రెండు దేశాలుగా బతకడమే దారి | Sakshi Guest Column On Israel War on Palestine | Sakshi
Sakshi News home page

రెండు దేశాలుగా బతకడమే దారి

Published Wed, Oct 23 2024 4:23 AM | Last Updated on Wed, Oct 23 2024 4:23 AM

Sakshi Guest Column On Israel War on Palestine

అభిప్రాయం

హమాస్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్‌ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్‌ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.

పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్‌ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్‌ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్‌ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్‌ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.

2023 అక్టోబర్‌ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్‌ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్‌ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్‌ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్‌ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.

దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్‌ ఆపరేషన్ లో హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) అక్టోబర్‌ 17న ప్రకటించింది. సిన్వార్‌ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్‌ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.

రెండు దేశాల పరిష్కారం
సమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్‌ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్‌ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్‌ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. 

కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్‌ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.

ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్‌హుడ్‌ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.

ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్‌ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.

75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్‌ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్‌ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.

సామాజిక–ఆర్థిక పరిస్థితులు
2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్‌ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్‌ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.

యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?

ఇజ్రాయెల్‌ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.

కొత్త ఒప్పందాలు అవసరమా?
1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్‌ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్‌ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.

పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్‌ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.

ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి  పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్‌ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.

పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్‌ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్‌ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్‌ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?

ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్‌ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement