అక్టోబర్ 7 నాటి హమాస్ తీవ్రదాడి ఇజ్రాయెల్‌ను రాజకీయంగా ఒక్కటి చేసింది. అయితే అత్యధిక దేశాలు ఇజ్రాయెల్ ప్రతిదాడుల తీవ్రతను ప్రశ్నిస్తు న్నాయి. హమాస్ దాడి తీవ్రవాద చర్య అని మరికొన్ని భావిస్తున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానం చాలా దేశాలను వర్గాలుగా, ప్రాంతా లుగా విడదీసిందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నా... గాజా ప్రజల కష్టాలపై కనీస స్పందన కనబరచాలనే ఒత్తిడిలో తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో తీర్మానానికి మద్దతివ్వని ఏకైక దక్షిణాసియా దేశంగా ఉండటం వల్ల, ఇజ్రాయెల్‌కు సానుకూలంగా భారత్ మారిందన్న భావన అదే అరబ్ దేశాల్లో బలపడే వీలుంది. అందుకే భారత్ ఆచితూచి వ్యవహరించాలి.
అక్టోబర్ 7 నాటి హమాస్ తీవ్రదాడికి కారణ మైన నిఘా వైఫల్యాలు, భద్రత లోపాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ, ఆ దేశ రాజకీయ వర్గం ప్రభుత్వం వెంట నిలిచింది. జాతీయ అత్యయిక పరిస్థితిలో రాజకీయ పక్షాలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టాయి. ‘అత్యవసర ఐక్యతా ప్రభుత్వ’ ఏర్పాటునకు పార్ల మెంటు ఆమోదం పొందే క్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, ‘హోలోకాస్ట్ తరువాత యూదు ప్రజలు ఎదుర్కొన్న అతి దుర్భర ఘటన’గా అక్టోబర్ 7ను అభివర్ణించారు. హమాస్ దాడిలో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. 229 మందిని హమాస్ బందీ లుగా కొనిపోయింది. అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతిదాడుల విష యంలో ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక దేశాలు ఇజ్రాయెల్ ప్రతిదాడుల తీవ్రతను ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ రాజకీయ వర్గాలు హమాస్ అంతు చూడాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాయి.
బందీల పరిస్థితేమిటి?
హమాస్ దాడి జరిగిన వెంటనే, ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక, భూతల దాడుల్లో ఇప్పటివరకూ 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఇంకో అడుగు ముందుకేసి విద్యుత్ సేవలు నిలిపి వేసింది. ఆహారం కూడా తక్కువ పరిమాణంలో గాజాలోకి వెళ్లేలా నియంత్రిస్తోంది. గాజా ఉత్తర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దక్షిణం వైపునకు పోవాలని హెచ్చరించింది. అక్టోబరు 27న ఇజ్రాయెల్ భూతల దళాలు గాజా లోకి ప్రవేశించాయి. ఒక రోజు తరువాత నెతన్యాహూ, యుద్ధంలో తరువాతి దశ ఇక మొదలవుతుందనీ, ఇది దీర్ఘకాలిక పోరు కానుందనీ ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించారు.
బందీలను రక్షించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని ఇజ్రా యెల్ చెబుతోంది. తమ చర్యల కారణంగా గాజాలో ప్రాణనష్టానికి భయపడి హమాస్ బందీలను విడుదల చేస్తుందనేది ఇజ్రాయెలీల ఆలోచనగా కనిపిస్తోంది. గాజా ప్రజల ఒత్తిడికి కూడా హమాస్ తలొగ్గ వచ్చునని భావిస్తోంది. ఖతార్, ఈజిప్టు లాంటి దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి. బందీల విడు దలకు ప్రయత్నిస్తున్నాయి.
అయితే హమాస్ తమకు రక్షణ కవచంగా ఉంటున్న బందీలను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా అన్నది ప్రశ్న. మరోవైపు ఇజ్రాయెలీ అధికారులు కూడా అసందిగ్ధతను ఎదు ర్కొంటున్నారు. బందీల కుటుంబ సభ్యులు వారిపై ఒత్తిడి తెస్తు న్నారు. బందీలుగా ఉన్న పాలస్తీనీయులను వదిలితే ఇజ్రాయెలీల విడుదలపై ఆలోచిస్తామని హమాస్ షరతు విధించినట్టు తెలుస్తోంది. గతంలో ఒకే ఒక్క ఇజ్రాయెలీ సైనికుడి విడుదల కోసం ఇజ్రాయెల్ చాలామంది పాలస్తీనియన్లను వదిలిపెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావ నార్హం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
హమాస్ దాడి సమర్థనీయమే?!
పాలస్తీనాను ఇజ్రాయెల్ చాలాకాలంగా ఆక్రమించి ఉండటం, రెండు దేశాల పరిష్కారానికి సిద్ధంగా లేకపోవడం కారణంగా అక్టో బరు 7 నాటి హమాస్ దాడి అర్థం చేసుకోదగినదే అని కొన్ని అరబ్ దేశాలతోపాటు, కొన్ని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. ఇంకో అడుగు ముందుకెళ్లి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ గత వారం భద్రతా మండలిని ఉద్దేశించి, హమాస్ దాడి శూన్యంలోంచి పుట్టుకొచ్చింది కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజంలో చాలామంది ఇజ్రాయెల్ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ హమాస్ దాడి తీవ్రవాద చర్య అనీ, సమర్థనీయం కాదనీ భావిస్తున్నారు.
ఈ అంశాలన్నీ కూడా ఇటీవలే ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానం విషయంలో స్పష్టమయ్యాయి. ‘ప్రజల భద్రత, న్యాయమైన, మానవీయ బాధ్యత’ కోసం ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి 121 దేశాలు మద్దతిచ్చాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ‘మానవతావాద సంధి ఒకటి తక్షణం కుదరాలనీ, ఈ ఏర్పాటు దీర్ఘకాలం కొనసాగేదిగా ఉండాలనీ’ ఈ తీర్మానం ప్రతిపా దించింది. హమాస్, ఇజ్రాయెల్ పేర్లను ప్రస్తావించలేదు. గాజా ప్రజలకు సాయం అందేలా చూడాలనడం, మానవత చట్టాల అమలు గురించి మాట్లాడటాన్ని బట్టి, ఈ తీర్మానం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదించినదని స్పష్టంగా అర్థమవుతుంది... గాజాలోని ఇజ్రా యెల్ బందీలు అని అర్థమయ్యేలా అక్రమంగా నిర్బంధించిన పౌరుల విడుదల అంశాన్ని ఇందులో పేర్కొన్నప్పటికీ.
ముఖ్యమైన విషయం ఏమిటంటే... అరబ్, ఇస్లామిక్ దేశాలతో పాటు రష్యా, చైనా కూడా ఇజ్రాయెల్ నిగ్రహం చూపాలనీ, ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గాన్ని వదిలేయాలనీ డిమాండ్ చేయడం. తీర్మా నానికి అనుకూలంగా ఓటేసిన దేశాల జాబితాలో ఐక్యరాజ్య సమతి భద్రత మండలి సభ్యదేశమైన ఫ్రాన్స్ కూడా ఉంది. తన ‘నాటో’ భాగస్వామి అమెరికాతో మాత్రమే కాదు, బ్రిటన్‌తోనూ ఫ్రాన్స్ విభేదించింది. అమెరికా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించగా, బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. యూరోపియన్ యూనియన్, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా యూనియన్, ఏసియన్, దక్షిణాసియా దేశాలను ఈ తీర్మానం వర్గాలుగా, ప్రాంతాలుగా విడదీసిందంటే అతిశయోక్తి కాదేమో!
ఇజ్రాయెల్‌కు అమెరికా దన్ను!
ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి దన్నుగా నిలుస్తోంది. ఎన్నికలకు ఏడాది గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్ ను అమెరికా యూదుల లాబీ ప్రభావితం చేయడం దీనికి కారణం కావచ్చు. అమెరికాకు చెందిన బందీలపై ఆందోళన కూడా ముఖ్యమైన కారణం కావచ్చు. ఈ కారణంగానే హమాస్‌ను తుదముట్టించాలనే ఇజ్రాయెల్ కృతనిశ్చయాన్ని అమెరికా సమర్థిస్తుండవచ్చు. దీనర్థం, అమెరికా ఇకపై కూడా తన వీటో పవర్‌తో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌కు దౌత్యపరమైన సాయం కొనసాగిస్తుంది.
మరోవైపు ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నా... గాజా ప్రజల కష్టాలపై కనీస స్పందన కనబర చాలనే ఒత్తిడిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఇజ్రాయెల్‌తో ఆ దేశాలు, ముఖ్యంగా యూఏఈ, బహ్రెయిన్ , ఈజిప్టు తమ సంబంధాలను తెంచుకుంటాయా అనేది చూడాలి.
భారత్ వైఖరి
ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయంపై భారతదేశం వివరణ ఇచ్చింది. అది సరిగ్గానే ఉగ్రవాదంపై దృష్టి కేంద్రీకరించింది. నిగ్రహంగా ఉండాలని పిలుపునిచ్చింది. దౌత్యం, చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాగలదని స్పష్టం చేసింది. మానవతా చట్టాలను గౌరవించాలని చెబుతూనే తాను రెండు దేశాల సిద్ధాంతానికి మద్దతుగా నిలుస్తున్నట్లు స్పష్టం చేసింది.
అయితే తీర్మానానికి మద్దతివ్వని ఏకైక దక్షిణాసియా దేశంగా ఉండటం వల్ల, ఇజ్రాయెల్‌కు సానుకూలంగా, పాలస్తీనియన్ల పట్ల పట్టింపు లేనిదిగా భారత్ మారిందన్న భావన అరబ్ దేశాల్లో బలపడేందుకు వీలుంది. ఇది వాస్తవం కాకపోవచ్చు. స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ, వాటి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలి. అరబ్ దేశాలతో కూడా మనకు అంతే భారీ ప్రయోజనాలు ఉన్నాయి.
వివేక్ కాట్జూ
వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment