ఇజ్రాయిల్.. గాజాలో భూతల దాడులు ముమ్మరం చేసింది. వైమానిక దాడుల వేగం పెంచింది. హమాస్ ఉగ్రవా దులను పూర్తిగా ఏరిపారేసే వరకు యుద్ధం ఆగదని తేల్చి చెబుతోంది. గాజాని పూర్తిగా జల్లెడ పట్టి, శత్రువు అనే వాడు లేకుండా చేస్తానంటోంది. గాజాలో అమాయకుల ఉసురు తీయడంలో ఇజ్రాయిల్ సేనలు చెలరేగిపోతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల్లో ప్రతి రోజు 420 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
‘గ్రేవ్‌యార్ట్ ఫర్ చిల్డ్రన్’.. ఇది గాజాలో కొనసాగుతోన్న మారణహోమాన్ని చూసి, ఆ ప్రాంతానికి యూనిసెఫ్ పెట్టిన పేరు. తెలుగులో దీని అర్థం చిన్నారుల శశ్మాన వాటిక. ఇజ్రాయిల్ దాడుల్లో ఎక్కువుగా బలై పోతున్నది అమాయక పౌరులే. వారిలోనూ చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గాజాలో ఇజ్రాయిల్ నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా పాలుతాగే చిన్నారులు సైతం నెత్తుటి ముద్దలుగా మారిపోతున్నారు.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో మరణాల సంఖ్య వేలలోనే ఉందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒక్క గాజాలోనే మరణాల సంఖ్య 11వేలు దాటింది. ఈ భీకర పోరులో చిన్నారులు బలవుతుండటం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ఇప్పటివరకు 4,100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, 2,300 మంది చిన్నారుల జాడ తెలియడం లేదు. లెక్కలేనంతమంది చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు. ఇక అయిన వాళ్లందరినీ కోల్పోయిన చిన్నారుల సంఖ్య కూడా వేలలోనే ఉంది.
మరోవైపు గాజాలో లక్షల మంది చిన్నారులు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతంలో సాధారణంగా వినియోగించే మంచి నీటిలో ఐదు శాతమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంతో డీహైడ్రేషన్‌తోనూ పిల్లలు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. తీవ్రంగా గాయపడిన చిన్నారులకు సరైన వైద్యసేవలు అందించడం పెద్ద సవాల్‌గా మారింది. ఒకవైపు గాయాలు, మరోవైపు మానసిక భయాలు వారిని వెంటాడుతున్నాయి. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ గాలిలో దీపంలా మారింది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఇజ్రాయిల్, పాలస్తీనాలను దాటి పశ్చిమాసియా అంతటా విస్తరిస్తుందనే ఆందోళన పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: గాజా సిటీపై దండయాత్ర
Comments
Please login to add a commentAdd a comment