రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి.
వారికి ఈ ఆగస్టు 15 చిరస్మరణీయం చేయండి.
ప్రతి భారతీయ గుండె ఉప్పొంగే క్షణాలివి. ప్రతి కన్ను ఆనందంతో చమర్చే అనుభూతి ఇది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ మువ్వన్నెలు నిండిపోయే అపూర్వఘట్టం ఇది. మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం... అందరూ అనిర్వచనీయమైన ఉద్వేగంతో ఊగిపోయే సందర్భం ఇది.
దేశమా... నీ సమున్నత కీర్తిని చూసి గర్విస్తున్నాం.
దేశమా... నీ ఘన వారసత్వానికి పులకించిపోతున్నాం.
దేశమా... నీ విలువల ఔన్నత్యానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం.
దేశమా... నీవు ఇచ్చిన ఈ పిడికెడు మట్టికి హృదయాల్ని అర్పణం చేస్తున్నాం.
‘సారే జహా సే అచ్ఛా హిందూస్తాన్ హమారా’... ప్రపంచ దేశాలలోనే అందమైన దేశం, సుందర దేశం, సమృద్ధి దేశం మన దేశం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ 75 ఏళ్ల అమృత మహోత్సవం సందర్భంగా వాగ్దానం చేయాలి. నేటి బాలల హృదిలో ఈ కొనసాగింపునకు పాదులు వేయాలి. ఎందుకంటే వారే కదా భావిపౌరులు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని నెహ్రూ అన్నది– బాలల్లో దేశభక్తిని పెంపొందించాలని సూచించినది. అందుకే ప్రతి ఇంట ఉన్న బాలబాలికలందరినీ తప్పనిసరిగా ఆగస్టు 15 ఉదయం నాటి పతాకావిష్కరణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడండి. వారి చేత వందేమాతరం, జనగణమన పాడించండి.
మాట్లాడనివ్వండి
రేపటి ఘట్టం మాట్లాడే ఘట్టం. పిల్లల్ని మాట్లాడించాల్సిన ఘట్టం. మీ ఇళ్లల్లో, వీధుల్లో, వాడల్లో, అపార్ట్‌మెంట్లలో పిల్లలకు వక్తృత్వ పోటీలు పెట్టండి. ‘నేను నా దేశం’, ‘నాకు నచ్చిన మహనీయుడు’, ‘ఈ దేశానికి నేను ఏమి ఇస్తాను’, ‘దేశమంటే మట్టి కాదోయ్... మనుషులోయ్’... వంటి అంశాలు ఇచ్చి, ప్రిపేర్ అయ్యి, మాట్లాడమనండి. ఏం మాట్లాడాలో కొంత సహాయం చేయండి. ఎలా మాట్లాడాలో నేర్పించండి. గొప్ప వక్త గొప్ప నాయకుడు కాగలడు... మార్గనిర్దేశనం చేయగలడు... అని చెప్పి ప్రోత్సహించండి. బాగా మాట్లాడిన వారికి బహుమతులు ఇవ్వండి. ఆగస్టు 15న వారిలోని కొత్త ప్రతిభకు పాదు వేయండి.
నేనే ఆ నాయకుణ్ణయితే
పిల్లల్ని పరకాయప్రవేశం చేయించండి. మోనో యాక్షన్... ఏకపాత్రాభినయం పోటీలు పెట్టండి. దేశ నాయకులుగా వేషం కట్టి వారిలా మారి వారు ఎలా మాట్లాడతారో దేశం కోసం ఏం సందేశం ఇస్తారో ఇమ్మనమని చెప్పండి. గాంధీ, నెహ్రూ, అల్లూరి, భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్... ఒక్కొక్కరు ఒక్కో నేతలా మారనివ్వండి. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాదు సమాజం కోసం పాటుపడిన వారు కూడా దేశభక్తులే అని చెప్పి సుందరలాల్ బహుగుణ, మదర్ థెరిసా, సావిత్రిబాయ్ పూలే, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్ వంటి మహనీయుల వేషాలు వేయమనండి. దేశకీర్తిని ఇనుమడింప చేసిన చిత్రకారులు, గాయకులు, కవులు రవీంద్రనాథ్ టాగోర్, మంగళంపల్లి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్ వంటి వారి రూపంలో పిల్లల్ని వేదిక మీదకు రమ్మనండి. అద్భుతం ఆ దృశ్యం. మహనీయుల పసిరూపం.
పర్వతాలు, నదులు... దేశమే
చిత్రలేఖనం పోటీ పెట్టండి. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ బొమ్మలే కాదు హిమాలయాలు, గంగానది, వింధ్య పర్వతాలు, హిందూ మహాసముద్ర తీరాలు... వీటిని కూడా గీయమనండి. దేశంలోని ప్రకృతిని కాపాడటం దేశభక్తి అని చెప్పండి. రాజస్తాన్ ఎడారి, గుజరాత్ శ్వేత మైదానాలు, మధ్యప్రదేశ్ ఘోరారణ్యాలు, తెలంగాణ పీఠభూములు, ఆంధ్రప్రదేశ్ నదీ ప్రవాహాలు జాతి సంపదలేనని చాటుతూ గీయమనండి. ‘టీ షర్ట్ పెయింటింగ్’ కూడా మంచి ఆలోచన. తెల్లటి టీషర్ట్ మీద దేశభక్తిని తెలియచేసే బొమ్మ గీసి వేసుకోవడం, బహుమతిగా ఇవ్వడం చేయమనండి. జాతీయ జంతువు, పక్షి, చిహ్నం వీటిని గీయమని చెప్పండి. అంతే కాదు, వీటన్నింటికి అర్హుడయ్యేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటామని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించండి.
క్విజ్‌లు, థీమ్ పార్టీలు
స్వాతంత్య్ర పోరాటం ఒక సుదీర్ఘ ఘట్టం. దీని మీద ఎన్ని క్విజ్‌లైనా నిర్వహించవచ్చు. సరైన సమాధానాలు చెప్పిన పిల్లలకు మంచి బహుమతి ఇవ్వండి. అలాగే ఆ మధ్యాహ్నం లేదా సాయంత్రం థీమ్ పార్టీ చేసుకోవచ్చు. ఖాదీ బట్టలు, మూడు రంగుల బట్టలు లేదా గాంధీ టోపీ... ఇలాంటి థీమ్ పెట్టుకొని పిల్లలు స్నాక్స్ పార్టీ చేసుకోవచ్చు. ఆ సాయంత్రం ‘చరిత్ర నడక’– అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా చారిత్రక స్థలం అంటే కూడలి, దేశభక్తుని విగ్రహం, లేదా గతంలో మహనీయులు వచ్చి వెళ్లిన చోటు అక్కడి వరకు పిల్లలు పెద్దలు కలిసి వాక్ చేయవచ్చు. అలాగే ఆ సాయంత్రం అందరూ కలిసి మంచి దేశభక్తి సినిమా తిలకించవచ్చు. పాటల పోటీ, డాన్స్ పోటీలు ఎలాగూ ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలు వేసిన బొమ్మలతో సాయంత్రం ప్రదర్శన ఏర్పాటు చేయాలి.
సంకల్పం
దేశ స్వాతంత్య్రం ఒక్కరోజులో రాలేదని, ఎందరో త్యాగాలు చేస్తే... కష్టాలు ఎదుర్కొంటే వచ్చిందని పిల్లలకు చెప్పాలి. జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని దేశం గర్వించేలా ఎదగడమే దేశభక్తి అని కూడా వారికి చెప్పాలి. ‘నాకు జన్మనిచ్చిన దేశానికి నేను పెద్దయ్యి ఏం చేయాలి’ అనే భావన ఎప్పుడూ కలిగి ఉండాలని వారికి చెప్పాలి.
భారత్ మాతా కీ జై అనే నినాదం వారి హృదయంలో సదా మార్మోగేలా పెద్దల సహకారంతో పిల్లలు ఈ అమృత మహోత్సవాన్ని జరుపుకునేలా నేడంతా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాం.
సంస్కృతులకు స్వాగతం చెప్పండి
సాటి సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని కూడా చెప్పండి. భిన్న సంస్కృతుల వేషధారణల పోటీ పెట్టండి. అస్సామీలు, మణిపురిలు, తమిళులు, మలయాళీలు, మహరాష్ట్రీయులు, కశ్మీరీలు... వీరంతా వేదిక మీదకు రావాలి. హిందూ ముస్లిం శిక్కు క్రైస్తవ ధర్మాలు మన దేశంలో ఉన్నాయని, అందరూ కలిసి మెలిసి జీవించాలని తెలియచేసే రూపకాలు, పాత్రలు వేయించండి. భిన్నత్వంలో ఏకత్వం... ఏకత్వంలో భిన్నత్వం బోధించండి.
స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా
Published Sun, Aug 14 2022 12:41 AM | Last Updated on Sun, Aug 14 2022 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment