water bill
-
గ్రేటర్ వరంగల్‌లో ‘క్యూఆర్ కోడ్’తో పన్నుల చెల్లింపు... స్కాన్ అండ్ పే..
వరంగల్ అర్బన్: స్మార్ట్ సేవలు అందించడంలో గ్రేటర్ వరంగల్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో మొదటిసారిగా క్యూ ఆర్ కోడ్ సిస్టమ్‌ను వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనూతన విధానంతో ప్రజలు సులువుగా పన్నులు చెల్లించేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆస్తి, చెత్త పన్నులు, నీటి చార్జీలు ఇళ్లు, ఆఫీస్, వ్యాపార దుకాణాల్లో నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అన్ని రకాల పన్నులకు సంబంధించి కార్యకలాపాలను అనుసంధానం చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మీసేవ, ఈసేవ, అమెజాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్ను కట్టేందుకు సౌకర్యం ఉంది. ఆన్లైన్లో సొమ్ము చెల్లిస్తే నగదు సక్రమంగా జమ కాని పరిస్థితులూ ఉన్నాయి. నూతన విధానం ద్వారా పారదర్శకంగా చెల్లింపులకు వీలు కలగనుంది. నగరంలో 2,07 లక్షల అసెస్మెంట్లు(భవనాలు) ఉండగా.. 1.70 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 1.20 లక్షల అసెస్మెంట్లకు డిజిటల్ డిమాండ్ నోటీసులను పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నోటీసులను ఒకటి, రెండు రోజుల్లో అందిస్తామని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా రెండు రకాలుగా పన్నులు చెల్లించే అవకాశం ఉంది. ● ఇళ్లల్లో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో పన్నుల విభాగానికి చెందిన బిల్ కలెక్టర్లు క్యూఆర్ కోడ్‌తో కలిగి ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసుల్ని పంపిణీ చేస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పన్నులు, వడ్డీ చూపెడుతుంది. ఆసొమ్ము చెల్లిస్తే బల్దియా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. ● క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసులు అందకపోతే మరో విధానం ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పే ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే ‘ఇ మునిసిపాలిటీ తెలంగాణ’ సైట్లో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జిల్లా, ప్రాంతం, సర్కిల్, ఇంటి నంబర్ ఎంటర్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అదేవిధంగా వాటర్ చార్జీ చెల్లింపునకు క్యాన్ నంబరు డీటెయిల్స్‌పై క్లిక్ చేసి కింది భాగంలో ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేస్తే వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆస్తి, నీటి, చెత్త పన్నుల చెల్లింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లిస్తేనే నగరాభివృద్ధి జరుగుతుంది. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – షేక్ రిజ్వాన్ బాషా, బల్దియా కమిషనర్ -
నేడు ‘మీట్ యువర్ ఎండీ’
సాక్షి, సిటీబ్యూరో: నీటి బిల్లులు, మంచినీటి సరఫరా తదితర సమస్యలపై జలమండలి శనివారం ‘మీట్ యువర్ ఎండీ’ కార్యక్రమం నిర్వహించనుంది. ఇది ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు జరుగుతుంది. డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను వినియోగదారులు నేరుగా ఎండీ దానకిశోర్‌ను కలిసి విన్నవించవచ్చు. ఇక సాయంత్రం 6 నుంచి 6:30గంటల వరకు ‘డయల్ యువర్ ఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ సమస్యలను ఫోన్లో ఎండీకి వివరించవచ్చు. ముందుగా కస్టమర్ అకౌంట్ నంబర్ తెలిపి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఫోన్ చేయాల్సిన నంబర్లు 040–23442881 /23442882/23442883. ఇక బిల్లింగ్, రెవెన్యూ, మీటర్ సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారులు మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు నిర్వహించే ‘రెవెన్యూ అదాలత్’లో పాల్గొని తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జలమండలి కోరింది. -
ఏడున్నర లక్షల వాటర్ బిల్లు ఎగ్గొట్టిన సీఎం
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల వాటర్ బిల్లు ఎగ్గొట్టారంట. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 18 మంది మంత్రులను ఎగవేతదారులుగా ప్రకటించింది. షకీల్ అహ్మద్ అనే సామాజక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ ఈ మేరకు సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధిరారిక నివాసం ‘వర్షా’ బంగ్లాకు ఏడు కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ పేరు మీద దాదాపు 7,44,891 రూపాయల వాటర్ బిల్లు బకాయి పడ్డట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సుధీర్ ముంగతివార్, పంకజా ముండే, రామ్‌దాస్ కదమ్ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది. అయితే బిల్లు కట్టని సీఎం, మంత్రులపై బీఎంసీ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తోంది. ముంబైలో వీవీఐపీల పెండింగ్ నల్లా బిల్లు ఏకంగా రూ. 8కోట్ల పైనే ఉందట. -
ప్రభుత్వ బడికి రూ.46 వేల నల్లాబిల్లు
రహమత్‌నగర్: ప్రభుత్వ పాఠశాలకు నల్లా బిల్లు రూ.46 వేలు రావడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. అసలు తమ నల్లాకు మీటరు లేదని, అలాంటప్పుడు ఇంత పెద్ద మొత్తంతో బిల్లు రావడంతో చేసేదిలేక తమ ఉన్నతాధికారులకు పంపించారు. ఎస్పీఆర్హిల్స్ వినాయకనగర్ ప్రభుత్వ పాఠశాలకు ఇటీవల జలమండలి అధికారులు బిల్లును పంపించారు. ఇందులో రూ.46 వేలు చెల్లించాలని స్పష్టంగా ఉంది. అసలు తమ పాఠశాలకు నల్లాకు మీటర్ లేదని, గతంలో ఎప్పుడూ తమ పాఠశాల పేరుతో నల్లా బిల్లు రాలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. -
బకాయిలున్న పార్టీల అభ్యర్థులకు నో చాన్స్!
న్యూఢిల్లీ: విద్యుత్తు, నీరు, టెలిఫోన్ బిల్లులు బకాయిలు పడ్డ పార్టీల అభ్యర్థులను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఈసీ యోచిస్తోంది. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. ప్రస్తుతం అభ్యర్థుల పేరున బకాయిలుంటే అనర్హులుగా ప్రకటిస్తోంది. ఇక నుంచి పార్టీ కార్యాలయాల బిల్లులు బకాయిపడ్డా పార్టీ అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించాలని యోచిస్తోంది. -
ఎంత వాడినా మూడొందలే..!
నెలకు వచ్చే విద్యుత్, నల్లా బిల్లు మొత్తమిది మురికివాడల పేదలకు ‘గ్రేటర్’ ఎన్నికల కానుక? అదే జరిగితే 1.25 లక్షల కుటుంబాలకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: రాబోయే బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని మురికివాడల ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి నగరంలో గుర్తించిన (నోటిఫైడ్) 1475 మురికివాడల్లో వినియోగంతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.150 నల్లా బిల్లు, రూ.150 విద్యుత్ బిల్లు జారీచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమీక్షలో కేసీఆర్ ఈ అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. సర్కారు తాజా నిర్ణయంతో ఆయా బస్తీల్లో నివాసం ఉంటున్న సుమారు 1.25 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. గ్రేటర్లో పాగా వేయాలని యోచిస్తున్న సర్కారు పెద్దలు ఈ దిశగా పేదల మనసు దోచుకునేందుకు నయా ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మహానగర పరిధిలో నెలకు ప్రతి 15 వేల లీటర్ల నీటి వినియోగం ఉండే ఇంటికి రూ.212 సాధారణ బిల్లు వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై గరిష్టంగా రూ.150 మాత్రమే బిల్లు వస్తుంది. ఇక వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారికి నెలకు రూ.300 సాధారణ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇకపై వీరికి నెలకు రూ.150 మాత్రమే బిల్లు వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు బిల్లులూ కలిపి రూ.300కు మించదన్నమాట. అయితే ప్రభుత్వం త్వరలో జారీ చేసే ఉత్తర్వులతో వీటిపై స్పష్టత వస్తుందని ఆయా విభాగాల అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా విద్యుత్, నీటి బిల్లుల బకాయిల మాఫీపైనా నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. ఇదే జరిగితే ఖజానాపై రూ.కోట్లు అదనపు భారం పడుతుందంటున్నారు. నోటిఫైడ్ కానివారికి నిరాశే... గ్రేటర్ పరిధి శరవేగంగా విస్తరిస్తుండటంతో పాటు పలు శివారు ప్రాంతాలు మౌలిక వసతులకు నోచుకోక మురికివాడలుగానే మిగిలాయి. వీటిని నోటిఫైడ్ మురికివాడలుగా గుర్తించకపోవడంతో ఆయా బస్తీలల్లో నివసిస్తున్న వారికి ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. నోటిఫైడ్మురికివాడలుగా గుర్తింపు పొందిన బస్తీలకు సబ్సిడీలు, సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రెండు దశాబ్దాల కిందటే పూర్తయ్యింది. నాటి జాబితాలో ఉన్న బస్తీలకే నేటికీ ఈ పథకాలు వర్తిస్తున్నాయి. -
రూ.10వేలు బకాయిపడితే నల్లా కట్
సాక్షి,సిటీబ్యూరో: నీటి బిల్లు బకాయిలు రూ.10 వేలు దాటితే నల్లా కనెక్షన్ కట్ చేయాలని జలమండలి నిర్ణయించింది.శనివారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎమ్డీ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నెలవారీ నీటి బిల్లులు, బకాయిలతో కలిపి రూ.100 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. జలమండలికి రావలసిన బకాయిల మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెలవారీ బిల్లులతో పాటు బకాయిల్లో కొంతమొత్తమైనా రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నూతన కుళాయి కనెక్షన్ల జారీ, ట్యాంకర్ల ద్వారా విక్రయించే నీటి చార్జీలు అన్నీ కలిపితేరూ.100 కోట్ల రెవెన్యూ లక్ష్యం సాధించవచ్చని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.25 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నెలవారీ ఠంఛనుగా బిల్లులు చెల్లించేవారు నాలుగు లక్షలకు మించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ఇతర డెరైక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇక పై గ్రేటర్లో పక్కగా నీటిబిల్లుల వసూళ్లు
-
మరణించిన 47 ఏళ్ల తర్వాత నీటిబిల్లు!!
పాకిస్థానీ అధికారులు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మరణించిన 47 సంవత్సరాల తర్వాత.. రూ. 2.63 లక్షల నీటి బిల్లు పంపారు. అదికూడా వాళ్లకు, వీళ్లకు కాదు.. పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నాకు పంపారు!! నోటీసు అందిన పది రోజుల్లోగా బిల్లు చెల్లించాలని, లేనిపక్షంలో తాగునీటి, మురుగునీటి కనెక్షన్లు తొలగిస్తామని కరాచీ వాటర్ అండ్ సివరేజి బోర్డు ఆమెకు బిల్లు పంపింది. భూమి రెవెన్యూ చట్టం ప్రకారం ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని, వేలం వేయచ్చని, జరిమానా కూడా విధించవచ్చని అధికారులు అంటున్నారు. అంతే కాదు.. ఆమెను అరెస్టు కూడా చేయొచ్చట!! ఆ నోటీసు ప్రకారం అయితే.. మే 28లోగా మొత్తం బిల్లు చెల్లించాలి. బిల్లు అందలేదని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతం ఆమె ఇంటిని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ జిన్నా, ఆయన సోదరి ఉపయోగించిన వస్తువులను కూడా భద్రంగా ఉంచారు. ఈ ఇంటిని జిన్నా 1944లో 1.15 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. 1948 సెప్టెంబర్‌లో ఫాతిమా ఆ ఇంట్లోకి వెళ్లి, 1964 వరకు ఉన్నారు. 1965లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీచేశారు. 1967లో ఆమె మరణించారు. విషయం తెలుసుకున్న తర్వాత కరాచీ మునిసిపల్ కమిషనర్ సదరు వాటర్ బోర్డు అధికారిని పిలిచి, చీవాట్లు పెట్టి నోటసు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. -
సామాన్యుడిపైకొరడా
నీటిబిల్లు బకాయిదారులపై ఆర్ఆర్ యాక్ట్ ప్రభుత్వ విభాగాల బకాయిలపై మౌనం జలమండలి తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు సాక్షి, సిటీబ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత నీరందిస్తూ ఢిల్లీ జలబోర్డు ఆమ్ ఆద్మీ మనసు దోచుకుంటోంది. ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయని మన జలమండలి.. సామాన్యులపై కొరడా ఝళిపిస్తూ లాభాల బాటలో నడవాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆరు నెలలుగా నీటిబిల్లు బకాయిపడిన సామాన్య, మధ్యతరగతి వర్గాలకు.. బ్రిటీషు ప్రభుత్వం 1864లో చేసిన రెవెన్యూ రికవరీ యాక్ట్, సెక్షన్-5 ప్రకారం ఏకంగా 941 రెడ్‌నోటీసులిచ్చి సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.850 కోట్లు బకాయిపడిన మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు క్వార్టర్లు, సర్కారు కార్యాలయాల విషయంలో జలమండలి మిన్నకుంటుంది. ఈ విషయంలో హోదా రీత్యా జలమండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కూడా ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. సామాన్యులపైనే కరకు చట్టం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న చందంగా మారింది జలమండలి తీరు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో సామాన్య, మధ్యతరగతి, నిరుపేదలకు సంబంధించిన కుళాయిలు సుమారు 4 లక్షల వరకు ఉన్నాయి. వీరిలో నెలవారీగా ఠంచనుగా బిల్లు చెల్లించేవారు 90 శాతం మంది ఉంటారు. మరో పదిశాతం మాత్రం వివిధ వ్యక్తిగత, ఆర్థిక కారణాల రీత్యా ఆర్నెల్లు, ఏడాదికి బిల్లు చెల్లించడం.. బోర్డు ఏర్పడినప్పటి (1989వ సంవత్సరం) నుంచీ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇటీవల సర్కారు పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. నీటిబిల్లులను పక్కాగా వసూలు చేసి జలమండలిని లాభాల బాట పట్టించేందుకు ఒకవైపు నీటిబిల్లులను ఎడాపెడా పెంచడంతోపాటు, ఆర్నెల్లు బిల్లు బకాయి పడితే చాలు రెవెన్యూ రికవరీ యాక్ట్-1864 లోనిసెక్షన్-5 ప్రకారం కొరడా ఝళిపిస్తోంది. మహానగరం పరిధిలో గత నెలరోజులుగా 941 రెడ్నోటీసులిచ్చింది. వీటిలో 64 కుళాయి కనెక్షన్లను తొలగించింది. ఇంతటితో ఆగక ఆర్.ఆర్.యాక్ట్ ముసుగుతో బకాయిదారుల ఇళ్లలోని టీవీలు,ఫ్రిజ్‌లు, కూలర్లు వం టి గృహవినియోగ వస్తువులను బలవంతంగా సీజ్ చేసి సామాన్యులను హతాశులను చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో ఒకవైపు ఉచిత నీరు ఇస్తున్నప్పటికీ ఆ దిశగా నగరంలో చేసిన ప్రయత్నాలు లేకపోగా ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం హేయమని స్వచ్ఛం ద సంఘాలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూ.850 కోట్ల సర్కారు బకాయిలపై మౌనం! మహానగరంలో జలమండలికి మూతపడిన ప్రభుత్వరంగ సంస్థలు, సర్కారు కార్యాలయాలు, వసతి గృహాల నుంచి రావాల్సిన బకాయిలు రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. వీటి వసూలుకు జలమండలి ఆపసోపాలు పడుతోంది. ఆయా విభాగాలకు మొక్కుబడిగా లేఖలు రాసి చేతులు దులుపుకొంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి హోదా రీత్యా చైర్మన్‌గా ఉన్నప్పటికీ బకాయిల వసూలుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో జలమండలి రోజురోజుకూ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు చేయడమో లేదా ప్రభుత్వం ఆ మొత్తాన్ని గ్రాంటుగా మంజూరు చేయడమో చేస్తేనే బోర్డు ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గడమే కాదు.. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 4 లక్షల కుళాయిలకు ఉచిత నీరు సరఫరా చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కరకు చట్టాల అమలుపై జలమండలికి కనువిప్పు కలుగుతుందా? -
నీటి మీటర్ల పేరుతో లూటీ
సాక్షి, సిటీబ్యూరో: నీటిబిల్లుల మోతతో సిటీజనులను బెంబేలెత్తిస్తున్న జలమండలి.. నీటి మీటర్ల ఏర్పాటు విషయంలోనూ వినియోగదారులపై మరో బాదుడుకు తెరతీసింది. గృహవినియోగ కుళాయిలకు రూ.600కు లభించే నీటి మీటర్లను కాదని, యూరోపియన్ ప్రమాణాల పేరుతో తాను ఎంపిక చేసిన ఐదు కంపెనీలకు చెందిన అధిక ధరల మీటర్లనే కొనుగోలు చేయాలని వినియోగదారులకు హుకుం జారీచేసింది. వీటి ధరలు రూ.1300 నుంచి రూ.2000 వరకు ఉండటంతో ఈ నిబంధన సామాన్యుల పాలిట గుదిబండలా మారింది. కేంద్ర ప్రభుత్వం 2002లో చేసిన జల సుంక చట్టం (వాటర్సెస్ చట్టం) ప్రకారం గృహ వినియోగ కనెక్షన్లకు నీటిమీటర్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జల మండలిదే. వాటి రీడింగ్ ప్రకారమే అది బిల్లులు జారీ చేయాలి. అయినప్పటికీ అధికారులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఎడాపెడా బాదేస్తుండడంతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు కుదేలవుతున్నాయి. ఇష్టారాజ్యంగా నీటిబిల్లుల జారీ ఇటీవల 1318 బల్క్ (25ఎంఎం పరిమాణం మించినబడా కుళాయిలకు) నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసి శాస్త్రీయంగా బిల్లుల వసూలుకు శ్రీకారం చుట్టిన జలమండలి... డొమెస్టిక్ నల్లాల విషయంలోగుడ్డిగా వ్యవహరిస్తోంది. మీటర్లు లేనివి, ఉన్నా పనిచేయని స్థితిలో ఉన్న కుళాయిలకు ఇష్టారాజ్యంగా బిల్లులు బాదేస్తుండటంతో మహానగరంలో వేతన జీవులు నానా బాధలు పడుతున్నారు. ఇష్టారాజ్యంగా నీటి బిల్లుల జారీ కారణంగా డొమెస్టిక్ విభాగం కిందకు వచ్చే నల్లాకు నెలవారీగా రావాల్సిన సాధారణ బిల్లు రూ.225 స్థానే.. చాలామందికి రూ.500 నుంచి రూ.2000 వరకు బిల్లులు జారీ అవుతుండడం గమనార్హం. మొత్తంగా గ్రేటర్ పరిధిలో సుమారు 8 లక్షల కుళాయిలుండగా.. 2 లక్షల కుళాయిలకే మీటర్ల ఆధారంగా బిల్లులు జారీ అవుతున్నాయి. మరో లక్ష కుళాయిలకు మీటర్లు ఉన్నా అవి పనిచేయడం లేదు. ఏకంగా ఐదు లక్షల కుళాయిలకు మీటర్లు లేకుండానే డాకెట్ సరాసరి పేరుతో బిల్లులు బాదేస్తుండడం గమనార్హం. డాకెట్ సరాసరి పేరుతో బాదుడు.. నీటి మీటర్లు లేని నల్లాలకు ‘డాకెట్ యావరేజ్’ పేరుతో బిల్లులు జారీ చేస్తుండటం వల్లే ఇబ్బంది వస్తోంది. ఒక పైప్లైన్కున్న 1500 నుంచి 2500 కుళాయి కనెక్షన్లను కలిపి డాకెట్గా పరిగణిస్తారు. ఇందులో మొత్తం కుళాయిలు వినియోగించే నీటి పరిమాణాన్ని లెక్కగట్టి వచ్చే బిల్లును అందరికీ సమానంగా పంచుతారన్నమాట. ఈ విధానంతో రెండు గదుల ఇళ్లున్న వారికీ, రెండంతస్తుల మేడ ఉన్నవారికీ ఒకే రీతిన అశాస్త్రీయంగా బిల్లులు జారీ అవుతున్నాయి. గ్రేటర్లో మొత్తం డాకెట్లు 543 వరకు ఉన్నాయి. ప్రస్తుతం 15 కిలో లీటర్లు(15 వేల లీటర్లు)లోపుగా నీటిని వాడేవారు చెల్లించాల్సిన సాధారణ బిల్లు రూ.225 మాత్రమే. కానీపలు బస్తీలు, కాలనీల్లో సాధారణం కంటే అత్యధికంగా బిల్లులు జారీ అవుతున్నాయి. చాలా చోట్ల రూ.500, రూ.1000, రూ.2000 వరకు బిల్లులు జారీ చేస్తుండడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని కాలనీల్లో వినియోగదారులు ఇళ్లలోనే ఉన్నా డోర్‌లాక్ అని, మీటర్ రిపేర్ అంటూ ఎడాపెడా బిల్లులు బాదేస్తున్నారు. దీనిపై ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గతం లో నీటి బిల్లుల జారీ విధానాన్ని పర్యవేక్షించేం దుకు బయటివ్యక్తుల (థర్డ్‌పార్టీ)తో తనిఖీ చేయిస్తామని చెప్పిన బోర్డు అధికారులు ప్రస్తు తం ఆ హామీని విస్మరించడం గమనార్హం. ప్రత్యామ్నాయమిదే.. దేశవాళీగా తయారయ్యే నీటి మీటర్లు బహిరంగ మార్కెట్లో రూ.600కేలభిస్తాయి. యూరోపియన్ ప్రమాణాల పేరుతో అత్యధిక ధర పలికే నీటి మీటర్లు కొనుగోలు చేయాలన్న నిబంధనను సవరించాలి. నీటిమీటర్లను బోర్డు సొంతంగా ఏర్పాటుచేయాలి. నెలవారీ బిల్లులో కొంత మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో రాబట్టాలి. మురికివాడల్లో కుళాయిలకు జలమండలే ఉచితంగా మీటర్లు ఏర్పాటు చేయాలి. వీటి నిర్వహణ, మరమ్మతులను కూడా జలమండలి పర్యవేక్షించాలి. నెలవారీగా వినియోగించిన నీటి పరిమాణం ఆధారంగా మాత్రమే బిల్లులివ్వాలి. ఈ విషయంలో మీటర్ రీడర్లకు తగిన శిక్షణ తప్పనిసరి. ఈ-పాస్ యంత్రాల (స్పాట్‌బిల్లింగ్ యంత్రాలు) సాఫ్ట్‌వేర్‌ను కూడా సవరించాలి.