కామెంట్
ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయవ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణాలన్నింటినీ మెచ్చుకునేవారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి గురైనప్పుడు కూడా ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ సానుభూతి ఉండింది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు అనుకున్నారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననమే అందరి కళ్లల్లో మెదులుతోంది. తమను హింసలకు గురిచేసిన హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను హింసలు పెడుతున్నామని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రయ పడుతోంది.
బ్రిటన్ మాజీ ప్రధాని హరాల్డ్ మెక్‌మిలన్‌కు రాజకీయాల్లో వారం రోజులంటే చాలా ఎక్కువ సమయం! ఇదే విధంగా హమాస్‌తో నడుస్తున్న యుద్ధం విషయంలో ఇజ్రాయెలీలు కూడా ఒక యుగమైందని అనుకుంటున్నారు. ఈ ఏడాది సమయంలో ఇజ్రాయెలీల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. తమ సంబంధాలన్నీ వాళ్లు కోల్పోయారు.
గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ చేసింది అత్యంత భయంకరమైంది, ఆటవికమైంది. అది క్షమించరాని నేరం. సుమారు 1,200 మంది ఇజ్రాయెలీల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న హమాస్ ఆ రోజు ఇంకో 250 మందిని బందీలుగా చేసుకుంది. ఇజ్రాయెల్ మొత్తం ఈ ఘటనతో వణికిపోయింది. ఇజ్రాయెల్ పట్ల ఆ రోజు కొంతైనా సానుభూతి వ్యక్తమైంది.
ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు కదా అని అనుకున్నారు. కానీ, ప్రతీకారం పేరుతో ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దమనకాండను పరిశీలిస్తే, హమాస్ అకృత్యాలు కూడా పేలవమై నవిగా అనిపించక మానవు. ఆడవాళ్లు, పిల్లలతోపాటు 42 వేల మంది పాలస్తీనియులు ఇప్పటిదాకా చనిపోయారు. ఇంకో లక్ష మంది గాయ పడ్డారు.
గాజాలో 23 లక్షల మంది జనాభాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసిన విధ్వంసపు ఆనవాళ్లే. అందుకేనేమో... ఏడాది క్రితం వరకూ ఇజ్రాయెల్‌పై ఉన్న సానుభూతి కాస్తా ధిక్కారంగానూ, ఛీత్కారంగానూ మారిపోయింది. అందరి దృష్టిలో ఇజ్రాయెల్ ఇప్పుడు దురాక్రమణదారుగా మారిపోయింది!
హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కంకణం కట్టుకున్నారు. దశాబ్దాల పాలస్తీనా వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడం ద్వారా తమకు మేలు జరుగుతుందని ఆశించారు. అయితే హమాస్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటు కోవడమే కాకుండా, సైద్ధాంతికంగా మరింత బలం పుంజుకుందని చెప్పాలి.
ఇంకో ముఖ్యమైన విషయం... నెతన్యాహూ గాజాపై చేస్తున్న యుద్ధం కాస్తా పాలస్తీనా అంశాన్ని అంతర్జాతీయ వేదిక పైకి చాలా బలంగా చేర్చింది. ఐక్యరాజ్య సమితిలోనూ పాలస్తీనాకు న్యాయం జరగాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... అగ్రరాజ్యం అమెరికా విశ్వవిద్యాలయాల్లోనూ ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రదర్శనలు జరగడం గమనార్హం. నెతన్యాహూ ఈ పరిణామాలను బహుశా ఊహించి ఉండరు.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నడిచిన గత 365 రోజుల్లో ఇర్లాండ్, స్పెయిన్ , నార్వేలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. సౌదీ అరేబియా ఇంకో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల కోసం పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని ఒక నిబంధనగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నోట పాలస్తీనా ఏర్పాటు మాట వస్తూనే ఉంది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు అందరూ సూచిస్తున్న మార్గం ఆ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విడగొట్టడం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అందరూ మరచిపోతున్నారు. ఎందుకంటే వెస్ట్‌బ్యాంక్‌లో సుమారు ఏడు లక్షల మంది ఇజ్రాయెలీ వలసదారులు ఉంటున్నారు. గాజాలో తను చెప్పినట్టు నడుచుకునే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహూ శతథా ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు పాల స్తీనా దేశం ఎక్కడ ఏర్పాటు అవుతుంది?
ఏడాది క్రితం... కనీసం ఆరు నెలల క్రితం కూడా పాలస్తీనీ యులు దేశం మొత్తం తమదే అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. యూదులకు ఇది అస్సలు అంగీకారం కాదు. కారణం ఒక్కటే. తాము యుగాలుగా ఆశిస్తున్న తమదైన మాతృదేశం తమకు లేకుండా పోతుందని!
ఎంత విచిత్ర పరిస్థితి? పాలస్తీనాకు న్యాయం జరగాలని మొట్టమొదటిసారి ప్రపంచం మేల్కొన్న సమయంలో అసలు ఆ న్యాయం ఏమిటన్నది కూడా తెలియని పరిస్థితి. రాజకీయ ఆలోచన లకు అతీతంగా అంతా మారిపోయింది.
మరో దృక్కోణం ఒకటి ఉంది. ఇది ఇజ్రాయెలీలకు అంతగా రుచించకపోవచ్చు. ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఏడాది క్రితం వరకూ తమ దేశం పట్ల ఇతరులకు ఉన్న దృక్పథం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే... ఆక్రమణదారుడైనప్పటికీ బాధితు డిగా తనను తాను చిత్రీకరించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది మరి!
2023లో ప్రజాభిప్రాయం ఒకదాన్ని సేకరించే ముందు కాలంలో ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయ వ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణా లన్నింటినీ మెచ్చుకునేవారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననం మాత్రమే అందరి కళ్లల్లో మెదలుతోంది. ఒకప్పుడు అభినందించిన ప్రజలే ఇప్పుడు ఛీత్కరించే పరిస్థితి.
ఇజ్రాయెలీలకు ఈ విషయాలు తెలియవా? రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల చేతిలో ఊచకోతకు గురైన వాళ్లే కదా! హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను నానా హింసలూ పెడు తున్నామన్న విషయాన్ని అంగీకరించేందుకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కానీ వాస్తవమైతే అదే! కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రాయపడుతోంది.
హమాస్ నేత ఇస్మాయెల్ హనియే, హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాల నాటకీయ హత్యలు ఇజ్రాయెలీల నిఘా వ్యవస్థ చురుకు దనానికి నిదర్శనంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కానీ గత ఏడాది అక్టోబరులో నిఘా విభాగం వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు.
అయితే గాజాపై ఇజ్రాయెల్ చేసిన రక్తపు మరక అంత తొందరగా చెరిగిపోయేది కాదు. మరచిపోయేది, క్షమించదగ్గది కూడా కాదు. ఇజ్రాయెల్‌ను ఓ భిన్న దేశంగా చూపింది ఈ యుద్ధం. ఈ విషయాన్ని ఇజ్రాయెలీలు ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడా ల్సిన విషయం.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment