స్ గురించి తెగ వెతికాను. అప్పుడు నాకు చాలా ఫెలోషిప్స్ కనిపించాయి. నూటపది దేశాల్లోని 17 నుంచి 26 ఏళ్ల యువతీ యువకుల ప్రతిభను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ... ‘నోవెల్స్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లీడర్షిప్(కేఈసీటీఐఎల్– కెటిల్)’లో యూత్ప్రోగ్రామ్ ఫెలోషిప్ చేయడానికి అవకాశం లభించింది. ఏడాదిపాటు ఆన్లైన్ ప్రోగ్రామ్ జరిగింది. 2019 జూన్‌లో అట్లాంటాలో వారం రోజుల పాటు జరిగే లీడర్షిప్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 27 మందిలో నేను కూడా ఉన్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలా మంది చేంజ్ మేకర్లు, ఎంట్రప్రెన్యూర్లు, సామాజిక సేవాకార్యకర్తలు ఉన్నారు. వీళ్లంతా ఏదో ఒకటి సాధించి వచ్చినవారే. 17–20లోపు వాళ్లు వచ్చి వారు ఏమేం చేస్తున్నారో, సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారో చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను కూడా ఏదో ఒకటి చేయాలని. అవసరశాల అట్లాంటా నుంచి ఇండియా వచ్చిన తరువాత చాలా ఆలోచించాను. అతి చిన్న వయసులో అనేక దేశాల్లోని పిల్లలు వివిధ రంగాల్లో ఎదిగి చూపిస్తున్నారు. కెటిల్ వేదికగా అవన్నీ ప్రత్యక్షంగా చూశాను. ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. వారినెందుకు ఆ విధంగా తయారు చేయకూడదు అనిపించింది. అనుకున్న వెంటనే అమెజాన్‌లో ఉద్యోగం వదిలేశాను. నా భర్త సందీప్‌తో కలసి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తేసేందుకు అనేక మార్గాలను అన్వేషించి 2020లో ‘అవసరశాల’ను ప్రారంభించాం. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీల లిస్టు తయారు చేశాం. నవ్వుల పోటీ, ఫ్యాన్సీడ్రెస్, స్టోరీ టెల్లింగ్, గూగుల్ జూనియర్ కోడింగ్, నాసా స్పేస్ కాంటెస్ట్, జాతీయ, అంతర్జాతీయ స్కాలర్షిప్పులు, స్టూడెంట్ లీడర్ షిప్, అంతర్జాతీయ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్, అంతర్జాతీయ ఎస్సే కాంపిటీషన్స్, జాతీయ స్థాయి మ్యూజిక్ కాంపిటీషన్, డ్యాన్స్ ఫెలోషిప్స్, జూనియర్ ఫుట్‌బాల్ లీగ్, క్విజ్లు, ఒలింపియాడ్స్, అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వంటివన్నీ చేపడుతున్నాను. వీటిద్వారా పిల్లల్లో ప్రతిభను వెలికి తీస్తున్నాము. ‘విజ్‌కిడ్స్ చాలెంజ్’ పేరిట మరో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆర్ట్, సైన్స్, లైఫ్ స్కిల్స్, కుకింగ్, ఫైనాన్స్, ఇన్నోవేషన్స్‌లో శిక్షణ ఇస్తూ లాక్డౌన్లో పిల్లల్ని బిజీగా ఉంచాం. దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులకు వివిధ అంశాలు, ఫెలోషిప్స్‌పై అవగాహన కల్పించి వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నాము. దీంతో వాళ్లు భవిష్యత్‌లో ఏ రంగంలోనైనా రాణించగలరు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో ఎదుగుతామనడానికి నేనే ఉదాహరణ. లాక్డౌన్ మొదట్లో ప్రారంభించిన అవసరశాల బాగా క్లిక్ అవ్వడంతో మంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. కెటిల్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్–3 ‘‘వచ్చే ఐదేళ్లలో నువ్వు ఏం చేస్తావు?’’ అని నన్ను అడిగారు. అప్పుడు నేను ‘‘ఆరుగురి కంటె ఎక్కువమందికి ప్రేరణగా నిలుస్తాను’’ అని చెప్పాను ‘అవసరశాల’తో ఆరుగురు కాదు వేలమందిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నిరూపించే స్థాయిలో ప్రేరణ కలిగించాను. నా పనికి గుర్తింపుగా ఐకానిక్ ఉమెన్ ఆఫ్ 2020 అవార్డు, టాప్‌టెన్ సోషల్ ఇన్నోవేటర్, యూత్ కోలాబ్ నుంచి పీపుల్స్ చాయిస్ అవార్డులు వంటివెన్నో వరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన సభ్యుల్లో ఇండియా నుంచి నేను ఉండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని చెబుతోంది అశ్వతి. -
పిల్లల భవిష్యత్తు కోసం...
తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు. ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి. చదువుతోపాటు ఇతర కళలు విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్‌గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యయ అంచనాలు శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. విదేశీ విద్య అయితే.. గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి. పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి. ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు.. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్ కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్ కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్‌కు అవకాశం ఉండదు. కనుక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్ చేసుకున్నట్టు అవుతుంది. డెట్ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పొదుపు... చిన్న అడుగులు పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. విద్యా రుణం ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. -
అందమైన మనసు
మనసు అందంగా ఉంటే మనిషి అభిరుచులు కూడా అందంగా ఉంటాయి. ఆసక్తి ఉన్నా ఆసరా లేని మహిళలకు వివిధ ఉపాధి నైపుణ్యాలు నేర్పించి వారికి ఆర్థికంగా తోడ్పాటునిస్తున్న గీతా మిశ్రా.. నాలుగేళ్లుగా అనాథ పిల్లల్నీ చేరదీసి..సొంత ఖర్చుతో.. సొంతవాళ్ల సహకారంతో.. ఆ పిల్లల భవిష్యత్తుగా అందమైన బాటను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, కోఠీలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇరుకు గల్లీలో ఓ మూడంతస్తుల భవనం ఉంది. ఆ బిల్డింగ్‌కి ‘నవజీవన్ ఆర్ఫన్ హోమ్’ అనే బోర్డు ఉంది. సాయంత్రం నాలుగు గంటల వరకు నిశ్శబ్దంగా ఉందా హోమ్. నాలుగుంపావుకు అక్కడికి స్కూల్ వ్యాన్ వచ్చి ఆగింది. బిలబిలమంటూ ఓ ఇరవై మంది పిల్లల వరకు దిగారు. రెండో అంతస్థులో ఉన్న గీతా మిశ్రా దగ్గరకు వెళ్లి ‘‘మమ్మీ! గుడీవినింగ్’’ అని విష్ చేశారు. వాళ్లలో పదేళ్ల దివ్య అయితే ఏకంగా గీతా మిశ్రా ఒళ్లో వాలిపోయింది. ‘‘పెద్దయిన తరవాత నాలాగ ‘మమ్మీ’ అవుతానని అంటోంది’’ అంటూ దివ్య బుగ్గలు పుణికింది గీతా మిశ్రా. ‘‘అవును, మా ఆంటీ నా ఒంటి మీద వాతలు పెడుతుంటే ఈ మమ్మీనే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. మమ్మీ నాలాంటి పిల్లలందరినీ ముద్దుగా చూసుకుంటోంది. అందుకే నేను పెద్దయిన తర్వాత ఆర్ఫనేజ్ పెట్టి అమ్మానాన్నలు లేకుండా కష్టాలు పడే పిల్లలందరికీ మమ్మీనవుతాను’’ అని గీతామిశ్రా మెడను చుట్టుకుని తన చేతి మీదున్న మానిపోయిన గాయాల మచ్చలను చూసుకున్నది దివ్య. నిర్దయకు ఆనవాలు దివ్య అమ్మానాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. అప్పుడు ఆ ఇంటి యజమాని పెట్టిన చిత్ర హింసలకు ఆనవాళ్లే మచ్చలు. ‘‘ఆమెకు కోపం వస్తే ఈ పాప చేతుల మీద వాతలు పెట్టేది, ఆడుకుంటున్నప్పుడు పెద్ద రాయి పైన వేసిందోసారి. అదృష్టవశాత్తూ ఆ బండరాయి తలకు తగల్లేదు’’ అని దివ్య తల నిమురుతూ చెప్పారు గీత. ఆధార్ కార్డులోనూ ఆమే తల్లి గీతామిశ్రా పూర్వికులది ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ జిల్లా. నాలుగు తరాల కిందటే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి స్థిర పడిన హిందీ కుటుంబం వాళ్లది. ఆమె బాల్యం హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గడిచింది. పెళ్లితో హైదరాబాద్, కోఠీలో స్థిరపడిన మరో మర్వాడీ కుటుంబంలో అడుగుపెట్టారు. సోషల్ వర్కర్‌గా గీత అల్పాదాయ వర్గాలు నివసించే బస్తీల్లో పని చేసేవారు. అక్కడ తాను చూసిన అనాథ పిల్లలను చేరదీస్తూ... వాళ్లకు తానే తల్లయ్యారు. అలా ఓ ఇరవై మంది చిన్నారులకు ‘మమ్మీ, డాడీ’ రెండూ ఆమే అయ్యారు. ఆ పిల్లల స్కూల్ రిజిస్టర్లో గీతా మిశ్రా పేరే ఉంటుంది. ఆరుగురు పిల్లలకైతే ఆధార్ కార్డులో కూడా తల్లిగా ఆమె పేరే ఉంది. అదే గదిలో ఒక టేబుల్ మీద పిల్లల ఆధార్ కార్డుల రికార్డు, బర్త్ సర్టిఫికేట్ల ఫైల్, పిల్లల మెడికల్ రికార్డ్స్ వరుసగా పేర్చి ఉన్నాయి. ఒక గోడకు పిల్లలు జూ పార్క్‌కు వెళ్లినప్పటి ఫొటోలతోపాటు పిక్నిక్లో ఒంటె మీద సవారీ చేస్తున్న ఫొటోలు, బాసరకు ట్రైన్లో వెళ్తున్న ఫొటోలు, జూ పార్క్, బోనాల వేడుక, గురుపూర్ణిమ, జాదూగర్ ఆనంద్ మ్యాజిక్ షో చూడడానికి వెళ్లినప్పటి ఫొటోలు ఉన్నాయి. మరో గోడకు క్యాలెండర్లో కొన్ని తేదీలు రెడ్ ఇంకుతో రౌండప్ చేసి ఉన్నాయి. అవి బర్త్‌డేలు, న్యూ ఇయర్ వేడుకలను హోమ్‌లో ఉన్న పిల్లలతో జరుపుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్లు రిజర్వ్ చేసుకున్న తేదీలు. భగవంతుడే నడిపిస్తున్నాడు ఒక మామూలు మహిళ ఇంత పెద్ద బాధ్యతను తలకెత్తుకోవడం గురించి గీతా మిశ్రా ఇలా అన్నారు. ‘‘నాది సంకల్పం మాత్రమే. నడిపిస్తున్నది ఆ భగవంతుడు. నాకు బరువు కలగకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చును పంచుకున్నారు. ‘నిరాధార్∙గుజరాతీ జైన్ సేవా సమితి’ వాళ్లు నెలకు ఇరవై వేలిస్తారు. హోమ్ నిర్వహణ కోసం ఒక కుక్, ఒక కేర్‌టేకర్, ఒక ట్యూటర్ ఉన్నారు. వాళ్ల జీతాలకు ఆ డబ్బు సరిపోతుంది. మా అమ్మ విద్యామిశ్రా, స్నేహితులు ఆర్తి పాటిల్, లతారెడ్డి, నావల్ కిశోర్, ఓం ప్రకాశ్, ఉర్మిళ క్రమం తప్పకుండా ప్రతినెలా రెండు–మూడు వేలిస్తారు. ఉర్వి అనే మరో ఫ్రెండ్ అప్పుడప్పుడూ కిరాణా సరుకులు తెచ్చి పెడుతుంటుంది. స్కాల్ (ఎస్కెఏఎల్) మెంబర్ రవీశ్ దవే పిల్లలకు నెలకోసారి స్టార్ హోటల్ ఫుడ్ పంపిస్తారు. కొంతమంది వాళ్లకు తోచినప్పుడు పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కు పాలు, బిస్కట్, అరటి పండ్లను స్పాన్సర్ చేస్తారు. నేరుగా పాలవాళ్లకు, అరటిపండ్ల వాళ్లకు డబ్బిచ్చి ఎన్ని రోజులు వేయాలో చెప్తారు. మిగిలిన రోజులకు నేను పే చేసుకుంటాను. నేను బ్యూటిషియన్‌గా హోమ్సర్వీస్ చేస్తాను కాబట్టి మంచి ఫీజు ఇస్తారు. ఆ భగవంతుడి దయ వల్ల మా ఇంట్లో నా సంపాదన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. అమ్మాయిలిద్దరికీ పెళ్లయింది. ముంబయిలో ఉంటారు. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా వారు ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. ఆర్ఫన్ హోమ్ కోసం ఇల్లు వెతుకుతున్నప్పుడు ఎవరూ ఇల్లు అద్దెకివ్వలేదు. ఆ టెన్షన్‌తో నాకు బీపీ ఒడిదొడుకులు, షుగరూ వచ్చేశాయి. అప్పుడు మా వారు, పిల్లలు నాకు నచ్చచెప్పి ఈ ఇంట్లోనే హోమ్ నడుపుకోమన్నారు. ఇప్పుడు మేము కాచిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాం’’ అని ఈ హోమ్ నిర్వహణలో ఎవరెంతెంత సహాయం చేస్తున్నారో చెప్తూ ‘ఒక మంచి పని చేస్తుంటే కలిసి వచ్చే చేతులు సమాజంలో చాలానే ఉన్నాయి’’ అన్నారు గీతామిశ్రా. మంచి డాక్టర్లు దొరికారు హోమ్‌లోని పిల్లలకు విద్యతో పాటు వైద్యానికి కూడా తనకు దేవుడు మంచి దారిని చూపించాడు అన్నారు గీత. ‘‘డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ బోలే ఇద్దరూ పిల్లలకు ఏ సమయంలో అవసరం వచ్చినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అనాథ బిడ్డల బాధ్యత తీసుకోవడం అంటే... వాళ్లకు ఉండడానికి నీడనిచ్చి, కట్టుకోవడానికి దుస్తులిచ్చి, వేళకింత అన్నం పెట్టడం మాత్రమే కాదు. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి మంచి జీవితంలో స్థిరపడడానికి ఒక దారిని కూడా వేయాలి. పిల్లల చదువే నా మొదటి ప్రాధాన్యత. మొదట్లో మా హోమ్‌కు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాను. అక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఉంది కదా అనుకున్నాను. అయితే ఆ స్కూల్లో పిల్లలకు చదువు మీద ఇష్టం కలగలేదు. దాంతో నల్లకుంటలోని ‘వామాక్షి విద్యానికేతన్ హైస్కూల్’లో చేర్చాను. ఆ స్కూల్ ప్రిన్సిపల్ పద్మ ఫీజు రాయితీ ఇచ్చారు. రాయితీ పోగా కట్టాల్సిన ఫీజును కూడా సిటీలో ఉన్న మా మార్వాడీ కమ్యూనిటీలో రామకృష్ణ, రమ, శకుంతల వంటి వాళ్లు ఏడాది మొత్తానికి ఒకేసారి కట్టేస్తున్నారు. నందకిశోర్ వ్యాస్ వంటి ఎందరో సహాయం చేస్తున్నారు. ఈ పిల్లలను నా దగ్గరకు చేర్చిన భగవంతుడే జరగాల్సిన వాటికి కూడా దారి చూపిస్తున్నాడు’’ అన్నారామె సంతోషంగా. ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంది ‘‘మా పిల్లలు ఊరికే స్కూలుకుపోవడం కాదండీ, ఇదిగో... ఈ నికిత స్కూల్ టాపర్, కలెక్టర్ కావాలని తన కోరిక. అమ్ములు, జీవన, శిరీష, పూజ తమ క్లాస్‌లకు లీడర్లు. ఈ చిన్నారులకు భవిష్యత్తు మీద ఎంత పెద్ద ఆలోచనలున్నాయో అని చెబుతూ.. ‘‘మోనికా నువ్వేమవుతావు’’ అని అడిగారు గీతామిశ్రా. వెంటనే మోనిక ‘డాక్టర్’ అని, నూతన ‘హార్స్ రైడర్’ అని, హేమలత ‘పోలీస్’, మరో నికిత ‘టీచర్’’, జీవన ‘కలెక్టర్’ అని చెప్పారు. శిరీష ఎయిర్‌హోస్టెస్ అవుతానని చెప్పింది, అంకిత మాత్రం ‘నేను హీరోయిన్నవుతా’ అని సిగ్గుపడిపోయింది. ఇంతలో ఓ పాపాయి ‘‘మేము ఫ్లయిట్ ఎక్కుతాం’’ అన్నది. ‘‘ట్రూజెట్ వాళ్లు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ప్రోగ్రామ్‌లో పేద పిల్లలకు ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తున్నారు. ఈ సారి ఆ ట్రిప్‌లో మా హోమ్ పిల్లలను కూడా తీసుకెళ్లనున్నారు’’ అని చెప్పారు గీతామిశ్రా. – వాకా మంజులారెడ్డి ఎలాగైనా ప్రభాస్‌ని చూపించాలి ‘‘స్వర్ణజయంతి షహరి రోజ్‌గార్ యోజన’లో భాగంగా అల్పాదాయ వర్గాల నివాస ప్రదేశాల్లోని మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, బ్యూటీషియన్ కోర్సుల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాను. రేషన్‌కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ల వంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో జరగాల్సిన పనులు చేయించడంలో సహాయంగా ఉండేదాన్ని. కాలనీ వాళ్లు తల్లిదండ్రులు లేక నిరాదరణకు గురవుతున్న పిల్లలను చూపించి వాళ్లకు ఏదో ఒక దారి చూపించమని అడిగేవాళ్లు. అలా ఒక్కొక్కొళ్లనీ మా ఇంటికి తెచ్చుకున్నాను. ఇంతమంది పిల్లలకు తల్లినయ్యాను. మా పిల్లలు సినీ యాక్టర్ ప్రభాస్‌ను చూపించమని మారాం చేస్తున్నారిప్పుడు. ఎలాగైనా సరే వాళ్ల ముచ్చట తీర్చాలి. -
పండుటాకులకు అండగా...
పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ముద్దుగా పెంచుకుంటారు తలిదండ్రులు. ఆ పిల్లలే పెద్దయి అమ్మానాన్నలను పనికిమాలిన వస్తువులుగా భావిస్తూ ఇంటి బయట పారేయడానికి సిద్ధపడుతున్నారు. అమ్మానాన్నా అంటే ఆస్తులు సంపాదించి ఇచ్చే యంత్రాలుగానే భావిస్తున్నారు. తమ కలల్ని, ఆస్తులను పిల్లలకు పంచి ఇచ్చిన తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో అయినవారి అండ లేకుండా అనాథలుగా మారుతున్నారు. కమలమ్మ భర్త చనిపోతే తానే అన్నీ అయ్యి కొడుకును పెంచి పెద్ద చేసింది. కొడుకు కూడా బాగా చదువుకున్నాడు. పెళ్లి చేసింది. కోడలు కూడా బాగా చదువుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. డెభ్బై ఏళ్ల వయసులో కమలమ్మకు క్యాన్సర్ వచ్చింది. ‘ఏడాదికన్నా బతకద’ని డాక్టర్ చెప్పారు. ఆ రోజు నుంచి మొదలు ఇంట్లో ‘మీ అమ్మను ఎక్కడైనా హోమ్‌లో పెట్టండి. పిల్లలకూ ఈ జబ్బు వస్తుంది..’ అని కోడలు రోజూ కొడుకుతో చెప్పే మాటలు వింటూనే ఉంది కమలమ్మ. వృద్ధాశ్రమంలో పెట్టను అన్నాడు కొడుకు. గొడవలు ముదిరి కోడలు వేధింపుల కేసు పెట్టేంత వరకు వెళ్లింది. అందులో అత్తగారి మీద కూడా కేసు పెట్టింది. చివరి దశలో ఉన్న కమలమ్మ మానసిక వ్యథ అంతా ఇంతా కాదు. మరో ఆరు నెలలు బతికేది రెండు నెలలకే కన్ను మూసింది. అన్నపూర్ణ, పరంధామయ్యల కొడుకు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డాడు. వాళ్లిద్దరూ హైదరాబాద్‌లో ఉంటారు. ఓ రోజు కొడుకు వచ్చి ‘నాతో పాటు వచ్చేయండి అన్నాడు. ‘సరే’ అన్నారు తల్లిదండ్రి. మీరు అమెరికా వచ్చేశాక ఇక్కడ ఆస్తులు ఎందుకు?’ అన్నాడు. ఆస్తులన్నీ అమ్మించేసి క్యాష్ అయ్యాక అమెరికా బయల్దేరారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక తల్లిదండ్రులని బయట కూచోబెట్టి వివరాలేవో కనుక్కొని వస్తానని చెప్పి లోపలికెళ్లాడు. వాళ్లిద్దరూ ఎదురు చూసి చూసీ తమ కొడుక్కి ఏదో జరగరానిది జరిగిందని ఏడుస్తూ కూచున్నారు. కొడుకు వివరాలు చెప్పి అక్కడి సిబ్బందిని కనుక్కొంటే అతను ఎప్పుడో అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడని తెలిసి షాకయ్యారు. వసుధ వయసు 80 ఏళ్లు. ముగ్గురు కొడుకులు. కూతురు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్లే. భర్త ఉన్నప్పుడు పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చాడు. భర్త చనిపోయాక వసుధ పిల్లల ఇంట్లో నెల రోజుల చొప్పున ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఓ రోజు హాస్పిటల్లో చెకప్ కోసమని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర వదిలేసిపోయారు. వసుధ తన పిల్లల పేర్లు, వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. లక్ష్మీబాయమ్మకు నెలనెలా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చే ముందు రెండు రోజులు తల్లితో బాగానే ఉంటాడు కొడుకు. పెన్షన్ తీసుకోవడానికి ఆఫీస్ వరకు బండిమీద తీసుకొని వెళతాడు. తల్లి పెన్షన్ తీసి కొడుకు చేతికి ఇవ్వగానే అవి జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్లిపో .. అని అక్కడే వదిలేసాడు. మళ్ళీ పెన్షన్ వచ్చే రెండు రోజుల మందు వరకు లక్ష్మీబాయమ్మ అర్ధాకలితో కాలం గడపాల్సిందే. పిల్లలదే బాధ్యత ఇలా పిల్లల చేత నిరాదరణకు గురైన పెద్దల సంఖ్య దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతోంది. కన్నపిల్లలే కాదన్నాక ఇంకెవరిని నమ్ముతాం అనే నైరాశ్యంలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ‘చాలా మంది తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచడమే అంటుంటారు. కానీ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉందనే విషయాల గురించి ఆలోచించరు’ అంటారు పి.శ్యామ్‌కుమార్. హెల్పేజ్ ఇండియా అడ్వొకసీ ఆఫీసర్ అయిన శ్యామ్ కుమార్ వయోవృద్ధులకు ఉన్న హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందం’టారు. ‘వృద్ధుల మీద 498ఎ కేసులూ నమోదవుతున్నాయి. కోడళ్లు పెట్టే గృహ హింస కేసులను ఇంట్లో పెద్దలు వారు చనిపోయే దశ వరకు ఎదుర్కోవలసి వస్తుంది’ అంటూ ఆవేదన చెందారు రాజేశ్వరి. తోడునీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమె. ‘పిల్లలు తల్లిదండ్రులకు ఉండటానికి వసతి, తిండి, బట్ట.. వంటివి తప్పక ఇవ్వాలి. పిల్లలు ఏ ఆదాయాన్ని కలిగి ఉన్నా సెక్షన్ 23 ప్రకారం దాదాపు 10 వేల రూపాయల వరకు తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఇవ్వాలి. పిల్లలు వారిపై నిర్లక్ష్యాన్ని చూపితే అది మోసం, బలవంతంగా ఆస్తులు లాక్కోవడం వంటి నేరాల కిందకే వస్తుంది.సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు–కూతుళ్లు, కోడళ్లు–అల్లుళ్లు, బంధువులది కూడా’ అని వివరించారు. తిరిగి ఆస్తిని పొందవచ్చు ‘తల్లిదండ్రులు తమకోసం ఏమీ ఉంచుకోకుండా ప్రేమతో పిల్లలకు ఆస్తి అంతా రాసిస్తారు. చివరకు ఆ పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోరు. ఇలాంటప్పుడు నేరుగా కోర్టుకు అప్పీల్ చేసుకొని తమ ఆస్తులను తిరిగి పొందవచ్చు. వయోవృద్ధులకు సంబంధించిన కార్యాలయం, రెవిన్యూ డివిజన్ ఆఫీస్‌కు నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మంచానికే పరిమితమైన వారి తరపున ఎవరైనా అప్పీల్ చేయవచ్చు. ►సెక్షన్ 11 కింద డిడబ్ల్యూవో జిల్లా స్థాయిలో మెయింటెన్స్ ఆఫీసర్ జడ్జిమెంట్‌ను ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే వారి సంరక్షణ ఏవిధంగా ఉందనే విషయం ప్రతీ నెలా, మూడు నెలలకు ఓసారి ఆ ఆఫీసర్ పర్యవేక్షిస్తుంటారు. ►అయినప్పటికీ పిల్లలను సరిగా పట్టించుకోకపోయినా, వృద్థులను ఎవరైనా వేధించినా సెక్షన్ 24 ప్రకారం క్రమినల్ చర్యలు తీసుకుంటారు.. మూడు నెలల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధించే అవకాశాల ఉంటాయి. రక్షణగా ఉండాలి యువతరంలో స్వార్థం బాగా పెరిగింది. నేను– నా ఇల్లు –నా పిల్లలు ఇదే నా కుటుంబం అనుకుంటున్నారు. తల్లిదండ్రుల విషయానికి వస్తే భారంగా ఫీలవుతారు. చిన్న కుటుంబాలు పెరిగాక శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వృద్ధుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని పిల్లలు భావిస్తున్నారు. ఇది తప్పు అని తెలియజేయాల్సిన అవసరం సమాజానికి, ప్రభుత్వానికి ఉంది. నిరాదరణకు గురవుతున్న పెద్దలు కోర్టుకు అప్పీలు చేసుకుంటే 90 రోజుల్లోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృద్ధుల ఆరోగ్య రక్షణలో భాగంగానూ ప్రతీ ఏరియా హాస్పిటల్స్‌లో విడిగా జీరియాట్రిక్ వార్డు ఉండాలి. ఓపీల దగ్గర, మెడిసిన్స్ దగ్గర విడిగా క్యూ లైన్ ఉండాలి. ఉమ్మడి కుటుంబంతో కాకుండా పెద్దలకు విడిగా హెల్త్ కార్డు ఉండాలి. పెద్దలు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొన్నట్టు గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని మాకు తెలియజేయవచ్చు. రాజేశ్వరి, తోడునీడ స్వచ్ఛంద సంస్థ, స్టేట్ కౌన్సెల్ మెంబర్ ఫర్ సీనియర్ సిటిజిన్స్, తెలంగాణ సమస్యల పరిష్కారానికి.. వృద్ధులు నిరాదరణకు గురైతే వారి పోషణ ఖర్చును పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద పొందవచ్చు. ఇందుకోసం ఒక శాఖ పనిచేస్తోంది. వయోవృద్ధుల సంరక్షణ కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, నేరుగా బాధిత వృద్ధులను కలుసుకొని సమస్యలను పరిష్కరించడం దిశగా ఈ కమిటీæ పనిచేస్తుంది. బాధిత వృద్ధులు ఎవ్వరైనా, వారి తరపు వారైనా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా టోల్‌ఫ్రీ నెం: 18001801253 కు ఫోన్ చేయచ్చు. గూగుల్‌లో ఏ్ఛ p్చజ్ఛ ౖ యాప్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. పి.శ్యామ్‌కుమార్. టిఎస్ అండ్ ఎపి హెల్పేజ్ ఇండియా అడ్వొకసీ ఆఫీసర్ -
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల భవిష్యత్
విజయనగరం లీగల్: పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదేనని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మీనారాయణ హితవు పలికారు. స్థానిక న్యాయసేవాసదన్‌లో బాలల హక్కులు, బాల నేరస్తులతో పోలీసులు ప్రవర్తించాల్సిన తీరుపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. పరిసర ప్రాంతాలు, సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ కారణంగానే కొంతమంది బాలలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారన్నారు. వీరిపై కేసులు నమోదు అయినప్పుడు పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు. వారిని శిక్షించడం కన్నా వారిలో మార్పు తీసుకురావడం కోసమే కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పక్కాగా చట్టాల అమలు ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బాలల హక్కుల సంరక్షణకు చట్టాలు రూపొందించాయని, వాటిని పక్కాగా అమలు చేయడానికి జువైనల్ అధికారులు, పోలీస్ అధికారులు బాల న్యాయాధికారులు, శిశు సంరక్షణ అధికారులు కృషి చేయాలని కోరారు. సమాజంలో పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. బాల నేరస్తుల కేసులు విచారణ చేసేటప్పుడు పోలీసు అధికారులు యూనిఫాం ధరించకూడదన్నారు. బాలల విషయంలో మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. వీరి ఫొటోలు, పేర్లు ప్రచురించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. దీనిపై కూడా మీడియా ప్రతినిధులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అధికారి, జువైనల్ వెల్ఫేర్ ఎం. శరత్ బాబు బాలల న్యాయ రక్షణ సంరక్షణ చట్టం, 2015 అమలు, అధికారులు నిర్వహించాల్సిన విధులు, బాల న్యాయ చట్టాల రూల్స్‌పై అవగాహన కల్పించారు. అలాగే పిల్లల మనస్తత్వం, కౌన్సెలింగ్‌పై సైకాలిజిస్ట్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, బాల నేరాలపై సెంట్రల్ క్రైం స్టేషన్ డీఎస్పీ ఎస్.చక్రవరి, బాలల న్యాయ హక్కులు జాతీయ విధానంపై లీగల్ సర్వీసెస్ మెంబర్ బి.ఎల్.నరసింగరావు, బాల నేరాల కేసులు, పరిష్కారంపై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.ఆశారాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి, అదనపు జడ్జి బి.శ్రీనివాసరావు, స్పెషల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ చట్టం, అదనపు జడ్జి వి.వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.సురేష్, జిల్లాలోని 42మంది ఎస్ఐలు, చిన్న పిల్లల సంరక్షణ సంక్షేమాధికారులు, జువైనల్ అధికారులు, జిల్లా ప్రొహిబిషన్ అధికారులు, పోలీస్ అధికారులు, పిల్లల సంరక్షణ ఎన్జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పిల్లల కోసం పీర్లెస్ అసెట్ ఫండ్
మూడు రకాల ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ రిస్క్ తగ్గించే అసెట్ అలకేషన్ ఫండ్‌ను పీర్లెస్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా గోల్డ్ ఈటీఎఫ్, డెట్ పథకాలు, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా చైల్డ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తంలో 20% బంగారంలో, 20% ఈక్విటీల్లో, మిగిలిన 60% రుణ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ విభాగంలోకి వచ్చే ఓపెన్ ఎండెడ్ పథకం. దీంతో ఈ పథకంలో ఎప్పుడైనా చేరడానికి, ఎప్పుడైనా వైదొలగడానికి అవకాశం ఉంది. -
పిల్లలకు చెలగాటం బాల్యానికి ప్రాణసంకటం
పిల్లలు గొడవ చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఏదో కార్టూన్ చానల్ ముందు పెడితే సరి! కొందరు పేరెంట్స్ ఇలా చేస్తున్నారు. పిల్లలు మన కాళ్లకు అడ్డంపడుతుంటే ఏమి చేయాలి? సెల్ఫోన్లో వీడియో గేమ్ ఇస్తే పోలా! ఇది మరికొందరు పేరెంట్స్ చేస్తున్నది. ప్రపంచం పరిగెడుతోంది. దాని వెంట మనం పరిగెడుతున్నాము. పిల్లల భవిష్యత్ కోసమే తెగ పరిగెడుతున్నాము. కానీ వాళ్ల చిన్నిచిన్ని మనసుల్లో ఎలాంటి ఆలోచనలు పరిగెడుతున్నాయో తెలుసుకోకపోతే... టామ్.. పెంపుడు పిల్లి. జెర్రీ.. చిట్టెలుక. టామ్ వట్టి ఉడుకుమోతు. జెర్రీ ఆటపట్టించే రకం. ఈ రెండిటి మధ్య జరిగే బీభత్స, భయానక, హింసాత్మక పోరాట దృశ్యాలే... టామ్ అండ్ జెర్రీ. అయితే ఇక్కడ భయం... పెద్దదైన పిల్లిది! బీభత్సం... చిట్టిదైన ఎలుకది!! వీటి మధ్య జరిగే హింస ‘స్లాప్స్టిక్ కామెడీ’. బ్రహ్మానందాన్ని రవితేజ ఫటా ఫటా ఫటా ఫటా కొడుతుంటే కడుపు ముక్కలు చెక్కలు చేసుకునే పెద్దవాళ్ల లాంటి పిల్లల కామెడీ షో ఈ టామ్ అండ్ జెర్రీ. కొట్టడమే కామెడి. కొట్టడంలో ఎంత హింస ఉంటే అంత కామెడీ. ట్రాజెడీ ఏమిటంటే మన పిల్లలకు ఇందులోని హింస విపరీతంగా నచ్చుతోంది. బిట్టు బిట్టు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకనేమిటి? పెద్దలకు కూడా. పాలస్తీనా స్వాతంత్య్ర సమర యోధుడు పైగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన యాసర్ అరాఫత్ ‘‘పిల్లి కాకుండా, ఎంతో చిన్నదైన చిట్టెలుక ఎప్పుడూ గెలుస్తూ ఉండడం నాకు నచ్చుతుంది’’ అనేవారట. చిన్నప్పుడు బడిలో, ఇంటి పక్కన, మనల్ని వేధించే, ఆటపట్టించే పెద్ద పిల్లలను దబదబా బాదేసి, తలను నేలకేసి కొట్టేసేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. నిజ జీవితంలో అలాంటివి సాధ్యం కాదు కాబట్టే టామ్ అండ్ జెర్రీ పిల్లలకు, పెద్దలకు నచ్చుతోంది. పిల్లలపై ప్రభావం పెద్దలకు నచ్చితే చూసి అక్కడితో వదిలేస్తారు. పిల్లలు అనుకరించే ప్రయత్నం చేస్తారు. హింసలో ప్రేరేపించే గుణం ఉంటుంది. పిల్లల్లో త్వరగా ప్రేరణకు గురయ్యే బలహీనత ఉంటుంది. అందుకే టామ్ అండ్ జెర్రీ, పాపోయ్, 3 స్టూజెస్, సూపర్‌మేన్, లూనీ ట్యూన్స్, స్కూబీ డూ, బఫీ ది వాంపైర్ స్లేయర్, అమెరికన్డాల్ వంటి కార్టూన్ షోలు ఇంతగా పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే - ‘‘ఆకట్టుకోవడం వరకు మంచిదేకానీ, వాటిల్లోని క్యారెక్టర్లు రోజంతా పిల్లల్ని అలా కట్టి పడేసి ఉంచుతున్నాయి. వారిలో దుడుకు స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి’’ అని ఐయోవా స్టేట్ యూనివర్శిటీ తాజా అధ్యయనంలో వెల్లడయింది! ఆ అధ్యయన ఫలితాలు ఎంతో ఆసక్తికరంగా, అదే సమయంలో తల్లిదండ్రులకు, టీచర్లకు, సమాజానికి ఆందోళన కలిగించేగా ఉన్నాయి. హింసను తగ్గిస్తే కామెడీ తగ్గిపోదా? కంటి చూపుతో చంపేస్తా అంటుంది టామ్. కనుబొమతో లేపేస్తా అంటుంది జెర్రీ. ఎంత కామెడీ! ఈ చంపేయడం, లేపేయడంతోనే కదా ‘టామ్ అండ్ జెర్రీ’ సూపర్ హిట్ అయింది. అందుకే ఇలాంటి అత్యంత ప్రజాదరణ పొందిన కామిక్ సీరియళ్ల వరకైనా హింస ఉండాల్సిందేనని కామిక్ ప్రియులు అంటున్నారు. పైగా టామ్ అండ్ జెర్రీలోని హింసను హింస అనకూడదని వాదిస్తున్నారు. ఇంతకీ టామ్ అండ్ జెర్రీ వయలెంటేనా? ఎంత సెలైంట్‌గా ఉంటే మర్డర్ అంత వయొలెంట్‌గా ఉంటుందని ఓ తెలుగు సినిమాలో విలన్ డైలాగ్. టామ్ అండ్ జెర్రీలో మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. అవి కూడా ఎంతో కామిక్‌గా. ఇక ఈ సీరీస్ ప్రేరేపించే హింస గురించి మాట్లాడవలసి వస్తే, అసలలాంటే ప్రేరేపణలే కలగవనీ; కల్పనకు, వాస్తవానికి మధ్య తేడాను పిల్లలు ఇట్టే పసిగట్టగలరని టామ్ అండ్ జెర్రీ ప్రొడ్యూసర్లు ఏనాటి నుంచో చెబుతున్న మాట. నాలుగైదేళ్ల వయసుకే పిల్లల్లో వాస్తవాలను గ్రహించే శక్తి వస్తుంది. టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటాయో తెలుసు. అవి ఊహాత్మకమైన క్యారెక్టర్లు అని, బయట అలా ఉండదని వారికి పనిగట్టుకుని చెప్పే పనిలేదు. ఆ దృశ్యాలను చూసి పిల్లలు మరీ ఎక్సయిట్ అయినప్పుడు, పక్కనే ఉన్న పెద్దవాళ్లు అది నిజం కాదని చెప్పొచ్చు అంటారు కొందరు. అది మానేసి టీవీ కట్టేయడం, పిల్లల్ని టీవీ ముందు నుంచి తరిమేయడం పిల్లల్ని హింస నుంచి కాపాడ్డం కోసం పిల్లలపై హింసను ప్రయోగించడం అని కూడా అంటున్నారు. మంచి విషయాలే లేవా? కామెడీ కన్నా మంచి ఏముంటుంది? కామెడీని మించిన ఆరోగ్యం ఏముంటుంది. టామ్ అండ్ జెర్రీ వట్టి అర్థంలేని కొట్లాటల కామెడీ షో కాదు. అందులో విలువలూ ఉన్నాయి. ఆ విలువల గురించి పెద్దలే పిల్లలకు వివరంగా చెప్పాలి. టామ్‌ని అస్తమానం గాభరా పెడుతుండే జెర్రీ ఎన్నిసార్లు టామ్‌ని కష్టాల నుంచి గట్టెక్కించలేదు? టామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా వె తికి పెట్టింది కదా జెర్రీ! ఎక్కడి నుంచో వచ్చిన అపరిచిత పిల్లులు టామ్‌ని ఏడిపిస్తుంటే, జెర్రీనే కదా వెళ్లి టామ్‌కి సహాయంగా నిలిచింది. ఎలా మర్చిపోతాం? పిల్లల్ని ఎలా మర్చిపోనిస్తాం. జీవితంలోని ఒత్తిళ్లను, అలసటను కామిక్ షోలు పోగొడతాయి. మనల్ని నవ్వించడం కోసం వాటిల్లోని పాత్రలు అష్టకష్టాలు పడతాయి. కనుక పిల్లలను గమనించుకుంటూ వారి ధోరణులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్లడమే దారి, అన్నది మరోవాదన. ఐయోవా అధ్యయనం 10 -11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల మీద కార్టూన్ సీరియళ్ల ప్రభావం ఎలా ఉంటుందనడానికి ఐయోవా యూనివర్సిటీ చేసిన అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి... ⇒ కార్టూన్ సీరియళ్లు చూసి పిల్లలు తెంపిరితనాన్ని అలవ రచుకుంటున్నారు. ⇒ గాసిప్స్ చెప్పుకోవడం, వదంతుల్ని వ్యాపించడం, ఎక్స్ప్రెషన్లో అవసరానికి మించి కళ్లు తిప్పడం వంటివి చేస్తున్నారు. ⇒ కార్టూన్ షోలలోని హింస, దుడుకు ధోరణులు ప్రత్యక్షంగానో, ప్రరోక్షంగానో చిన్నారుల ప్రవర్తనలపై నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి. ⇒ పరుగులు తీసే కామెక్ షోలలో గంటకు కనీసం 26 హింసాత్మక దృశ్యాలు ఉంటున్నాయి. అదే పెద్దవాళ్ల సీరియళ్లలో అయితే ఈ దృశ్యాలు ఐదారు మాత్రమే ఉంటాయి. ⇒ టీవీ పరిశ్రమ కార్టూన్ షోలలోని హింసను రెండుగా విభజించి చూస్తోంది. ఒకటి యానిమేటెడ్ వయలెన్స్. ఇంకోటి నాన్ యానిమేటెడ్ వయొలెన్స్. టామ్ అండ్ జెర్రీ లాంటి యానిమేటెడ్ హింస వల్ల నష్టమేమీ లేదని అంటోంది. అది నిజం కాదు. హింస బొమ్మల రూపంలో ఉన్నా, మనుషుల రూపంలో ఉన్నా హింసే. ⇒ కార్టూన్ సిరీస్‌లలోని భాషను, ప్రవర్తనలను పిల్లలు తమ స్కూళ్లలో, ఇంటి పక్కల అనుకరిస్తున్నారు. చిన్న పిల్లలను ఏడిపిస్తున్నారు. ⇒ బాలికలు కూడా అబ్బాయిల్లా రఫ్‌గా, ఇండీసెంట్‌గా తయారవుతున్నారు. ⇒ కామెడీ షో చూస్తున్నప్పుడు పేరెంట్స్ ఛానల్ మార్చమంటేనో, టీవీ కట్టేయమంటేనో పిల్లలకు విపరీతమైన కోపం వస్తోంది. ఆ కోపాన్ని... ఇంటోని వస్తువులను విసిరేయడం, తల్లిదండ్రుల మీద పడి కొట్టడం, వారిని దుర్భాషలాడడం వంటి చర్యలతో పిల్లలు ప్రదర్శిస్తున్నారు. ఇదంతా కూడా కార్టూన్ షోలలోని హింసాత్మక దృశ్యాల ప్రభావమే. ⇒ స్కూల్లో గ్రూపులు కడుతున్నారు. వర్గ విభేదాలకు, తగాదాలకు, ఇతర అసాంఘిక వైఖరులకు ఈ గ్రూపులు కారణం అవుతున్నాయి. అనుకరణ ప్రమాదం పిల్లలు ఏ విషయాలనైనా పెద్దల నుంచి సమాజం నుంచి ‘గమనింపు’ (అబ్జర్వేషన్)తో నేర్చుకుంటారు. మనల్ని, సమాజాన్ని అనుకరిస్తారు. దీన్ని ‘లెర్నింగ్ ఫినామినా’ అంటారు. ఈ ప్రక్రియలో సమాజంలో ఒక భాగమైన టీవీ మాస్మీడియాను పిల్లలు అనుకరించే ప్రమాదం ఉంది. మనకు కోపం ఉన్నవారినీ, మనకు ఇష్టం లేనివారిపై అలా కసి తీర్చుకోవచ్చనే అభిప్రాయం పిల్లల్లో నెలకొనే అవకాశం ఉంది. ఇలా హింసకు పాల్పడితే సమాజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. అప్పుడే పిల్లలు వినోదానికీ, హింసకూ మధ్య ఉన్న ఆ విభజన రేఖను తెలుసుకోగలుగుతారు. - డాక్టర్ శేఖర్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
బెట్టింగ్ భూతం
పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ గ్రామాలకూ పాకిన జాడ్యం.. ఆన్‌లైన్‌లోనూ జోరుగా జూదం విజయవాడ సమీపంలోని ఓ చిన్న పట్టణంలో ఏడో తరగతి విద్యార్థి ఇంట్లోంచి రూ.వెయ్యి చెప్పకుండా తీసుకెళ్లాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలుస్తుందని పందెం కాశాడు. తల్లిదండ్రుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.హైదరాబాద్ దగ్గరలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగేళ్ల క్రితం 70 మంది ఫైనలియర్ విద్యార్థులు ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో రూ. 23 లక్షలు పందెం కాసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికీ నాటి అప్పులు తీర్చుకుంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఐపీఎల్ మ్యాచ్ మీద రూ. 2 లక్షలు పందెం కాసి ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఘటనలు. ప్రస్తుతం దేశంలో క్రికెట్ బెట్టింగ్ పరాకాష్టకు చేరింది. దీనికి తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం కాదు. దాదాపు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సరదాగా పందేలు కాసుకునేవాళ్లు కొందరైతే.. 99 శాతం మంది పిల్లలు డబ్బు మీద ఆశతో పందేలు కాస్తున్నారు. ఈ పందేలు ఎలా జరుగుతున్నాయి..? దీనివల్ల జరుగుతున్న నష్టం ఏమిటి? పిల్లల్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల గురించి పందేలు జరగని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్... ఏటికేడు పెరుగుతూ ఇప్పుడు గ్రామాలకూ పాకింది. స్కూల్ పిల్లలు కూడా పందేలు కాసే స్థాయికి బెట్టింగ్ పెరిగింది. ఈ పందేలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. గ్రామాల్లో సరదాగా... గ్రామాల్లో కుర్రాళ్లు సరదాగా పందేలు వేసుకుంటారు. రూ. 500 నుంచి రూ. 5 వేల దాకా ఈ పందేలు ఉంటాయి. ఇందులో గెలిచినా, ఓడినా ఆ డబ్బు ఆ ఊళ్లోనే ఉంటుంది. ఇలా చిన్న చిన్న పందేలు కాస్తూనే గతేడాది ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఓ 36 ఏళ్ల వ్యక్తి ఇంట్లో బంగారం అమ్ముకునే దుస్థితికి చేరు కున్నాడు. బుకీల వ్యవస్థ... బెట్టింగ్‌లో ముఖ్యమైనవి బుకీల ద్వారా జరిగేవి. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వందల సంఖ్యలో క్రికెట్ పందేలు నిర్వహించే వ్యక్తులు ఉన్నారు. ముంబై, ఢిల్లీలలో ఉండే బుకీలతో స్థానిక నిర్వాహకులకు సంబంధాలు ఉంటాయి. వీళ్ల దగ్గర కంప్యూటర్లు, ఫోన్లు, బెట్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటాయి. వీళ్లు మ్యాచ్‌ల బెట్టింగ్‌లతోపాటు బంతికి, బంతికి బెట్టింగ్‌లు కూడా తీసుకుంటారు. బెట్టింగ్ జరిగే తీరు అవగాహన ఉన్న వాళ్లు, చాలా మంది విద్యార్థులు ఎక్కువగా వీళ్ల దగ్గరే పందేలు కాస్తుంటారు. ముందుగా వీళ్ల దగ్గర కొంత డబ్బు డిపాజిట్ చేస్తే అది పూర్తయ్యే వరకు పందేలు కాసుకోవచ్చు. దీనికి ఏజెంట్లూ ఉన్నారు. పందేలు కాసేవాళ్లను పరిచయం చేస్తే వాళ్లు బెట్టింగ్‌లపై కమీషన్ ఇస్తారు. రూ. లక్ష పందేలు కాస్తే రూ. 5 వేల వరకు కమీషన్ ఉంటుంది. ప్రతి టోర్నీకీ బెట్టింగ్ ఒక్క భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లే కాదు. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ జరిగినా మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌లు తీసుకుంటారు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కౌంటీ క్రికెట్, బిగ్‌బాష్... ఇలా అన్ని టోర్నీల మీదా పందేలు మన దగ్గర జరుగుతున్నాయి. అయితే ఈ పందేలు నిర్వహించేవాళ్లు కేవలం టీవీలో వచ్చే మ్యాచ్‌ల పందేలే తీసుకుంటారు. చాలా చోట్ల పందేల నిర్వాహకులు రాజకీయ నాయకుల అండతోనే కార్యక లాపాలు సాగిస్తుంటారు. తల్లిదండ్రులూ జాగ్రత్త... ఐపీఎల్ వచ్చాక ఎక్కువగా బెట్టింగ్ ద్వారా నాశనమైంది విద్యార్థులు. రెండు రాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ కనీసం కాలేజికి ఒక్కరైనా ఈ పందేలు కాసేవాళ్లు ఉన్నారు. ఐపీఎల్ సమయంలో మీ అబ్బాయి టీవీకి అతుక్కుపోయి కంగారు పడుతూ మ్యాచ్ చూస్తున్నాడంటే కచ్చితంగా అనుమానించాలి. మధ్యమధ్యలో బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడి వస్తుంటే ఏం చేస్తున్నాడని అడగండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే తమ పిల్లలు బెట్టింగ్ భూతం బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చట్టబద్ధం చేస్తే? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చట్టం ఏం చెబుతున్నా, పోలీసులు ఎన్ని దాడులు చేసినా బెట్టింగ్‌ను ఆపడం కష్టం. ఆపలేనప్పుడు చట్టబద్ధం చేయడం ఓ మార్గం. ఇంగ్లండ్ లాంటి దేశాల్లో క్రికెట్ మైదానంలోనే బెట్టింగ్ షాప్‌లు ఉంటాయి. దీనిని లీగలైజ్ చేసి పన్ను విధిం చడం ద్వారా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుంది. కానీ బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే క్రైమ్‌రేట్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. జోరుగా ఆన్లైన్లో .. ఇటీవల కాలంలో దేశంలో బెట్టింగ్ పెరగడానికి కారణం ఆన్లైన్ బెట్టింగ్. మన దేశంలో ఇది చట్టవ్యతిరేకం. గతంలో విదేశాల్లోని బంధువులు, స్నేహితుల క్రెడిట్ కార్డుల ద్వారా పందేలు కాసే వ్యక్తులు ప్రస్తుతం బెట్టింగ్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ సాగిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న 30 ఏళ్ల లోపు ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది ఈ బెట్టింగ్ చేస్తున్నట్లు అంచనా. ఇందులో మహిళలు కూడా ఉండటం గమనార్హం. బాగుపడినోళ్లు తక్కువ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కారణం దీనికి సంబంధించిన రేట్లు. ఉదాహరణకు ముంబై, హైదరాబాద్ జరుగుతుందని అనుకుందాం. ముంబై ఫేవరేట్ జట్టు అయితే ఆ జట్టుపై రూ. 1,000 కాస్తే రూ. 700 వస్తుందని అనుకుందాం. అదే సమయంలో హైదరాబాద్‌పై రూ. 800 కాస్తే ఆ జట్టు గెలిస్తే రూ. 1,000 వస్తుంది. ఒక వ్యక్తి ముంబై గెలుస్తుందని రూ. 10 వేలు కాశాడని అనుకుందాం. ఆ జట్టు ఓడిపోయే పరిస్థితికి వస్తే పందెం మార్చుకోవచ్చు. అయితే అప్పుడు రేటు దారుణంగా ఉంటుంది. హైదరాబాద్‌పై రూ. 10 వేలు కాస్తే రూ. 2,000 వస్తుంది. అంటే ముంబైపై పెట్టిన రూ. 10 వేలు లోటు పూడ్చుకోవాలంటే హైదరాబాద్‌పై రూ. లక్ష కాయాలి. కొంతమంది ఈ రిస్క్‌లు చేస్తారు. అలాంటి రిస్క్ చేసిన సమయంలో పొరపాటున మళ్లీ ముంబై గెలిస్తే... ఏకంగా రూ. 90 వేలు పోతాయి. చాలా సందర్భాల్లో పందేలు కాశాక తిరిగి మార్చుకునే అవకాశం లేకుండా రేట్లు మారిపోతాయి. కాబట్టి పందేలు కాసేవాళ్లు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఐపీఎల్ సీజన్లో 50 మ్యాచ్‌ల మీదా బెట్టింగ్ కాస్తే.... నష్టం లేకుండా బయటపడాలంటే కనీసం 30 మ్యాచ్‌లు గెలవాలి. ఎంత క్రికెట్ పండితుడికైనా ఇది కష్టం. భారీగా టర్నోవర్ ... ఒక్కో మ్యాచ్‌పై టర్నోవర్ కూడా భారీగానే ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు పందేలు మారుస్తూ పోతారు. కొన్ని సందర్భాల్లో రూ. లక్ష టర్నోవర్ చేసి రూ. 5 వేలు లాభం లేదా నష్టంతో బయటపడతారు. ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌పై భారత్‌లోనే రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ముంబైకి చెందిన ఓ బుకీ అంచనా. అయితే చివరకు ఒక్క మ్యాచ్‌పై కనీసం రూ. 20 వేల కోట్ల వరకు చేతులు మారతాయని అంచనా. -
కేథరిన్‌తో షికారు..
ఎర్రబస్సు ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలను తను తెలుసుకుంది. బ్యాటరీ కార్లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది. ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే? * మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’ * నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’ * మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ * అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే.. ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీయ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
ఒక్కయ్యవారితో సదువెలా?
పుట్లూరు : ‘పాఠశాలలో ఏడు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. టీచర్లను నియమించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదు. ఇలాగైతే మా పిల్లల భవిష్యత్ ఏమి కావాలి’ అంటూ పుట్లూరు మండలంలోని చాలవేముల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వారు స్థానిక పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఉన్న ఒక ఉపాధ్యాయుడిని బయటకు పంపి పాఠశాలకు తాళం వేశారు. ఏడు తరగతుల్లో 84 మంది విద్యార్థులు ఉన్నారని, ఉపాధ్యాయుల కొరత వల్ల నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో వారి పిల్లలను చదివిస్తారా అంటూ నిలదీశారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో గ్రామంలో చాలామంది తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం పేద విద్యార్థులు మాత్రమే ఇక్కడ చదువుకుంటున్నారన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య పెంచకపోతే వీరు కూడా ఈ పాఠశాలకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. -
పిల్లలకు భరోసా ఉండాలిగా..
పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేకంగా పాలసీలు తీసుకోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మిగతా పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈ తరహా పథకాల్లో ఒక అదనపు ప్రయోజనం ఉంది. ఇవి పాలసీదారుకు బీమా రక్షణ కూడా కల్పిస్తాయి. ఒకవేళ పాలసీదారుకు ఏదైనా అనుకోనిది సంభవిస్తే.. పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాలకు ఢోకా లేకుండా ఆదుకుంటాయి. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు ఆషామాషీగా వ్యవహరించకుండా.. అదనపు ప్రయోజనాలు కల్పించే రైడర్ల గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఇలాంటి అయిదు రకాల రైడర్ల గురించి తెలిపేదే ఈ కథనం. వెయివర్ ఆఫ్ ప్రీమియం.. చాలా మటుకు పిల్లల బీమా పాలసీల్లో ఈ ఫీచర్ ఉంటుంది. ఒకవేళ పాలసీదారుకేదైనా ఊహించనిది జరిగి (ప్రమాదాల్లో అంగవైకల్యం వంటివి), ఆ వ్యక్తి తదుపరి ప్రీమియాలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇటు పాలసీ, అటు రైడరుకు సంబంధించి భవిష్యత్‌లో ప్రీమియాలు చెల్లించడం నుంచి మినహాయింపు లభిస్తుంది. సదరు రైడరు వ్యవధి పూర్తయ్యే దాకా ఈ మినహాయింపు ఉంటుంది. 80సి పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ప్రమాద, అంగవైకల్య ప్రయోజనాల రైడరు పేరుకు తగ్గట్లే ఇది రెండు పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ముందుగా పాలసీదారు మరణం అంశాన్ని తీసుకుందాం. పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ముందుజాగ్రత్తగా బీమా పథకం తీసుకున్న పాలసీదారు (తల్లి/తండ్రి) మరణించినా.. సదరు పాలసీ వృథా కాకుండా, ప్రయోజనాలు పిల్లలకు దక్కేలా చూసేందుకు ఈ రైడరు ఉపయోగపడుతుంది. మరణం సంభవించిన సందర్భాన్ని బట్టి కూడా పాలసీ మొత్తం చెల్లింపు ఉండేలా కొన్ని పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు, పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే.. బేసిక్ సమ్ అష్యూర్డ్‌తోపాటు నూటికి నూరు శాతం ‘రైడర్ సమ్ అష్యూర్డ్’ని కూడా ఒక కంపెనీ చెల్లిస్తోంది. అయితే ఏదైనా ప్రజా రవాణా వ్యవస్థ వాహ నంలో టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నప్పుడు మరణిస్తే.. పాలసీదారు కుటుంబానికి బేసిక్‌తో పాటు 200% రైడర్ సమ్ అష్యూర్డ్‌ని చెల్లిస్తోంది. మరోవైపు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సమ్ అష్యూర్డ్‌లో ఎంత మొత్తానికి రైడర్ తీసుకుంటే.. అంత దాకా తదుపరి ప్రీమియాలు చెల్లించడం నుంచి మినహాయింపు లభిస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్.. తీవ్రమైన వ్యాధులు, ఆరోగ్య సమస్యల చికిత్సలు భారీ ఖర్చులతో కూడుకున్నవి. ఇలాంటి ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు ఒకోసారి పిల్లల పాలసీల ప్రీమియాలు సమయానికి కట్టడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ రైడర్ పనికొస్తుంది. పక్షవాతం, గుండెపోటు, ప్రధాన అవయవాల మార్పిడి వంటి వాటికి ఇది పనిచేస్తుంది. ఈ రైడర్లో ఆప్షన్లు వివిధ రకాలుగా ఉంటాయి. పాలసీదారుకు రైడర్ సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని చెల్లించడం ఒక పద్ధతి. ఇందులో రైడరు వ్యవధి ముగిసి బేస్ పాలసీ మాత్రం కొనసాగుతుంది. మరో ఆప్షన్లో రైడర్‌తోపాటు సమ్ అష్యూర్డ్ మొత్తం కూడా బీమా కంపెనీ చెల్లించేస్తుంది. పాలసీ టెర్మినేట్ అయిపోతుంది. కానీ, ముందుగా నిర్దేశించుకున్న గడువు దాకా బేస్ పాలసీ కొనసాగించుకోవచ్చు. తదుపరి ప్రీమియాలు కడుతూ పోతే.. గడువు తీరిన తర్వాత పాలసీదారు కట్టిన ప్రీమియాలు, బోనస్‌లు అంతా కలిపి కంపెనీ ఆఖరున చెల్లిస్తుంది. ఇన్కమ్ బెనిఫిట్ రైడర్.. పాలసీదారు మరణించిన పక్షంలో సంతానం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా ఈ రైడర్ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో రైడరు సమ్ అష్యూర్డ్‌లో 10 శాతాన్ని ఏటా నిర్దిష్ట తేది నాడు లబ్దిదారుకు కంపెనీ అందిస్తుంది. రైడర్ గడువు ముగిసే దాకా ఇది కొనసాగుతుంది. టర్మ్ బెనిఫిట్.. పథకం గడువు తీరేలోగా పాలసీదారు మరణించిన పక్షంలో లబ్దిదారుకు అదనపు ప్రయోజనాలు అందించగలదీ రైడరు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్ అష్యూర్డ్‌తో పాటు అదనంగా డెత్ బెనిఫిట్ మొత్తం కూడా లభిస్తుంది. గరిష్టంగా బేసిక్ సమ్ అష్యూర్డ్‌కి సరిసమానంగా ఈ రైడరు విలువ ఉంటుంది. ప్రస్తుతం అవైవా యంగ్ స్కాలర్ అడ్వాంటేజ్, మ్యాక్స్ న్యూయార్క్ కాలేజ్ ప్లాన్, కోటక్ చైల్డ్ అడ్వాంటేజ్ ప్లాన్ వంటి పాలసీలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాస్త ఎక్కువ ప్రీమియం కడితే.. నెలవారీ ప్రయోజనాలు కల్పించేలా అవైవా పాలసీల్లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. పిల్లలకు 18 ఏళ్లు వచ్చాక.. ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడేలా ఏటా కొంత మొత్తం చెల్లించేలా మ్యాక్స్ కాలేజ్ ప్లాన్ ఉంది. ఏది ఏమైనా.. పిల్లలు ఎదిగే క్రమంలో వివిధ దశల్లో వారికి కావాల్సినవి సమకూర్చగలిగేటువంటి పాలసీలను ఎంచుకోవడం ముఖ్యం. అయితే, ఇది ఇతర ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలి. -
పిల్లలకైతే యులిప్సే బెస్ట్...
గతంతో పోలిస్తే పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు అధికంగా దృష్టిసారిస్తున్నారు. వారికి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి ఉన్నత చదువులు చదివించడందాకా అన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా సాగిస్తున్నారు. ఉన్నత చదువులకు పిల్లలను విదేశాలకు పంపే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఏటా వేగంగా పెరుగుతున్న విద్యావ్యయం తట్టుకోవడం వీరికి కష్టంగా మారుతోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇటీవల నిర్వహించిన ‘లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్’ సర్వేలో 75 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం పొదుపునకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కాని చాలామంది ఈ పొదుపును చాలా ఆలస్యంగా మొదలు పెడుతున్నారు. ఉన్నత చదువుకు అక్కరకు వచ్చే విధంగా ఉండాలంటే కనీసం 3 నుంచి 8 ఏళ్ళ లోపే ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. దీర్ఘకాలానికి యులిప్స్ అటు బీమా రక్షణ కల్పిస్తూ, ఇటు ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా అనేక పిల్లల పథకాలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) అనువైనవని చెప్పొచ్చు. తల్లిదండ్రుల రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉండటమే కాకుండా, అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలామంది బ్యాంకు ఎఫ్డీలు, పోస్టాఫీసు సేవింగ్స్ వంటి పథకాలపై అధికంగా మొగ్గు చూపుతున్నారు. కాని వీటికంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని యులిప్స్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ మూడు గుర్తుంచుకోవాలి ఏదైనా ఒక చైల్డ్ యులిప్ పథకాన్ని ఎంచుకునేటప్పుడు తప్పకుండా ఈ అంశాలను పరిశీలించడం మర్చిపోవద్దు. అందులో మొదటిది ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి. యులిప్స్ అనేవి కేవలం దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కే అనువుగా ఉంటాయి. ఇప్పుడు చాలా పథకాలు 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేసే విధంగా పథకాలను అందిస్తున్నాయి. ఇలా దీర్ఘకాలం ఎంచుకోవడం వల్ల మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకులను తట్టుకొని దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందొచ్చు. ఇక రెండో విషయం: ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ప్రారంభంలో ఈక్విటీలకు అధికంగా కేటాయిస్తూ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్ వంటి సాధనాల్లోకి క్రమేపీ మారాలి. ఉదాహరణకు ప్రారంభంలో 80 నుంచి 100 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తే పాలసీ ముగిసే వరకు అదే విధంగా కొనసాగించకూడదు. మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల వల్ల లాభాలు హరించుకుపోయే ప్రమాదం ఉంది. లాభాలొచ్చినప్పుడు వాటిని డెట్ వంటి రిస్క్ తక్కువ ఉండే వాటిల్లోకి మార్చుకోవాలి. చిన్న పిల్లల పేరుమీద ఏ పాలసీ తీసుకున్నా సరే వైవర్ ఆఫ్ ప్రీమియం అనే రైడర్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోని అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగి తల్లిదండ్రులు ప్రీమియం చెల్లించలేకపోయినా పిల్లల లక్ష్యం అక్కడితో ఆగిపోకూడదు. ఇలాంటి సమయంలో వైవర్ ఆఫ్ ప్రీమియం అక్కరకు వస్తుంది. ఇంతే కాకుండా యులిప్స్‌లో ఉండే ఇంకో ప్రయోజనం ఏమిటంటే.... బోనస్‌లు, లేదా ఇతర ఆదాయాలు ఏమైనా చేతికి వస్తే టాప్ అప్స్ పేరుతో అదే పథకంలో పిల్లల పేరుమీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
అడ్డొస్తోందని..
రాయచోటి టౌన్, న్యూస్‌లైన్: వివాహేతర సంబంధానికి అడ్డు రావడాన్ని సహించలేకపోయాడు. చాటుమాటుగా సాగుతున్న తన వ్యవహారాన్ని పసిగట్టి, నీలదీయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి దోషిగా తేల్చడంతో మృగంగా మారిపోయాడు. అగ్నిసాక్షిగా కట్టిన తాళినే ఎగతాళి చేశాడు. ముగ్గురు బిడ్డలతో కలసి ప్రశాంతంగా నిద్రిస్తున్న భార్యపై దుడ్డుకర్రతో కసితీరా కొట్టి కాటికి పంపాడు. అంతటితో ఆగక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఈ సంఘటనతో నిద్ర నుంచి మేల్కొన్న పిల్లలు గట్టిగా కేకలు వేయగా, ఇరుగు పొరుగు వారు రావడంతో అక్కడి నుంచి జారుకున్నాడా హంతకుడు. రాయచోటిలో శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక జరిగిన సంఘటన తెల్లారే సరికి దావనలంలా వ్యాపించడంతో రాయచోటి ఒక్కసారిగా మూగబోయింది. రాయచోటిలోని 30వ వార్డుకు చెందిన రెడ్డెయ్య(44) లక్కిరెడ్డిపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగులమ్మ, సుబ్బన్న కుమార్తె యశోదమ్మతో పాతికేళ్ల కిందట వివాహమైంది. వీరికి సునీల్(20), సునీత(18), తేజస్విని(14) సంతానం. వృత్తిరీత్యా దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోసించే రెడ్డెయ్య ఏడేళ్ల కిందట బెంగళూరుకు వెళ్లి అక్కడి ఓ కంపెనీలో టైలర్‌గా చేరాడు. తన ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని ఇక్కడ ఉంటున్న భార్యా, పిల్లలకు పంపేవాడు. తను నెలకో, రెణ్ణెళ్లకో వచ్చిపోయేవాడు. ఆ తరువాత డబ్బులు సక్రమంగా పంపకపోగా, ఇంటికి సైతం నెలల తరబడి వచ్చే వాడు కాదు. ఇదేమంటే డొంక తిరుగుడు సమాధానాలు చెప్పేవాడు. నిజమైన అనుమానాలు భర్తపై అనుమానం వచ్చిన యశోదమ్మ ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆరా తీయడం మొదలుపెట్టారు. భర్త యవ్వారాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్న ఆమె నిశ్ఛేష్టురాలైంది. బెంగళూరులోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న ఆమె పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని భర్తను మంచిగా చెప్పింది. అతనిలో మార్పు రాకపోవడంతో నిలదీసింది. అయినా ఫలితం లేకపోవడంతో తన పుట్టింటి వారితో పాటు మెట్టినింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తరువాత పెద్ద మనుషులతో చెప్పించారు. బెంగళూరుకు వెళ్లకూడదని, ఇక్కడే ఉంటూ టైలరింగ్ చేసుకుంటూ బతకాలని పెద్ద మనుషులు చెప్పారు. అందుకు అంగీకరించి ఇంటిపట్టునే ఉంటున్న రెడ్డయ్య తిన్నగా భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఒక్కొక్కటిగా తెగనమ్మి ప్రియురాలికి పంపేవాడు. దీంతో చిర్రెత్తిన యశోదమ్మ తన భర్త చేస్తున్న తప్పులను నిలదీసింది. కసి తీరా చంపి.. ఆపై పరారీ రోజులాగే యశోదమ్మ తన ముగ్గురు బిడ్డలు, భర్తలో కలసి శనివారం రాత్రి నిద్రపోయింది. రాత్రి బాగా పొద్దుపోయాక రెడ్డయ్యలో మృగం మేల్కొన్నాడు. అంతే దుడ్డుకర్ర తీసుకుని నిద్రిస్తున్న భార్యపై కసి తీరా బాది చంపేశాడు. అంతటితో ఊరుకోక పిల్లలను ఇంట్లోనే ఉంచి గడియపెట్టి మృతదేహంపై కిరోసిన్ పోసేందుకు ప్రయత్నించాడు. అయితే పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన రెడ్డయ్య ఒక్క ఉదుటున అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పాడు. సమాచారం అందుకున్న పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, రాయచోటి అర్బన్ సీఐ శ్రీరాములు తమ సిబ్బందితో ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.