న్యాయ సేవలు మరింత విస్తృతం | Legal services more widely | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలు మరింత విస్తృతం

Published Sat, Jan 25 2014 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

Legal services more widely

జిల్లాలో 18 లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటికే 26 క్లినిక్‌లు జిల్లా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నాల్సా) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించారు.
 -సాక్షి, నిజామాబాద్/ఆర్మూర్ రూరల్, న్యూస్‌లైన్
 
 అందించే సేవలు
 ఈ క్లినిక్‌లలో న్యాయవాదితో పాటు, పారా లీగల్ వాలంటీర్లు ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయపరమైన సేవలు అందించడమే కాకుండా రేషన్‌కార్డులు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం వంటి పథకాలనుంచి లబ్ధిపొందేందుకు సహకరిస్తారు. కోర్టు కేసులుంటే ఇరువర్గాలతో కౌన్సెలింగ్ నిర్వహించి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బందె అలీ తెలిపారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో బందె అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటగా 2011 మార్చి 26న జిల్లా జైలులో ఈ క్లినిక్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. క్లినిక్‌ల ద్వారా అందించే సేవలను వివరించారు.
 
 బ్రాడ్‌బ్యాండ్ సేవలపై అసంతృప్తి
 బ్రాడ్‌బ్యాండ్ సేవలు సరిగ్గా అందకపోవడంతో చీఫ్ జస్టిస్ వీడియో కాన్ఫరెన్స్‌కు తరచూ అంతరాయం కలిగింది. దీంతో న్యాయమూర్తి బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.
 
 మూడు రోజులుగా ఏర్పాట్లు..
 దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అంకాపూర్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడుతారని జిల్లా జుడీషియల్ వర్గాలు భావించాయి. ఈ మేరకు ఎన్‌ఐసీ విభాగం అధికారులు మూడు రోజులుగా ఏర్పాట్లు చేశారు. కానీ సాంకేతికలోపం తలెత్తడంతో వీడియో కాన్ఫరెన్స్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన న్యాయమూర్తి ముఖాముఖి లేదని తేలడంతో అంకాపూర్ గ్రామస్తులు నిరుత్సాహానికి గురయ్యారు.
 
 జడ్జిలకు సన్మానం
 జడ్జిలను అంకాపూర్ గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో బందె అలీతో పాటు, ఆర్మూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలు వేణు, పావని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు కృష్ణగోపాల్‌రావు, సంస్థ సూపరింటెండెంట్ శ్రీధర్, క్లినిక్ అడ్వకేట్ జి. ఆనంద్‌కుమార్, గ్రామ సర్పంచ్ సిరిసిల్ల పుష్ప, ఎన్‌ఐసీ జిల్లా అధికారులు కృష్ణ, రాజగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
 
 ఉపయోగకరం
 గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల గ్రామస్తులకు ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు, సూచనలు అందుతాయి.
 -సిరిసిల్ల పుష్ప,
 సర్పంచ్, అంకాపూర్
 
 కేంద్రాన్ని ఉపయోగించుకుంటాం
 లీగల్ క్లినిక్‌ను గ్రామస్తులందరం ఉపయోగించుకుంటాం. వీటి వల్ల సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందుతుంది. సివిల్ తగాదాలను సైతం ఇందులో పరిష్కరించాలి.
 -గడ్డం రాజన్న,వీడీసీ అధ్యక్షుడు, అంకాపూర్
 
 సద్వినియోగం చేసుకోవాలి
 ఈ సహాయ కేంద్రాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి. రేషన్‌కార్డు మొదలు ఉపాధిహామీ వరకు.. ఇతర సమస్యలను సైతం కేంద్రం దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు.    
            -గటడి ఆనంద్,న్యాయ సహాయ కేంద్రం న్యాయవాది, ఆర్మూర్
 
 ఆనందంగా ఉంది
 మా గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రామంలో ఏర్పాటు చేసినందుకు న్యాయాధికారులకు కృతజ్ఞతలు.
 - నారాయణరెడ్డి,రైతు, అంకాపూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement