అసలే కరోనాకాలం. అందరి పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయాయి. ఇదే సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి కొందరు దారులు వెతుకుతున్నారు. ఇలాంటివారికి ఐపీఎల్ సీజన్ కలిసొచ్చింది. ఇంకేముంది టీవీ ఆన్ చేయడం.. బంతి బంతికీ బెట్టింగ్ కట్టడం, ఫోన్లలోనే లావాదేవీలు జరపడం ఇట్టే జరిగిపోతోంది. బెట్టింగుల సంస్కృతిని కట్టడిచేయడానికి పోలీసులు సైతం రహస్యంగా నిఘా ఉంచడం విశేషం.
చిత్తూరు అర్బన్: ఐపీఎల్.. పరిచయం అక్కర్లేనిపేరు. క్రికెట్ గురించి తెలియనివాళ్లు కూడా ఐపీఎల్ ఉన్న మజాను ఆస్వాదిస్తారు. ఎప్పుడో వేసవిలో జరగాల్సిన మ్యాచ్‌లు కరోనా కారణంగా వాయిదాపడుతూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా, ఛీర్ గర్ల్స్ కనిపించకున్నా.. ప్రతి మ్యాచ్‌లో బెట్టింగులు నిర్వహించడానికి మాత్రం కొన్ని ముఠాలు సిద్ధమైపోయాయి. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సెల్‌ఫోన్లలో బేరాలు నడుస్తుంటాయి. ఈ సీజన్‌లో జిల్లా నుంచి రోజుకు రూ.30 కోట్లు బెట్టింగులు జర గొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ బెట్టింగ్ వ్యవహారాన్ని పసిగట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. వాటి మూలాల్లోకి వెళ్లి చట్టరీత్యా ఆటకట్టిస్తామంటుని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బంతి బంతికో లెక్క
పొట్టి క్రికెట్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందూలోనూ స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా కలిసి జట్లుగా ఆడేసే ఐపీఎల్‌పై ప్రతీ ఏటా జిల్లాలో పెద్ద మొత్తంలో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రతీ ఓవర్‌లో వేసే బంతి బంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. అన్నీ కూడా సెల్‌ఫోన్లలోనే జరుగుతుంటాయి. ఇదివరకులాగా ఫోన్లు చేసి బేరసారాలు చేయకుండా.. వాట్సాప్‌కాల్స్, మెసెంజర్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల రూపంలో బెట్టింగులు పెడుతున్నారు. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన జాడ్యం జిల్లాలోని పల్లెలకు పాకిపోయింది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె లాంటి ఓ మోస్తరు ప్రాంతాల నుంచి కుప్పం, పలమనేరు, బి.కొత్తకోట లాంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించింది.
పుట్టగొడుగుల్లా బుకీలు
ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగులుచేసే వాళ్లు ఎవరికివాళ్లు బుకీలు, సబ్ బుకీల అవతారం ఎత్తుతున్నారు. ఎదుటివ్యక్తి బలహీనత, అత్యాశే పెట్టుబడిగా రంగంలోకి దిగుతున్నారు. తమ ప్రధాన కేంద్రం బెంగళూరు, చెన్నైలో ఉందని చెబుతూ.. గెలిచిన డబ్బుకు ఎలాంటి ఢోకాలేదని హామీలు ఇస్తున్నారు. పందెంకాచే డబ్బును ఇపుడంతా డిజిటల్ మనీ యాప్స్ ద్వారా మొబైల్‌ఫోన్లు, బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. గెలిచినవాళ్లకు సైతం ఇదే పద్ధతిలో నగదు ముట్టజెబుతున్నారు. ఈ గోతిలో ఎక్కువగా చదువుకున్న విద్యావంతులు చిక్కుకుంటుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తక్కువ సమయంలో కష్టం లేకుండా ఎక్కువ సంపాధించాలనే అత్యాశాపరులు ఐపీఎల్ పందాలకోసం కాచుక్కూర్చున్నారు.
గతంలో పట్టుబడ్డా..
గతంలో జిల్లాలో ఐపీఎల్ బెట్టింగులపై పోలీసులు కన్నెర్రజేయడంతో పాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేసి, నగదు సీజ్ చేశారు. తిరుపతిలో ఓ వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. చిత్తూరులో నాటి టీడీపీ యువ నాయకుడు క్రికెట్ పందెంలో అడ్డంగా దొరికిపోయినా, ఓ కార్పొరేటర్ ప్రమేయం ఉందని సాక్ష్యాలు లభించినా ప్ర త్యేక పోలీసుల సాయంతో తప్పించుకున్నాడు. కు ప్పం నియోజకవర్గంలో ఓ సర్పంచ్ వద్ద 12 సెల్‌ఫోన్లతోపాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు.
నాలుగేళ్లలో జిల్లాలో బెట్టింగ్ కేసులు
మొత్తం కేసులు -15
అరెస్టయిన వ్యక్తులు -75
పట్టుబడిన నగదు - రూ.6.06 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment