Crimea
-
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్‌ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్‌పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్‌డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నేరస్తులపై నిఘా పెంచండి
సాక్షి,హైదరాబాద్:నేరాలకు పాల్పడుతున్నవారిపై నిఘా పెంచాలని, అవసరమైతే రౌడీషిటర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. చీకటి ప్రదేశాల్లో, భారీ నిర్మాణాల దగ్గర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, ఫ్లై ఓవర్లు, పాఠశాలల వద్ద మద్యం, గంజాయి సేవించడంపై నిఘా ఉంచాలని సూచించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై–పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న నేరాలు, హత్యలపై హోంమంత్రి మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్ షాప్‌లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం మూతపడేలా చూడాలని సూచించారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను కొన్ని గ్రూపులు ప్రబలంగా ప్రసారం చేస్తున్నాయని, దీని ఫలితంగా ప్రజలలో తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉందని హోంమంత్రి అన్నారు. ఫంక్షన్ హాళ్లలో అర్ధరాత్రి వరకు గడపవద్దని ప్రజలను కోరారు. విధి నిర్వహణలోని పోలీసులకు ప్రజలు సహకరించాలని, భద్రత కోసం ప్రజలకు సేవ చేయడానికి పోలీసులకు చేయూతనివ్వాలన్నారు. -
Russia-Ukraine War: క్రిమియా బ్రిడ్జిపై భారీ పేలుడు.. ఇద్దరి మృతి
క్యివ్: గతేడాది అక్టోబర్ నెలల్లో ట్రక్కు బాంబు పేలిన అదే బ్రిడ్జి మీద మరోసారి పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక జంట మృతి చెందగా వారి బిడ్డ మమ్మీ, డాడీ అంటూ రోదిస్తూ హృదయాలను ద్రవింపజేసింది. క్రిమియా నుండి రష్యాకు కనెక్టివిటీగా ఉన్న ఈ బ్రిడ్జి రష్యా యుద్ధం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 12 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు కమ్ రైలు వంతెన రష్యా దళాలు వస్తూ పోతూ ఉండడానికి బాగా ఉపయోగపడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇదే బ్రిడ్జిపై ట్రక్కు బాంబు పేలిన విషయం తెలిసిందే. దీన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు రవాణా యధాతధంగా సాగుతున్న ఈ బ్రిడ్జి మీద మళ్ళీ పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక జంట మృతి చెందారని వారి చిన్నారి మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడిందని తెలిపారు పశ్చిమ రష్యాలోని బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్. బెల్గోరోడ్ నెంబర్ ప్లేటు ఉన్న వాహనం ఒకటి ఈ పేలుడుకు ప్రధాన కారణమని అన్నారు. రష్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ చర్యేనని ఆరోపిస్తూ పేలుడుకి గల కారణాలను విచారిస్తున్నట్లు తెలిపింది. క్రిమియా గవర్నర్ సెర్జీ ఆక్సియోనోవ్ ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా ధృవీకరించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రిడ్జి 145 పిల్లర్ వద్ద పేలుడు సంభవించిందని, బ్రిడ్జి రహదారిపై విపత్తు నిర్వహణ సంస్థల వారు రక్షణ చర్యలు చేపట్టారని. వీలైనంత తొందరగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: పసిఫిక్ సముద్రంలో చిక్కుకుని.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
క్రిమియా చమురు నిల్వకేంద్రంపై దాడులు
కీవ్: తొమ్మిదేళ్ల క్రితం రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ద్వీపకల్ప ప్రాంతం క్రిమియాపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో క్రిమియాలోని తీరప్రాంత నగరం సెవస్తపోల్‌లోని చమురు నిల్వ కేంద్రానికి నిప్పు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ‘ఈ దాడి ఉక్రెయిన్ డ్రోన్ల పనే. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికి ఒక్కచోట మాత్రమే మంటలు ఆర్పగలిగాం’ అని నగర గవర్నర్ మిఖాయిల్ రజవోజయేవ్ చెప్పారు. మరణాల వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రతిదాడి చేసి క్రిమియాను మళ్లీ ప్రధాన భూభాగంలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం, శుక్రవారమే 20 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసి రష్యా 23 మంది పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయిల్ డిపోలో 10 ట్యాంకుల్లో అగ్గిరాజుకోవడం దేవుడు వేసిన శిక్ష అంటూ ఉక్రెయిన్ సైనిక నిఘా అధికార ప్రతినిధి ఆండ్రీ యుసోవ్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా అక్రమంగా విలీనం చేసుకున్న ఖేర్సన్ ప్రావిన్స్‌లోని నోవా కఖోవ్కా సిటీపైకి ఉక్రెయిన్ సేనలు భారీ స్థాయిలో కాల్పుల మోత మోగించాయి. -
'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!'
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏడాది కంటే ఎక్కువ కాలం బతకడని ఆ దేశ ఫెడరల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ ఇలియా పొనోమరేవ్ జోస్యం చెప్పారు. అక్టోబర్ 7న జరిగే తన పుట్టినరోజు వరకు కూడా పుతిన్ ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బ్రిటన్ వార్తా సంస్థ ఎక్స్‌ప్రెస్‌తో పొనోమరేవ్ మాట్లాడారు. 2014లో రష్యాతో విలీనమైన క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత పుతిన్ పతనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. క్రిమియా విలీనానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక డిప్యూటీ పొనోమరేవే కావడం గమనార్హం. పుతిన్ ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని కూడా ఈయన బహిరంగంగా ఆరోపించారు. విధులు సరిగ్గా నిర్వర్తించలేదనే కారణంతో అభిశంసనకు గురై దేశం నుంచి వెలివేయబడ్డాడు. దీంతో 2016 నుంచి ఉక్రెయిన్‌లో నివసిస్తున్నారు. ఏదో ఒక రోజు క్రిమియాలోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశిస్తాయని పొనోమరేవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అదే పుతిన్ పాలనకు ముగింపు అవుతుందన్నారు. అలాంటి సైనిక ఓటమిని పుతిన్ తట్టుకోలేడని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఓడిపోతున్నట్లు పుతిన్‌కు తెలుసునని, కానీ తన బలగాలు విజయం సాధిస్తాయని నమ్ముతున్నారని చెప్పారు. చదవండి: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. -
క్రిమియాకు ఎందుకంత క్రేజ్?
క్రిమియా.. ఉక్రెయిన్ ప్రావిన్స్ లోని ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం రష్యా అధీనంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతం అటు రష్యాకు కీలకం, ఇటు ఉక్రెయిన్ కి కీలకంగా మారింది. 2022ను ఉక్రెయిన్ కి అత్యంత విషాదకరంగానూ, అదే సమయంలో చారిత్రాత్మక విజయాలతో సంతోషాన్ని అందించిన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవటానికి రష్యా, ఫిబ్రవరి 2022లో 1,90,000 మీద ట్రూపులతో దాడికి దిగింది. వేలాది మంది ప్రాణాలను బలిగొంది. చెప్పుకోలేనంత విధ్వంసాన్ని సృష్టించింది. కాని యుద్ధం ప్రారంభమైన కొన్నివారాల్లోనే ఉక్రెయిన్ సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పిగొట్టగలిగింది. ఆగస్టు నాటికి, రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో సగానికి పైగా తిరిగి స్వాధీనం చేసుకుని, ఆ దేశం విజయావకాశాలపైన నీళ్లు చల్లింది. రష్యా బడాయి కబుర్లు ఉక్రెయిన్ కి సంబంధించిన నాలుగు ప్రావిన్సులు.. డొనెట్స్క్, ఖెర్సాన్, లుహాన్స్క్, జపొరిజియాలను తాము స్వాధీనం చేసుకున్నామని గత ఏడాది సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అదంతా ఒట్టిమాట. పుతిన్ ఈ ప్రకటన చేసే సమయానికి ఇందులో ఏ ఒక్క ప్రావిన్స్ పైన ఆ దేశానికి పట్టు లేదు. అంతే కాదు. సైన్యం దాదాపుగా అక్కడ గ్రౌండ్ కోల్పోయింది. పొరపాటును దిద్దుకున్నాం : పుతిన్ ఉక్రెయిన్ ప్రావిన్స్ కి చెందిన క్రిమియా ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి, 2014లో ఆ దేశాన్ని ఉక్రెయిన్ నుంచి అది హస్తగతం చేసుకుంది. 1954లో క్రిమియాను ఉక్రెయిన్ కు బదలాయించటం తప్పని, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవటం ద్వారా చేసిన తప్పును దిద్దుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. క్రిమియాను తిరిగి దక్కించుకోవటం వల్ల అంతర్జాతీయంగా కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతున్నామని చెప్పారు. అది ఒట్టిమాట ఇది తప్పుడు వాదనే. క్రిమియాకు విశిష్టమైన, సంపద్వంతపైన చరిత్ర ఉంది. ఎంతో కాలంగా అది రష్యాలో భాగంగా ఉన్న మాట నిజమే అయినా, 1991లో దేశవ్యాప్తంగా చేపట్టిన రిఫరెండం ద్వారా ఉక్రెయిన్లు.. అందులో అధికభాగం క్రిమియన్ లో నివసిస్తున్న వాళ్లంతా దానిని సోవియెట్ యూనియన్ నుంచి విముక్తం కావాలని కోరారు. వాళ్లంతా అలా కోరుకోవటానికి కారణం ఉంది. రష్యా అనేది నిరంకుశ రాజ్యం (టొటాలిటేరియన్ స్టేట్). ఉక్రెయిన్ అనేది ప్రజాస్వామ్యం (ప్లురాలిస్టిక్ డొమోక్రసీ) దిశగా అడుగులు వేస్తోంది. రష్యా పాలనలో క్రిమియాలో నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయి. మైనార్టీల అణచివేత, పౌరులను దుష్ప్రచారం చేసే మీడియాకు లోబడి ఉండాలని ఒత్తిడి కొనసాగుతోంది. వేలాది మంది క్రిమియన్ టాటర్ జాతుల వాళ్లు రష్యా కబంధహస్తాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. పశ్చిమదేశాలదీ అదే అభిప్రాయం 2014లో క్రిమియాను రష్యా ఆధీనంలోకి తెచ్చుకోవటం అనేది సరైన నిర్ణయం కాదని అనే విషయంలో పశ్చిమదేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కానీ దానిని విముక్తం చేయటానికి అవి ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. పైగా క్రిమియాను ఉక్రెయిన్ లో సంఘటితం చేసేందుకు సాగే ప్రయత్నాలు, రష్యాను రెచ్చగొడితే, పుతిన్ న్యూక్లియర్ యుద్ధానికయినా వెనకాడబోడన్న భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే క్రిమియాను పొందటానికి తన రాజధాని కివీని అందించేందుకు ప్రతిపాదనలు చేసుకోవచ్చని చెబుతున్నాయి. క్రిమియాకు ఎందుకంత ప్రాధాన్యం? క్రిమియాకు రష్యాతో దశాబ్దాల అనుభవం ఉంది. సెవస్టొపోల్ అనే దానికి రష్యాతో చారిత్రక అనుబంధం ఉంది. ఎక్కువ మంది ప్రజలు రష్యన్ భాష మాట్లాడతారు. సెవస్టొపోల్ రష్యన్ నౌకాస్థావరంగా ఉంది. దీనికి దక్షిణ తీరంలో విలాసవంతమైన చారిత్రక రాజప్రాసాదాలు ఉన్నాయి. 1783లో రష్యా స్వాధీనం చేసుకునేవరకూ దానిని ఎందరో రాజులు పాలించారు. ఇక్కడ ఎన్నో జాతులు ఉన్నాయి. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవటానికి రష్యా ఈ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మలుచుకుంది. 2014 తర్వాత 20 లక్షల మంది రష్యా పౌరుల్లో దాదాపు ఏడులక్షల మంది అక్కడకు మకాం మార్చారు. ఉక్రెయిన్ నుంచి క్రిమియాను లాక్కోవటానికి రష్యాకు ఎనిమిదేళ్లు పట్టింది. అక్కడ తగినంత మంది సైనిక పటాలాన్ని ఉంచింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంలో రష్యా ఈ భూభాగాన్ని వినియోగించుకుంటోంది. క్రిమియన్ లో ఉన్న బ్లాక్ సీ నావికాదళాన్ని ఉపయోగించుకుంటోంది. అలాగే ఇక్కడ ఎయిర్ బేస్ నుంచి డ్రోన్, మిస్సెల్ దాడులను నిర్వహిస్తోంది. రష్యా దీనిని ఆక్రమించుకోవటం ద్వారా అటు బ్లాక్ సీ, ఇటు అజోవ్ సీల పైన పట్టు సాధించింది. యురేషియన్ ఖండం రవాణాకు అది సముద్ర మార్గం . సీపోర్టులను, రవాణాలను అది నియంత్రించగలుగుతోంది. ఇక్కడ నుంచే బొగ్గు, ఇనుపఖనిజం, ఇతరత్రా రవణా అవుతున్నాయి. క్రిమియాను స్వాధీనం చేసుకుంటే గానీ ఉక్రెయిన్ సురక్షితంగా ఉండలేదు. తన ఎకానమీని పునరుద్ధరించుకోలేదు. 2018లో అజోవ్ సీ పైన రష్యా పట్టు సాధించినప్పటి నుంచి ఉక్రెయిన్ కి చెందిన మరియుపోల్, బెర్డియాన్స్ కో ఎయిర్ పోర్టులలో రవాణా తగ్గింది. బ్లాక్ సీ లో ఎన్నో సహజమైన గ్యాసు వనరులున్నాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ దానిని సొంతం చేసుకోవాలన్న ప్రయత్నం చేసింది. ఎక్సోన్ మొబిల్ తో ఆరు బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకుంది. రష్యా ఆక్రమణతో అది చేజారిపోయింది. క్రిమియా రష్యా చేతుల్లో ఉన్నంత వరకూ, ఆ దేశంపైన పై చేయి సాధించటం అనేది ఉక్రెయిన్ కు కష్టసాధ్యమైన విషయమే. -
ఉక్రెయిన్ ఉగ్రవాదమా? అది ప్రపంచానికి తెలుసు!
మాస్కో: కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించాడు. రష్యా-క్రిమియాలను కలిపే ఆ వంతెనపై దాడికి ఉక్రెయిన్ కారణమని ఆరోపించిన ఆయన.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించాడు. ఇది రష్యాకు సంబంధించిన క్లిష్టమైన, అతిముఖ్యమైన పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ఉద్దేశించిన తీవ్రవాద చర్య. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఉక్రెయిన్ నిఘా బలగాలు ఉద్దేశపూర్వకంగా ఇందులో పాల్గొన్నాయి అంటూ క్రెమ్లిన్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా పుతిన్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ పేలుడుకు కర్త, కర్మ, క్రియ.. అన్నింటికి ఉక్రెయిన్ కారణం అని ఆయన పేర్కొన్నారు. 2014లో క్రిమియాను రష్యా, ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్నాక.. నాలుగేళ్లకు ఈ బ్రిడ్జిని ప్రారంభించింది. సుమారు 19 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జిని 2018లో గ్రాండ్‌గా ప్రారంభించారు పుతిన్. ఉక్రెయిన్ దక్షిణ భాగానికి మాస్కో దళాలు చేరుకునేందుకు కెర్చ్ స్ట్రెయిట్ వీలుగా ఉండేది. అంతేకాదు.. రష్యా నల్ల సముద్రం నౌకాదళం ఉన్న సెవాస్టోపోల్ నౌకాశ్రయానికి కూడా ఈ వంతెన ప్రధాన మార్గం. అయితే క్రెమ్లిన్-రష్యాలను అనుసంధానం చేసే ఈ కీలక వారధిపై శనివారం బాంబు పేలుడుతో మంటలు ఎగసిపడ్డాయి. బ్రిడ్జి సగ భాగం నాశనం కాగా, ముగ్గురు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7 — Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022 ఈ నేపథ్యంలో.. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ హెడ్ అలెగ్జాండర్ బస్ట్రీకిన్తో పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఆయన పుతిన్‌కు వివరించారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ వర్గాల పనేనని రష్యా ఆరోపిస్తోంది. పేలుడు ధాటికి బ్రిడ్జి ఒక పక్క భాగం నాశనం అయ్యిందని, ఒక్కరోజు విరామం తర్వాత రైలు సేవలు, పాక్షిక రహదారి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని రష్యా అధికారులు తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడి ఆరోపణలకు ఉక్రెయిన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్ స్పందిస్తూ.. పుతిన్ ఆరోపణలను తిప్పి కొట్టారు. ఉక్రెయిన్‌ది ఉగ్రవాదమా? ఇక్కడున్నది ఒకే ఒక్క ఉగ్రవాద దేశం. అదేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉక్రెయిన్ ఉగ్రవాదానికి పాల్పడుతోందన్న పుతిన్ ఆరోపణలు.. చివరికి రష్యాకు కూడా విరక్తిగా అనిపించకమానదు. ఇక బ్రిడ్జి దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెటకారంగా స్పందించారు. ఉక్రెయిన్‌లో ఇవాళ పగలు అంతా బాగోలేదు. బాగా ఎండ దంచికొడుతోంది. దురదృష్టవశాత్తూ క్రిమియాలో మాత్రం దట్టంగా మేఘాలు అలుముకుని ఉన్నాయి. అదే సమయంలో వెచ్చగానూ ఉంది అంటూ దాడిని ఉద్దేశించి శనివారం రాత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలన విషయాలు