చదువుకు ‘న్యాయం’
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు.
‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.
న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.
‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.
ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు!
సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.
సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు.
వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
భవిష్యత్తుకు భరోసా!
ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం.
ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది.
– సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్
– తుమాటి భద్రారెడ్డి,
సాక్షి, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment