ration card cuttings
-
రేషన్ కార్డులపై.. పునరాలోచన..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దారిద్య్ర రేఖకు దిగువ (బీపీఎల్)న ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చిన కార్డులు నామమాత్రంగా మిగులుతున్నాయి. ఆ కార్డు కావాలనుకుంటున్న వారు.. సదరు కార్డు ద్వారా ఇచ్చే రేషన్ బియ్యం మాత్రం వద్దనుకుంటున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డును సంక్షేమ పథకాలకు లింక్ పెట్టింది. దీంతో అవసరం ఉన్నా.. లేకున్నా, అర్హులు కాకున్నా అడ్డదారిన కార్డులు పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రతి నెలా కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. కొత్త కార్డుల కోసం ఇబ్బడి ముబ్బడిగా అందుతున్న దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటి విడతగా ఆరు నెలలు బియ్యం తీసుకోని వారిని గుర్తించి జాబితాలను సిద్ధం చేస్తోంది. ఈప్రక్రియ కొలిక్కి వస్తేఆ జాబితాలో ఉన్నవారి రేషన్ కార్డులకు చెక్ పెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. జిల్లాలో 4.61లక్షల కార్డులు.. జిల్లా వ్యాప్తంగా 991 రేషన్ షాపుల పరిధిలో 4,61,219 బీపీఎల్ కార్డుదారులు ఉన్నారు. వీటి ద్వారా ప్రతి నెలా రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. కాగా, రేషన్ సరుకుల పంపిణీలో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు రెండేళ్ల కిందట ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో కార్డుదారుని కుటుంబ సభ్యులు రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్ర వేస్తే తప్ప రేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ప్రతి నెలా రేషన్ సరుకులు తీసుకోవడానికి కొందరు ముందుకు రావడం లేదు. జిల్లాలో చాలా మంది కార్డుదారులు రేషన్ తీసుకోకపోవడంతో ప్రతినెలా రేషన్ సరుకులు మిగులుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిస్థితిపైనే దృష్టి సారించిందని అధికారులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల లింక్‌తోనే అడ్డదారిన కార్డులు.. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బీపీఎల్ కార్డులు లింక్ పెట్టడం వల్లే చాలా మంది అడ్డదారిలో రేషన్ కార్డులు పొందారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పిల్లల చదువులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు పొందేందుకు ఏదో విధంగా కార్డులు పొందుతున్నారు. సిబ్బందికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కొందరు కార్డులు పొందుతుండగా, మరికొందరు అంతోఇంతో ముట్టజెప్పి కార్డులు పొందారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కార్డులు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. కాగా, ప్రస్తుతం ఆరు మాసాలుగా అసలే రేషన్ సరుకులు తీసుకోని వారి పేర్లను తొలగించి ఆ తర్వాత మరింత పకడ్బందీగా అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతినెలా 5వేల క్వింటాళ్లకు పైగా బియ్యం మిగులు.. ఆరు మాసాలుగా నలభై వేల పైచిలుకు మంది రేషన్ తీసుకోని కారణంగా ప్రతినెలా 5వేల పైచిలుకు క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నట్లు గుర్తించారు. గతంలో ఈ–పాస్ విధానం లేని సమయంలో ఇలా మిగిలిపోయిన రేషన్ బియ్యం పక్కదారి పట్టేంది. పెద్ద మొత్తంలో రాష్ట్ర సరిహద్దులు దాటేది. ఇపుడు ఈ–పాస్ విధానంలో రేషన్ కార్డుదారుడు వేలిముద్ర వేస్తే కానీ సరుకు విక్రయించడం కుదరదు. లేదంటే ఒక డీలర్ దగ్గర స్టాకు అలా మిగిలిపోవాల్సిందే. ఇలా స్టాకు పెద్ద మొత్తంలో మిగిలి పోతుండడంతో రేషన్ బియ్యం అవసరం లేని వారెవరో తేలిపోయింది. దీంతో వీరంతా అవసరం లేకున్నా కార్డులు పొందారని గుర్తించి వాటిని రద్దు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని నిర్ణయించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రేషన్ తీసుకోనివారి వివరాల సేకరణ.. జిల్లా వ్యాప్తంగా 4,61,219 మంది రేషన్ కార్డు దారులు ఉండగా, వీరిలో ఆరు నెలలుగా 40,440 మంది కార్డులదారులు రేషన్ షాపుల గడప తొక్కలేదు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోని వారి లెక్క ఆన్లైన్లోనే తేలిపోయింది. ఈ విషయం పై విచారణ జరిపి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులంతా ఊళ్లోనే ఉంటున్నారా..? వారు ఎందుకు బియ్యం తీసుకోవడం లేదు..? చనిపోయినవారు ఎవరైనా ఉన్నారా..? లేదా రేషన్ బియ్యం తినడం ఇష్టం లేక వాటిని వదిలేస్తున్నారా..? అన్న వివరాలన్నింటినీ సేకరించేందుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
రేషన్‌కార్డులు లేక..పథకాలకు నోచుకోక
సాక్షి, చీపురుపల్లి రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డు ఎంతో అవసరం. అలాంటి రేషన్‌కార్డు లేకపోతే ప్రభుత్వం ప్రతీ నెలా అందజేస్తున్న రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా దూరమవ్వాల్సిందే. ఇది ఏ ఒక్క రూ కాదనలేని నిజం. ప్రజలకు ఏవేవో చేసేశాం, ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్‌కార్డులను మంజూరు చేయడంలో ఎంతో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేందుకు పీకే పాలవలస ఒక ఉదాహరణ. ఈ గ్రామానికి చెందిన గవిడి గొల్లబాబు గత మూడున్నర ఏళ్లుగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తునే ఉన్నాడు. కొత్త రేషన్‌కార్డు రావాలంటే భార్య, భర్తల పేర్లు ఏ ఒక్క కార్డులో కూడా ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలో కొత్త కార్డు వస్తుందనే ఆశతో తల్లిదండ్రుల కార్డులో ఉన్న పేరును గొల్లబాబు తొలగించాడు. అదే విధంగా భార్య పేరును కూ డా ఆమె తల్లిదండ్రుల కార్డులో నుంచి తొలగించా డు. ప్రతీ జన్మభూమి సభలో దరఖాస్తు చేసుకోవడమే తప్ప రేషన్‌కార్డు మాత్రం రావడం లేదు. దీంతో భార్య, భర్తలతో పాటుగా పిల్లలు సైతం ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఇది ఈ ఒక్కడి సమస్య కాదు నియోజకవర్గంలోని వందలాది మంది సమస్య. రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. కార్డులు లేక పథకాలకు నోచుకోలేకపోతున్నారు. ప్రయోజనం లేని జన్మభూమి సభలు ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన జన్మభూమిలో వందల సంఖ్యలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినప్పటికీ ఏ ఒక్కరికీ మంజూరైన దాఖలా లు లేవు. గత నాలుగేళ్లుగా జరిగిన జన్మభూమి సభల్లో కూడా వందల సంఖ్యలో రేషన్‌కార్డులు దరఖాస్తు చేస్తే పదుల సంఖ్యలో మాత్రమే మంజూరయ్యాయి. దీంతో అర్హులందరికీ నిరాశ తప్పడం లేదు. పేద ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఈ ఒక్క రేషన్ కార్డు విషయంలోనే స్పష్టమవుతోందని పలువురు మండిపడుతున్నారు. 55 మంది ఎదురు చూపు మండలంలోని ఒక్క పీకే పాలవలస గ్రామంలోనే 55 మంది అర్హులు రేషన్‌కార్డుల కోసం ప్రతీ సారి దరఖాస్తు చేసుకొని మోసపోతున్నారు. గ్రామానికి విచ్చేసిన రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను నిలదీస్తే మేమేమీ చేయలేం, మా చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారని స్థానిక విలేకర్లతో తమ గోడు చెప్పుకుంటున్నారు. రేషన్‌కార్డు కోసం 1100కి ఎప్పుడు ఫోన్ చేసినా, ప్రోసెస్‌లో ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక కలెక్టర్ గ్రీవెన్‌సెల్‌లో కూడా ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఏ ఒక్క అధికా రి కూడా గ్రామంలోకి రాలేదని వారు వాపోతున్నారు. రెండోసారి గ్రీవెన్‌సెల్‌లో అడిగితే మండ ల రెవెన్యూ అధికారులకు వివరాలంతా పంపిం చామని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావిస్తే కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. -
ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తే తెల్లరేషన్‌కార్డు, పింఛన్ల రద్దు
పుత్తూరు రూరల్ : ప్రైవేట్ పాఠశాలల్లో తమ చిన్నారులను చదివిస్తే కుటుంబసభ్యులకు తెల్లరేషన్‌కార్డు, పింఛన్లను రద్దు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ఎంపీపీ గంజి మాధవయ్య స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఇషా విద్య ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంక్షేమ పథకాల అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. విద్య కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులను ఉచితంగా అందించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేస్తున్నట్లు ఆయన వివరించారు. అయినప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడడం తగదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంపీడీఓ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువలతో కూడిన విద్యను బోధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఇషా కోఆర్డినేటర్ వీరమంగళం వెంకటరమణ మాట్లాడుతూ అంగన్వాడీల్లో ఐదేళ్లు పూర్తయిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు.ఇషా విద్య అమలులో ఉండడంతో ఆటపాటలతో కూడిన అత్యున్నత విద్యాబోధన అందిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎంఈఓ తిరుమలరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఇందిరా ప్రియదర్శిని, రోజారమణి, షామిని పాల్గొన్నారు. -
కోత ముమ్మరం
- నాలుగు చక్రాల వాహనం ఉంటే రేషన్ కట్ - తాజాగా ఇంటి పన్ను చెల్లిస్తున్న వారి కార్డుల తొలగింపు – ఆందోళనలో రేషన్ కార్డుదారులు అనంతపురం అర్బన్ : దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇచ్చిన రేషన్ కార్డుల కోతను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాసాధికార సర్వేకు సమాచారం ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల కోత ఉండదన్న ప్రభుత్వం ప్రకటనలు అబద్ధమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు చక్రాల వాహనం ఉందంటూ ఇప్పటికే కార్డులు తొలగించిన ప్రభుత్వం... తాజాగా మరో చర్యకు ఉపక్రమించింది. ఇంటి పన్ను చెల్లిస్తున్నారంటూ కార్డుల కోత పెడుతోంది. మునుముందు ఇంకేమి మెలికలు పెట్టి కార్డులు కోత వేస్తారోనని పేదలు ఆందోళనకు గురవుతున్నారు. సాధికార సర్వే ఎఫెక్ట్ ప్రజా సాధికార సర్వే పేరుతో దాదాపు 22 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించి ఆధార్‌కు అనుసంధానం చేసింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పేదలపై పడింది. ఇందులోని సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల తొలగింపు చేపట్టింది. కొందరు పేదలు స్వయం ఉపాధి కోసం బ్యాంకులో రుణం తీసుకుని నాలుగు చక్రాల వాహనం (జీపు) కొనుగోలు చేశారు. దాన్ని బాడుగకు నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు చక్రాల వాహనం ఉందనే కారణంగా ఇప్పటికే పలువురికి రేషన్ కార్డులు తొలగించారు. వార్షిక ఆదాయం రూ.65 వేలకు మించి ఉందంటూ కొందరికి ఇచ్చిన కార్డులను తొలగించారు. ఇంటి పన్ను చెల్లిస్తున్నారంటూ తాజాగా కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. పట్టణాల్లో ఇంటి పన్ను రూ.500 లోపు చెల్లిస్తున్న తెల్లకార్డుదారులకు రూ.200 కొళాయి కనెక్షన్ ఇస్తున్నారు. అంటే రూ.500 లోపు పన్ను చెల్లించేవారు తెల్లకార్డుకు అర్హులనేది స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు రూ.305 ఇంటి పన్ను చెల్లిస్తున్న వారికీ రేషన్ కార్డు తొలగించడం చూస్తే సొంత ఇల్లు ఉంటే కార్డు తొలగిస్తారనేది స్పష్టమవుతోంది.