జస్టిస్ ఎన్‌వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం అర్థించే వారికి ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సహాయం అందాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్ని రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, సభ్య కార్యదర్శులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాల్సి వచ్చినప్పటి నుంచే న్యాయ సహాయార్థులకు న్యాయ సేవలు అందించాలి.
సరైన సమయంలో అప్పీలు దాఖలు చేయడం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు, సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవడం, బెయిల్ అప్లికేషన్ అవసరమైన వారిని గుర్తించడం, వారికి న్యాయ సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. శిక్ష పడిన వారికి న్యాయ సేవలు అందించే దిశగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నల్సా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. నేర బాధితులకు న్యాయ సహాయం అందించాలన్న మరో ముఖ్యమైన అంశంపైనా చర్చించారు. 2020లో ఐదు జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు వివరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ రెండో శనివారం ఈ అదాలత్‌లను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment