పుంగనూరు (చిత్తూరు జిల్లా): చంద్రబాబు పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడిచేసి గాయపరచి, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారని చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.శ్రీలక్ష్మి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె పుంగనూరులో పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ అశోక్‌కుమార్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో రూట్‌మ్యాప్‌ను కాదని పుంగనూరులోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను నివారించినందుకే రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ ఘటనపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసి, సీసీ çఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు చేసిన వారిలో 62 మందిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలిస్తున్నామన్నారు.
పోలీసులను రెచ్చగొట్టి.. తద్వారా కాల్పులు జరిగేలా చేయాలన్నది టీడీపీ ముఖ్య నేతల ఉద్దేశం అని తేలిందన్నారు. అవసరమనిపిస్తే పోలీసులను చంపాలని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపితే టీడీపీ వారు చనిపోతే తద్వారా ఇమేజ్ పొందేలా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2న రొంపిచెర్లలో వ్యూహ రచన చేశారన్నారు. ఆయన పీఏ గోవర్దన్‌రెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయం వెల్లడైందన్నారు. దీంతో ప్రస్తుతం చల్లా రామచంద్రారెడ్డిని ఏ–1 నిందితునిగా కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment