
ఆరేళ్ల పిల్లలిద్దరినీ విచక్షణారహితంగా కొట్టిన లక్ష్మి
గొంతునులిమి కార్తీక్ హత్య
మరో బాలుడు ఆకాశ్‌కు తీవ్ర గాయాలు
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దారుణం
ఫిరంగిపురం: ఆరేళ్ల చిన్నారులపై మారు తల్లి కర్కశత్వంగా ప్రవర్తించింది. పిల్లలిద్దరినీ బెల్టు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టింది. ఓ బాలుడిని వేడివేడి పెనంపై కూర్చోపెట్టి.. మరో బాలుడిని గొంతునులిమి చంపేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్‌కు ఇద్దరు కవల పిల్లలు కార్తీక్(6), ఆకాశ్. రెండేళ్ల కిందట భార్య అనారోగ్యంతో చనిపోయింది. అనంతరం సాగర్ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ప్రకాశం పంతులునగర్‌కు చెందిన జి.లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు.
వారిద్దరికీ పాప జన్మించింది. లక్ష్మి ప్రతిరోజూ కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలు పెడుతుండేది. శనివారం బెల్టు, కర్రలతో విచక్షణారహితంగా వారిద్దరినీ కొట్టింది. కర్రతో కార్తీక్ తల పగలకొట్టి.. ఆకాశ్‌ను వేడివేడి పెనంపై కూర్చోపెట్టింది. వారికి తీవ్రగాయాలై రోదిస్తున్నా.. వదిలిపెట్టకుండా కార్తీక్‌ను గొంతు పిసికి చంపేసింది. ఈ దారుణం బయటపడకుండా కార్తీక్ మృతదేహాన్ని, తీవ్రగాయాలపాలైన ఆకాశ్‌ను తీసుకొని లక్ష్మి, సాగర్‌లు కొండవీడుకు వెళ్లిపోయారు.
ఈ విషయం తెలిసిన సాగర్ చెల్లెలు ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరుకు తరలించారు. ఆకాశ్‌కు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మి, సాగర్ ఇద్దరూ కలిసి కార్తీక్‌ను చంపేశారని పిల్లల మేనత్త విజయ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు.