పుట్లూరు : ‘పాఠశాలలో ఏడు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. టీచర్లను నియమించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదు. ఇలాగైతే మా పిల్లల భవిష్యత్ ఏమి కావాలి’ అంటూ పుట్లూరు మండలంలోని చాలవేముల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వారు స్థానిక పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఉన్న ఒక ఉపాధ్యాయుడిని బయటకు పంపి పాఠశాలకు తాళం వేశారు. ఏడు తరగతుల్లో 84 మంది విద్యార్థులు ఉన్నారని, ఉపాధ్యాయుల కొరత వల్ల నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో వారి పిల్లలను చదివిస్తారా అంటూ నిలదీశారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో గ్రామంలో చాలామంది తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం పేద విద్యార్థులు మాత్రమే ఇక్కడ చదువుకుంటున్నారన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య పెంచకపోతే వీరు కూడా ఈ పాఠశాలకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
ఒక్కయ్యవారితో సదువెలా?
Published Wed, Jun 18 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement