పిల్లలకు చెలగాటం బాల్యానికి ప్రాణసంకటం | The Tom and Jerry Show see the children | Sakshi
Sakshi News home page

పిల్లలకు చెలగాటం బాల్యానికి ప్రాణసంకటం

Published Sun, May 10 2015 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

కార్టూన్లలో, వీడియో గేమ్స్‌లో హింస పిల్లలపై ఏమేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

కార్టూన్లలో, వీడియో గేమ్స్‌లో హింస పిల్లలపై ఏమేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

 పిల్లలు గొడవ చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
 ఏదో కార్టూన్ చానల్ ముందు పెడితే సరి!
 కొందరు పేరెంట్స్ ఇలా చేస్తున్నారు.
 పిల్లలు మన కాళ్లకు అడ్డంపడుతుంటే ఏమి చేయాలి?
 సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్ ఇస్తే పోలా!
 ఇది మరికొందరు పేరెంట్స్ చేస్తున్నది.
 ప్రపంచం పరిగెడుతోంది.
 దాని వెంట మనం పరిగెడుతున్నాము.


పిల్లల భవిష్యత్ కోసమే తెగ పరిగెడుతున్నాము.
కానీ వాళ్ల చిన్నిచిన్ని మనసుల్లో ఎలాంటి ఆలోచనలు
పరిగెడుతున్నాయో తెలుసుకోకపోతే...

 
టామ్.. పెంపుడు పిల్లి. జెర్రీ.. చిట్టెలుక.
టామ్ వట్టి ఉడుకుమోతు. జెర్రీ ఆటపట్టించే రకం.

ఈ రెండిటి మధ్య జరిగే బీభత్స, భయానక, హింసాత్మక పోరాట దృశ్యాలే... టామ్ అండ్ జెర్రీ. అయితే ఇక్కడ భయం... పెద్దదైన పిల్లిది! బీభత్సం... చిట్టిదైన ఎలుకది!! వీటి మధ్య జరిగే హింస ‘స్లాప్‌స్టిక్ కామెడీ’.
 బ్రహ్మానందాన్ని రవితేజ ఫటా ఫటా ఫటా ఫటా కొడుతుంటే కడుపు ముక్కలు చెక్కలు చేసుకునే పెద్దవాళ్ల లాంటి పిల్లల కామెడీ షో ఈ టామ్ అండ్ జెర్రీ.
 కొట్టడమే కామెడి. కొట్టడంలో ఎంత హింస ఉంటే అంత కామెడీ. ట్రాజెడీ ఏమిటంటే మన పిల్లలకు ఇందులోని హింస విపరీతంగా నచ్చుతోంది. బిట్టు బిట్టు ఎంజాయ్ చేస్తున్నారు.
 
పిల్లలకనేమిటి? పెద్దలకు కూడా. పాలస్తీనా స్వాతంత్య్ర సమర యోధుడు పైగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన యాసర్ అరాఫత్  ‘‘పిల్లి కాకుండా, ఎంతో చిన్నదైన చిట్టెలుక ఎప్పుడూ గెలుస్తూ ఉండడం నాకు నచ్చుతుంది’’ అనేవారట.  చిన్నప్పుడు బడిలో, ఇంటి పక్కన, మనల్ని వేధించే, ఆటపట్టించే పెద్ద పిల్లలను దబదబా బాదేసి, తలను నేలకేసి కొట్టేసేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. నిజ జీవితంలో అలాంటివి సాధ్యం కాదు కాబట్టే టామ్ అండ్ జెర్రీ పిల్లలకు, పెద్దలకు నచ్చుతోంది.
 
పిల్లలపై ప్రభావం
పెద్దలకు నచ్చితే చూసి అక్కడితో వదిలేస్తారు. పిల్లలు అనుకరించే ప్రయత్నం చేస్తారు. హింసలో ప్రేరేపించే గుణం ఉంటుంది. పిల్లల్లో త్వరగా ప్రేరణకు గురయ్యే బలహీనత ఉంటుంది. అందుకే  టామ్ అండ్ జెర్రీ, పాపోయ్, 3 స్టూజెస్, సూపర్‌మేన్, లూనీ ట్యూన్స్, స్కూబీ డూ, బఫీ ది వాంపైర్ స్లేయర్, అమెరికన్‌డాల్ వంటి కార్టూన్ షోలు ఇంతగా పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి.  అయితే - ‘‘ఆకట్టుకోవడం వరకు మంచిదేకానీ, వాటిల్లోని క్యారెక్టర్లు రోజంతా పిల్లల్ని అలా కట్టి పడేసి ఉంచుతున్నాయి. వారిలో దుడుకు స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి’’ అని ఐయోవా స్టేట్ యూనివర్శిటీ తాజా అధ్యయనంలో వెల్లడయింది! ఆ అధ్యయన ఫలితాలు ఎంతో ఆసక్తికరంగా, అదే సమయంలో తల్లిదండ్రులకు, టీచర్లకు, సమాజానికి ఆందోళన కలిగించేగా ఉన్నాయి.
 
హింసను తగ్గిస్తే కామెడీ తగ్గిపోదా?
కంటి చూపుతో చంపేస్తా అంటుంది టామ్. కనుబొమతో లేపేస్తా అంటుంది జెర్రీ. ఎంత కామెడీ! ఈ చంపేయడం, లేపేయడంతోనే కదా ‘టామ్ అండ్ జెర్రీ’ సూపర్ హిట్ అయింది. అందుకే ఇలాంటి అత్యంత ప్రజాదరణ పొందిన కామిక్ సీరియళ్ల వరకైనా హింస ఉండాల్సిందేనని కామిక్ ప్రియులు అంటున్నారు. పైగా టామ్ అండ్ జెర్రీలోని హింసను హింస అనకూడదని వాదిస్తున్నారు.
 
ఇంతకీ టామ్ అండ్ జెర్రీ వయలెంటేనా?
ఎంత సెలైంట్‌గా ఉంటే మర్డర్ అంత వయొలెంట్‌గా ఉంటుందని ఓ తెలుగు సినిమాలో విలన్ డైలాగ్. టామ్ అండ్ జెర్రీలో మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. అవి కూడా ఎంతో కామిక్‌గా. ఇక ఈ సీరీస్ ప్రేరేపించే హింస గురించి మాట్లాడవలసి వస్తే, అసలలాంటే ప్రేరేపణలే కలగవనీ; కల్పనకు, వాస్తవానికి మధ్య తేడాను పిల్లలు ఇట్టే పసిగట్టగలరని టామ్ అండ్ జెర్రీ ప్రొడ్యూసర్లు ఏనాటి నుంచో చెబుతున్న మాట. నాలుగైదేళ్ల వయసుకే పిల్లల్లో వాస్తవాలను గ్రహించే శక్తి వస్తుంది. టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటాయో తెలుసు. అవి ఊహాత్మకమైన క్యారెక్టర్‌లు అని, బయట అలా ఉండదని వారికి పనిగట్టుకుని చెప్పే పనిలేదు. ఆ దృశ్యాలను చూసి పిల్లలు మరీ ఎక్సయిట్ అయినప్పుడు, పక్కనే ఉన్న పెద్దవాళ్లు అది నిజం కాదని చెప్పొచ్చు అంటారు కొందరు. అది మానేసి టీవీ కట్టేయడం, పిల్లల్ని టీవీ ముందు నుంచి తరిమేయడం  పిల్లల్ని హింస నుంచి కాపాడ్డం కోసం పిల్లలపై హింసను ప్రయోగించడం అని కూడా అంటున్నారు.
 
మంచి విషయాలే లేవా?
కామెడీ కన్నా మంచి ఏముంటుంది? కామెడీని మించిన ఆరోగ్యం ఏముంటుంది. టామ్ అండ్ జెర్రీ వట్టి అర్థంలేని కొట్లాటల కామెడీ షో కాదు. అందులో విలువలూ ఉన్నాయి. ఆ విలువల గురించి పెద్దలే పిల్లలకు వివరంగా చెప్పాలి. టామ్‌ని అస్తమానం గాభరా పెడుతుండే జెర్రీ ఎన్నిసార్లు టామ్‌ని కష్టాల నుంచి గట్టెక్కించలేదు? టామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా వె తికి పెట్టింది కదా జెర్రీ! ఎక్కడి నుంచో వచ్చిన అపరిచిత పిల్లులు టామ్‌ని ఏడిపిస్తుంటే, జెర్రీనే కదా వెళ్లి టామ్‌కి సహాయంగా నిలిచింది. ఎలా మర్చిపోతాం? పిల్లల్ని ఎలా మర్చిపోనిస్తాం. జీవితంలోని ఒత్తిళ్లను, అలసటను కామిక్ షోలు పోగొడతాయి. మనల్ని నవ్వించడం కోసం వాటిల్లోని పాత్రలు అష్టకష్టాలు పడతాయి. కనుక పిల్లలను గమనించుకుంటూ వారి ధోరణులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్లడమే దారి, అన్నది మరోవాదన.
 
ఐయోవా అధ్యయనం

10 -11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల మీద కార్టూన్ సీరియళ్ల ప్రభావం ఎలా ఉంటుందనడానికి ఐయోవా యూనివర్సిటీ చేసిన అధ్యయన ఫలితాలు ఇలా ఉన్నాయి...

 
కార్టూన్ సీరియళ్లు చూసి పిల్లలు తెంపిరితనాన్ని అలవ రచుకుంటున్నారు.
గాసిప్స్ చెప్పుకోవడం, వదంతుల్ని వ్యాపించడం, ఎక్స్‌ప్రెషన్‌లో అవసరానికి మించి కళ్లు తిప్పడం వంటివి చేస్తున్నారు.
కార్టూన్ షోలలోని హింస, దుడుకు ధోరణులు ప్రత్యక్షంగానో, ప్రరోక్షంగానో చిన్నారుల ప్రవర్తనలపై నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి.
పరుగులు తీసే కామెక్ షోలలో గంటకు కనీసం 26 హింసాత్మక దృశ్యాలు ఉంటున్నాయి. అదే పెద్దవాళ్ల సీరియళ్లలో అయితే ఈ దృశ్యాలు ఐదారు మాత్రమే ఉంటాయి.
టీవీ పరిశ్రమ కార్టూన్ షోలలోని హింసను రెండుగా విభజించి చూస్తోంది. ఒకటి యానిమేటెడ్ వయలెన్స్. ఇంకోటి నాన్ యానిమేటెడ్  వయొలెన్స్. టామ్ అండ్ జెర్రీ లాంటి యానిమేటెడ్ హింస వల్ల నష్టమేమీ లేదని అంటోంది. అది నిజం కాదు. హింస బొమ్మల రూపంలో ఉన్నా, మనుషుల రూపంలో ఉన్నా హింసే.
కార్టూన్ సిరీస్‌లలోని భాషను, ప్రవర్తనలను పిల్లలు తమ స్కూళ్లలో, ఇంటి పక్కల అనుకరిస్తున్నారు. చిన్న పిల్లలను ఏడిపిస్తున్నారు.
బాలికలు కూడా అబ్బాయిల్లా రఫ్‌గా, ఇండీసెంట్‌గా తయారవుతున్నారు.
కామెడీ షో చూస్తున్నప్పుడు పేరెంట్స్ ఛానల్ మార్చమంటేనో, టీవీ కట్టేయమంటేనో పిల్లలకు విపరీతమైన కోపం వస్తోంది. ఆ కోపాన్ని... ఇంటోని వస్తువులను విసిరేయడం, తల్లిదండ్రుల మీద పడి కొట్టడం, వారిని దుర్భాషలాడడం వంటి చర్యలతో పిల్లలు ప్రదర్శిస్తున్నారు. ఇదంతా కూడా కార్టూన్ షోలలోని హింసాత్మక దృశ్యాల ప్రభావమే.
స్కూల్లో గ్రూపులు కడుతున్నారు. వర్గ విభేదాలకు, తగాదాలకు, ఇతర  అసాంఘిక వైఖరులకు ఈ గ్రూపులు కారణం అవుతున్నాయి.
 
అనుకరణ ప్రమాదం
పిల్లలు ఏ విషయాలనైనా పెద్దల నుంచి సమాజం నుంచి ‘గమనింపు’ (అబ్జర్వేషన్)తో నేర్చుకుంటారు. మనల్ని, సమాజాన్ని అనుకరిస్తారు. దీన్ని ‘లెర్నింగ్ ఫినామినా’ అంటారు. ఈ ప్రక్రియలో సమాజంలో ఒక భాగమైన టీవీ మాస్‌మీడియాను పిల్లలు అనుకరించే ప్రమాదం ఉంది. మనకు కోపం ఉన్నవారినీ, మనకు ఇష్టం లేనివారిపై అలా కసి తీర్చుకోవచ్చనే అభిప్రాయం పిల్లల్లో నెలకొనే అవకాశం ఉంది. ఇలా హింసకు పాల్పడితే సమాజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. అప్పుడే పిల్లలు వినోదానికీ, హింసకూ మధ్య ఉన్న ఆ విభజన రేఖను తెలుసుకోగలుగుతారు.
- డాక్టర్ శేఖర్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement