
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టికరణ
దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి
ప్రజలపై, నూతన ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టాలి
ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.435.17 లక్షల కోట్లు) చేరుకోవడం ఇక ఎంతోదూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, నవీన ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి పెట్టుబడులు అత్యంత కీలకమని వివరించారు.
‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై బుధవారం జరిగిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. 2014 నుంచి తమ ప్రభుత్వం 3 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచి్చందని అన్నారు. దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని, ఐదు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లు నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2015 నుంచి 2025 దాకా ఇండియా ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి చెందినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. వెబినార్‌లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
సరైన దిశలో సరైన పెట్టుబడులు
‘‘ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలను మనం అధిగమించాం. ఇండియా త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యం. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలంటే సరైన దిశలో సరైన పెట్టుబడులు పెట్టడం అత్యంత కీలకం. ఇందుకోసం కేంద్ర బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశాం. వాటిని అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భాగస్వామ్యపక్షాలన్నీ ఇందులో పాలుపంచుకోవాలి.
ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు
విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థికం, నవీన ఆవిష్కరణలపై పెట్టుబడులకు సరిసమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతలో ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడానికి, నూతన అవకాశాలు కలి్పంచడానికి ‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకం’ ప్రవేశపెట్టాం. పరిశ్రమ వర్గాలు సైతం ఈ పథకంలో భాగస్వామిగా మారాలి. ఈ ఏడాది బడ్జెట్‌లో అదనంగా 10 వేల మెడికల్ సీట్లు ప్రకటించాం. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
గ్లోబల్ టూరిజం, వెల్‌నెస్ హబ్‌గా
ఇండియా పర్యాటక రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కలి్పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జీడీపీలో 10 శాతం సమకూర్చగల సత్తా పర్యాటక రంగానికి ఉంది. దేశంలో 50 ప్రాంతాలను అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయబోతున్నాం. అక్కడి హోటళ్లకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తాం. దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు
జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా కీలకం. ఇందులో భాగంగా అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం ప్రైవేట్ రంగం.. ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ చొరవ తీసుకోవాలి. దేశ ఆర్థిక ప్రగతిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం. అందుకే ఏఐ ఆధారిత విద్య, పరిశోధనల కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాం. ఏఐ కెపాసిటీని అభివృద్ధి చేయడానికి నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment