రాయచోటి టౌన్, న్యూస్‌లైన్: వివాహేతర సంబంధానికి అడ్డు రావడాన్ని సహించలేకపోయాడు. చాటుమాటుగా సాగుతున్న తన వ్యవహారాన్ని పసిగట్టి, నీలదీయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి దోషిగా తేల్చడంతో మృగంగా మారిపోయాడు. అగ్నిసాక్షిగా కట్టిన తాళినే ఎగతాళి చేశాడు. ముగ్గురు బిడ్డలతో కలసి ప్రశాంతంగా నిద్రిస్తున్న భార్యపై దుడ్డుకర్రతో కసితీరా కొట్టి కాటికి పంపాడు. అంతటితో ఆగక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఈ సంఘటనతో నిద్ర నుంచి మేల్కొన్న పిల్లలు గట్టిగా కేకలు వేయగా, ఇరుగు పొరుగు వారు రావడంతో అక్కడి నుంచి జారుకున్నాడా హంతకుడు. రాయచోటిలో శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక జరిగిన సంఘటన తెల్లారే సరికి దావనలంలా వ్యాపించడంతో రాయచోటి ఒక్కసారిగా మూగబోయింది.
రాయచోటిలోని 30వ వార్డుకు చెందిన రెడ్డెయ్య(44) లక్కిరెడ్డిపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగులమ్మ, సుబ్బన్న కుమార్తె యశోదమ్మతో పాతికేళ్ల కిందట వివాహమైంది. వీరికి సునీల్(20), సునీత(18), తేజస్విని(14) సంతానం. వృత్తిరీత్యా దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోసించే రెడ్డెయ్య ఏడేళ్ల కిందట బెంగళూరుకు వెళ్లి అక్కడి ఓ కంపెనీలో టైలర్‌గా చేరాడు. తన ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని ఇక్కడ ఉంటున్న భార్యా, పిల్లలకు పంపేవాడు. తను నెలకో, రెణ్ణెళ్లకో వచ్చిపోయేవాడు. ఆ తరువాత డబ్బులు సక్రమంగా పంపకపోగా, ఇంటికి సైతం నెలల తరబడి వచ్చే వాడు కాదు. ఇదేమంటే డొంక తిరుగుడు సమాధానాలు చెప్పేవాడు.
నిజమైన అనుమానాలు
భర్తపై అనుమానం వచ్చిన యశోదమ్మ ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆరా తీయడం మొదలుపెట్టారు. భర్త యవ్వారాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్న ఆమె నిశ్ఛేష్టురాలైంది. బెంగళూరులోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న ఆమె పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని భర్తను మంచిగా చెప్పింది. అతనిలో మార్పు రాకపోవడంతో నిలదీసింది.
అయినా ఫలితం లేకపోవడంతో తన పుట్టింటి వారితో పాటు మెట్టినింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తరువాత పెద్ద మనుషులతో చెప్పించారు. బెంగళూరుకు వెళ్లకూడదని, ఇక్కడే ఉంటూ టైలరింగ్ చేసుకుంటూ బతకాలని పెద్ద మనుషులు చెప్పారు. అందుకు అంగీకరించి ఇంటిపట్టునే ఉంటున్న రెడ్డయ్య తిన్నగా భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఒక్కొక్కటిగా తెగనమ్మి ప్రియురాలికి పంపేవాడు. దీంతో చిర్రెత్తిన యశోదమ్మ తన భర్త చేస్తున్న తప్పులను నిలదీసింది.
కసి తీరా చంపి.. ఆపై పరారీ
రోజులాగే యశోదమ్మ తన ముగ్గురు బిడ్డలు, భర్తలో కలసి శనివారం రాత్రి నిద్రపోయింది. రాత్రి బాగా పొద్దుపోయాక రెడ్డయ్యలో మృగం మేల్కొన్నాడు. అంతే దుడ్డుకర్ర తీసుకుని నిద్రిస్తున్న భార్యపై కసి తీరా బాది చంపేశాడు. అంతటితో ఊరుకోక పిల్లలను ఇంట్లోనే ఉంచి గడియపెట్టి మృతదేహంపై కిరోసిన్ పోసేందుకు ప్రయత్నించాడు. అయితే పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన రెడ్డయ్య ఒక్క ఉదుటున అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పాడు. సమాచారం అందుకున్న పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, రాయచోటి అర్బన్ సీఐ శ్రీరాములు తమ సిబ్బందితో ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
అడ్డొస్తోందని..
Published Mon, Sep 16 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement