ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం ఆగి, గాజా ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నిన్నటి దాకా ఉన్న కొద్దిపాటి ఆశ ఇప్పుడు ఆవిరైపోయినట్టు అనిపిస్తోంది. హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా చంపిన తీరు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనియేను చంపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించలేదు కానీ, ఆయన చనిపోవాలని ఇజ్రాయెలీల కన్నా ఎక్కువగా మరెవరూ కోరుకోరన్నది నిజం. మరోపక్క ఆ హత్యకు కొద్ది గంటల ముందే మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇరాన్‌కు మిత్రపక్షమైన హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు సీనియర్ మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ ప్రాణాలు గాలిలో కలిశాయి.
గత వారం (ఆక్రమిత) గోలన్ హైట్స్‌లో రాకెట్ దాడితో 12 మంది పిల్లల్ని పొట్టనబెట్టుకున్న ఆయనను మాత్రం అడ్డు తొలగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలా ఆ దేశ శత్రువులకు రెండు రోజుల్లో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ ఒప్పుదల మాటెలా ఉన్నా... ఇరాన్ నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారోత్సవానికి హనియే వచ్చివుండగా జరిగిన ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధినాయకుడు అయతొల్లా ఖొమేనీ గర్జించారు. ప్రతిగా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. వెరసి, వ్యవహారం ఇజ్రాయెల్ – ఇరాన్‌ల మధ్య నేరు ఘర్షణకు దారి తీస్తోంది. మొత్తం గాజా కథ మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది.
అసలే సంక్లిష్టంగా ఉన్న పశ్చిమాసియా సంక్షోభం కాస్తా హనియే హత్యోదంతంతో మరింత సంక్లిష్టంగా మారింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని చేస్తున్న శాంతి ప్రయత్నాలకు తాజా ఘటన విఘాతం కల్పించింది. ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి చర్చలు జరుగుతున్నప్పుడు... ఒక పక్షం వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తినే చంపేస్తే ఇక మధ్యవర్తి త్వం ఏం సఫలమవుతుంది? రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్న ఖతార్ పక్షాన ఆ దేశ ప్రధాని సరిగ్గా ఆ మాటే అన్నారు. ఆ మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. హనియేపై యుద్ధ నేరాలున్న మాట, అతనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇటీవలే వారెంట్ జారీ చేసిన మాట నిజమే.
కానీ, హమాస్ గ్రూపులో మిలటరీ నేత యాహ్యా సిన్వర్ సహా ఇతర పిడివాదులతో పోలిస్తే రాజీ చర్చల విషయంలో రాజకీయ విభాగ నేత హనియే కొంతవరకు ఆచరణవాది అంటారు. ఇప్పుడు ఆయనే హత్యకు గురయ్యాడు గనక కథ మొదటికి వచ్చింది. కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరినంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లబడతాయని గ్యారెంటీ లేదు కానీ, అసలు ఒప్పందమే లేకపోతే ఉద్రిక్తతలు తగ్గే అవకాశమే లేదు. మొత్తంగా ఈ ఘటన ఆ ప్రాంత సుస్థిరతనే దెబ్బ తీస్తూ, గాజా యుద్ధాన్ని చివరకు పెను ప్రాంతీయ ఘర్షణ స్థాయికి తీసుకెళుతోంది.
అతిథిగా వచ్చిన మిత్రపక్షీయుణ్ణి భద్రత ఎక్కువగా ఉండే సమయంలోనే సొంతగడ్డపై, స్వకీయ గూఢచర్య వైఫల్యంతో పోగొట్టుకోవడం ఇరాన్‌కు తీరని తలవంపులే. ఖొమేనీ గర్జించినట్టు ఇరాన్ దీనికి బదులు తీర్చుకోవచ్చు. అదే జరిగితే ఇజ్రాయెల్ ప్రతిచర్యా తప్పదు. నిజానికి, ఆ మధ్య ఏప్రి ల్‌లో డెమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీలో తమ జనరల్స్ ఇద్దరిని హత్య చేసినప్పుడు ఇరాన్ తొలి సారిగా నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక దాడి జరిపింది. వందలాది క్షిపణులు ప్రయోగించింది. అదృష్టవశాత్తూ అప్పట్లో అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా పరిణమించలేదు. ప్రతిసారీ అలా ఆగుతుందనుకోలేం.
తాజా ఘటనలతో యెమెన్ నుంచి హౌతీలు ఎర్రసముద్రంలో దాడులు ఇబ్బడి ముబ్బడి చేస్తారు. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్‌ను చూస్తూ ఊరుకోదు. అసలు నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు చేసిన దుర్మార్గమైన దాడి ఇక్కడికి తెచ్చింది. అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం తప్పదనే భయాందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే, ఏ పక్షమూ ఆ రకమైన యుద్ధం కోరుకోవడం లేదు కానీ, తమ చర్యలతో ఎప్పటి కప్పుడు కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం తీవ్రతరమయ్యే ముప్పు తప్పాలంటే ముందు గాజాలో కాల్పుల విరమణ జరగాలి.
అయితే, వరస చూస్తుంటే హమాస్‌పై పూర్తి విజయమే లక్ష్యమన్న నెతన్యాహూ మాటలనే ఇజ్రాయెల్ ఆచరిస్తోందని అనిపిస్తోంది. పది నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఒక్క గాజాలోనే ఇప్పటికి 40 వేల మంది చనిపోయారు. ఇలాగే ముందుకు సాగితే యుద్ధం ఇతర ప్రాంతాలకూ విస్తరించి, మరింత ప్రాణనష్టం తప్పదు. మానవీయ సంక్షోభమూ ఆగదు. హనియే హత్యతో హమాస్ తల లేని మొండెమైంది. పగ తీర్చుకోవాలన్న ఇజ్రాయెల్ పంతం నెరవేరింది. ఇకనైనా ఆ దేశం ప్రతీకార మార్గం వీడి, రాజీ బాటను అనుసరించాలి. శాంతికి కట్టుబడ్డ మన దేశానికి సైతం ఆ ప్రాంతంలో యుద్ధంతో భారీ నష్టమే. అక్కడ 89 లక్షల మంది మన వలస కార్మికులున్నారు.
పైగా, శాంతి, సుస్థిరత లేకుంటే నిరుడు ఢిల్లీ జీ–20 సదస్సులో ప్రకటించిన ‘ఇండియా– మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్’ (ఐఎంఈసీ) లాంటివి పట్టాలెక్కవు. ఇజ్రాయెల్, పాలెస్తీనాలు రెంటికీ మిత్రదేశంగా ఇరుపక్షాలనూ తిరిగి రాజీ చర్చలకు కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాలి. అధ్యక్ష ఎన్నికలతో తీరిక లేని అమెరికా సహా ఇతర దేశాలన్నీ ఒత్తిడి తెచ్చి అయినా సరే రెండువైపులవారినీ అందుకు ఒప్పించాలి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి. ఎందుకంటే, ఏ యుద్ధంలోనూ విజేతలుండరు. ప్రతిసారీ ప్రజలు పరాజితులుగానే మిగులుతారు.
Comments
Please login to add a commentAdd a comment