రేషన్‌ కార్డులపై..  పునరాలోచన..! | The Government is Considering Canceling Cards for Those Who Do Not Take Ration Items in Nalgonda | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డులపై..  పునరాలోచన..!

Published Sat, Jul 27 2019 8:34 AM | Last Updated on Sat, Jul 27 2019 8:35 AM

The Government is Considering Canceling Cards for Those Who Do Not Take Ration Items in Nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దారిద్య్ర రేఖకు దిగువ (బీపీఎల్‌)న ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చిన కార్డులు నామమాత్రంగా మిగులుతున్నాయి. ఆ కార్డు కావాలనుకుంటున్న వారు.. సదరు కార్డు ద్వారా ఇచ్చే రేషన్‌ బియ్యం మాత్రం వద్దనుకుంటున్నారు. ప్రభుత్వం రేషన్‌ కార్డును సంక్షేమ పథకాలకు లింక్‌ పెట్టింది. దీంతో అవసరం ఉన్నా.. లేకున్నా, అర్హులు కాకున్నా అడ్డదారిన కార్డులు పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ప్రతి నెలా కొత్తరేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. కొత్త కార్డుల కోసం ఇబ్బడి ముబ్బడిగా అందుతున్న దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటి విడతగా ఆరు నెలలు బియ్యం తీసుకోని వారిని గుర్తించి జాబితాలను సిద్ధం చేస్తోంది. ఈప్రక్రియ కొలిక్కి వస్తేఆ జాబితాలో ఉన్నవారి రేషన్‌ కార్డులకు చెక్‌ పెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం.

జిల్లాలో 4.61లక్షల కార్డులు..
జిల్లా వ్యాప్తంగా 991 రేషన్‌ షాపుల పరిధిలో 4,61,219 బీపీఎల్‌ కార్డుదారులు ఉన్నారు. వీటి ద్వారా ప్రతి నెలా రేషన్‌ సరుకులను సరఫరా చేస్తున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. కాగా, రేషన్‌ సరుకుల పంపిణీలో జరిగే అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రెండేళ్ల కిందట ప్రభుత్వం ఈ–పాస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో కార్డుదారుని కుటుంబ సభ్యులు రేషన్‌ దుకాణానికి వెళ్లి వేలిముద్ర వేస్తే తప్ప రేషన్‌ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ప్రతి నెలా రేషన్‌ సరుకులు తీసుకోవడానికి కొందరు ముందుకు రావడం లేదు. జిల్లాలో చాలా మంది కార్డుదారులు రేషన్‌ తీసుకోకపోవడంతో ప్రతినెలా రేషన్‌ సరుకులు మిగులుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిస్థితిపైనే దృష్టి సారించిందని అధికారులు చెబుతున్నారు.

సంక్షేమ పథకాల లింక్‌తోనే అడ్డదారిన కార్డులు..
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బీపీఎల్‌ కార్డులు లింక్‌ పెట్టడం వల్లే చాలా మంది అడ్డదారిలో రేషన్‌ కార్డులు పొందారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పిల్లల చదువులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు పొందేందుకు ఏదో విధంగా కార్డులు పొందుతున్నారు. సిబ్బందికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కొందరు కార్డులు పొందుతుండగా, మరికొందరు అంతోఇంతో ముట్టజెప్పి కార్డులు పొందారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కార్డులు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. కాగా, ప్రస్తుతం ఆరు మాసాలుగా అసలే రేషన్‌ సరుకులు తీసుకోని వారి పేర్లను తొలగించి ఆ తర్వాత మరింత పకడ్బందీగా అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 ప్రతినెలా 5వేల క్వింటాళ్లకు పైగా బియ్యం మిగులు..
ఆరు మాసాలుగా నలభై వేల పైచిలుకు మంది రేషన్‌ తీసుకోని కారణంగా ప్రతినెలా 5వేల పైచిలుకు క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నట్లు గుర్తించారు. గతంలో ఈ–పాస్‌ విధానం లేని సమయంలో ఇలా మిగిలిపోయిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టేంది. పెద్ద మొత్తంలో రాష్ట్ర సరిహద్దులు దాటేది. ఇపుడు ఈ–పాస్‌ విధానంలో రేషన్‌ కార్డుదారుడు వేలిముద్ర వేస్తే కానీ సరుకు విక్రయించడం కుదరదు. లేదంటే ఒక డీలర్‌ దగ్గర స్టాకు అలా మిగిలిపోవాల్సిందే. ఇలా స్టాకు పెద్ద మొత్తంలో మిగిలి పోతుండడంతో రేషన్‌ బియ్యం అవసరం లేని వారెవరో తేలిపోయింది. దీంతో వీరంతా అవసరం లేకున్నా కార్డులు పొందారని గుర్తించి వాటిని రద్దు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని నిర్ణయించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

రేషన్‌ తీసుకోనివారి వివరాల సేకరణ..
జిల్లా వ్యాప్తంగా 4,61,219 మంది రేషన్‌ కార్డు దారులు ఉండగా, వీరిలో ఆరు నెలలుగా 40,440 మంది కార్డులదారులు రేషన్‌ షాపుల గడప తొక్కలేదు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు రేషన్‌ బియ్యాన్ని తీసుకోని వారి లెక్క ఆన్‌లైన్‌లోనే తేలిపోయింది. ఈ విషయం పై విచారణ జరిపి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. రేషన్‌ బియ్యం తీసుకోని కార్డుదారులంతా ఊళ్లోనే ఉంటున్నారా..? వారు ఎందుకు బియ్యం తీసుకోవడం లేదు..? చనిపోయినవారు ఎవరైనా ఉన్నారా..? లేదా రేషన్‌ బియ్యం తినడం ఇష్టం లేక వాటిని వదిలేస్తున్నారా..? అన్న వివరాలన్నింటినీ సేకరించేందుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement