ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్‌ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్‌లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.
ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.
యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment