జిల్లా పోలీసుశాఖలో బదిలీలు తప్పనిసరి
టీడీపీ నేతల వద్ద క్యూ కడుతున్న పోలీసులు
ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న ఆశావహులు
కొందరికి రగ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం
డీఎస్సీ నుంచి.. ఎస్‌బీ కానిస్టేబుల్ వరకు ప్రదక్షిణలు
చిత్తూరు అర్బన్ : జిల్లాలో పుంగనూరు తప్ప మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కై వశం చేసకున్న విషయం తెలిసిందే. పుంగనూరులో టీడీపీ ఇన్‌చార్జ్‌తో కలిపి మిగిలిన ఆరు చోట్ల కూడా నాయకులు తమకు అనుకూలంగా ఉన్న సీఐలు, ఎస్‌ఐల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు ఇప్పటికే జాబితా సిద్ధం చేయగా, మరికొందరు తమకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాల ఆధారంగా గతంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులు ఎక్కడున్నారో అంటూ ఆరా తీస్తున్నారు. పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఆయా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తమకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించాలని నేరుగా కోరకుండా.. పూలబొకే చేతికి అందించి ‘అన్నా, ఊరికే కనిపిద్దామని వచ్చాను’ అని చెబుతున్నారు. గతంలో తాము పనిచేసిన స్థాయిని వివరిస్తూ, అప్పట్లో చేసిన అనుకూల ఘటనలను ఉదహరిస్తున్నారు.
కుప్పంలో కార్యదర్శులు..
కుప్పంలో పోస్టింగుల విషయమై చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శులు పలువురి పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపతున్నట్లు సమాచారం. పూతలపట్టులో ఎమ్మెల్యే కొత్తకావడంతో ఐదు మండలాల్లోని టీడీపీ నేతల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పూర్తిగా తనకు నచ్చిన అధికారులను నియమించుకునేలా ఎమ్మెల్యే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కూడా పూర్తిగా ఎమ్మెల్యేనే నేరుగా పోలీసు అధికారుల నియామకంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
బయటి జిల్లాల నుంచే..
ఎక్కువ శాతం పోలీసు అధికారులు బయటి జిల్లాల నుంచి చిత్తూరుకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో తిరుపతి పోలీసు శిక్షణ కేంద్రంలో ఉన్న ము గ్గురు సీఐ స్థాయి అధికారులు పలమనేరు, బంగారుపాళ్యం స్టేషన్లను అడుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అటాచ్‌మెంట్‌లో ఉన్న ఓ డీఎస్పీ పలమనేరు పోస్టింగుపైనే పట్టుగా ఉన్నారని, ఇందుకు మాజీ మంత్రి సైతం పచ్చ జెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. సీఐడీ విభాగంలో డీఎస్పీ ఒకరు నగరిపై గురి పెట్టినట్లు సిబ్బందే చెప్పుకుంటున్నారు. తిరుపతి ట్రాన్స్‌కో సీఐ ఒకరు చిత్తూరు వెస్ట్ కావాలని, గతంలో చిత్తూరులో పనిచేసి డీటీసీలో ఉన్న సీఐకి చిత్తూరు వన్‌టౌన్‌పై హామీ లభించినట్లు సమాచారం. కర్నూ లు జిల్లాలోని లూప్‌లైన్‌లో ఉన్న మరో సీఐ పలమనేరుకు వస్తున్నట్లు సమాచారం.
ఎస్‌బీకి తీవ్ర పోటీ..
లా అండ్ ఆర్డర్ విషయం పక్కన పెడితే ఈసారి స్పెషల్‌బ్రాంచ్ (ఎస్‌బీ) విభాగానికి సైతం తీవ్ర డిమాండ్ నెలకొంది. ఎస్పీకి దగ్గరగా పనిచేస్తూ, ఇదే సమయంలో పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడానికి ఇప్పటికే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ స్థాయి అధికారులు కర్చీఫ్‌లు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎస్‌బీలో పనిచేసిన అనుభవాన్ని, సామాజికవర్గాన్ని చూపించి కొందరు నేతలను పోస్టింగులు అడుగుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే వారంలో ఎస్‌ఐలు, సీఐల బదిలీలు.. పది రోజుల్లో కిందిస్థాయి సిబ్బందికి స్థానచలనం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment