సాక్షి ప్రతినిధి, తిరుపతి: పబ్లిసిటీనే ప్రధాన అజెండాగా చంద్రబాబు మరో షోకు తెరతీశారు. తన పబ్లిసిటీ కోసం కందుకూరు, గుంటూరులో 11 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యిందే కాక.. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మూకలు పోలీసులపై దాడులకు తెగబడేలా రెచ్చగొట్టారు. వెరసి.. ఎల్లో మీడియా ద్వారా పబ్లిసిటీ చేయించుకొని, రాజకీయ మైలేజీ పొందడానికి విఫలయత్నం చేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ్యుడిగా మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించాలని భావించారు. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో రోడ్ల మీద బహిరంగ సభలను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు.. ఆయన పీఏ మనోహర్‌కు ముందస్తు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు కార్యక్రమాల వివరాలు ఏమిటి? ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించనున్నారు? రోడ్‌షోలు ఎక్కడ? అనే వివరాలు తెలియజేసి, అనుమతి తీసుకోవాలని సోమవారం రాత్రే నోటీసు ఇచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు నుంచి కానీ, ఆయన పీఏ నుంచి కానీ పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో సభలు, సమావేశాలకు అనుమతులు లేవంటూ పోలీసులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు.
అంతా పథకం ప్రకారమే..
టీడీపీ శ్రేణులు ఏపీ, కర్ణాటక సరిహద్దులోని శాంతిపురం మండలం 121 పెద్దూరు, గడ్డూరు క్రాస్ వద్ద హంగామా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు కుప్పం వాసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ శ్రేణులు మదనపల్లె, వీ.కోట, కర్ణాటక నుంచి ప్రత్యేక వాహనాల్లో జనాన్ని తీసుకు రావడం ప్రారంభించారు. దీంతో పోలీసులు అనుమతి లేని వాహనాలకు ప్రవేశం లేదని, వాటిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక్కడి విషయాలను మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రబాబు పీఏ, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు ఫోన్ ద్వారా చెబుతూ వచ్చారు.
డ్రామాను రక్తి కట్టించాలని..
కుప్పం వాసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గ్రహించిన చంద్రబాబు.. తన ఎల్లో మీడియా ద్వారా విస్తృత ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారంటూ.. టీడీపీ శ్రేణుల ద్వారా హడావుడి చేయించారు. తన జనాన్ని రెచ్చగొట్టి పోలీసుల పైకి ఉసిగొల్పారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చనే ఉద్దేశంతో కొందరు టీడీపీ శ్రేణులను సామాన్య జనం రూపంలో గడ్డూరు క్రాస్ వద్దకు పంపించారు. వారి వద్ద రాడ్లు, కర్రలు, రాళ్లు కనిపించాయి. వారి ద్వారా గొడవ సృష్టించి లబ్ధి పొందడానికి విఫల యత్నం చేశారు.
1861 పోలీసు చట్టమే వర్తించదంటూ వక్రభాష్యం
చంద్రబాబుకు చట్టాల పట్ల కనీస అవగాహన లేదని మరోసారి నిరూపితమైంది. రోడ్లపై సభలకు అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం 1861 పోలీసు చట్టం ప్రకారం జీవోను జారీ చేసింది. అయితే ఆ చట్టం ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదని చంద్రబాబు పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం విస్మయ పరిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 పోలీస్ యాక్ట్‌ను ఇక్కడ ఎలా అమలు చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. కేంద్ర పోలీసు బలగాలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు వ్యవస్థలు 1861 పోలీస్ యాక్ట్ ప్రకారమే పని చేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా రాష్ట్రంలో ఎన్నోసార్లు 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు.
జనం ముసుగులో పోలీసులపై దాడి
బుధవారం ఉదయం నుంచే గడ్డూరు వద్ద వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అద్దె మనుషులు ఇరుకైన రోడ్లపై గుమికూడారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ససేమిరా అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలుగు తమ్ముళ్లను మరింత రెచ్చగొట్టారు. పోలీసులపై దాడికి దిగేలా ఉసిగొల్పారు. దీంతో కార్యకర్తలు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బందోబస్తు బ్యారికేడ్లను పక్కకు లాగేశారు. రోడ్డుపై బైఠాయించారు. ‘సీఎం డౌన్‌డౌన్.. ఇదేం ఖర్మ.. ఇదేం ఖర్మ..’ అంటూ నినాదాలతో రెచ్చిపోయారు. ఈ గందరగోళం మధ్య కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై పిడిగుద్దులతో దాడి చేశారు. పోలీసులు కూడా లాఠీలను పైకెత్తి వారిని తరిమే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సరిహద్దు నుంచి చంద్రబాబు 121 పెద్దూరు చేరుకున్నాక టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. ఇంకో వైపు తమను అడ్డుకుంటున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్‌లు వేయించారు. ఉదయం నుంచి ఇలా జరిగేలా చంద్రబాబు ప్రణాళిక రచించి, అమలు చేయించారని స్పష్టమైంది. ఇలా గొడవ చేయడం ద్వారా పోలీసులు తనను అరెస్టు చేసేలా వ్యూహం పన్నారు. అయితే పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు, శ్రేణులను సమర్థవంతంగా కట్టడి చేశారు.
చదవండి: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment