
పాలస్తీనాలో భాగమైన గాజా రాజ్యరహిత పరిస్థితి... దాన్ని పాలిస్తున్న హమాస్‌ను తీవ్రవాదంలోకి నెట్టింది. ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా బందీలను వదలమన్న ఐక్య రాజ్య సమితి 194వ తీర్మానాన్ని ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. పైగా పాలస్తీనాను ఆక్ర మించింది. తీవ్ర నిరసనలతో 2023 అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార యుద్ధానికి దిగింది. ఈ చర్యను అనేక దేశాలు ఖండించాయి.
గతంలో భద్రతా మండలి 1441వ తీర్మానాన్ని 2002 నవంబర్ 8న ఏకగ్రీవంగా ఆమోదించింది. అనేక తీర్మానాల్లో నిర్ధారించినట్లు తన నిరాయుధీకరణ బాధ్యత నిర్వహణకు సద్దాం హుస్సేన్‌కు ఈ తీర్మానం తుది అవకాశాన్నిచ్చింది. 687వ తీర్మాన యుద్ధ విరమణ ఆదేశాన్ని ఇరాక్ పాటించలేదనీ, విధ్వంసక నిషిద్ధ ఆయుధాలను సంపాదించి, నిషేధిత క్షిపణులను తయారు చేసిందనీ, 1990–91లో కువైట్ ఆక్రమణలో తన సైనిక దోపిడీకి పరిహారం నిరాకరించిందనీ ఆరోపించింది. ఇరాక్ తప్పుడు వ్యాఖ్యానాలు, సమర్థనలు, ఈ తీర్మాన అమలు వైఫల్యం ఇరాక్ బాధ్యతల ఉల్లంఘన అని హెచ్చ రించింది.
ఈ తీర్మానంలో ఇరాక్‌పై యుద్ధ ప్రసక్తి లేదు. ఐరాస పర్యవేక్షణ, పరిశీలన, తనిఖీ కమిషన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలను ఇరాక్ అనుమతించాలని పేర్కొన్నారు. 2002 సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్లు్య. బుష్ ఐరాస సాధారణ సభలో ఇరాక్ తప్పు లను చదివారు. ఆ తప్పులు: ఐరాస భద్రతా సమితి 1373వ (ఉగ్రవాద నిరోధక) తీర్మానాన్ని ఇరాక్ ఉల్లంఘించింది.
ఇరాన్, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తోంది. అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకున్న అల్ ఖైదా ఉగ్రవాదులు ఇరాక్‌లో ఉన్నారు. ఐరాస మానవ హక్కుల కమిషన్ 2001లో ఇరాక్‌లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను గమనించింది. ఇరాక్‌లో జీవ, రసాయన ఆయుధాలు, దీర్ఘ లక్ష్య క్షిప ణుల తయారీ, ఉపయోగం ఐరాస తీర్మానాల అతిక్రమణ. ఐరాస పథకం ఆహారానికి చమురు డబ్బుతో ఇరాక్ ఆయుధాల కొనుగోలు.
భద్రతా మండలిలో వీటో హక్కు, శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్‌లకు ఇరాక్‌పై అమెరికా యుద్ధానికి దిగుతుందన్న అనుమానముంది. తీర్మానంలో తీవ్ర పరిణామాలు, పాదార్థిక ఉల్లంఘనలు వంటి పదాలు యుద్ధానికి దారితీయరాదని, ఇరాక్‌పై చర్యకు మరొక తీర్మానం అవసరమని రష్యా, ఫ్రాన్స్‌లు వాదించాయి. 1441వ తీర్మాన ముసాయిదాను తయారుచేసిన అమెరికా, ఇంగ్లండ్‌లు, తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఏకైక అరబ్బు దేశం సిరియా, ఈ తీర్మాన లక్ష్యం ఇరాక్ నిరాయుధీకరణని, దానికి ఇరాక్ సహకరించకపోతే భద్రతా మండలి తర్వాతి కార్యక్రమాన్ని నిర్ణయించాలని అన్నాయి.
ఇరాక్ 2002 నవంబర్ పదమూడున తీర్మానాన్ని అంగీకరించింది. అమెరికా (ఐరాస) తీర్మాన ఆరోపణలు రుజువు కాలేదని ఐరాస తనిఖీ అధికారులు 2002 నవంబర్‌లో నివేదించారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఇరాక్ 12 వేల పేజీల ఆయుధ నివేదికను ఇచ్చింది. ఏ ఐరాస సభ్య దేశమూ యుద్ధానికి అనుకూలం కాదు. అమెరికా, ఇంగ్లండ్‌లు చాలా తారుమారు పనులు చేశాయి. ఒకటి రెండు దేశాలు ఐరాస భద్రతా మండలిని ఆదేశించలేవని ఐరాస సభ్య దేశాలు ప్రకటించాయి. ఇరాక్‌పై యుద్ధం అసమ్మతమని న్యాయ కోవిదులు తమ అభిప్రాయాలను తెలిపారు.
అయినా 2003 మార్చి 19న అమెరికా ఇరాక్‌పై యుద్ధానికి దిగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్‌లు ఇరాక్‌పై యుద్ధం చేశాయి. 2003 మే వరకు వరకు యుద్ధం సాగింది. ఇరాక్ సర్వనాశనమైంది. సద్దాం హుస్సే న్‌ను బంధించి ఉరిదీశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇరాక్‌పై యుద్ధం చట్టవ్యతిరేకమనీ, ఐరాస వ్యవస్థాపక ఒప్పంద ఉల్లంఘననీ 2004 సెప్టెంబర్‌లో ప్రకటించారు.
యుద్ధనివారణ కోసం ఐరాస సభ్య దేశాలు ఒక దేశంపై మరొక దేశం దాడిని ఆపాలన్నది రెండవ ప్రపంచ యుద్ధ విధ్వంసం తర్వాత ఏర్పడ్డ ఐరాస ప్రధాన లక్ష్యం. ఇజ్రాయెల్ ఐరాస సభ్య దేశం. పాలæ స్తీనా, వాటికన్ నగరం ఐరాస పరిశీలన దేశాలు. యుద్ధ నిరోధంలో పాలస్తీనా కంటే ఇజ్రాయెల్‌పై ఎక్కువ బాధ్యత ఉంది.
అంతర్జాతీయ మానవత్వ చట్టాలను పాటించి, మానవత్వంతో గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలనీ, ప్రజలకు అత్యవసర ఆహార, ఔషధాలను అందించాలనీ, బందీలను వదలాలనీ ఐరాస సర్వసభ్య సాధారణ సభ 2023 అక్టోబర్ 27న తీర్మానించింది. ఈనాటికీ ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ అమలు చేయలేదు. యుద్ధాన్ని ఆపలేదు. అమెరికా... ఇజ్రాయెల్ పక్షం వహిస్తోంది. కనీసం తాత్కా లిక విరామాన్ని పాటించమని అమెరికా మిత్ర దేశాలే కోరాయి.
ఐరాస 1441వ తీర్మాన చట్టవ్యతిరేక దుర్వినియోగానికి, ఐరాస ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డ అమెరికా, అలాగే ఇరాక్‌పై యుద్ధంలో పాల్గొన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్‌లు నేటి ఐరాస తీర్మానాన్ని ఎందుకు అమలు చేయించవు? ఇరాక్‌ను కక్షతో శిక్షించిన అమెరికా మానవత్వంతో ఇజ్రాయెల్‌ను ఎందుకు దండించదు?
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 9490 20 4545
Comments
Please login to add a commentAdd a comment