అభద్రతను పెంచుతున్న యుద్ధం | Sakshi Guest Column On Israel Gaza War | Sakshi
Sakshi News home page

అభద్రతను పెంచుతున్న యుద్ధం

Published Thu, Oct 10 2024 4:51 AM | Last Updated on Thu, Oct 10 2024 4:51 AM

Sakshi Guest Column On Israel Gaza War

విశ్లేషణ

హమాస్‌–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. 

ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.

ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్‌ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్‌ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్‌ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. 

పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.

ఇజ్రాయెల్, ఇరాన్‌ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. 

ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్‌ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్‌ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.

మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. 

ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.

ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్‌ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్ట్‌ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్‌ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్‌ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. 

రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. 

ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్‌ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్‌ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!

ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్‌ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్‌ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.

ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్‌ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. 

ఇజ్రాయెల్‌ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.

నేడు ఇజ్రాయెల్‌ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్‌ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్‌ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. 

గ్లోబల్‌ సౌత్‌ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్‌ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్‌ కోసం బ్యాటింగ్‌ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.

మొత్తం మీద చూస్తే  అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్‌ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.

ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్‌లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్‌ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్‌ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్‌ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.

భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్‌ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.

హ్యాపీమాన్‌ జాకబ్‌ 
వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో...)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement