సాక్షి,హైదరాబాద్:నేరాలకు పాల్పడుతున్నవారిపై నిఘా పెంచాలని, అవసరమైతే రౌడీషిటర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. చీకటి ప్రదేశాల్లో, భారీ నిర్మాణాల దగ్గర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, ఫ్లై ఓవర్లు, పాఠశాలల వద్ద మద్యం, గంజాయి సేవించడంపై నిఘా ఉంచాలని సూచించారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై–పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న నేరాలు, హత్యలపై హోంమంత్రి మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్ షాప్‌లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం మూతపడేలా చూడాలని సూచించారు.
వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను కొన్ని గ్రూపులు ప్రబలంగా ప్రసారం చేస్తున్నాయని, దీని ఫలితంగా ప్రజలలో తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉందని హోంమంత్రి అన్నారు. ఫంక్షన్ హాళ్లలో అర్ధరాత్రి వరకు గడపవద్దని ప్రజలను కోరారు. విధి నిర్వహణలోని పోలీసులకు ప్రజలు సహకరించాలని, భద్రత కోసం ప్రజలకు సేవ చేయడానికి పోలీసులకు చేయూతనివ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment