బెట్టింగ్ భూతం | Children are destroying the future of cricket betting | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ భూతం

Published Sun, May 10 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

బెట్టింగ్ భూతం

బెట్టింగ్ భూతం

పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్
గ్రామాలకూ పాకిన జాడ్యం.. ఆన్‌లైన్‌లోనూ జోరుగా జూదం

 
విజయవాడ సమీపంలోని ఓ చిన్న పట్టణంలో ఏడో తరగతి విద్యార్థి ఇంట్లోంచి రూ.వెయ్యి చెప్పకుండా తీసుకెళ్లాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలుస్తుందని పందెం కాశాడు. తల్లిదండ్రుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.హైదరాబాద్ దగ్గరలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగేళ్ల క్రితం 70 మంది ఫైనలియర్ విద్యార్థులు ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో రూ. 23 లక్షలు పందెం కాసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికీ నాటి అప్పులు తీర్చుకుంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఐపీఎల్ మ్యాచ్ మీద రూ. 2 లక్షలు పందెం కాసి ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఘటనలు. ప్రస్తుతం దేశంలో క్రికెట్ బెట్టింగ్ పరాకాష్టకు చేరింది. దీనికి తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం కాదు. దాదాపు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సరదాగా పందేలు కాసుకునేవాళ్లు కొందరైతే.. 99 శాతం మంది పిల్లలు డబ్బు మీద ఆశతో పందేలు కాస్తున్నారు. ఈ పందేలు ఎలా జరుగుతున్నాయి..? దీనివల్ల జరుగుతున్న నష్టం ఏమిటి? పిల్లల్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల గురించి పందేలు జరగని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్... ఏటికేడు పెరుగుతూ ఇప్పుడు గ్రామాలకూ పాకింది. స్కూల్ పిల్లలు కూడా పందేలు కాసే స్థాయికి బెట్టింగ్ పెరిగింది. ఈ పందేలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం.

గ్రామాల్లో సరదాగా...

గ్రామాల్లో కుర్రాళ్లు సరదాగా పందేలు వేసుకుంటారు. రూ. 500 నుంచి రూ. 5 వేల దాకా ఈ పందేలు ఉంటాయి. ఇందులో గెలిచినా, ఓడినా ఆ డబ్బు ఆ ఊళ్లోనే ఉంటుంది. ఇలా చిన్న చిన్న పందేలు కాస్తూనే గతేడాది ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఓ 36 ఏళ్ల వ్యక్తి ఇంట్లో బంగారం అమ్ముకునే దుస్థితికి చేరు కున్నాడు.
 
బుకీల వ్యవస్థ...


బెట్టింగ్‌లో ముఖ్యమైనవి బుకీల ద్వారా జరిగేవి. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వందల సంఖ్యలో క్రికెట్ పందేలు నిర్వహించే వ్యక్తులు ఉన్నారు. ముంబై, ఢిల్లీలలో ఉండే బుకీలతో స్థానిక నిర్వాహకులకు సంబంధాలు ఉంటాయి. వీళ్ల దగ్గర కంప్యూటర్లు, ఫోన్లు, బెట్టింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటాయి. వీళ్లు మ్యాచ్‌ల బెట్టింగ్‌లతోపాటు బంతికి, బంతికి బెట్టింగ్‌లు కూడా తీసుకుంటారు. బెట్టింగ్ జరిగే తీరు అవగాహన ఉన్న వాళ్లు, చాలా మంది విద్యార్థులు ఎక్కువగా వీళ్ల దగ్గరే పందేలు కాస్తుంటారు. ముందుగా వీళ్ల దగ్గర కొంత డబ్బు డిపాజిట్ చేస్తే అది పూర్తయ్యే వరకు పందేలు కాసుకోవచ్చు. దీనికి ఏజెంట్లూ ఉన్నారు. పందేలు కాసేవాళ్లను పరిచయం చేస్తే వాళ్లు బెట్టింగ్‌లపై కమీషన్ ఇస్తారు. రూ. లక్ష పందేలు కాస్తే రూ. 5 వేల వరకు కమీషన్ ఉంటుంది.

ప్రతి టోర్నీకీ బెట్టింగ్

ఒక్క భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లే కాదు. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ జరిగినా మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌లు తీసుకుంటారు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కౌంటీ క్రికెట్, బిగ్‌బాష్... ఇలా అన్ని టోర్నీల మీదా పందేలు మన దగ్గర జరుగుతున్నాయి. అయితే ఈ పందేలు నిర్వహించేవాళ్లు కేవలం టీవీలో వచ్చే మ్యాచ్‌ల పందేలే తీసుకుంటారు. చాలా చోట్ల పందేల నిర్వాహకులు రాజకీయ నాయకుల అండతోనే కార్యక లాపాలు సాగిస్తుంటారు.
 
తల్లిదండ్రులూ జాగ్రత్త...

ఐపీఎల్ వచ్చాక ఎక్కువగా బెట్టింగ్ ద్వారా నాశనమైంది విద్యార్థులు. రెండు రాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ కనీసం కాలేజికి ఒక్కరైనా ఈ పందేలు కాసేవాళ్లు ఉన్నారు. ఐపీఎల్ సమయంలో మీ అబ్బాయి టీవీకి అతుక్కుపోయి కంగారు పడుతూ మ్యాచ్ చూస్తున్నాడంటే కచ్చితంగా అనుమానించాలి. మధ్యమధ్యలో బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడి వస్తుంటే ఏం చేస్తున్నాడని అడగండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే తమ పిల్లలు బెట్టింగ్ భూతం బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.

చట్టబద్ధం చేస్తే?

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చట్టం ఏం చెబుతున్నా, పోలీసులు ఎన్ని దాడులు చేసినా బెట్టింగ్‌ను ఆపడం కష్టం. ఆపలేనప్పుడు చట్టబద్ధం చేయడం ఓ మార్గం. ఇంగ్లండ్ లాంటి దేశాల్లో క్రికెట్ మైదానంలోనే బెట్టింగ్ షాప్‌లు ఉంటాయి. దీనిని లీగలైజ్ చేసి పన్ను విధిం చడం ద్వారా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుంది. కానీ బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే క్రైమ్‌రేట్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
 
 
జోరుగా ఆన్‌లైన్‌లో ..

ఇటీవల కాలంలో దేశంలో బెట్టింగ్ పెరగడానికి కారణం ఆన్‌లైన్ బెట్టింగ్. మన దేశంలో ఇది చట్టవ్యతిరేకం. గతంలో విదేశాల్లోని బంధువులు, స్నేహితుల క్రెడిట్ కార్డుల ద్వారా పందేలు కాసే వ్యక్తులు ప్రస్తుతం బెట్టింగ్ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ సాగిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న 30 ఏళ్ల లోపు ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది ఈ బెట్టింగ్ చేస్తున్నట్లు అంచనా. ఇందులో మహిళలు కూడా ఉండటం గమనార్హం.
 
బాగుపడినోళ్లు తక్కువ
 
బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కారణం దీనికి సంబంధించిన రేట్లు. ఉదాహరణకు ముంబై, హైదరాబాద్ జరుగుతుందని అనుకుందాం. ముంబై ఫేవరేట్ జట్టు అయితే ఆ జట్టుపై రూ. 1,000 కాస్తే రూ. 700 వస్తుందని అనుకుందాం. అదే సమయంలో హైదరాబాద్‌పై రూ. 800 కాస్తే ఆ జట్టు గెలిస్తే రూ. 1,000 వస్తుంది. ఒక వ్యక్తి ముంబై గెలుస్తుందని రూ. 10 వేలు కాశాడని అనుకుందాం. ఆ జట్టు ఓడిపోయే పరిస్థితికి వస్తే పందెం మార్చుకోవచ్చు. అయితే అప్పుడు రేటు దారుణంగా ఉంటుంది. హైదరాబాద్‌పై రూ. 10 వేలు కాస్తే రూ. 2,000 వస్తుంది. అంటే ముంబైపై పెట్టిన రూ. 10 వేలు లోటు పూడ్చుకోవాలంటే హైదరాబాద్‌పై రూ. లక్ష కాయాలి. కొంతమంది ఈ రిస్క్‌లు చేస్తారు. అలాంటి రిస్క్ చేసిన సమయంలో పొరపాటున మళ్లీ ముంబై గెలిస్తే... ఏకంగా రూ. 90 వేలు పోతాయి. చాలా సందర్భాల్లో పందేలు కాశాక తిరిగి మార్చుకునే అవకాశం లేకుండా రేట్లు మారిపోతాయి. కాబట్టి పందేలు కాసేవాళ్లు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఐపీఎల్ సీజన్‌లో 50 మ్యాచ్‌ల మీదా బెట్టింగ్ కాస్తే.... నష్టం లేకుండా బయటపడాలంటే కనీసం 30 మ్యాచ్‌లు గెలవాలి. ఎంత క్రికెట్ పండితుడికైనా ఇది కష్టం.
 
 భారీగా  టర్నోవర్  ...

ఒక్కో మ్యాచ్‌పై టర్నోవర్ కూడా భారీగానే ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు పందేలు మారుస్తూ పోతారు. కొన్ని సందర్భాల్లో రూ. లక్ష టర్నోవర్ చేసి రూ. 5 వేలు లాభం లేదా నష్టంతో బయటపడతారు. ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌పై భారత్‌లోనే రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ముంబైకి చెందిన ఓ బుకీ అంచనా. అయితే చివరకు ఒక్క మ్యాచ్‌పై కనీసం రూ. 20 వేల కోట్ల వరకు చేతులు మారతాయని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement