తల్లిదండ్రులుగా..అదే పిల్లలకు ఇవ్వగల అత్యంత విలువైన కానుక! | Parenting Tips: Spending Enough Time With Your Children | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులుగా..అదే పిల్లలకు ఇవ్వగల అత్యంత విలువైన కానుక!

Published Sat, Aug 19 2023 12:13 PM | Last Updated on Sat, Aug 19 2023 12:57 PM

Parenting Tips: Spending Enough Time With Your Children - Sakshi

పిల్లలకు మీ సమయాన్ని ఇస్తున్నారా? పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగల అత్యంత విలువైన కానుక ఏదైనా ఉందంటే అది కేవలం సమయం మాత్రమే. సమయం ఎందుకు విలువైనది అని అంటే, గడిచిన క్షణం అయినా తిరిగి రాదు. అందువల్ల వారితో విలువైన, నాణ్యమైన సమయాన్ని గడిపి, వారికి మంచి జ్ఞాపకాలను మిగల్చండి. వారితో గడిపేందుకు ఏమేం చేయవచ్చో చూద్దాం...

మనం పిల్లలతో కలిసి చదవడం, పనిపాటలు చేయడం నుంచి ఆటలు ఆడటం వరకు..వారితో మీ బంధం బలపడడానికి, అనుబంధాలు అల్లుకోవడానికి తోడ్పడతాయి. 

పుస్తక పఠనం
పిల్లలతో బంధాన్ని పెంచుకోవడానికి, వారి భాషానైపుణ్యాలను పెంపొందించడానికి పుస్తకపఠనం గొప్ప మార్గం. వయస్సుకి తగినవి, మీ పిల్లలు ఆనందిస్తారని మీరు భావించే పుస్తకాలను ఎంచుకుని వాటిని పిల్లలతో కలిసి బిగ్గరగా చదవవచ్చు లేదా వాళ్లే చదివి మీకు వినిపించేలా చేయవచ్చు. ఒకవేళ పుస్తకాలు లేకపోతే తెలుగు లేదా ఇంగ్లిష్‌ వార్తాపత్రికలు చదవడంతో దినచర్య ప్రారంభించడం మంచిది.

కలిసి ఆటలు ఆడటం
మీ పిల్లల సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆటలు ఆడటం ఒక ఆహ్లాదకరమైన మార్గం. బోర్డ్‌ గేమ్‌లు, కార్డ్‌గేమ్‌లు, అవుట్‌డోర్‌ గేమ్‌లు వంటి అనేకరకాల ఇండోర్‌ లేదా ఓట్‌డోర్‌ గేమ్స్‌ పిల్లలతో ఆడచ్చు. చెస్, స్నేక్స్‌ అండ్‌ లేడర్స్‌ (పాముపటం), అష్టాచెమ్మా, పచ్చీస్‌ వంటివి పిల్లలతో కలిసి ఆడటం వల్ల వారిలో క్రీడానైపుణ్యాలు పెంపొందుతాయి.

విహారయాత్రలకు వెళ్లడం
పిల్లలు కొత్త విషయాలను అనుభూతించడానికి, వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఔటింగ్‌లకు వెళ్లడం గొప్పమార్గం. పార్క్, జూపార్క్, మ్యూజియం లేదా ఇంకేదైనా చూపించడానికి వారిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం ద్వారా వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. 

కళానైపుణ్యాన్ని పెంపొందించడం
కళలు పిల్లలు తమను తాము నిరూపించుకోవడానికి, తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కళలు ఒక ఆహ్లాదకరమైన చక్కటి మార్గం. మీరు మీ పిల్లలకు క్రేయాన్‌లు, మార్కర్‌లు, పెయింట్, క్లే వంటి ఆర్ట్‌ సామాగ్రిని సమకూర్చి, వాటితో వారు ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పించి, వాటిని తయారు చేసేందుకు వారితో కలిసి పనిచేయండి. వారికి కావలసిన వాటిని వారే తయారు చేసుకునేలా వారిని ప్రోత్సహించండి. 

గార్డెనింగ్‌
పిల్లలు ప్రకృతి, బాధ్యత గురించి తెలుసుకోవడానికి గార్డెనింగ్‌ని మించిన మంచి మార్గం మరోటి లేదని చెప్పొచ్చు. పిల్లలతో కలిసి మీ పెరట్లో కొన్నిమొక్కలు నాటవచ్చు. లేదా మీ డాబాపై కొన్ని కుండీలు ఏర్పాటు చేసి వాటిలో కూడా నాటవచ్చు. వాటికి రోజూ నీళ్లు పోయడం, అవి ఎలా పెరుగుతున్నాయో వారితో కలిసి చూడడం గొప్ప అనుభూతినిస్తుంది. 

మాట్లాడటం... మాట్లాడనివ్వటం
పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి వారితో మాట్లాడటం, వారు చెప్పే కబుర్లు ఆసక్తిగా వినడం. వారి రోజువారి స్నేహితులు, వారి ఆసక్తులు, వారి కలల గురించి వారిని అడగండి. వారు చెప్పేది వినండి. అవసరం అయితే వారికి మీ మద్దతును, సహకారాన్ని అందించడం.
 
కలిసి వంట చేయడం
ఉదయం పూట చేసే బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి, మధ్యాన్నం వారు తినే లంచ్‌ వరకు వారికి ఇష్టమైన వాటిని లేదా మీ ఇంట్లో ఉన్న వాటితో టిఫిన్లు, స్నాక్స్, లంచ్‌ ప్రిపేర్‌ చేయడంలో వారి సాయం తీసుకోవడం మంచి పద్ధతి. అంటే తప్పనిసరిగా వారు మీకు హెల్ప్‌ చేయాలని కాదు... ఆసక్తి ఉంటే వారే సాయం చేయడానికి వచ్చేలా చేసుకోగలిగితే చాలు. ఇది రోజూ కుదరకపోవచ్చు కానీ కనీసం వారికి సెలవురోజుల్లో అయినా సరే, కలిసి వంట చేసుకునే అలవాటు చేయడం మంచిది.

వాకింగ్‌ లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లడం
పిల్లలు పది పన్నెండేళ్లలోపు వారైతే వారిని మీతో కలిసి రోజూ వాకింగ్‌కు లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లండి. వారు శారీరకంగా చురుగ్గా ఉండేందుకు, మానసికంగా మీకు దగ్గరయ్యేందుకు మార్నింగ్‌ వాక్‌ మంచి మార్గం.  అలా చేయడం ద్వారా వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

స్వచ్ఛంద సేవలో...
పిల్లలు ఇతరులకు సహాయం చేయడం, ప్రపంచంలో మార్పు తీసుకురావడం గురించి తెలుసుకోవడానికి వాలంటీరింగ్‌ ఒక గొప్ప మార్గం. మీరు స్థానికంగా ఉండే ఆశ్రమాల్లో లేదా ఇతర సంస్థలో స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. 

(చదవండి: ఎలక్ట్రానిక్‌ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement