
ముంబై: గిఫ్ట్ సిటీలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (Investments) పెట్టినట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్ కె రాజారామన్ తెలిపారు. అలాగే ఇతరత్రా బ్యాంకింగ్ సాధనాల్లో దాదాపు 5,000 మంది ఎన్నారైలు (NRIs) ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
గిఫ్ట్ సిటీలోని 30 బ్యాంకుల నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 78 బిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు వివరించారు. ఇందులో సుమారు 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని దేశీ కార్పొరేట్లు రుణాలుగా తీసుకున్నట్లు, ఇటీవలే ఒక బడా భారతీయ కార్పొరేట్ దిగ్గజం 3 బిలియన్ డాలర్ల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజారామన్ చెప్పారు.
ఐపీవోకి ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ దరఖాస్తు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్’ ఐపీవోకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. రూ.392 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా కంపెనీ విక్రయించనుంది. అలాగే, ప్రమోటర్‌తోపాటు ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్ 28.57 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ రూపంలో విక్రయించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ.78 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక.
తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో సమకూరే రూ.224 కోట్లను ప్రభుత్వ, చట్టపరమైన అనుమతులు, అదనపు ఫ్లోర్ స్పేస్ కొనుగోలుకు తదితర అవసరాలకు వినియోగించనుంది. రూ.74 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ముంబై, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.
అదానీ విల్మర్ చేతికి ‘టాప్స్’
న్యూఢిల్లీ: టాప్స్ బ్రాండుతో పచ్చళ్లు, సాస్‌లు తయారు చేసి విక్రయిస్తున్న జీడీ ఫుడ్స్‌ను కొనుగోలు చేసినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మర్ (Adani Wilmer) తాజాగా పేర్కొంది. ఇందుకు జీడీ ఫుడ్స్ మ్యాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తొలుత 80 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. తదుపరి మూడేళ్లలో మిగిలిన 20 శాతం వాటాను చేజిక్కించుకోనుంది.
చదవండి: రియల్టీ ప్లాట్‌ఫామ్ సిలాలో ఎంఎస్ ధోని పెట్టుబడులు
ఐపీఏ గూటికి క్వాలిటీ యానిమల్ ఫీడ్స్
ముంబై: ఇండియన్ పౌల్ట్రీ అలయెన్స్(ఐపీఏ) తాజాగా క్వాలిటీ యానిమల్ ఫీడ్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు అల్లన గ్రూప్ అనుబంధ సంస్థ ఐపీఏ వెల్లడించింది. తాజా కొనుగోలు ద్వారా దేశీ పౌల్ట్రీ పరిశ్రమలో పటిష్టపడనున్నట్లు ఐపీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఫ్రోజెన్ హలాల్ మీట్, తృణధాన్యాలతోపాటు ఫ్రూట్ పల్ప్‌లు, కాఫీ, పెట్ ఫుడ్ తదితర కన్జూమర్ ప్రొడక్టుల తయారీ, ఎగుమతులను చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment