పిల్లలకు భరోసా ఉండాలిగా.. | need support to childrens | Sakshi
Sakshi News home page

పిల్లలకు భరోసా ఉండాలిగా..

Published Sun, Jan 5 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

పిల్లలకు భరోసా ఉండాలిగా..

పిల్లలకు భరోసా ఉండాలిగా..

 పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేకంగా పాలసీలు తీసుకోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మిగతా పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈ తరహా పథకాల్లో ఒక అదనపు ప్రయోజనం ఉంది. ఇవి పాలసీదారుకు బీమా రక్షణ కూడా కల్పిస్తాయి. ఒకవేళ పాలసీదారుకు ఏదైనా అనుకోనిది సంభవిస్తే.. పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాలకు ఢోకా లేకుండా ఆదుకుంటాయి. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు ఆషామాషీగా వ్యవహరించకుండా.. అదనపు ప్రయోజనాలు కల్పించే రైడర్ల గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఇలాంటి  అయిదు రకాల రైడర్ల గురించి తెలిపేదే ఈ కథనం.
 
 వెయివర్ ఆఫ్ ప్రీమియం..
 చాలా మటుకు పిల్లల బీమా పాలసీల్లో ఈ ఫీచర్ ఉంటుంది. ఒకవేళ పాలసీదారుకేదైనా ఊహించనిది జరిగి (ప్రమాదాల్లో అంగవైకల్యం వంటివి), ఆ వ్యక్తి తదుపరి ప్రీమియాలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇటు పాలసీ, అటు రైడరుకు సంబంధించి భవిష్యత్‌లో ప్రీమియాలు చెల్లించడం నుంచి మినహాయింపు లభిస్తుంది. సదరు రైడరు వ్యవధి పూర్తయ్యే దాకా ఈ మినహాయింపు ఉంటుంది. 80సి పన్ను ప్రయోజనాలు  ఉంటాయి.
 
 ప్రమాద, అంగవైకల్య ప్రయోజనాల రైడరు
 పేరుకు తగ్గట్లే ఇది రెండు పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ముందుగా పాలసీదారు మరణం అంశాన్ని  తీసుకుందాం. పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ముందుజాగ్రత్తగా బీమా పథకం తీసుకున్న పాలసీదారు (తల్లి/తండ్రి) మరణించినా.. సదరు పాలసీ వృథా కాకుండా, ప్రయోజనాలు పిల్లలకు దక్కేలా చూసేందుకు ఈ రైడరు ఉపయోగపడుతుంది. మరణం సంభవించిన సందర్భాన్ని బట్టి కూడా పాలసీ మొత్తం చెల్లింపు ఉండేలా కొన్ని పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు, పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే.. బేసిక్ సమ్ అష్యూర్డ్‌తోపాటు నూటికి నూరు శాతం ‘రైడర్ సమ్ అష్యూర్డ్’ని కూడా ఒక కంపెనీ చెల్లిస్తోంది. అయితే ఏదైనా ప్రజా రవాణా వ్యవస్థ వాహ నంలో టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నప్పుడు మరణిస్తే.. పాలసీదారు కుటుంబానికి బేసిక్‌తో పాటు 200%  రైడర్ సమ్ అష్యూర్డ్‌ని చెల్లిస్తోంది. మరోవైపు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సమ్ అష్యూర్డ్‌లో ఎంత మొత్తానికి రైడర్ తీసుకుంటే.. అంత దాకా తదుపరి ప్రీమియాలు చెల్లించడం నుంచి మినహాయింపు లభిస్తుంది.
 
 క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్..
 తీవ్రమైన వ్యాధులు, ఆరోగ్య సమస్యల చికిత్సలు భారీ ఖర్చులతో కూడుకున్నవి. ఇలాంటి ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు ఒకోసారి పిల్లల పాలసీల ప్రీమియాలు సమయానికి కట్టడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ రైడర్ పనికొస్తుంది. పక్షవాతం, గుండెపోటు, ప్రధాన అవయవాల మార్పిడి వంటి వాటికి ఇది పనిచేస్తుంది. ఈ రైడర్‌లో ఆప్షన్లు వివిధ రకాలుగా ఉంటాయి. పాలసీదారుకు రైడర్ సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని చెల్లించడం  ఒక పద్ధతి. ఇందులో  రైడరు వ్యవధి ముగిసి బేస్ పాలసీ మాత్రం కొనసాగుతుంది. మరో ఆప్షన్‌లో రైడర్‌తోపాటు సమ్ అష్యూర్డ్ మొత్తం కూడా బీమా కంపెనీ చెల్లించేస్తుంది. పాలసీ టెర్మినేట్ అయిపోతుంది. కానీ, ముందుగా నిర్దేశించుకున్న గడువు దాకా బేస్ పాలసీ కొనసాగించుకోవచ్చు. తదుపరి ప్రీమియాలు కడుతూ పోతే.. గడువు తీరిన తర్వాత పాలసీదారు కట్టిన ప్రీమియాలు, బోనస్‌లు అంతా కలిపి కంపెనీ ఆఖరున చెల్లిస్తుంది.
 
 ఇన్‌కమ్ బెనిఫిట్ రైడర్..
 పాలసీదారు మరణించిన పక్షంలో సంతానం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా ఈ రైడర్ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో రైడరు సమ్ అష్యూర్డ్‌లో 10 శాతాన్ని ఏటా నిర్దిష్ట తేది నాడు లబ్దిదారుకు కంపెనీ అందిస్తుంది. రైడర్ గడువు ముగిసే దాకా ఇది కొనసాగుతుంది.
 
 టర్మ్ బెనిఫిట్..
 పథకం గడువు తీరేలోగా పాలసీదారు మరణించిన పక్షంలో లబ్దిదారుకు అదనపు ప్రయోజనాలు అందించగలదీ రైడరు. ఇలాంటి పరిస్థితుల్లో  సమ్ అష్యూర్డ్‌తో పాటు అదనంగా డెత్ బెనిఫిట్ మొత్తం కూడా లభిస్తుంది. గరిష్టంగా బేసిక్ సమ్ అష్యూర్డ్‌కి సరిసమానంగా ఈ రైడరు విలువ ఉంటుంది. ప్రస్తుతం అవైవా యంగ్ స్కాలర్ అడ్వాంటేజ్, మ్యాక్స్ న్యూయార్క్ కాలేజ్ ప్లాన్, కోటక్ చైల్డ్ అడ్వాంటేజ్ ప్లాన్ వంటి పాలసీలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాస్త ఎక్కువ ప్రీమియం కడితే.. నెలవారీ ప్రయోజనాలు కల్పించేలా అవైవా పాలసీల్లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. పిల్లలకు 18 ఏళ్లు వచ్చాక.. ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడేలా ఏటా కొంత మొత్తం చెల్లించేలా మ్యాక్స్ కాలేజ్ ప్లాన్ ఉంది. ఏది ఏమైనా.. పిల్లలు ఎదిగే క్రమంలో వివిధ దశల్లో వారికి కావాల్సినవి సమకూర్చగలిగేటువంటి పాలసీలను ఎంచుకోవడం ముఖ్యం. అయితే, ఇది ఇతర ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement