Legal services
-
గెహిస్ ఇమ్మిగ్రేషన్, ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభం (ఫొటోలు)
-
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా
హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్ సర్విసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్ అదాలత్‌లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్ సర్విసె స్ అథారిటీ నిర్వహిస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 1995లో ఏర్పాటు లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పని చేస్తాయి. వృద్ధ దంపతులకు ఆసరా.. ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్ చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్‌్కలో వారికి ఆశ్రయం అందించింది. నిరుద్యోగులకు చేయూత.. మహబూబ్‌నగర్ జిల్లా సెంట్రల్ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ.. మున్సిపల్ చైర్మన్‌తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది. 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (సబ్–కోర్టు), అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (మేజిస్ట్రేట్ కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏం న్యాయ సేవలు అందిస్తారు? 1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 3). కోర్టు ఫీజులను భరించడం 4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం ఆశ్రయించడం ఎలా? ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చు. న్యాయ సాయం ఎవరికి.. 1). షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 2). మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 3). మహిళలు, బాలబాలికలు 4). అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 5). ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 6). పారిశ్రామిక కార్మికులు 7). రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నాం. – గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
ఎల్ఐసీ ఐపీవోకు న్యాయ సంస్థల సేవలు కావాలి
న్యూఢిల్లీ: ఎల్ఐసీ భారీ ఐపీవో విషయంలో న్యాయసేవలు అందించే సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించడం ఇది రెండో పర్యాయం కావడం గమనార్హం. తొలుత జూలై 15న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ/ప్రతిపాదనలు) విడుదల చేసి ఆగస్ట్ 6వరకు గడువు ఇచి్చంది. తగినంత స్పందన రాకపోవడంతో పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) మరో విడత న్యాయ సేవల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహా్వనం పలుకుతూ గురువారం ఆర్ఎఫ్పీని విడుదల చేసింది. మొదటి విడత తగినంత స్పందన రాలేదని స్పష్టం చేసింది. ఐపీవో, క్యాపిటల్ మార్కెట్ల చట్టాల విషయంలో తగినంత అనుభవం కలిగిన ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించింది. ఎల్ఐసీ ఐపీవో కోసం గత వారమే 10 మంది మర్చంట్ బ్యాంకర్లను దీపమ్ ఎంపిక చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే అతిపెద్ద నిధుల సమీకరణగా ఎల్ఐసీ ఐపీవో రికార్డు సృష్టించనుందని అంచనా. -
ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం అర్థించే వారికి ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సహాయం అందాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్ని రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, సభ్య కార్యదర్శులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాల్సి వచ్చినప్పటి నుంచే న్యాయ సహాయార్థులకు న్యాయ సేవలు అందించాలి. సరైన సమయంలో అప్పీలు దాఖలు చేయడం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు, సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవడం, బెయిల్ అప్లికేషన్ అవసరమైన వారిని గుర్తించడం, వారికి న్యాయ సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. శిక్ష పడిన వారికి న్యాయ సేవలు అందించే దిశగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నల్సా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. నేర బాధితులకు న్యాయ సహాయం అందించాలన్న మరో ముఖ్యమైన అంశంపైనా చర్చించారు. 2020లో ఐదు జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు వివరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ రెండో శనివారం ఈ అదాలత్‌లను నిర్వహిస్తారు. -
‘సాక్షుల రక్షణ’ను అమలుపరచండి
న్యూఢిల్లీ: సాక్షుల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన ముసాయిదాను అమలు పరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ (నల్సా) సలహా తీసుకుంటామని తెలిపింది. కేంద్రం రూపొందించిన ముసాయిదా రూపకల్పన తుది దశకు చేరుకుందని, త్వరలోనే అది చట్టంగా రూపొందనుందని ఈ లోపు ముసాయిదాను అమలుపరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాల్సిందిగా అటార్నీ జనరల్ కె.కె.వేణు గోపాల్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ‘మేం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం. ఈ ముసాయిదాను అమలు పరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తాం’అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. -
రాయగడలో లీగల్ సర్వీసెస్ అవగాహన శిబిరం
పర్లాకిమిడి : స్థానిక నవజీవన్ అంధ, అనాథ బాలబాలికల కేంద్రంలో జిల్లా న్యాయసలహా అథారిటీ తరఫున శుక్రవారం చైతన్య శిబిరం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజపతి జిల్లా జడ్జి, న్యాయ సలహా అథారిటీ అధ్యక్షుడు దుర్గాశంకరమిశ్రా హాజరై బాలబాలికలకు పీసీ, పీఎన్డీటీ చట్టం 1994 గురించి తెలియజేశారు. సన్మానిత అతిథిగా జిల్లా శిశుసంక్షేమ ప్రొటెక్షన్ అధికారి అరుణ్ కుమార్ సాహు పాల్గొని బాలబా లికలకు విభిన్న చట్టాలపై అవగాహన కల్పించా రు. ప్రాధికరణ కార్యదర్శి దీపా దాస్ అనాథబాలబాలికలకు ప్రభుత్వ సహాయం, పునరావాసం గురించి అవగాహన కల్పించారు. కోర్టు రిజిస్ట్రార్ సర్వేశ్వర్ దాస్, జిల్లా శిశుసురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సీడబ్ల్యూసీ చైర్మన్ వినోద్ జెన్నా, నవజీవన్ ట్రస్ట్ట్ ఇన్చార్జి ఎస్వీ రమణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీఎస్‌ఎన్‌రాజు, ఆర్.జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నవజీవన్ ట్రస్ట్ విద్యార్థులకు రూ.ఇరవై వేల చెక్కును అందజేశారు. జిల్లా జడ్జి మిశ్రా ద్వారా నవజీవన్ ట్రస్ట్‌లో ఒక కంప్యూటర్ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. -
'ప్రజలంతా లోక్ అదాలత్‌ల గురించి తెలుసుకోవాలి'
ఢిల్లీ: ప్రజలంతా లోక్ అదాలత్‌ల వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యాయసేవల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. లోక్ అదాలత్‌ల ద్వారా సామాన్యులకు న్యాయం జరుగుతోందనీ, ఇవి అందిచే న్యాయసేవలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు లోక్ అదాలత్ ద్వారా 8.5 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు. కోర్టులకు రావడానికి ఆర్థీక స్థోమత లేని వారికి లోక్ అదాలత్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రజలందరికీ అభివృద్ధితో పాటు న్యాయసేవలు కూడా అందాల్సిన అవసరముందని తెలిపిన ప్రధాని న్యాయ విశ్వవిద్యాలయాలయాలు లోక్ అదాలత్లకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టులను తమ విద్యార్ధులకు ఇవ్వాలని సూచించారు. -
అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం
లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సాక్షి, హైదరాబాద్: న్యాయ పాలన సక్రమంగా సాగినప్పుడే న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను నిలబెట్టుకోగలుగుతందని హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనన్నారు. జాతీ య న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టులో ‘మహిళల సాధికారిత’ అంశంపై జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య మాట్లాడారు. -
‘ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు’
నిజామాబాద్ లీగల్/నందిపేట/నవీపేట : ప్రజలకు న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చామని జిల్లా అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కిరణ్ కుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాధాకృష్ణ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ మండలంలోని కాలూర్‌లో, మాక్లూర్‌లో, నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించారు. కార్యక్రమాల్లో వారు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకే ప్రజలు అన్యాయాలకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. లక్షలోపు వార్షిక ఆదాయమున్న నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలు, వృద్ధులు, నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను ఏర్పాటు చేశామన్నారు. మాక్లూర్ మండలంలో సివిల్ కేసుల పరిష్కారానికి న్యాయవాది రవికుమార్‌ను, క్రిమినల్ కేసుల పరిష్కారానికి స్థానిక ఎస్సై సంతోష్‌కుమార్‌లను సంప్రదించాలని సూచించారు. చదువుకు దూరమై వీధులలో తిరుగుతున్న బాలలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా రు. 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకోవడం నేరమని, దీనికి కఠి న శిక్షలుంటాయని హెచ్చరించా రు. ఈ సందర్భంగా మాక్లూర్‌లో సర్పంచ్ సత్యమ్మ న్యాయమూర్తుల ను సన్మానించారు. సీఐలు దామోదర్‌రెడ్డి, యాదిరెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్, జడ్పీటీసీ సభ్యులు లతా పీర్సింగ్, డీసీసీబీ డెరైక్టర్ పీర్సింగ్, ఎంపీటీసీ సభ్యుడు హైమద్, నవీపేట మండల లీగల్ ఆర్గనైజర్ కిషన్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావ్, ఇన్చార్జి తహశీల్దార్ రమేశ్, ఎస్సై సంపత్ కుమార్, సర్పంచ్ కపిల తదితరులు పాల్గొన్నారు. -
న్యాయ సేవలు మరింత విస్తృతం
జిల్లాలో 18 లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటికే 26 క్లినిక్‌లు జిల్లా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నాల్సా) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించారు. -సాక్షి, నిజామాబాద్/ఆర్మూర్ రూరల్, న్యూస్‌లైన్ అందించే సేవలు ఈ క్లినిక్‌లలో న్యాయవాదితో పాటు, పారా లీగల్ వాలంటీర్లు ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయపరమైన సేవలు అందించడమే కాకుండా రేషన్‌కార్డులు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం వంటి పథకాలనుంచి లబ్ధిపొందేందుకు సహకరిస్తారు. కోర్టు కేసులుంటే ఇరువర్గాలతో కౌన్సెలింగ్ నిర్వహించి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బందె అలీ తెలిపారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో బందె అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటగా 2011 మార్చి 26న జిల్లా జైలులో ఈ క్లినిక్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. క్లినిక్‌ల ద్వారా అందించే సేవలను వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలపై అసంతృప్తి బ్రాడ్‌బ్యాండ్ సేవలు సరిగ్గా అందకపోవడంతో చీఫ్ జస్టిస్ వీడియో కాన్ఫరెన్స్‌కు తరచూ అంతరాయం కలిగింది. దీంతో న్యాయమూర్తి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. మూడు రోజులుగా ఏర్పాట్లు.. దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అంకాపూర్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడుతారని జిల్లా జుడీషియల్ వర్గాలు భావించాయి. ఈ మేరకు ఎన్ఐసీ విభాగం అధికారులు మూడు రోజులుగా ఏర్పాట్లు చేశారు. కానీ సాంకేతికలోపం తలెత్తడంతో వీడియో కాన్ఫరెన్స్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన న్యాయమూర్తి ముఖాముఖి లేదని తేలడంతో అంకాపూర్ గ్రామస్తులు నిరుత్సాహానికి గురయ్యారు. జడ్జిలకు సన్మానం జడ్జిలను అంకాపూర్ గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో బందె అలీతో పాటు, ఆర్మూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలు వేణు, పావని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు కృష్ణగోపాల్‌రావు, సంస్థ సూపరింటెండెంట్ శ్రీధర్, క్లినిక్ అడ్వకేట్ జి. ఆనంద్‌కుమార్, గ్రామ సర్పంచ్ సిరిసిల్ల పుష్ప, ఎన్ఐసీ జిల్లా అధికారులు కృష్ణ, రాజగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉపయోగకరం గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల గ్రామస్తులకు ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు, సూచనలు అందుతాయి. -సిరిసిల్ల పుష్ప, సర్పంచ్, అంకాపూర్ కేంద్రాన్ని ఉపయోగించుకుంటాం లీగల్ క్లినిక్‌ను గ్రామస్తులందరం ఉపయోగించుకుంటాం. వీటి వల్ల సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందుతుంది. సివిల్ తగాదాలను సైతం ఇందులో పరిష్కరించాలి. -గడ్డం రాజన్న,వీడీసీ అధ్యక్షుడు, అంకాపూర్ సద్వినియోగం చేసుకోవాలి ఈ సహాయ కేంద్రాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి. రేషన్‌కార్డు మొదలు ఉపాధిహామీ వరకు.. ఇతర సమస్యలను సైతం కేంద్రం దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. -గటడి ఆనంద్,న్యాయ సహాయ కేంద్రం న్యాయవాది, ఆర్మూర్ ఆనందంగా ఉంది మా గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రామంలో ఏర్పాటు చేసినందుకు న్యాయాధికారులకు కృతజ్ఞతలు. - నారాయణరెడ్డి,రైతు, అంకాపూర్