త్వరలో.. | flight transportation will provide various districts | Sakshi
Sakshi News home page

త్వరలో..

Published Tue, Jan 14 2014 2:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

flight transportation will provide various districts

సాక్షి, కడప:  మీరు కడప నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్నారా.. కొద్దిరోజులు ఆగండి తిరుపతికే కాదు... కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, న్యూఢిల్లీలాంటి మహానగరాలకూ వెళ్లొచ్చు. కడపలో కొత్తగా  నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టు పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరులో  ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.  విమానయాన శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే మార్చి నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి.
 
 కడపలో 1953 నుంచి విమానాశ్రయం ఉన్నప్పటికీ విమానాల  రాకపోకలు మాత్రం పూర్తిస్థాయిలో లేవు. దీంతో కడపలో అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని  మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఇందుకోసం రూ. 33 కోట్లను ఒకే విడతగా విడుదల చేశారు. 1060 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. రెండు విడతల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను చేపట్టారు.
 
 రూ.21కోట్లతో మొదటి విడత పనులు:
 మొదటి విడత పనులను రూ.21 కోట్లతో 2008 జూన్‌లో చేపట్టారు. 2009 డిసెంబర్‌కు పనులను పూర్తి చేశారు. 6వేల అడుగుల రన్‌వే, ఆఫ్రాన్, టాక్సీతో పాటు 1060 ఎకరాల పరిధికి రక్షణ గోడ నిర్మించారు. రెండో విడత పనులను 2010 అక్టోబరు 10న చేపట్టారు. రూ. 13 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో టెర్మినల్ బిల్డింగ్ తో పాటు ఏటీసీ( ఏయిర్ ట్రాఫిక్ సర్వీసు), పవర్ హౌస్, లింకు రోడ్డులు, కార్‌పార్కింగ్, సివిల్, ఎలక్ట్రికల్ పనులను చేపట్టారు. రెండో విడత పనులు 2011 డిసెంబరుకే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో గడువు జూన్ వరకు వాయిదా పడింది. ప్రస్తుతం టెర్మినల్ బిల్డింగ్‌తో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి.
 
 ముఖద్వారం ఒక్కటే మిగిలింది:
 ఎయిర్‌పోర్టు మెయిన్‌గేట్ ఎంట్రెన్స్(ముఖద్వారం) నిర్మాణం పూర్తయినా గత  డిసెంబర్ 20న జరిగిన సమావేశంలో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ముఖద్వారాన్ని పెద్దగా, అందంగా తీర్చిదిద్దాలని ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. అది మినహా ఎయిర్‌పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. టెర్మినల్‌కు దగ్గరలోనే కార్‌పార్కింగ్‌ను నిర్మించారు. ఇన్‌వే, అవుట్‌వే లింకు రోడ్లను పూర్తి చేశారు.
 
 పలు విమాన సంస్థల దరఖాస్తులు:
 కడప నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్ వేస్, స్పైజెట్‌లు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్‌లెన్స్ సర్వీసులు ఎలాగూ నడుస్తాయి. అయితే కడప విమానాశ్ర యాన్ని డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దీంతో  ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులకు  మాత్రమే సౌకర్యం ఉంటుంది. బోయింగ్, ఎయిర్ బస్సులు నడిపేందుకు కడప ఎయిర్‌పోర్టు రన్‌వే అనుకూలించదు.
 
 అన్ని వర్గాల వారికి  సౌలభ్యం
 పారిశ్రామిక అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ జిల్లా పురోగతిని సాధించడంతో జిల్లా కేంద్రానికి విమానసౌకర్యం అనివార్యమైంది. ప్రముఖ వైద్యుల రాకపోకలు, వైవీయూ ప్రొఫెసర్లు, సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారులకు కడప ఎయిర్‌పోర్టు సౌలభ్యంగా ఉంటుంది. దీంతో పాటు కడప నుంచి ‘కనెక్టింగ్ ఫ్లైట్’లు నడపనున్నారు. కడప నుంచి ఏ ప్రాంతానికైనా టిక్కెట్టు తీసుకుని ప్రయాణించవచ్చు. అయితే ఇతర ఎయిర్‌పోర్టులలో విమానం మారాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement