విజయనగరం లీగల్: పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదేనని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మీనారాయణ హితవు పలికారు. స్థానిక న్యాయసేవాసదన్‌లో బాలల హక్కులు, బాల నేరస్తులతో పోలీసులు ప్రవర్తించాల్సిన తీరుపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. పరిసర ప్రాంతాలు, సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ కారణంగానే కొంతమంది బాలలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారన్నారు. వీరిపై కేసులు నమోదు అయినప్పుడు పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు. వారిని శిక్షించడం కన్నా వారిలో మార్పు తీసుకురావడం కోసమే కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
పక్కాగా చట్టాల అమలు
ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బాలల హక్కుల సంరక్షణకు చట్టాలు రూపొందించాయని, వాటిని పక్కాగా అమలు చేయడానికి జువైనల్ అధికారులు, పోలీస్ అధికారులు బాల న్యాయాధికారులు, శిశు సంరక్షణ అధికారులు కృషి చేయాలని కోరారు. సమాజంలో పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
బాల నేరస్తుల కేసులు విచారణ చేసేటప్పుడు పోలీసు అధికారులు యూనిఫాం ధరించకూడదన్నారు. బాలల విషయంలో మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. వీరి ఫొటోలు, పేర్లు ప్రచురించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. దీనిపై కూడా మీడియా ప్రతినిధులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అధికారి, జువైనల్ వెల్ఫేర్ ఎం. శరత్ బాబు బాలల న్యాయ రక్షణ సంరక్షణ చట్టం, 2015 అమలు, అధికారులు నిర్వహించాల్సిన విధులు, బాల న్యాయ చట్టాల రూల్స్‌పై అవగాహన కల్పించారు.
అలాగే పిల్లల మనస్తత్వం, కౌన్సెలింగ్‌పై సైకాలిజిస్ట్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, బాల నేరాలపై సెంట్రల్ క్రైం స్టేషన్ డీఎస్పీ ఎస్.చక్రవరి, బాలల న్యాయ హక్కులు జాతీయ విధానంపై లీగల్ సర్వీసెస్ మెంబర్ బి.ఎల్.నరసింగరావు, బాల నేరాల కేసులు, పరిష్కారంపై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.ఆశారాణి అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి, అదనపు జడ్జి బి.శ్రీనివాసరావు, స్పెషల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ చట్టం, అదనపు జడ్జి వి.వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.సురేష్, జిల్లాలోని 42మంది ఎస్‌ఐలు, చిన్న పిల్లల సంరక్షణ సంక్షేమాధికారులు, జువైనల్ అధికారులు, జిల్లా ప్రొహిబిషన్ అధికారులు, పోలీస్ అధికారులు, పిల్లల సంరక్షణ ఎన్‌జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల భవిష్యత్
Published Wed, Jun 29 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement
Advertisement