సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మాధవయ్య
పుత్తూరు రూరల్ : ప్రైవేట్ పాఠశాలల్లో తమ చిన్నారులను చదివిస్తే కుటుంబసభ్యులకు తెల్లరేషన్‌కార్డు, పింఛన్లను రద్దు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ఎంపీపీ గంజి మాధవయ్య స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇషా విద్య ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంక్షేమ పథకాల అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
విద్య కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులను ఉచితంగా అందించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేస్తున్నట్లు ఆయన వివరించారు. అయినప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడడం తగదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.
ఎంపీడీఓ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువలతో కూడిన విద్యను బోధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఇషా కోఆర్డినేటర్ వీరమంగళం వెంకటరమణ మాట్లాడుతూ అంగన్‌వాడీల్లో ఐదేళ్లు పూర్తయిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు.ఇషా విద్య అమలులో ఉండడంతో ఆటపాటలతో కూడిన అత్యున్నత విద్యాబోధన అందిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎంఈఓ తిరుమలరాజు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఇందిరా ప్రియదర్శిని, రోజారమణి, షామిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment