
అమెరికాలో రూ.8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తైవాన్ సంస్థ
చిప్‌ల తయారీ రంగం తరలిపోతుందంటూ విపక్షాల ఆందోళన
ట్రంప్‌కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని ప్రభుత్వంపై మండిపాటు
తైవాన్ గతి చివరికి ఉక్రెయిన్‌లా మారుతుందని అనుమానాలు
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లలో 90 శాతానికిపైగా తైవాన్‌లో తయారైనవే. సెల్‌ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో ఈ చిప్‌లు ఉండాల్సిందే. చిప్‌ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్‌ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.69 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు ఆ కంపెనీని ఒప్పించారు. గతవారం ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నిధులతో టీఎస్‌ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్‌ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్‌ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్‌లో మంటలు రాజేస్తోంది.
జాతీయ భద్రతా సంక్షోభం
తైవాన్ అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ)పై మాజీ అధ్యక్షుడు మా యింగ్–జియూ నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్‌ను కాపాడుతున్నందుకు ట్రంప్‌కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్‌ఎంఎస్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చిచెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు.
చిప్‌ల తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు. ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర సంబంధాలను దెబ్బతీస్తుందని మా యీంగ్–జియూ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదాను దిగజారుస్తుందని అన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్–తే స్పష్టంచేశారు. టీఎస్‌ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ ప్రతిష్టకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు.
తైవాన్‌ను గాలికొదిలేస్తారా?
తైవాన్‌పై పొరుగు దేశం చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది.
ప్రధానంగా తైవాన్‌కు జీవనాడిగా ఉన్న చిప్‌ల తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. అక్కడి పరిశ్రమను క్రమంగా అమెరికా తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి, ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్‌లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా–తైవాన్ సంబంధాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్‌లో తరచుగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment