ఎంత వాడినా మూడొందలే..!
నెలకు వచ్చే విద్యుత్, నల్లా బిల్లు మొత్తమిది
మురికివాడల పేదలకు ‘గ్రేటర్’ ఎన్నికల కానుక?
అదే జరిగితే 1.25 లక్షల కుటుంబాలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: రాబోయే బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని మురికివాడల ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి నగరంలో గుర్తించిన (నోటిఫైడ్) 1475 మురికివాడల్లో వినియోగంతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.150 నల్లా బిల్లు, రూ.150 విద్యుత్ బిల్లు జారీచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమీక్షలో కేసీఆర్ ఈ అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. సర్కారు తాజా నిర్ణయంతో ఆయా బస్తీల్లో నివాసం ఉంటున్న సుమారు 1.25 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. గ్రేటర్‌లో పాగా వేయాలని యోచిస్తున్న సర్కారు పెద్దలు ఈ దిశగా పేదల మనసు దోచుకునేందుకు నయా ఎత్తుగడ వేసినట్లు తెలిసింది.
కాగా ప్రస్తుతం మహానగర పరిధిలో నెలకు ప్రతి 15 వేల లీటర్ల నీటి వినియోగం ఉండే ఇంటికి రూ.212 సాధారణ బిల్లు వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై గరిష్టంగా రూ.150 మాత్రమే బిల్లు వస్తుంది. ఇక వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారికి నెలకు రూ.300 సాధారణ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇకపై వీరికి నెలకు రూ.150 మాత్రమే బిల్లు వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు బిల్లులూ కలిపి రూ.300కు మించదన్నమాట. అయితే ప్రభుత్వం త్వరలో జారీ చేసే ఉత్తర్వులతో వీటిపై స్పష్టత వస్తుందని ఆయా విభాగాల అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా విద్యుత్, నీటి బిల్లుల బకాయిల మాఫీపైనా నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. ఇదే జరిగితే ఖజానాపై రూ.కోట్లు అదనపు భారం పడుతుందంటున్నారు.
నోటిఫైడ్ కానివారికి నిరాశే...
గ్రేటర్ పరిధి శరవేగంగా విస్తరిస్తుండటంతో పాటు పలు శివారు ప్రాంతాలు మౌలిక వసతులకు నోచుకోక మురికివాడలుగానే మిగిలాయి. వీటిని నోటిఫైడ్ మురికివాడలుగా గుర్తించకపోవడంతో ఆయా బస్తీలల్లో నివసిస్తున్న వారికి ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. నోటిఫైడ్‌మురికివాడలుగా గుర్తింపు పొందిన బస్తీలకు సబ్సిడీలు, సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రెండు దశాబ్దాల కిందటే పూర్తయ్యింది. నాటి జాబితాలో ఉన్న బస్తీలకే నేటికీ ఈ పథకాలు వర్తిస్తున్నాయి.