
జర్నలిస్టు అంటే ఎవరు? ప్రపంచానికి వార్తలు అందించేవాడు. ప్రజలకు కీడు చేసే విషయాలను తెలిపి చైతన్యపరిచేవాడు. ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగట్టేవాడు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేసే యుద్ధాలలో ఎంత విధ్వంసం జరుగుతుందో చూపేవాడు. జర్నలిస్టులు కొందరు ఆఫీసులో కూచుని పని చేస్తే మరికొందరు ఫీల్డులో ఉంటారు. ఆ ఫీల్టు యుద్ధ క్షేత్రమైతే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తారు.
ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాపై యుద్ధదాడులు చేస్తోంది. ఇది టీవీల్లో మీరూ చూసి ఉంటారు. ఇజ్రాయిల్– గాజా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో గాజాకు చెందిన 12 ఏళ్ల సుమయ్యా జర్నలిస్టు అవతారం ఎత్తింది. స్థానికంగా జరుగుతున్న అంశాల గురించి రిపోర్ట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.
‘షిరీన్ అబూ’ అనే మహిళా జర్నలిస్టు కొంతకాలంగా గాజాపై జరుగుతున్న దాడుల గురించి అల్ జజీరా అనే ఛానెల్‌లో రిపోర్టింగ్ చేస్తూ ఉండేది. అయితే ఆమె మరణించింది. క్షేత్రస్థాయిలో ఆమె చెప్పే వార్తలు వింటూ ఉన్న సుమయ్యాకు ఆమె మరణం తీరని బాధను మిగిల్చింది. ఆమె ఆపిన పనని తాను పూర్తి చేయాలని భావించింది.
వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ముందుగా వారు భయపడ్డారు. అప్పటికే వందమంది దాకా జర్నలిస్టులు యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రాణాలు వదిలారు. అంత అనుభవం ఉన్నవారికే అలా జరిగినప్పుడు తమ కూతురు యుద్ధరంగంలో ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అయితే సుమయ్యా వారికి ధైర్యం చెప్పింది.
స్థానికంగా జరుగుతున్న విషయాలను ప్రపంచానికి చూపించడం తన బాధ్యత అని వారికి వివరించింది. వారి అనుమతితో జర్నలిస్టుగా మారింది. అల్ జజీరా ఛానెల్లో అతి చిన్న జర్నలిస్టుగా మారింది. గాజాపై జరుగుతున్న దాడులు, అక్కడి ప్రజల స్థితిగతుల్ని ప్రపంచానికి వివరించింది.
ఏమాత్రం బెరుకు లేకుండా తను చెప్పే విషయాలు అందర్నీ ఆలోచింపజేశాయి. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆగిపోవాలని, అంతా శాంతి నెలకొనాలని అంటోంది. అదే తన లక్ష్యమని, అందుకే ఈ రంగంలోకి వచ్చానని వివరిస్తోంది. తన ధైర్యానికి, ఆలోచనలకీ అందరూ శెభాష్ అంటున్నారు.
(చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. వారికి ఏం నేర్పిస్తున్నారు?)